ఆదివారం, ఫిబ్రవరి 17, 2013

ఆనాటి వానచినుకులు

ప్రఖ్యాత సినిమా దర్శకుడు పతంజలి ఓ అందమైన డ్రీమర్. తనదంటూ ప్రత్యేకమైన లోకం. కథలు రాసుకోడం, సినిమాలు తీయడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకోడు. సినిమా ఫంక్షన్లకీ, పత్రికల ఇంటర్యూలకీ బహు దూరం.'ప్రపంచంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు?' అంటే, "నేనే" అన్నది పతంజలి సమాధానం. ఒంటరి తనాన్ని ఇష్టపడే పతంజలి అత్యున్నత సాహిత్యం మినహా సాదా సీదా పత్రికలు చదవడు. ఎవరితోనూ మాట్లాడడు. పతంజలి తో కొంచం చనువుగా మాట్లాడ గలిగేది, అతని సెక్రటరీ కృష్ణారావు మాత్రమే.

భావుకత్వాన్ని గురించి నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి పతంజలికి. ప్రతి ఒక్కరూ విన్సెంట్ వేంగో, పికాసో, ఎడ్మండ్ డ్యులాక్, బోరిస్ వెలిజోల లాంటి పాశ్చాత్య కళాకారుల వర్క్స్ ని స్టడీ చేయాలనీ, ఉమర్ ఖయ్యామ్, పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడు, ఖలీల్ జిబ్రాన్ లాంటి కవుల్నీ, రేవతీదేవి లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్నీ జీర్ణం చేసుకోవాలనీ, పాల్ మారియట్, ఇన్నియొ మొర్రికాన్ని, హ్యూగో మాంటిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్స్ కంపోజిషన్స్ ని ఔపోసన పట్టాలనీ, అప్పుడు మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ తరచూ చెబుతూ ఉంటాడు కృష్ణారావుకి.

బయటి ప్రపంచంతో నిమిత్తం పెట్టుకోడానికి పతంజలి ఇష్ట పడకపోయినా, అతన్ని అభిమానించే వాళ్ళు అనేకమంది ఉన్నారు. రోజూ ఎన్నో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. పతంజలి జవాబులు రాయకపోయినా వాళ్ళు మాత్రం ఉత్తరాలు రాస్తూనే ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గంధంవారి పాలెం లో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న ఎన్నెస్ నారాయణ రావు అలాంటి అభిమానుల్లో ఒకడు. తన నూట నాలుగో ఉత్తరంలో, పతంజలి చేతి రాతతో నాలుగు లైన్ల ఉత్తరాన్ని కోరుకుంటాడు నారాయణరావు.

కార్తీక పౌర్ణమి రాత్రి నిండు చంద్రుడిని ఆస్వాదిస్తూ, వైట్ రమ్ చప్పరిస్తూ, పింక్ ఫ్లాయిడ్ ట్రాక్ వింటున్న పతంజలి తన తర్వాతి సినిమాకి కథ ఆలోచిస్తున్న సమయంలో వస్తాడు కృష్ణారావు. విషయాన్ని వేమన పద్యమంత క్లుప్తంగా చెప్పి, నారాయణ రావుకి నాలుగు లైన్ల జవాబు ఇమ్మని కోరతాడు. మండిపడ్డ పతంజలి, కృష్ణారావుకి చనువిచ్చి తప్పు చేస్తున్నా అంటాడు. అభిమానులని గౌరవిస్తేనే వారిద్వారా భావుకుల సంఖ్య పెరుగుతుందని వాదించే ప్రయత్నం చేసి ఓడిపోయిన కృష్ణారావు మర్నాడు ఆఫీసుకి రాడు.

కృష్ణారావు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి అతన్ని తీసుకువచ్చిన పతంజలి, నారాయణ రావుకి జవాబు రాయడంతో పాటు తన ఫోటో కూడా పంపానని చెబుతాడు. గంధం వారి పాలెంలో ఉన్న ప్రతి గడప నుంచీ ఉత్తరం వస్తుంది పతంజలికి. పౌర సన్మానానికి ఆమోదించమని. గ్రామీణ వాతావరణం నేపధ్యంగా పతంజలి తీయబోయే తర్వాతి సినిమాకి ఈ ట్రిప్ ఉపయోగ పడుతుంది కాబట్టి ఒప్పుకొమ్మని సలహా ఇస్తాడు కృష్ణారావు. అతను చెప్పింది సబబుగా తోచడంతో సరే అంటాడు పతంజలి.

ఎన్నో ఇబ్బందులు పడుతూ, భావుకత్వాన్ని గురించి కృష్ణారావు కి లెక్చర్లు ఇస్తూ గంధం వారి పాలెం చేరుకున్న పతంజలికి ఊహించని షాక్ తగులుతుంది, రిక్షా అబ్బి గోపాలం రూపంలో. ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏమీ చదవక్కర్లేదనీ, ఏదీ వినక్కలేదనీ, ఎవరినీ పరిశీలించనవసరం లేదనీ, భావుకుడు జన్మిస్తాడే తప్ప తయారు కాడనీ పతంజలి ఎలా తెలుసుకో గలిగాడు అన్నదే వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ. ఇదే పేరుతో ఎమెస్కో విడుదల చేసిన సంకనంలోనూ, వంశీ ఇటీవలి సంకలనం 'ఆకుపచ్చని జ్ఞాపకం' లోనూ ఉందీ కథ. వంశీ కథల్లో నాకు బాగా నచ్చే వాటిలో ఇదీ ఒకటి.

(ఉదయం రోడ్డు మీద వెడుతూ ఉండగా ఓ ఆటో వెనుక రాసిన వాక్యం 'పువ్వు పూజ కోసం...పూజ నీకోసం...నువ్వు నాకోసం'  ఈ కథని గుర్తు చేసింది...బ్లాగ్మిత్రులకీ గుర్తు చేద్దాం అనిపించి...)

6 కామెంట్‌లు:

  1. మొదటి అడుగు పదికి పదిహేడు,
    రెండో అడుగు రెండుకి ఏడు..
    మొన్నేటితో పోలిస్తే
    జనవరి, ఫిబ్రవరి నెలలు
    ఆరోహణలోనే సాగాయండి.

    ఎప్పటిలానే కథ బాగా (చాలా బాగా) చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కథ.. వంశీ మనస్తత్వానికీ, అనుభవాలకీ అద్దం పడుతుంది. మంచి కథని గుర్తుచేశారు.

    రిప్లయితొలగించండి
  3. చక్కని కథ గురుంచి అంతే చక్కగా వివరించారు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  4. చదివొచ్చానిప్పుడే.. చదివిస్తున్నారు సమీక్షల ద్వారా. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  5. @గీతిక.బి: భలే నిశితంగా పరిశీలిస్తున్నారండీ... ధన్యవాదాలు

    @చక్రవర్తి: అవునండీ నాకు బాగా నచ్చే వంశీ కథల్లో ఒకటి.. ఇలాంటి కథలు ఇప్పుడు రాయడం లేదు ఎందుకో :( .. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ధన్యవాదాలండీ

    @కొత్తావకాయ: నచ్చినవి మళ్ళీ మళ్ళీ చదవడంలో ఓ ఆనందం ఉంటుందండీ నాకైతే... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి