ఇది సమీక్ష కాదు. బహుశా పరిచయం కూడా కాదేమో.
'త్రిపుర' కలంపేరుతో రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు రాసిన పదిహేను
కథలనీ చదివిన అనుభవం తాలూకు కబుర్లివి. 1963-90 మధ్యకాలంలో రాసిన ఈ కథల్లో
ఏడు కథలు 'భారతి' లో ప్రచురితమయ్యాయి. 'రాబందుల రెక్కల చప్పుడు' అముద్రితం.
మిగిలినవి 'జ్యోతి,' 'ఆంధ్రప్రభ,' 'తరుణ,' 'స్వాతి,' 'ఆంధ్రజ్యోతి' లలో
ప్రచురితం అయ్యాయి. కథారచయిత త్రిపుర పేరు చాలా రోజులుగా పరిచయం. కానీ,
త్రిపుర రాసిన కథ మాత్రం కొంచం చిత్రంగా పరిచయం అయ్యింది నాకు.
సుమారు
పదిహేనేళ్ళ క్రితం ఓ వర్షాకాలపు సాయంత్రం వేళ నలుగురు మిత్రులం ఓ హోటల్లో
టీ తాగుతున్నాం. "అచ్చం త్రిపుర కథలో వాతావరణంలా ఉంది" అన్నారొకరు. అనడమే
కాదు, 'హోటల్లో' కథని మూడు ముక్కల్లో పరిచయం చేసేశారు. "హీరో ఓ హోటల్లో
కూర్చుంటాడు. అక్కడ ఒక్కో టేబిల్ దగ్గరా వినిపించిన మాటలన్నీ వరసగా
చెబుతాడు. కథ అయిపోతుంది.." ఇది విన్నాక ఆసక్తి పెరిగింది. ఎలాగో సంపాదించి
ఆ ఒక్క కథా చదివాను. కథలో హీరో జీవితంలో అనేక కోణాల్ని ఏకకాలంలో చూశాడు,
హోటల్లో కూర్చుని.
తర్వాతెప్పుడూ నేను త్రిపుర కథల జోలికి
వెళ్ళలేదు. పుస్తకాల షాపుల డిస్ప్లే లో అవెప్పుడూ కనిపించకపోవడం బహుశా ఓ
కారణం. మూడేళ్ళ క్రితం కనిపించింది 'త్రిపుర కథలు,' పర్స్పెక్టివ్స్
ప్రచురణ. కాపీ తీసేసుకుని, అప్పటికే పరిచయం ఉన్న 'హోటల్లో' కథ మాత్రం
చదివేసి, పుస్తకాన్ని బుద్ధిగా పక్కన పెట్టేశా. రెండేళ్ళ క్రితం పేపర్లో
త్రిపుర మరణవార్త. సాహిత్యం పేజీల్లోనూ, కొన్ని వెబ్ మేగజైన్లలోనూ త్రిపుర
గురించీ, త్రిపుర కథల గురించీ వ్యాసాలు. పుస్తకం నా దగ్గర ఉందో లేదో చెక్
చేసుకున్నాను. కాపీ భద్రంగానే ఉంది, హమ్మయ్య!
ఓ ఆర్నెల్ల
క్రితం, మొండి బకాయిల ప్రక్షాళనలో భాగంగా పైకి తీశాను 'త్రిపుర కథలు'
పుస్తకాన్ని. అప్పటి నుంచీ అప్పుడో కథా, అప్పుడో కథా చదువుతూ.. వాటిగురించి
ఆలోచనల్లో పడుతూ.. తేరుకుంటూ.. కొన్ని కొన్ని వాక్యాలనీ, మరికొన్ని ఎక్స్
ప్రెషన్లనీ అప్పుడప్పుడూ గుర్తుచేసుకుంటూ... కథల్లో ఏముందో పట్టుకోడానికి
ప్రయత్నం చేస్తూ.. 'ఇంకా ఏదో ఉంది.. తప్పకుండా ఉంది' అన్న ఆలోచన దగ్గర
ఆగుతూ వస్తున్నాను. కథ కి ఓ ఫ్రేం వర్క్ ఉందీ అనుకుంటే అందులో ఏమాత్రమూ
ఇమడని కథలు త్రిపురవి. చదువుతూంటే 'ఇవి కథలేనా?' అన్న ప్రశ్న మాత్రం
రాదుగాక రాదు.
'పాము,' 'చీకటి గదులు,' 'భగవంతం కోసం,' 'సుబ్బారాయుడి రహస్య జీవితం,' 'కేసరివలె కీడు,' 'జర్కన్' 'కనిపించని వంతెనలు' ... ఇవన్నీ కథల పేర్లు.భగవంతం,
శేషాచలపతి, సుశీల, భాస్కర్.. వీళ్ళు చాలా కథల్లో కనిపిస్తారు. కాకపొతే
వీళ్ళ ఆలోచనలు, ప్రవర్తన ఏ రెండు కథల్లోనూ ఒకే తీరుగా ఉంటాయనుకోరాదు. వాళ్ళ
వ్యధలూ, వాళ్ళకి ఎదురైన అనుభవాల ఆధారంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు
వాళ్ళు. ఆ ప్రపంచం అచ్చం 'అబ్ స్ట్రాక్ట్' పెయింటింగ్ లాగా ఉంటుంది. చూసిన
వెంటనే ఏమీ అర్ధం కాదు. చూస్తూ ఉండగా ఏదో అర్ధం స్ఫురిస్తుంది. మరికొంచం
ఓపిక చేసుకుంటే ఒకటికి మించిన అర్ధాలు కళ్ళముందు కనిపిస్తాయి.
ఈ అర్ధం కాకపోవడం అన్నది కథని ఆసాంతమూ చదవడానికి ఏమాత్రం అడ్డంకి కాకపోవడం త్రిపుర కథల ప్రత్యేకత. "ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో కొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు తర్జన భర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరులో ఏముందంటాను నేను," అన్నారు పాలగుమ్మి పద్మరాజు, త్రిపుర కథలకి రాసిన 'పరిచయం' (1980) లో. "ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్నా మెచ్చుకోలు ఏముంటుంది.. ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు" అని ముక్తాయించారు కూడా.
ఈ అర్ధం కాకపోవడం అన్నది కథని ఆసాంతమూ చదవడానికి ఏమాత్రం అడ్డంకి కాకపోవడం త్రిపుర కథల ప్రత్యేకత. "ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో కొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు తర్జన భర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరులో ఏముందంటాను నేను," అన్నారు పాలగుమ్మి పద్మరాజు, త్రిపుర కథలకి రాసిన 'పరిచయం' (1980) లో. "ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్నా మెచ్చుకోలు ఏముంటుంది.. ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు" అని ముక్తాయించారు కూడా.
త్రిపుర
కథల్ని వేరెవరి కథల్తోనూ పోల్చలేం. పోలిస్తే గీలిస్తే త్రిపుర తర్వాత
వచ్చిన కథల్ని త్రిపుర కథలతో పోల్చవచ్చు. అయితే, మనస్తత్వ చిత్రణ దగ్గరికి
వచ్చేసరికి మాత్రం నాకు బుచ్చిబాబు, తిలక్ గుర్తొచ్చారు చాలాసార్లు. పాత్రల
అంతః సంఘర్షణలలో రచయిత కనీకనిపించకుండా కనిపిస్తూ ఉంటాడు. ఓ పలచని
తెరవెనుక నిలబడినట్టుగా. జేమ్స్ జాయిస్, కాఫ్కా, ఆల్బర్ట్ కామూ ఇంకా
శామ్యూల్ బెకెట్ ల రచనలంటే త్రిపురకి బాగా ఇష్టమని అర్ధవుతుంది కథలు
చదువుతూ ఉంటే. వాళ్ళందరి రచనలూ చదివేసి, అప్పుడు మళ్ళీ 'త్రిపుర కథలు'
చదివితే బాగా అర్ధమవుతాయేమో. అయితే ఒకటి, ఒకసారి చదివాక అర్ధం కాకపోయినా
మళ్ళీ చదివించే గుణమున్న కథలివి. (పేజీలు 244, వెల రూ. 150).
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి