ఇంట్లో దెబ్బలు తినడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటే. నాకు ఊహ తెలిశాక నా మూడో ఏట ఓ ఎండవేళ మద్యాహ్నం నాన్ననన్ను చీపురు పుల్లతో కొట్టడం బాగా గుర్తుంది. నా వయసుతో పాటే శిక్షా పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఎద్దులని కొట్టే కొరడా కర్ర (చెర్నకోలా అనికూడా అంటారు), నాటకాల కోసం తెచ్చిన లెదర్ హంటర్ నా వీపు మీద ఎక్కువగా నాట్యం చేశాయి. ఇంట్లో ఎన్ని దెబ్బలు తిన్నా స్కూల్లో మూడో తరగతి వరకు దెబ్బలు తినలేదు. క్లాస్ లో ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పడమే ఇందుకు కారణం. ఐతే అల్లరి చేసినందుకు అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్షలు ఉండేవి. క్లాస్ లో నిలబెట్టడం లాంటివి. నేను స్కూల్లో మొదటి సారి బెత్తం దెబ్బ తిన్నది మూడో తరగతిలో.
సత్యనారాయణ మాస్టారు మా స్కూలికి కొత్తగా వచ్చారు. ఆయనకి అంతకు ముందు సంవత్సరమే కొత్తగా ఉద్యోగం వచ్చింది. మా పక్క ఊరినుంచి రోజూ సైకిల్ మీద వచ్చేవారు. మద్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్లి మళ్ళీ వచ్చేవారు. ఆయన చేతి వేళ్ళకి ఉండే పొడవాటి గోళ్ళని నేను చాలా ఆరాధనా భావంతో చూసే వాడిని. ఎందుకంటే నాకు చిన్నప్పుడు విపరీతంగా గోళ్ళు కొరికే అలవాటు. ఆయన మాకు లెక్కలు చెప్పేవారు. ఇక స్కూలికి ఒంటిపూట సెలవులు మొదలవుతాయనగా ఓ రోజు మధ్యాహ్నం మాష్టారు స్కూలుకి చాలా కోపంగా వచ్చారు. వస్తూనే లెక్కల పాఠమ్ మొదలు పెట్టి అందర్నీ నిలబెట్టి ప్రశ్నలడగడం మొదలెట్టారు. అసలే ఎండలో దూరం నుంచి సైకిల్ మీద వచ్చారేమో ఆయన రూపం భయంకరంగా ఉంది. దానికి తోడు గద్దించి అడుగుతున్నారు.
ముందుగా లక్ష్మి కాంతం అనే అమ్మాయిని అడిగారు. ఆమె చెప్పలేకపోయింది. బెత్తంతో కొట్టారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తరువాత నా వంతు వచ్చింది. ఆయన ఏం అడుగుతున్నారో అర్ధం కాలేదు. మైండ్ బ్లాంక్ అయిపోవడం అంటారే..అలాంటి పరిస్థితి. నేను తడబడ్డాను. ఆలస్యాన్ని భరించలేక ఆయన బెత్తాన్ని గాలిలో రెండు సార్లు లేపారు. రెండు తొడలమీద మంట తెలుస్తోంది. నాన్న కొట్టే దెబ్బల పుణ్యమా అని దెబ్బ తగిలినా ఏడవకుండా ఉండగలగడం నాకు అలవాటయ్యింది..నా నుంచి స్పందన లేకపోవడంతో దెబ్బ తగలలేదనుకుని మరోసారి బెత్తం పైకి లేపారు మాస్టారు. ఈసారి దెబ్బ ఎడమ మణికట్టు మీద. ఈలోగా హెడ్ మాస్టర్ గారు వచ్చి మాస్టారిని పిలుచుకు వెళ్ళారు. లక్ష్మి కాంతం ఏడుపు మొదలు పెట్టింది.
ఆడ పిల్లలంతా ఆమె చుట్టూ, అబ్బాయిలంతా నా చుట్టూ మూగారు. అప్పుడు చూసుకున్నా దెబ్బలు. రెండు తొడలమీదా ఎర్రని చారికలు. ఎడమ మణికట్టు మీద పైకి లేచిన దద్దురు. మాస్టారి చేత దెబ్బలు తిన్నందుకు ఇంట్లో మరో రౌండ్ ఉంటుంది..నేను దాని గురించి ఆలోచిస్తున్నా.. ఈ లోగా గణేష్ అన్నాడు..'మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను కొడతారు. మేం ఎవరం మీ ఇంట్లో చెప్పం..నువ్వు కూడా చెప్పకు' అని.
ఇంటికి వెళ్ళాక బట్టలు మార్చుకోవాలి.. అమ్మ చూడకుండా.. అంతకు ముందే సంక్రాంతి పండక్కి కుట్టించిన కొత్త లాగు తొడుక్కున్నా.. అదైతే కాళ్ళమీద దెబ్బలు ఇంట్లో వాళ్ళకి కనిపించవు. ఎడమచెయ్యిని కవర్ చేయడం కోసం నాకున్న ఫుల్ హాండ్స్ చొక్కా. కొత్తబట్టలు మాపేస్తున్నానని అమ్మ తిట్లు. సాయంత్రం వరకు రహస్యం దాచగాలిగా. దీపాలు పెట్టే వేళ నాన్న ఇంటికి చేరారు. కొరడా కర్రకి కొత్త తోలు ముక్కలు కొనుక్కొచ్చారు. వీధిలో కూర్చుని అవి మారుస్తూ 'ఆ తల అగ్గిపుల్ల వేసినా అంటుకోదు .. ఇదిగో వీడికి కాస్త నూని రాయి' అని అమ్మకి ఆర్డర్ వేశారు. నాకు నూనె రాసుకోవడం చిరాకు. ఇప్పుడు తప్పదు. అమ్మ చేత నూనె రాయించుకోవడం అంటే నూనె డబ్బాలో తల పెట్టడమే. పిండితే బొట్లు బొట్లు గా కారేలా తలకి నూనె పట్టించాక అమ్మ ప్రేమగా నా పాదాలకి, చేతులకి తన నూనె చేతులు రాయడం మొదలుపెట్టింది.
చేతికి నూనె రాస్తుండగా అమ్మ ఆ దెబ్బ చూసి 'ఏమిటిది..ఎవరు కొట్టారు?' అని అరిచింది. మాస్టారు కొట్టారని చెప్పక తప్పలేదు. గుచ్చి గుచ్చి అడిగితే కాళ్ళ మీద దెబ్బలు కూడా చూపించేశా.. కొరడా దెబ్బలు తప్పవని అర్ధమైపోయింది. ఐతే నాన్న కొట్టలేదు 'నీకు తిండి దండుగ..దూడలు కాసుకో..' లాంటి రొటీన్ తిట్లన్నీ తిట్టి చెయ్యలేకపోయిన లెక్క తెమ్మన్నారు. పుస్తకం తెచ్చి చూపించా. చిన్న లెక్కే..కానీ ఇక్కడ నాన్న భయం..చేయలేక పోయా.. తనే చేయించి దానికింద 'ఈ లెక్క చేయలేక పోయినందుకు ఇవాళ మాస్టారు నన్ను కొట్టారు' అని నా చేత రాయించారు. అది చూసి మాస్టారు నన్ను మళ్ళీ ఎక్కడ కొడతారో అని భయం. మర్నాడు లక్ష్మి కాంతం వాళ్ల తాతగారు మాస్టారి మీద యుద్ధానికి వచ్చారు.. నాన్న మాత్రం మాస్టారిని ఏమి అనలేదు.
అమ్మ రాసే వెన్నపూసల పుణ్యమా అని వాతలు వారం రోజుల్లో మానిపోయాయి. స్కూల్లోనూ, ఊళ్ళోనూ సింపతీ భరించడం మాత్రం చాలా కష్టమైంది. ఆ దెబ్బల పుణ్యమా అని రెండు జరిగాయి. ఒకటి నాకు లెక్కల మీద అసహ్యం. రెండోది పెద్దయ్యాక ఏ ఉద్యోగమైనా చేయాలి, మాస్టారి ఉద్యోగం తప్ప అని ఓ గట్టి నిర్ణయం తీసుకోవడం. లెక్కల మీద పెంచుకున్న అసహ్యం ఆ తర్వాత నా జీవితం ఓ మలుపు తిరగడానికి కారణమైంది. మాస్టర్ ఉద్యోగం చేయకూడదు అన్న నిర్ణయాన్ని బలపరిచే సంఘటనలు ఆ తర్వాత మరి కొన్ని జరిగాయి. కాలక్రమం లో కొందరు మంచి ఉపాధ్యాయులు కూడా పరిచయం అయ్యారు. మొత్తం మీద ఆ చిన్న సంఘటన నా మీద చాలా పెద్ద ప్రభావాన్నే చూపింది.
ఇలాంటి చిన్నప్పటి సంఘటనలు తల్చుకుంటే ఒక లాటి ఆనందం కలుగుతుంది. ఆ మాష్టారి దెబ్బలు మధురంగా అనిపిస్తాయి ఇప్పుడు. నాకొక విషయం అర్థం కాదు. చిన్నప్పుడు నాన్న అంత కఠినంగా ఉన్నా(సాధారణంగా అన్నయ్యలకు పడేవి దెబ్బలు, మాకేమో గుంజిళ్ళు) నాకు నాన్న మీద కంప్లెయింట్స్ లేవు. క్రమశిక్షణ ఇలాగే అలవాటయింది అనిపిస్తుంది. బాగున్నాయి మీ చిన్నప్పటి బెత్తం దెబ్బలు.
రిప్లయితొలగించండి@సుజాత: ధన్యవాదాలు. ఏం చేయమంటారు..మా ఇంట్లో నేనే అన్నయ్యని..అందుకే నాకు తప్పలేదు.
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారు :) ఒక సారి నన్ను కొట్టిన పాపానికి పాపం మా క్లాస్ లీడర్ ని మా ఇంట్లో వాళ్ళందరు దండెత్తి మరి తిట్టారు, ఎలాగన్నా అబ్బాయిలకు పాపం తక్కువే సానుభూతి :)
రిప్లయితొలగించండి@నేస్తం: తప్పదండీ..కొన్ని జీవితాలు అంతే..:) మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళీగారు.....మీ బెత్తం దెబ్బలు నాకు గుర్తుకు తెచ్చాయి నా చిన్నినాటి చిలిపిచేష్ఠలు, బాగుందండి.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: ధన్యవాదాలు
రిప్లయితొలగించండిwow
రిప్లయితొలగించండిమురళి గారూ,
రిప్లయితొలగించండిమీ ఈ పోస్టు చదివినప్పటినుండి ఆలొచిస్తున్నాను నా తొలి బెత్తం దెబ్బ ఎప్పుడా అని. నా ఆరో తరగతిలో అనుకుంటా, నేను బాగా చదివేవాడినే అయినా, కొంతమంది ఆకతాయి పిల్లల్తోపాటు క్లాసులోకి ఆలస్యం గా అడుగుపెట్టడం తో, వారితో పాటు నాకూ పడింది దెబ్బ. అయితే అందరినీ అరచేయి వెనక్కి తిప్పి వేళ్ళ వెనకభాగాన కొడితే, నాకు మాత్రం కన్సెషన్ ఇచ్చి అరచేయి మధ్యలో కాస్త సున్నితంగా కొట్టారు.. :)
బెత్తం దెబ్బ అంటే గుర్తొంచ్చింది. నేను యేడవ తరగతిలో ఉండగా నా స్నేహితుడొకడు....ఒక మంచి డిజైన్ పేపర్లు కలిగిన ఒక పుస్తకం కొన్నాడు. అందులో అందరి చేత ఎదొ ఒకటి రాయిస్తున్నాడు. సరే నన్ను కూడా ఎదొ ఒకటి రాయమన్నాడు. " అసలు ఎందుకురా ఇది...ఏంటిది? " అని అడిగా... వాడన్నాడు....ఈ పుస్తకం ఒక తీపి గుర్తు గా దాచుకోటానికిరా అన్నాడు. అబ్బా...ఇలా కూడా చెస్తారా? అనుకున్నా. సరే మరి అడిగాడు కదా అని....బాగా ఆలోచించి..(అప్పటికి ఈనాడు పేపర్ని ఒక చిన్న ఎడ్వర్టైస్మెంట్ కూడా వదలకుండా చదివే అలవాటున్న నేను)...అందరిలాగా కాకుండా ఎదైనా కొత్తగా...రాయాలి...ఒక కవి లాగ రాయాలి...అనుకుని "ఆవేశం ఆపుకో..ఆలోచన పెంచుకో" అని రాస్తూ...బాగా సంబరపడ్డా. అయ్య బాబోయ్ నాలో ఇంత కవి ఉన్నాడా అని నన్ను నేనే అభినందించుకుంటూ. కాని ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. నేను వాడి పుస్తకంలో ఎదో రాస్తున్నట్టు గమనించిన మా ఫ్లోర్ ఇంచార్జ్...కరస్పాండెంట్ దెగ్గరికి తీస్కెళ్ళి ఇదీ విషయం అని చెప్పాడు. ఇంకేముంది...మీకు జరిగినట్లే..నామిద కుడా వెదురు బెత్తం నాత్యం చేసింది. అదేంటొ ఆయన కొట్టినప్పుడు..అసలు కొట్టినట్లే అనిపించలేదు...కాని కొట్టిన మూడు క్షణాలకి తెలిసింది ఆ నొప్పి. అరచేతులు బూరెల్లా ఉబ్బిపోయి....వేళ్ళు కూడా కదిలించలేని పరిస్థితి. కాని ఎం చేద్దాం....మీకు నాకు సారూప్యం కాస్త ఎక్కువగా ఉనంట్టుంది... మా ఇంట్లో వాళ్ళు కూడా స్కూలికి వచ్చి ఇలా ఎందుకు కొట్టారు అని మాత్రం ఆయనని అడగలేదు. కాని...నేను మాత్రం ఆయన నన్ను కొట్టాక...మనసులో అనుకున్నాను...మా స్నేహితుడి పుస్తకలో నేను రాసిన వాక్యాలు వాడికంటే ఈయనని ఉద్దేశించి రాస్తే బావుండేది అని.
రిప్లయితొలగించండి@ఉమాశంకర్: అదృష్టవంతులు.. ఆరోతరగతి వరకూ దెబ్బలు తినలేదు.. నేను మూడో తరగతిలోనే.... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@"శం కరోతి" - ఇతి శంకరః : "నేను మాత్రం ఆయన నన్ను కొట్టాక...మనసులో అనుకున్నాను...మా స్నేహితుడి పుస్తకలో నేను రాసిన వాక్యాలు వాడికంటే ఈయనని ఉద్దేశించి రాస్తే బావుండేది అని." ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి.. బాగుంది మీ జ్ఞాపకం.. ధన్యవాదాలు.