వాక్యం ఒడుపు తెలిసిన రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి నుంచి తాజాగా వచ్చిన కథాసంపుటి 'సమాంతరాలు.' నూటిరవై పేజీల సంకలనంలో కథల సంఖ్య కేవలం ఐదు. వీటిలో మొదటి కథ నిడివే యాభై పేజీలు. పదాల లెక్కలు, సన్నివేశాల నిడివి లాంటి కొలతలేవీ పెట్టుకోకుండా కథల్ని తాపీగానూ, అదే సమయంలో ఎక్కడా ఆపకుండా చదివించేలానూ రాశారు. కథలు చదివేప్పుడు ముగింపు ఏమై ఉంటుందో అన్న ఆత్రుత కన్నా, పాయసంలో జీడిపప్పు పలుకుల్లా తగిలే వాక్యాలని నెమరువేసుకుంటూ ముందుకుసాగడం బాగుంటుంది పాఠకులకి. కథ చదవడం పూర్తయ్యాక ఆగి ఆలోచించడం ఎటూ జరిగేదే అయినా, చదువుతూ మధ్యమధ్యలో కూడా ఆగి ఆలోచనల్లో పడేలా చేయడం ఈ ఐదు కథల ప్రత్యేకత. జీవిత సత్యాలని - నిలబెట్టి పాఠం చెప్పేస్తున్నట్టుగా కాక, యధాలాపంగా చెప్పినట్టనిపించే వాక్యాల్లో పొదగడం కనిపిస్తుంది కథలన్నింటిలోనూ. మళ్ళీ చదివినప్పుడు కూడా కొత్తగా అనిపించే ఎక్స్ప్రెషన్లకి కొదవే లేదు. ఈ కథల్ని మొదటిసారి చదివినప్పుడు - వెలుగుని చూసి కళ్ళు మిరుమిట్లు గొలిపినట్టుగా - ఏమీ రాయాలనిపించలేదు. మళ్ళీమళ్ళీ చదివించే గుణం ఉన్న కథలే అన్నీను.
హరిదాసుల కుటుంబలో పుట్టిన దాసు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రాజమండ్రిలో బాగా డెవలప్ అయిన లొకాలిటీలో పాతదైన సొంత ఇల్లు ఉంది. భార్య గతించింది. మగపిల్లలిద్దరూ వాళ్ళ కుటుంబాలతో దూరంగా ఉంటున్నారు. ఓ రాత్రి వేళ దాసుగారింట్లో ఓ దొంగ ప్రవేశించాడు. అప్రమత్తంగా ఉన్న దాసుగారు, తాను చీకట్లో దాగి దొంగాడిని కర్రతో మోదారు. ఆ దొంగ పేరు పీటర్. ఇంటర్ ఫెయిలైన కుర్రాడు. దొంగతనం అదే ప్రధమం. దాసుగారే కుర్రాడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా చిత్రమైన స్నేహం అల్లుకుంది. దాసు గారికి గతమే తప్ప భవిష్యత్తు లేదు. పీటర్ గతమంతా దెబ్బల మయం. రంగుల భవిష్యత్తుని నిర్మించుకునే పనిలో ఉన్నాడు. భిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి జీవితాల్లో, వాళ్ళు కలిసి గడిపిన కొంత కాలాన్ని చిత్రించారు 'సమాంతరాలు' కథ. సంపుటిలో మొదటి కథ ఇదే. "గోదారి మధ్యనే ఉత్తినే దొరికిన చిన్న పడవలా ఉన్నాడు పీటరు" లాంటి వర్ణనలెన్నో కథనిండా. దాసు గారికి ఇష్టమైన మెత్త పకోడీని మనవూ నవుల్తూన్నట్టే ఉంటుంది కథ చదువుతుంటే.
పూర్ణ, మార్కండేయులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మార్కండేయులు చిత్రమైన వ్యక్తి. అతనికి జ్ఞాపకాలంటూ ఏవీ ఉండవు. పెళ్ళైన మూడేళ్ళకి పూర్ణ అతనికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పటినుంచీ మార్కండేయులుకి ఒకటే వ్యాపకం - పూర్ణ ఆనుపానులు తెలుసుకోవడం. అతని ప్రయత్నాల గురించి పూర్ణకీ తెలుసు, అందుకే అతనికి దొరక్కుండా దూరంగా తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెకి మార్కండేయులు మీద చెడు అభిప్రాయమేమీ లేదు. కానీ, అతనితో జీవితం తనకి కష్టం అనే విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుని, బాగా ఆలోచించే విడాకుల నిర్ణయం తీసుకుంది. పూర్ణ తన ఇంట్లో ఉన్నన్నాళ్లూ ఆమెని పట్టించుకోలేదు మార్కండేయులు. కానీ, ఆమె వెళ్ళిపోయినప్పటినుంచీ ఆమె ఆలోచనలే అతని ప్రపంచం అయిపోయాయి. వీళ్ళ కథకి సమాంతరంగా సాగుతుంది చౌదరి గారి నవయుగ హోటల్ నిర్వహణ. నవయుగ ఇడ్లీలు, పల్లీ పచ్చడి దేవతలు చేసినట్టు ఉంటాయి. బహుశా అక్కడి కాఫీనే అమృతం అంటారేమో అనుకుంటారు కస్టమర్లు. ఇంతకీ, మార్కండేయులు, పూర్ణ గురించి వాళ్ళ స్నేహితుడు (కథకుడు) ఏం తెలుసుకున్నాడో చెబుతుంది 'మార్కండేయుడి కాఫీ' కథ ముగింపు.
మూడో కథ మృత్యువు చుట్టూ తిరిగే 'నీడ వెంట'. ఓ రాజకీయ నాయకుడి మరణం అనంతరం మోపబడిన కర్ఫ్యూతో మొదలై, మూర్తి తండ్రి హఠాన్మరణం నుంచీ వేగం పుంజుకుని, అస్తి సంచయనానికి మూర్తి కాశీలో అడుగు పెట్టే సమయానికి అక్కడ కూడా కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తడం అనే మలుపు తీసుకుని ఊహకందని ముగింపుకి చేరుతుంది. "ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మూర్తికి తనొక్కడే పెద్ద ఉల్లిపొర కాయితం పొట్లంలో ఉన్నట్టనిపించింది.." "ఉదయం గంగ మామూలుగా ప్రశాంతంగా మురిగ్గా ఉంది" లాంటి వాక్యాల దగ్గర ఆగకుండా ముందుకెళ్లలేం. అపార్ట్మెంట్లో మూర్తి కుటుంబం శవ జాగరంలో ఉండగా, పక్క ఫ్లాట్లలో జీవితాలు యధాతధంగా గడవడం లాంటి పరిశీలనలకీ లోటులేదు. కాశీ చిత్రణ గతంలో చదివిన వాళ్ళకి కూడా, కర్ఫ్యూ నాటి కాశీని గురించి చదవడం కొత్త అనుభవమే అవుతుంది. మూర్తితో పాటు కాశీని చూస్తున్న పాఠకులు ఉలిక్కిపడే లాంటి ముగింపు ఇచ్చారు కథకి.
జీవితం అల్లకల్లోలం అయిపోడానికి పెద్ద పెద్ద మార్పులే జరగక్కర్లేదు, 'గునపం లాంటి ఒక వాక్యం' చాలు గురుమూర్తి గారి లాంటివాళ్ళకి. అప్పటివరకూ లేని కొత్త చింత, చింతన మొదలవుతాయి గురుమూర్తి గారిలో - ఆ వాక్యం విన్న తర్వాత. అప్పటి వరకూ నింపాదిగా ఉన్నవాడు కాస్తా గతాన్ని పెళ్లలు పెళ్లలుగా తవ్వి పోయడం మొదలెడతాడు. ఆ తవ్వకాల్లో ఎక్కువగా దొరికేవి పగిలిన కాఫీ కప్పులే. గవర్నమెంట్లో పనిచేసి రిటైరైన గురుమూర్తికి ఇటీవలే భార్యా వియోగం సంభవించింది. ఆ తర్వాతే ఆయనలో అశాంతి మొదలయ్యింది. అందుకు కారణం ఆయన భార్య ఆయనతో చివరగా మాట్లాడిన ఒకే ఒక్క వాక్యం. ఆ వాక్యం నుంచి అన్వేషణ మొదలై గతంలోకి సాగింది. ఆలోచనలన్నీ అసంపూర్ర్ణమే అవుతున్నాయి. చూడబోతే తన జీవితమే అసంపూర్ణం అనిపించింది ఆయనకి. 'అతని శీతువు' కథలో వరదాచార్యులు ఈ కథలో అతిధి పాత్రలో మెరుస్తారు. "ఎదురింటి మెట్ల మీద కామాలా పడుకుంది కుక్క" లాంటి వాక్యాలు భలే అందాన్నిచ్చాయీ 'ఇదొక అరసున్నా' కథకి.
అమెరికా నుంచి తల్లితో పాటు తురకపాలెం వచ్చిన ఎనిమిదేళ్ల క్రిష్-కృష్ణ-కిష్టప్పకి మురికిగా ఉండే ఆ ఊరు మొదట అస్సలు నచ్చనే నచ్చదు. రోడ్డు మీద పేడ వేసే గేదెలు, ఉమ్ములేసే మనుషులూ, బొత్తిగా గతుకుల రోడ్డూ.. ఏవీ ఆకట్టుకోవు. ఇంట్లో మావయ్య, అత్తయ్య, పెద్దమ్మ మాత్రం బాగా నచ్చుతారు. రానురానూ తురకపాలెం ప్రత్యేకతలని గురించి ఇంట్లో వాళ్ళ నుంచీ, బయటి వాళ్ళనుంచీ తెలుసుకున్నాక - ఏ ఇద్దరు చెప్పే విషయాలకీ పొంతన లేకపోయినా - ఆ ఊరిమీద కుతూహలం మొదలవుతుంది. పున్నమి రాత్రులలో ఆ ఊరి మురికికాల్వలో స్నానం చేయడానికి వచ్చే దేవకన్యలని చూడడానికి అర్ధ రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక బేటరీలైటు వేసుకుని "తెల్ల పిల్లిలా" వెళ్లిన కృష్ణ తెలుసుకున్నదేవిఁటి? ఆ ఊరిని గురించి అతనిలో స్థిరపడిన అభిప్రాయం ఏమిటన్నది 'తురకపాలెం దేవకన్యలు' కథ ముగింపు. పిల్లల్లో సృజనాత్మకతని ప్రోది చేయాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. ఒకప్పుడు చాలా సహజంగా జరిగిన ఈ ప్రక్రియ ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందనే ఆలోచన వస్తుంది పాఠకుల్లో.
"జీవితానుభవం తడిసిన చపాతీ పిండి వంటిది కాదు. ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను. పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒక రకమైన మృత్యు స్పృహ - అనుభవాలు. అవి చొక్కా పేంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి" అన్నారు రచయిత తన ముందు మాటలో. 'సమాంతరాలు' 'తురకపాలెం దేవకన్యలు' కథలు మొదటిసారి చదివినప్పుడే ఆకట్టుకుంటే, మిగిలిన కథలు పునశ్చరణలో బాగా నచ్చుతాయి. మళ్ళీ చదివినప్పుడు కూడా ఏకబిగిన కథని పూర్తిచేయించే శైలి ఈ కథల ప్రత్యేకత. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి అంకితం ఇచ్చిన 'సమాంతరాలు' కథాసంపుటిని 'ఛాయ' ప్రచురించింది. పేజీలు 120, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు.
ఇది చాయ వారి బెస్ట్ బుక్. థాంక్యూ. నేను మొదటి కథ కు శాస్త్రిగారి అభిమాని అయ్యాను. మీ బ్లాగ్ చాలారోజులకు చూశాను. చాలా సంతోషం అండీ.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండి