'మాస్తి కన్నడిగులు ఆస్తి' అని కర్ణాటకలో ఒక వాడుక. మన శ్రీపాద
సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మించిన రెండు నెలల తర్వాత మైసూరు సంస్థానంలోని
తమిళ బ్రాహ్మణ కుటుంబలో జన్మించిన మాస్తి వేంకటేశ అయ్యంగార్ కి ఆధునిక
కన్నడ కథా రూపశిల్పిగా పేరుంది. 'చిక్కవీర రాజేంద్ర' నవలా రచనకు గాను
ప్రతిష్ఠాత్మకమైన 'జ్ఞానపీఠ' బహుమతిని పొందారు. కన్నడ ప్రభుత్వం మాస్తి
పేరిట ఒక సాహిత్య అవార్డుని ఏర్పాటు చేయడమే కాక, ఆయన ఇంటిని లైబ్రరీగా
మార్చి నిర్వహిస్తోంది. కొడగు ప్రాంతంలో ఆయన పేరిట ఒక పాఠశాలని కూడా
నడుపుతోంది. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై, మైసూరు సంస్థానంలో
ఉన్నతోద్యాగాలు చేసిన మాస్తి, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విశేషశమైన రచనలు
చేశారు.
కన్నడలో వెలువరించిన 'మాస్తి
చిన్నకథలు' సంపుటి సాహిత్య అకాడమీ బహుమతిని అందుకుంది. ఆ కథల్ని తెలుగులోకి
అనువదింపజేసి, ప్రచురించి, మార్కెట్ చేసే బాధ్యతలని అకాడెమీనే
స్వీకరించింది. ఈ సంపుటిలోని ఇరవైనాలుగు కథల్లోనూ చెప్పుకోవాల్సిన విశేషం
వస్తు వైవిధ్యం. చిన్ననాడు తాను విన్నకథలు మొదలుకొని, తన జీవిత అనుభవాలు,
కాలక్రంమలో విన్న విశేషాలు, చదివిన సాహిత్యంలో తనని ఆకర్షించిన అంశాలని
కథలుగా మలిచారు రచయిత. ప్రధమ ప్రచురణ తేదీలని పేర్కొనకపోవడం ప్రచురణకర్తలు
లోపమే కానీ, కథలు చదువున్నప్పుడు దాదాపు అలాంటి నేపథ్యంతోనో, లేక అలాంటి
పాత్రలతోనో నూరేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన కథలు గుర్తు రాక మానవు.
పుస్తకంలోని
ఇరవై నాలుగు కథల్నీ నాలుగు విభాగాలుగా చూడొచ్చు. రచయిత తన బాల్యంలో విన్న
విషయాలు, తనకి ఎదురైన అనుభవాలు, పురాణ కథల ప్రేరణతో రాసినవి, విదేశీ
సాహిత్యం స్పూర్తితో రాసిన కథలు. 'మునీశ్వరుడి చెట్టు,' 'చెన్నమ్మ,'
'పిన్నమ్మ,' 'సంజీవయ్య కల,' ' దివాణం ఆచార్యులు' కథలు రచయిత తన బాల్యంలో
విన్నవిగా అనిపిస్తాయి. వీటిలో 'చెన్నమ్మ' చదువుతూ ఉంటె మన కొకు రాసిన
రెండుమూడు కథలు జ్ఞాపకం వస్తాయి. 'పిన్నమ్మ' కథని ఓ పట్టాన మర్చిపోలేం.
పాలకుడైన రాజుకి, ఆచార్యుడికి మధ్య ఉండాల్సిన సంబంధాన్ని వివరించి చెప్పే
కథ 'దివాణం ఆచార్యులు,' కాగా ఓ దంపతుల కథ 'మునీశ్వరుడి చెట్టు.' ఇక,
'సంజీవయ్య కల' ఓ సరదా కథ.
రచయితవి లేదా ఆయన
స్నేహితుల జీవితానుభవాలుగా అనిపించే కథలు 'కుక్క బ్రతుకు,' 'ఆంగ్ల నౌకా
క్యాప్టెన్,' 'కాకిలోకం,' 'నాలుగో అధ్యాయం,' 'కొత్తరకం దాంపత్యం,'
'చట్టికారుడి తల్లి.' వీటిలో 'ఆంగ్ల నౌకా క్యాప్టెన్' కథ నాటి భారతీయ,
విదేశీ సమాజపు విలువలని పోల్చే ప్రయత్నంగా అనిపిస్తుంది. 'చట్టికారుడి
తల్లి' బ్రిటన్ పురుషుడి వల్ల తల్లైన భారతీయ స్త్రీ తన జీవితంలో
ఎదుర్కొన్న సంఘర్షణలని చిత్రించిన కథ. 'కుక్క బ్రతుకు' 'కొత్తరకం దాంపత్యం'
కథల్లో ఏ పోలికా లేకపోయినా ఆ రెంటి మధ్యా ఏదో అంతస్సూత్రం ఉన్నట్టే
అనిపిస్తుంది. చలం 'బుజ్జిగాడు' వగయిరా రచనల్ని గుర్తు చేసే కథ 'కాకి
లోకం.'
ఇక పురాణ కథల స్పూర్తితో రాసిన కథలు
'చీమల లోకం,' 'కుచేలుడి భాగ్యం,' 'మంత్రోదయం.' వీటిలో 'చీమలలోకం' కథ
రామాయణం నుంచి తీసుకున్నది. కైకేయి తండ్రి కేకయరాజుకి అన్ని జీవరాశుల
భాషలనీ అర్ధం చేసుకునే వరం ఉంది. చీమల భాష తెలియడం వల్ల, వాటి జీవన
విధానాన్ని అధ్యయనం చేశాడాయన. ఈ అధ్యయనానికి, రామాయణ కథకీ అందమైన ముడి
వేశారు మాస్తి. అందరికీ తెలిసిన కృష్ణ-కుచేలుర కథనే కొత్తగా చెప్పారు
'కుచేలుడి భాగ్యం' కథలో. ఓ మహర్షి జీవితంలోని కట్ట కడపటి రోజుని చిత్రించిన
కథ 'మంత్రోదయం.' ఆశ్రమ జీవిత వర్ణన, పాఠకుల్ని నేరుగా ఆశ్రమంలోకి
తీసుకుపోయేదిగా ఉంది.
విదేశీ సాహిత్యం
స్పూర్తితో పది కథల్ని రాశారు మాస్తి. రోమ్ దేశపు సత్యవాది 'సంయమి కేటో' ఓ
ధర్మ నిరతుడి కథ. ఈజిప్ట్ రాజవంశీకులు రాచరక్తం కల్తీ కాకుండా ఉండడం కోసం
సోదరీసోదరుల మధ్య వివాహం జరిపించిన వైనాన్ని వివరించే కథ 'రాణి హాట్ సిటో.'
తన తమ్ముడిని వివాహం చేసుకున్న ఈ రాణీ, తన కుమార్తెకి కొడుకునిచ్చి వివాహం
చేస్తుంది! 'చెడ్డకాలం' (రోమ్), 'నేషహువల్ కోయోటిల్' (మెక్సికో), 'విచిత్ర
ప్రేమ,' (ఫ్రాన్స్), 'నర్తకి పరాభవం' (రష్యా), 'పేరు చావదు' (గ్రీక్),
'ధర్మ కింకరుడు ఫట్స్ స్టీఫన్' (ఇంగ్లాండ్), 'యాన్ షేక్స్ పియర్'
(ఇంగ్లాండ్), 'టాల్ స్టాయ్ మహర్షి భూర్జ వృక్షాలు' (రష్యా) కథలు ఆయా దేశాల
విశేష వ్యక్తుల జీవితాలని పరిచయం చేస్తాయి. చివరి రెండూ, షేక్స్ పియర్,
టాల్ స్టాయ్ లని గురించి ఆసక్తి కరమైన విశేషాలు చెబుతాయి. ఇక
'విచిత్రప్రేమ' కథ తెలుగులో వచ్చిన నాలుగైదు నవలలకు ముడి దినుసు!!
జీఎస్ మోహన్ తెలుగు అనువాదం సరళంగా ఉంది. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారికి
బాగా నచ్చే సంకలనం ఇది. (పేజీలు 311, వెల రూ. 125, సాహిత్య అకాడమీ
స్టాళ్లలో లభ్యం). కథలు చదువుతున్నంతసేపూ, మాస్తికి దక్కిన గౌరవంతో కొంచమైనా శ్రీపాదకి ఇక్కడ దొరకలేదు కదా అని పదేపదే అనిపించింది.
చాలా బాగా రాసారు, నేను కన్నడ లో ఆ book చదివాను. తెలుగులో try చెయ్యాలి.
రిప్లయితొలగించండిరాజేశ్వరి.
nice...
రిప్లయితొలగించండిtrendingandhra
@రాజేశ్వరి కిషోర్: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@అన్నోన్: ధన్యవాదాలండీ..