దాదాపు పదిహేనేళ్ల క్రితం ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకావిడ తన పుస్తకావిష్కరణ సభని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఒక హోటల్ టెర్రాస్ మీద చాలా వైభవంగా జరిగిందా సభ. నా వరకు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా అంతటి ఖరీదైన సభని చూడలేదు. ముగ్గురు హై-ప్రొఫైల్ ముఖ్య అతిధులు పుస్తకాన్ని చాలా మెచ్చుకుంటూ మాట్లాడారు. ఇద్దరు సాహితీ ప్రముఖులు ఆ సభలో నిశ్శబ్ద ప్రేక్షకులు - ఒకరు అబ్బూరి ఛాయాదేవి, రెండోవారు కాళీపట్నం రామారావు మాష్టారు. సభ పూర్తవ్వగానే మాస్టారు బయల్దేరబోతూ రచయిత్రిని పిలిచి ఒకటే మాట చెప్పారు: "వాళ్లంతా పుస్తకం చాలా బాగుందని మెచ్చుకున్నారు కానీ, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలున్నాయి, వాటిమీద దృష్టి పెట్టడం అవసరం" ..నేను మాత్రమే కాదు, ఆ మాటలు విన్న కొద్దిమందీ ఆశ్చర్యపోయారు. కారా మాస్టారిని ప్రత్యక్షంగా చూడడం అదే ప్రధమం.
మాస్టారితో కొంచంసేపు వివరంగా మాట్లాడింది మాత్రం తర్వాత పదేళ్లకి. ఐదారేళ్ళ క్రితం ఓ ఎండవేళ శ్రీకాకుళంలో పని చూసుకుని విశాఖపట్నం వెళ్ళబోతుండగా ఒక్కసారి కూడా 'కథానిలయం' చూడలేదని గుర్తొచ్చి విశాఖ 'ఎ' కాలనీ వైపు దారి తీసినప్పుడు కూడా ఆయన్ని కలుస్తాననుకోలేదు. కథానిలయం తాళం చెవి మాష్టారింట్లో ఉంటుందని తెలిశాక, ఆ అపరాహ్న వేళ బెల్ కొట్టి ఆయన్ని నిద్రలేపడమా, కథానిలయానికి బయటినుంచే దణ్ణం పెట్టేసుకుని తిరిగి వెళ్లిపోవడమా అనే సందిగ్ధం. ఓ ప్రయత్నం చేద్దామనిపించింది. ఆశ్చర్యం, ఆయన నిద్రపోవడం లేదు సరికదా కుర్చీలో కూర్చుని దీక్షగా చదువుకుంటున్నారు. పక్కనే పెన్సిలు, బుక్ మార్కు కోసం కాబోలు కొన్ని కాగితాలు ఉన్నాయి. తలుపు తీసినవారు మేస్టారిని చూపించి లోపలి తప్పుకున్నారు. ఆయనేమో, మర్నాడే పరీక్షన్నంత శ్రద్ధగా చదువుకుంటూ, మధ్యమధ్యలో పెన్సిల్ తో అండర్లైన్ చేసుకుంటూ, మార్జిన్లో నోట్సు రాసుకుంటున్నారు, (అప్పటికే ఆయనకి తొంభై దాటేశాయి) ఎంత సొగసైన దృశ్యమో!!
కాసేపటికి తలుపు తీసిన వారు తాళంచెవితో హాల్లోకి వచ్చి "మీరాయన్ని పలకరించండి పర్లేదు. కొంచం గట్టిగా మాట్లాడాలి" అని చెప్పి వెళ్లారు కానీ, మాస్టారిని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. ఓ క్షణానికి ఆయనే తలెత్తి చూశారు. కళ్ళకి కళ్ళజోడు, మడిచి కట్టిన తెల్ల పంచ, అనాచ్చాదిత ఛాతీ మీద బరువుగా వేలాడుతున్న జంధ్యం. ఆయన కథలకీ, ఈ ప్రయివేటు రూపానికీ అన్వయం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది లోపల్లోపల. "మీరు లెఫ్టిస్టు ఐడియాలజీ తోనే కథలన్నీ రాశారు కదా, మరి ఇదేవిటీ?" అని అడుగుదామా అనుకునే, 'విప్లవానికి జంఝప్పోచే అడ్డవైపోతుందా ఏవిటి?' అనిపించి ఆ ప్రశ్న మానుకున్నా. అసలైతే మాస్టారిని ఎప్పటినుంచో 'కలిస్తే అడగాలి' అనుకుంటున్న ప్రశ్న ఒకటుంది. 'యజ్ఞం' కథ మీద మీద జరిగిన చర్చ, రచ్చలలో మిగిలిన వాళ్ళ సంగతెలా ఉన్నా సొంత లెఫ్ట్ గ్రూపు నుంచి విమర్శలు వచ్చినప్పుడు ఆయనకేమనిపించిందీ అని. కానైతే ఆ ప్రశ్నకది సమయమూ, సందర్భమూ కాదనిపించి ఊరుకున్నా. పస్తాయించి చూస్తే ఆయన చుట్టూ ఉన్నవన్నీ కొత్త పుస్తకాలే. కొత్త రచయిత (త్రి) లు రాసినవే. అవి ఎలా ఉన్నాయని అడిగా.
"చాలామంది బాగా కృషి చేసి రాస్తున్నారు. కొందరు కృషి లేకుండా రాస్తున్నారు. రాయడం మాత్రం మానడం లేదు, అందుకు సంతోషం" అన్నారాయన. ప్రశ్నలు క్లుప్తంగా ఉండాల్సిన అవసరం అర్ధమై, "మీ కథల్లో నేటివిటీ.." అన్నాను కొంచం గట్టిగా. "ఆ పాత్రలన్నీ నిజజీవితం నుంచి వచ్చినవే. వాళ్ళ కట్టు, బొట్టు, భాష, యాస అన్నీ నాకు తెలిసినవే. కథలెక్కడినుంచి వస్తాయ్? మనుషుల నుంచే కదా" అన్నారాయన. అప్పుడు 'కథా నిలయం' గురించి అడిగితే ఆయన అక్షరాలా చిన్న పిల్లాడై పోయారు. డిజిటైజేషన్ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా చెప్పారు. ఎవరెవరు పనిచేస్తున్నారో, ఫండింగ్ చేశారో పేరుపేరునా జ్ఞాపకం చేసుకుని చెప్పారు. "కొన్ని పేర్లు, విషయాలు బాగా గుర్తుండడం లేదు" అన్నారు కొంచం విచారంగా. కాసిని కబుర్లయ్యాక 'కథానిలయం' చూడాలన్న కోరిక బయటపెడితే, వాళ్ళ మనవడికి తాళంచెవిచ్చి కూడా పంపారు. రోడ్డుకి ఒకపక్క మాష్టారి ఇల్లయితే, రెండోవైపున్న భవనమే 'కథానిలయం'.
ఎటుచూసినా కథలే కనిపించే ఆ నిలయంలో గోడలకి రచయితలు, రచయిత్రుల ఫోటోలు వేలాడుతున్నాయి. వాటిని శ్రద్ధగా చూస్తుండగా స్పురించిన విషయం - మాష్టారు రచయితగా ఒక భావజాలానికి కట్టుబడిన కథలు మాత్రమే రాసినా, 'కథానిలయం' లో మాత్రం భావజాలాలతో నిమిత్తం లేకుండా కథలన్నింటికీ చోటిచ్చారు. కథల్ని ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, కథల కోసం తాను ఇష్టంగా కట్టుకున్న ఇంటినే ఇచ్చేసేంత ప్రేమ ఒక్క మాస్టారికి మాత్రమే సొంతం. కథలకి ఓ గూడు ఏర్పాటు చేయడం ఓ ఎత్తైతే, ఊరూరూ కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ అరుదైన కథల్ని సేకరించి, భద్రపరచడం మరో ఎత్తు. ఆయన కథా ప్రయాణాల కథలు బహు గమ్మత్తైనవి. వాటిని ఆయన మిత్రులు రికార్డు చేయడం అవసరం. పాఠకుడిగా, విమర్శకుడిగా కూడా ఆయనెక్కడా భావజాలపు గిరులు గీసుకోలేదు. జీవితమంతా కథల్ని ప్రేమించారు, కథకుల్ని తన సునిశిత విమర్శతో ప్రోత్సహించారు. తెలుగు కథ అనగానే వెంటనే గుర్తొచ్చేంతగా శేషకీర్తులయ్యారు. కారా మాస్టారికి నివాళి.
తెలుగు కథాప్రియులకు కారా మాస్టారిచ్చిన అపురూపమైన కానుక “కథానిలయం” 👏. చిరస్మరణీయుడు కారా మాస్టారు 🙏.
రిప్లయితొలగించండినిజమండీ.. ధన్యవాదాలు..
తొలగించండి🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి