శుక్రవారం, జనవరి 22, 2010

బ్లాగులు-మధురవాణి

ఆ బ్లాగు లో టపాలు చదువుతూ ఉంటే రోజూ మన కళ్ళెదురుగా తిరిగే పక్కింటి అమ్మాయి గలగలా చెబుతున్న కబుర్లు వింటున్నట్టుగా ఉంటుంది. వట్టి కాలక్షేపం కబుర్లు కాదు సుమా.. సరదా చమక్కులతో పాటు, మనసుకు పట్టేసేవి, మనకి పనికొచ్చేవి ఎన్నో ఉంటాయి.. కేవలం మాటలు మాత్రమే కాదు.. అపురూపమైన పాటలూ దొరికే ఆ బ్లాగు పేరు 'మధురవాణి' ..బ్లాగరు పేరు కూడా అదే.

తెలుగు సాహిత్యంలో నా అభిమాన నాయికల్లో అగ్రస్థానంలో ఉన్న నాయిక పేరుతో ఒక బ్లాగు నా కంట పడినప్పుడు చదవకుండా ఉంటానా? గబగబా చదివేశాను. చదవగానే ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని జెర్మనీ కి ఎగిరిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే 'మధురవాణి-తెలుగురాణి' బ్లాగులో నేను మొదటగా చదివిన టపా 'జర్మనీలో క్రిస్మస్ మార్కెట్-గ్లూ వైన్ విశేషాలు.' జర్మనీలో ఎన్ని రకాల వైన్లు ఏయే రుచులలో దొరుకుతాయో రాసి నోరూరించారు మధురవాణి. ఆవిడ జర్మనీలో ఉంటారని తెలిసింది, ఆ టపా వల్ల.

ఒక్కసారి పాత టపాలు తిరగేస్తే తెలిసింది ఆ బ్లాగు కేవలం కబుర్ల పుట్ట మాత్రమే కాదనీ, పాటల ఖజానా కూడా అనీ.. పాతా, కొత్త అని కాకుండా వినసొంపైన పాటలన్నీ దొరుకుతాయిక్కడ. వినడమే కాదు చక్కగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.. నేను మొదటగా డౌన్ లోడ్ చేసుకున్న పాట 'శుభోదయం' లో 'కంచికి పోతావా కృష్ణమ్మా..' ఈ సినిమా గురించి 'నవతరంగం' లో ఒక చక్కని సమీక్ష కూడా రాశారు మధురవాణి.

కొంచం చరిత్ర లోకి వెళ్తే, 2008 సెప్టెంబర్ 27 న 'Welcome to Madhuravaani' అనే ఆంగ్ల శీర్షికతో మొదటి టపా రాశారు. బాపు బొమ్మలు, సుమతీ శతక పద్యాలతో అందంగా అలంకరించారు బ్లాగుని. త్వరలోనే తెలుగు కి మారిపోయినా, అప్పుడప్పుడూ ఆంగ్ల టపాలు తళుక్కు మంటూనే ఉన్నాయి, ప్రారంభంలో. ఐతే రాను రానూ తెలుగు టపాల మీదే దృష్టి పెట్టారు.

నీతి కథలు చెప్పినా, వాళ్ళ బంగారం విశేషాలు రాసినా, ముద్దు పేర్లను గురించి ముచ్చట్లు వివరించినా మనం అలా అలా చదువుకుంటూ వెళ్లి పోవాల్సిందే. 'అమ్మ' గురించి రాసిన టపా కదిలిస్తే, వాళ్ళింటి 'గుర్రం బొమ్మ' గురించి రాసిన టపా కాసేపు ఆలోచనల్లో పడేస్తుంది. వాళ్ళ పెరటి జామచెట్టు గాధ చదివాక మన కళ్ళ ముందు ఒక బుల్లి రాజు గారూ, మరో బుల్లి మంత్రి గారూ మెదలక మానరు. సినిమా పాటలతో పాటు సీరియస్ సాహిత్యాన్ని గురించీ చెప్పే మధురవాణి మహాకవి 'శ్రీశ్రీ' గొంతు వినిపించారు ఇక్కడ.

అప్రస్తుతం కాదు కాబట్టి ఇక్కడ నా గురించి కొంచం చెప్పాలి. నేను సాంకేతిక విషయాలు ఏవీ తెలుసుకోకుండా ఒకలాంటి మొండి తనంతో బ్లాగు మొదలు పెట్టేసి, బిక్కుబిక్కు మంటున్న వేళ తనంతట తానుగా వచ్చి నాకు సూచనలు చేశారు మధురవాణి. అప్పుడే తెలిసింది, ఇక్కడ మనకి సాయం చేసేవాళ్ళకి లోటు లేదని. అంతేనా.. నాకో చక్కని బహుమతిని కూడా ఇచ్చారు.

అన్నట్టు మధురవాణి గారు కేవలం బ్లాగరి మాత్రమే కాదు, రచయిత్రి కూడా. ఆవిడ మొదటి కథ 'ఆవృతం' పొద్దు లో ప్రచురితమయ్యింది. 2008 లో చాలా ఉత్సాహంగా టపాలు రాసిన మధురవాణి గారు - ఒక్క అక్టోబర్ నెలలోనే 36 టపాలు - 2009 లో బ్లాగింగ్ కి అతి కొద్ది సమయం మాత్రమే కేటాయించారు.. ఏడాది మొత్తం లో రాసినవి కేవలం 32 టపాలు మాత్రమే. 'మధురవాణి' తో పాటు మరో మూడు బ్లాగుల్ని నిర్వహిస్తున్నారు మరి. ఇప్పటి నుంచైనా కొంచం తరచుగా కబుర్లు చెబుతారనీ, కథలు రాస్తారనీ ఎదురు చూస్తున్నాను..

25 కామెంట్‌లు:

  1. నేనూ అప్పుడప్పుడూ చదువుతుంటాను. చాలా బాగా రాస్తారు. వారి బ్లాగులలో మీ ప్రియనేస్తం అనే బ్లాగు చాలా గొప్ప స్ఫూర్తితో మొదలు పెట్టారు. కానీ అది స్వాగతంతోనే ఆగిపోవడం నన్ను బాధపెట్టింది.

    మొదటా సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యలమీద చర్చ ప్రారంభిస్తే, క్రమంగా ఒక్కొ ఒక్కరూ తమ సమస్యలు పంపుతూ ఉంటారని నాకనిపిస్తోంది. కనుక ఇప్పటికైనా దానిని కొనసాగించాలని నా విన్నపం. :)

    రిప్లయితొలగించండి
  2. అవునండి. చాలా మంచి బ్లాగు, చాలా మంచి బ్లాగరి కూడా. ఆవిడ బ్లాగుని మొదటిసారి చూసినపుడు ఇన్నాళ్ళు ఈ బ్లాగుని మిస్సయిపోయానే అని బాధపడ్డాను. అదే చెప్పాను కూడా ఆవిడతో.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా రాసేరుఅండి. మధుర మైన వాణి తో అలరించె మధురాల గని ని. సవత్సరానికి 32 పోస్ట్ లు అతి కొద్ది టైం కేటాయించటమా? :-(
    అంతే లెండి ఒక్క నెలో లో 36 రాయగల సత్తా వున్న మధుర వాణి గారికి తక్కువేనేమో లే. కంగ్రాట్స్ మధురవాణి గారు. మీ దగ్గర నుంచి ఇంకా అధ్బుతాలను ఆశిస్తూ..

    రిప్లయితొలగించండి
  4. నాకు తెలియని ఒక బ్లాగ్ ని చక్కగా పరిచయం చేసారు. థాంక్సులు. ఆ బ్లాగ్ చదవడం
    మొదలెట్టేశానాహో .

    రిప్లయితొలగించండి
  5. మధురవాణి గారి బ్లాగ్ నేనూ చూస్తున్నాను మురళిగారు. మీరు చాలా చక్కని బహుమతే పొందారు. స్నేహమంటే అలా ఉండాలి. సో, మీకూ ఒకరి సహాయం అవసరమయ్యిందన్నమాట. మీ పరిచయం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. మధురవాణిగారి బ్లాగ్ నేను చదివానండి...చాలాబాగా రాస్తారు. మీరు చెప్పిన తీరు ఇంకాబాగుంది.

    రిప్లయితొలగించండి
  7. సుమధురవాణిని మీదైన శైలిలో పరిచయం చేశారు ముందే తెలిసినా మీ నెమలికన్నుద్వారా చూడటం కొత్త అనుభూతినిస్తుంది .....మీ బహుమతికూడా బావుంది.మీకు , మధురవాణి గారికీ అభినందనలు .

    రిప్లయితొలగించండి
  8. మీ పరిచయ వ్యాసం వల్ల ఓ చక్కని కథ చదివాను. అదే మీ కు బహుమతి అయిన కథ. చాలా బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  9. ఇన్ని రోజులు మధురవాణి అంటే ఎందుకో మద్యవయసు గృహిణి అనుకున్నాను . కాదని చదువుకునంటున్న అమ్మాయి అని తెలిసి ఆశ్చర్య పోయాను .
    నేను చిన్నప్పుడు చదువుకున్న బూర్గుంపహాడ్ అమ్మాయిని అని చెప్పి , ఆ వూరి సంగతులు చెప్పి , నాకూ , నాబాల్య స్మృతులని బహుమతిగా ఇచ్చింది . ఎంత మధురమైన బహుమతి కదా .

    రిప్లయితొలగించండి
  10. నా దగ్గరా ఒక డౌన్‌లోడ్ ఉంది ఆవిడ బ్లాగ్ లోంచే తీసుకున్నా,ఆత్రేయ గారి రహస్యం సినిమాలోని "సీతకళ్యాణం హరికధ" ఘంటసాల గారి గొంతులో ఓహోహో సూపరోసూపరు...

    అవును మురళి గారు ఒక్కరోజు ముందుగా రాసి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు కూడతెలియచేసి ఉంటే ఇంకా బావుండేదేమోకదా.
    "మధురవాణి" గారికి ఇలా ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాక్షలు తెలియచేసుకుంటూ,మీరిలాగే మీ ప్రస్థానాన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటూ...

    శ్రీనివాస్ పప్పు

    రిప్లయితొలగించండి
  11. చక్కని బ్లాగుకి ఎంతో చక్కని పరిచయం.. అభినందనలు మధురవాణి గారు :-)
    అలానే మిస్సైన కొన్ని టపాలను (ముఖ్యంగా నేను కధ ఇదివరకు చదవలేదు :( ) మాకు మళ్ళీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు :-)

    రిప్లయితొలగించండి
  12. రెగ్యులర్ గా చదువుదామనుకుని మిస్సయిన బ్లాగుల్లో మధురవాణి గారి బ్లాగు ఒకటి(చూశారా..మీరు కోపంగా చూస్తున్నారు..చదువుదామనుకుంటాడుగానీ ఒక్కటీ చదవడు అన్న అర్ధం కనిపిస్తుంది మీ చూపులో :-)). తను మంచి ఫోటో గ్రాఫర్ కూడానండీ..తన ఇంకో బ్లాగు మధురచిత్రాలు అనే బ్లాగుల్లో ఫోటోలు చూడ చక్కగా ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  13. చిన్న సవరణ.ఆత్రేయ గారు తీ(చే)సిన "వాగ్దానం" "రహస్యంగా" ఉంచాను.ఆ "సీతాకళ్యాణం" హరికథ వాగ్దానం సినిమాలోది.

    రిప్లయితొలగించండి
  14. మురళీ గారూ,
    ఎంతందంగా చెప్పారండీ ఒక అతి సాధారణమయిన బ్లాగు గురించి. మీ వ్రాతలో నా బ్లాగు భలే ముచ్చటగా కనిపిస్తుందండోయ్.. అదేనండీ లేని అందం కనిపిస్తోంది ;-)
    మీకూ, నా బ్లాగు ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాలు తెలిపి, ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @చిన్నా: 'ప్రియనేస్తా'న్ని కొనసాగిస్తారని ఆశిద్దామండీ.. ధన్యవాదాలు.
    @శిశిర: ఈమధ్య ఆవిడ అరుదుగా రాస్తుండడం వల్ల మీరు మిస్సై ఉంటారండీ, కొన్నాళ్ళ పాటు. ధన్యవాదాలు.
    @భావన: అయ్యో భావన గారూ.. మీకైతే సంవత్సరానికి 32 చాలా పేద్ద సంఖ్య అని తెలుసు నాకు :-) ఆవిడ అంతకు ముందు సంవత్సరంలో ఒక్క నెలలోనే 36 నాణ్యమైన పోస్టులు రాసి రికార్డు స్థాపించారు కదండీ మరి.. అద్భుతాలు వస్తాయని ఎదురు చూద్దామండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @వాసు: ఈ బ్లాగు మిమ్మల్ని నిరాశ పరచదనే నా నమ్మకమండీ.. ధన్యవాదాలు.
    @జయ: బ్లాగు లోకపు మొదటి రోజులు.. నిజం చెప్పాలంటే కొత్తగా బళ్ళో చేరినట్టు అనిపించిందండీ.. సీనియర్లందరూ మంచి వాళ్ళు కాబట్టి ర్యాగింగూ అవీ చెయ్యకుండా తలో చెయ్యీ వేసి సాయం చేశారు.. గత సంవత్సరం అందుకున్న విలువైన బహుమతుల్లో మధురవాణి గారి బహుమతి ఒకటండీ.. ధన్యవాదాలు.
    @సృజన: అందరికీ నచ్చేలా రాయడం ఆవిడ ప్రత్యేకత అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @పరిమళం: ధన్యవాదాలండీ..
    @రాజశేఖరుని విజయ్ శర్మ: క్రెడిట్ అంతా మధురవాణి గారిదేనండీ.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: బహుశా బ్లాగు లోకంలో కొందరైనా 'మాలా కుమార్' అంటే కాలేజీ అమ్మాయి అనుకుంటూ ఉండి ఉంటారండీ :-) ఇంతకీ మీరూ, మీరూ ఓ ఊరివాళ్ళన్న మాట.. చూశారా, బ్లాగులు ఎందరు బంధువులని కలుపుతున్నాయో.. నిజంగానే మధురమైన బహుమతి అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @శ్రీనివాస్ పప్పు: మీరు పొరపాటు రాశారేమిటా అని నేను ఆశ్చర్యంలో ఉండగానే మీరు సవరణ పంపేశారు.. నాక్కూడా బాగా ఇష్టమైన పాటండీ.. పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది, ఆధునిక రామాయణమా అన్నట్టుగా.. పుట్టిన రోజు సంగతి నాకు తెలియదండీ.. తెలియజేసినందుకు మీకు స్పెషల్ థాంక్స్. ఆలస్యంగా అయినా మధుర వాణి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @నిషిగంధ: కథ బాగుంది కదండీ.. నాకు నచ్చింది.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నా స్పందనని యెంత చక్కగా విజువలైజ్ చేశారు శేఖర్ గారూ.. ఇక్కడితో ఆపకుండా కొంచం ప్రతిస్పందించడం కూడా మొదలు పెట్టండి :-) అవునండీ.. నాకైతే జర్మనీ వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది, ఫోటోలు చూసినప్పుడల్లా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @మధురవాణి: నేను చేసిన పని మీ బ్లాగుని అద్దంలో చూపించే ప్రయత్నం చేయడమండీ, అది కూడా ఒక పాఠకుడిగా మీ బ్లాగుతో నా జ్ఞాపకాలు పంచుకున్నానిక్కడ.. గొప్పదనాన్ని అద్దానికి ఇచ్చేస్తే ఎలా చెప్పండి?? అన్నట్టు మీరు కొంచం ఎక్కువ టపాలు రాస్తానని కమిటై ఉంటే బాగుండేదండీ :-) తర్వాతి సంగతి మనవాళ్ళంతా చూసుకుందురు.. మీ స్పందనకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మధురవాణి గారి బ్లాగు గురించి చాలా చక్కగా పరిచయం చేశారు. ముఖ్యంగా మొదటి లైను "ఆ బ్లాగు లో టపాలు చదువుతూ ఉంటే రోజూ మన కళ్ళెదురుగా తిరిగే పక్కింటి అమ్మాయి గలగలా చెబుతున్న కబుర్లు వింటున్నట్టుగా ఉంటుంది." నేను ఎపుడూ ఇదే అనుకుంటూ ఉంటాను. తను పరిచయం చేసే పాటలు కూడా చాలా బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  21. మంచి బ్లాగు గురించి మంచి పరిచయం. మంచి మంచి పాటలతో చిత్రాలతో అలరించే మధురవాణి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. @వేణూ శ్రీకాంత్: అసలు పాటల గురించే ఒక ప్రత్యేక టపా రాయొచ్చండి. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. telugu lo intha chakkaga mrudumaduramga wrayatam me okkari sotthu kabolu chakkaga parisilinchi kallaku kottochinattuga chadive vari manassu hatthukoni yekkadiko tisukelle vidamga vundi. meru elage samayam dorikinappudu wrastu vundandi.God Bless You.

    రిప్లయితొలగించండి
  24. @రాజేంద్రకుమార్: చదివి, మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. నిజమే. చాల ఇంటరెస్టింగ్ గా వుంది. పాత సినిమాలలోని మంచి మంచి పాటలని పరిచయం చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి