తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సినిమాలే తీసినా ఎక్కువ పేరు సంపాదించుకున్న నిర్మాతలు కొందరే. వారిలో ఒకరు 'యువచిత్ర' మురారిగా ప్రసిద్ధులైన కాట్రగడ్డ మురారి. 'సీతామాలక్ష్మి' నుంచి 'నారీ నారీ నడుమ మురారి' వరకూ తీసినవి కేవలం తొమ్మిదే సినిమాలైనా, సంగీతానికి పెద్ద పీట వేయడం, ప్రతి పాటా జనం నాలుకల మీద ఆడేలా శ్రద్ధ తీసుకోడం వల్ల ఆ సినిమాలు కమర్షియల్ హిట్స్ అవ్వడమే కాక, నిర్మాతకీ పేరు తెచ్చాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో పుట్టి పెరిగిన మురారి, సినిమా నిర్మాతగా మారిన తీరుని, సినిమా నిర్మాణంలో తన అనుభవాలని అక్షరబద్ధం చేస్తూ రాసుకున్న ఆత్మకథ 'నవ్విపోదురుగాక ....' ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతోంది.
ఓ సినిమా నిర్మాత ఆత్మకథ అనగానే సింహభాగం సినిమా కబుర్లే ఉంటాయనే పాఠకుల అంచనాలు తారుమారు చేస్తూ, ఉమ్మడి కుటుంబ రాజకీయాలతో తన కథని ప్రారంభించారు మురారి. "మా ఊరు మొగల్రాజపురం" అనే వాక్యం చదవగానే అప్రయత్నంగా నవ్వొస్తుంది. ఎందుకంటే, ఇప్పటి మొగల్రాజపురం విజయవాడలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. కానీ, మురారి మాత్రం మొగల్రాజపురం ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఊరు' అని రాయడం మాత్రమే కాదు, ఆ పల్లెటూరితనం తనని విడిచిపెట్టి పోలేదని నిరూపించే కబుర్లెన్నో పంచుకున్నారు. బాగా కలిగిన కుటుంబం, చదువుకున్న, సంగీత సాహిత్యాలంటే ఆసక్తి ఉన్న తండ్రి, ఎంతగానో ప్రేమించే తల్లి, బంధువులు. నిజానికి ఇలాంటి వాతావరణంలో బాల్యం స్వర్గంలా అనిపించాలి. కానీ, మురారికి మాత్రం నరకంలో ఉన్నట్టుగా గడిచింది. ఇందుకు కారణం ఉమ్మడి కుటుంబం.
ఇంట్లో పెత్తనమంతా మురారి 'కాలభైరవుడు' అని పిలుచుకునే పెదనాన్న మధుసూదనరావుదే. ఇంట్లో పిల్లలందరూ ఏం చదవాలో, ఎక్కడ చదవాలో మొదలు, భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయంలో కూడా ఆయనదే పెత్తనం. కేవలం ఈ పెత్తనం నుంచి బయట పడడం కోసమే వరంగల్ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టి మెడిసిన్ లో చేరారు మురారి. చేతినిండా డబ్బు, 'మనవాడు' అనుకునే బంధుగణం ఉంటే చాలు, ఒక్క క్లాసుకీ వెళ్లకపోయినా, లేబొరేటరీ మొహం చూడక పోయినా మెడిసిన్ పరీక్షలు పాసవ్వొచ్చని నిరూపించారాయన. ('ఈ విషయాలు మీరు రాయకుండా ఉండాల్సింది' అని తొలిముద్రణ చదివిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఓ ఉత్తరం రాస్తే, ఆ ఉత్తరాన్ని కూడా మలిముద్రణలో పుస్తకం చివర్లో చేర్చిన నిర్మొహమాటి మురారి). ఐదొందల నలభై పేజీల పుస్తకంలో సగానికి పైగా పేజీలని ఈ గృహ రాజకీయాలే ఆక్రమించాయి.
మెడిసిన్ అర్ధాంతరంగా ఆపేసిన మురారి దృష్టిని సినిమా రంగం ఆకర్షించడంలో విశేషం లేదు. 'నవయుగ' ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ కుటుంబ వ్యాపారమే. అయితే, సినిమాల్లో ఇంటిపేరు వాడుకోకూడదని నిర్ణయించుకుని, సహాయ దర్శకుడు కె. మురారిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా, దూరపు బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు అక్కడా అక్కరకు వచ్చాయి. అప్పటికే కొందరు దర్శకుల దగ్గర పనిచేసి, చక్రపాణి చివరిరోజుల్లో ఆయన దగ్గర సహాయకుడిగా చేరిన మురారి దర్శకుడిగా కంటే, నిర్మాతగా ఉంటేనే తాను రాణిస్తాననే నిర్ణయానికి వచ్చారు. దర్శకుల మీద చక్రపాణి చేసిన అజమాయిషీని దగ్గరనుంచి చూడడం ఇందుకు బహుశా ఒక కారణం కావొచ్చు. సినిమాకి సంబంధిచిన ప్రతి నిర్ణయమూ తానే తీసుకోవాలి, దర్శకుడు కేవలం తనకి (మురారికి) నచ్చేట్టుగా సినిమా తీసిపెట్టాలి అనే నిర్ణయంతో నిర్మాతగా మారి, చిన్నచిన్న మినహాయింపులతో ఈ పద్ధతిలోనే సినిమాలు తీశానని రాసుకున్నారు.
కులాల్ని గురించి రాయడానికి ఏమాత్రమూ మొహమాట పడలేదు మురారి. సహాయ దర్శకుడిగా పనిచేసే రోజుల్లో నటీమణి జి. వరలక్ష్మి "మీరు బ్రాహ్మలా?" అని అడిగితే "ఛీ ఛీ" అనడం మొదలు, బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న సినిమా నిర్మాణ రంగం కమ్మ కులస్తుల చేతుల్లోకి రావడం కోసం జరిగిన ప్రయత్నాలు, అందుకు కృషి చేసిన వ్యక్తుల వివరాలు విశదంగానే రాశారు. తన పెంపుడు కుక్కల పేర్లు 'భానుమతి' 'రామకృష్ణ' అని ప్రస్తావించడం మొదలు, ఆత్రేయకీ, వేటూరికీ తను చేసిన అవమానాలనీ దాచలేదు. నిర్మాతగా తనకా హక్కుందని ఆయన బలమైన నమ్మకం. ('నారీ నారీ నడుమ మురారి' కోసం వేటూరి రాసిన పాటని ఎన్టీఆర్ తప్పు పట్టారని చదివినప్పుడు, మార్కెట్ నుంచి రీకాల్ చేసిన ఎమ్మెస్ రెడ్డి ఆత్మకథ 'ఇదీ నాకథ' లో పౌండ్రక వసుదేవుడి ఉదంతం గుర్తొచ్చింది, అప్రయత్నంగా). తన సంస్థలో పని చేసిన దర్శకుల మీద ఉన్న కంప్లైంట్స్ లో విశ్వనాధ్, జంధ్యాలల మీద ఉన్నవాటిని సవివరంగా రాశారు.
బాల్యం నుంచీ మురారిని వెంటాడుతూ వచ్చిన 'ఉమ్మడి కుటుంబం' సినిమాల్లోకి వచ్చాక కూడా విడిచిపెట్టలేదు. సోదరులతో కలిసి సినిమా నిర్మాణం చేసినా, తన దృష్టి కథ, సంగీతం, షూటింగ్ సక్రమంగా జరిగేలా చూసుకోడంలాంటి వాటిమీదే ఉండడంతో డబ్బు విషయాలు పట్టించుకోలేదు. దీంతో, సినిమాలు విజయవంతమైనా ఎప్పుడూ డబ్బు చేతికి రాలేదు. ప్రాణ మిత్రుడు శోభన్ బాబు సలహా మేరకు, డబ్బు విషయాలు గట్టిగా మాట్లాడి తేల్చుకోడంతో పాటు, 'శ్రీనివాస కళ్యాణం' నుంచీ వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల ఆర్ధికంగా నిలబడగలిగానని రాశారు. సినిమాల నిర్మాణం ఆపేసిన తర్వాత కూడా, 'తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర' అనే బృహత్గ్రంధం రాయించడానికి పూనుకోవడం, ఇతరత్రా కార్యకలాపాలకీ చోటిచ్చారు ఈ ఆత్మకథలో. తన చిన్నప్పుడు ఉపవాచకంలో చదువుకున్న మల్లాది వసుంధర 'సప్తపర్ణి' ని గుర్తు చేసుకుంటూ, "మా తర్వాతి తరం వారందరూ విద్యావంతులై మా కన్నా మరో అడుగు ముందుకు వేసి అమెరికా వంటి దేశాలకు వలసపోయారు" అన్నారోచోట. మొత్తం మీద చూసినప్పుడు, కేవలం ఓ సినిమా నిర్మాత స్వీయ చరిత్రని కాక, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని, చేదు జ్ఞాపకాలనీ చూసిన వ్యక్తి ఆత్మకథ చదివేందుకు సిద్ధ పడేవాళ్ళకి నచ్చే పుస్తకం ఇది. మురారి స్వయంగా ప్రచురించి, పంపిణీ చేస్తున్న ఈ పుస్తకం వెల రూ. 500.
మంచి సినిమాలు తీసిన నిర్మాత అని ఈయనంటే గౌరవం ఉండేది ... ఇది చదివే వరకు. వీరి వ్యక్తిత్వంలో సంస్కార రాహిత్యం మెండుగా ఉందని అనిపిస్తోంది.
రిప్లయితొలగించండిటైటిల్ లొనే ఉంది కదండీ "నవ్విపోదురుగాక.." అని!
తొలగించండికంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అన్నారు పెద్దలు.
9 సినిమాలు తీసి తనేదో గొప్ప అనుకునేవారు అలానే రాస్తారు.
@విన్నకోట నరసింహారావు: తన వ్యక్తిత్వానికి కారణం తన బాల్యం, చుట్టూ ఉన్న పరిస్థితులు అని చెబుతూ, సినిమా రంగంలో కొందరు తనని అర్ధం చేసుకుని సహకరించగా, చాలామంది అపార్ధం చేసుకున్నారని రాసుకున్నారండీ.. ..ధన్యవాదాలు
తొలగించండి@సూర్య: కృష్ణశాస్త్రి కవిత నుంచి పుస్తకం టైటిల్ తీసుకున్నానని చెప్పారండి. ..ధన్యవాదాలు.
ఈ నిర్మాత ఎలాంటి వాడైనా మంచి సినిమాలు తీసాడు.
రిప్లయితొలగించండిఅయినా అందరి ఆత్మకథలు మనకి ఎందుకు?
ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఉపయోగపడవచ్చు, మిగతా వాళ్ళకి అనవసరం.
అంతేనంటారా .. ధన్యవాదాలు
తొలగించండిOnline lo chadavadaniki veelundaa ? any link. Kinige lo ledu.
రిప్లయితొలగించండిఎఫ్బీ లో మురారి యాక్టీవ్ అని మిత్రులు చెప్పారండీ.. వారిని సంప్రదిస్తే మీకు పుస్తకం అందించే ఏర్పాటు చేయొచ్చు.. ఈమధ్యనే తాజా ముద్రణ వచ్చింది కూడా.. ధన్యవాదాలు..
తొలగించండిkinige website lo digital edition undi. nenu chala rojula kritame konnanu
తొలగించండి