శనివారం, సెప్టెంబర్ 14, 2024

ఎల్బీ నట విశ్వరూపం 'కవిసమ్రాట్'

మొదటి అభినందన నిర్మాత ఎల్బీ శ్రీరామ్ కి. పెట్టిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అని తెలిసి కూడా సబ్జెక్టు మీద ప్రేమతో 'కవిసమ్రాట్' సినిమాని నిర్మించినందుకు. రెండవది నటుడు ఎల్బీ శ్రీరామ్ కి.  తెలుగులో తొలి జ్ఞానపీఠ గ్రహీత 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ మాట తీరు, హావభావాలు ఎలా వుంటాయో ఇప్పటి వాళ్లకి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానైతే, నటుడు ఎల్బీ శ్రీరామ్ ఏ పాత్రలో ఎలా ఉంటాడో బాగా తెలుసు. తాను ఇన్నాళ్లూ పోషించిన పాత్రల ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగా 'కవిసమ్రాట్' పాత్ర పోషించి, అవుననిపించిన నటుడు ఎల్బీ శ్రీరామ్ ని అభినందించాల్సిందే. వరుసలో మూడో వాడు, ఈ సినిమాకి కథ, మాటలు రాసుకుని, స్క్రీన్ ప్లే చేసుకుని, దర్శకత్వం వహించిన సవిత్ సి. చంద్ర నీ అభినందించాలి. 

గంట నిడివి గల ఈ 'కవిసమ్రాట్' బయోపిక్ కాదు. కేవలం విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో కొన్ని ఘట్టాలకి దృశ్యరూపం. ఆ ఘట్టాల ఆధారంగా విశ్వనాథ వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, నాటి సంఘం, సాహిత్య వాతావరణం ఇవన్నీ ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఇచ్చిన చిత్రం. దృశ్యాలని అనుసంధానం చేసే కథ చిన్నదే. తన స్వగ్రామం నందమూరులో జీర్ణస్థితిలో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించాలన్నది విశ్వనాథ శోభనాద్రి కల. ఆ కలని శోభనాద్రి కుమారుడు సత్యనారాయణ ఎలా నెరవేర్చాడు అన్నది కథ. ఇంగ్లీష్ సినిమాల పట్ల విశ్వనాథకి గల మోజు, వంటలో ప్రవేశం, సమకాలీన సాహిత్యం పట్ల ధోరణి, తనకి సాయం చేసిన వాళ్ళని మరవని తత్త్వం, బీదరికం లోనూ దూరం చేసుకోని ఆత్మాభిమానం ఇలాంటివన్నీ కథనంలో భాగమై ఆసాంతమూ సినిమాని ఆసక్తికరంగా మలిచేందుకు దోహద పడ్డాయి. 

ప్రారంభంలో వచ్చే 'నందమూరి తారకరామారావు' సన్నివేశంలో కనిపించిన నాటకీయత కొంత కలవరపెట్టిన మాట నిజం. అయితే, ఆ నాటకీయత ఆ ఒక్క సన్నివేశానికే పరిమితం కావడం పెద్ద ఊరట. 'దొరసాని' సన్నివేశం లోనూ ఒకింత నాటకీయత లేకపోలేదు కానీ, ఆ సంఘటన అలాగే జరిగింది అనడానికి దాఖలా విశ్వనాథ అచ్యుతదేవరాయలు రచన 'మా నాయన గారు' (అజో-విభొ కందాళం ఫౌండేషన్ ప్రచురణ).  నటీనటుల నటనని గురించి చెప్పుకోవాలంటే ప్రధాన పాత్రధారి ఎల్బీ శ్రీరామ్ అంతా తానే అయ్యారు. తమ్ముడు వెంకటేశ్వర్లు పాత్ర ధరించిన అనంత్ బాబు కి ఇంచుమించు సమంగా స్క్రీన్ స్పేస్ దొరికింది. మిగిలిన పాత్రల్లో కాస్త ఎక్కువ సేపు కనిపించింది 'ప్రసన్న కవి' గా టీఎన్నార్ (సుదీర్ఘ వీడియో ఇంటర్యూల ద్వారా పాపులర్ అయిన జర్నలిస్టు, కరోనాలో కాలం చేశారు). 

డాక్టర్ జోశ్యభట్ల సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శివాష్టకం, విశ్వనాథాష్టకం లో భాగాలని కీలక సన్నివేశాలకి నేపధ్య సంగీతంగా వాడుకోవడం వల్ల ఆయా సన్నివేశాల అందం ఇనుమడించింది. ఆ కాలపు ఇళ్ళు, నాటి వాతావరణ చిత్రణ కి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. అయితే, కృష్ణా జిల్లా నేపధ్యంగా జరిగే కథలో అక్కడక్కడా గోదావరి నది కనిపించడం, ఆ మాండలీకం వినిపించడాన్ని కాస్త సరిపెట్టుకోవాలి. 'వేయిపడగలు' చుట్టూ అల్లిన సన్నివేశాలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి, నాటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు బహుమతిని అడివి బాపిరాజు 'నారాయణరావు' తో కలిసి పంచుకున్న విషయాన్నీ ప్రస్తావించి వుంటే  బాగుండేది అనిపించింది. 'రామాయణ కల్పవృక్షము' కీ విశ్వనాథ వ్యక్తిగత జీవితానికీ వేసిన ముడి కన్విన్సింగ్ గా వుంది. 

కరోనానంతర కాలంలో థియేటర్లకి వెళ్లడం బాగా తగ్గి, సినిమాలు టీవీలోనే చూస్తున్నందువల్ల ఈ చూడడంలో వచ్చిన మార్పు ఏమిటంటే ఏ సినిమానీ ఏకబిగిన చూడకపోవడం. కాసేపు చూసి ఆపడం, మర్నాడో, మూడో నాడో కొనసాగించడం.. ఇలా అన్నమాట. ఈ మధ్య కాలంలో ఏకబిగిన చూసిన సినిమా ఈ 'కవిసమ్రాట్'. అంతే కాదు, సినిమా పూర్తి కాగానే మళ్ళీ మొదటికి వెళ్లి, చివరివరకూ రెండో సారి చూసిన సినిమా కూడా ఇదే. మొదటి సారి చూసినప్పుడు ప్రకటనలు అడ్డు పడడం సహజమే (యూట్యూబ్ లో కాబట్టి, ప్రకటనలు తప్పవు). కానీ, రెండో సారి కూడా ప్రకటనలు అడ్డమే అనిపించాయి. రెండు సార్లూ కూడా, చూస్తున్నంత సేపూ విశ్వనాథ రచనలు గుర్తొస్తూనే ఉన్నాయి. అయితే, రెండో సారి చివర్లో ఉండగా 'అల నన్నయకి లేదు...' గుర్తొచ్చింది (ఈ ప్రస్తావన సినిమాలో కూడా వుంది, వేరే విధంగా). ఎందుకంటే, విశ్వనాథ సమకాలీన రచయితలు ఎవరి గురించీ కూడా సినిమాలు రాలేదు మరి!!

8 కామెంట్‌లు:

  1. తారస్థాయి అనాలి గాని
    తారాస్థాయి అనడమేమిటండి విశ్వనాథవారు‌?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు పదప్రయోగాలూ సరైనవేనని "ఆంధ్రభారతి" చెబుతోంది "జిలేబి" గారూ.
      అయినా మీకు తెలియకనా, అనాలని అనడం తప్ప ?

      తొలగించండి
    2. 'విస్సన్న' చెప్పిందే వేదం అని జిలేబీ గారికి తెలియదని ఎలా అనుకుంటాం చెప్పండి? 

      తొలగించండి
    3. “జిలేబీ” చెప్పిందే వేదం అనే కాలం నడుస్తోందిగా, మురళి గారూ.

      తొలగించండి
  2. తెలుగు భాష పట్ల ఉండవలసిన గౌరవాన్ని వివరించే ఈ *LB Sriram* గారి "*తెలుగు‌ వెలుగు*" అనే విడియో చూడండి మురళి గారు, వీలయితే.

    https://youtu.be/RaYj20WzXF8?si=-edvhsjEoKAsqnnE

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు,
    "కవి సామ్రాట్" సినిమా చూసానండి. గతంలో చూసినదే అయినా మీ ఈ సమీక్ష చదివాక నిన్న మళ్లీ చూసాను. అన్నట్లు యూట్యూబ్ లోనే కాదు, "aha" అనే OTT platform లో కూడా ఉందండి (ఇప్పటి వరకయితే) . సరే, ఇక్కడ కూడా అడ్డు లు (ad లు అని నా భావం 🙂) ఎలాగూ తగులుతాయనుకోండి, వ్యాపారాలు కదా 😏.

    LB Sriram గారి నటన గురించి చెప్పేదేముంది, ఇటువంటి పాత్రల్లో జీవించేస్తాడు. వారి he'art' films కి కూడా నేను అభిమానిని (youtube లో short films).

    రిప్లయితొలగించండి

  4. మురళి గారు,
    "కవి సామ్రాట్" సినిమా హృద్యంగా తీసారు గానీ నాకో రెండు సందేహాలున్నాయి.

    (1). కథ, మాటలు వగైరా తానే స్వయంగా వ్రాయగలిగిన శ్రీరామ్ గారు తాను వ్రాయకుండా (పోనీ దర్శకత్వం మాట వదిలేసినా) సవిత్ చంద్ర గారు వ్రాయడం ఏమిటో? అసలు ఎవరా సవిత్ చంద్ర? పేరు కూడా తెలుగు పేరులాగా లేదు.

    (2). సినిమాలో చీటికీమాటికీ విశ్వనాథ వారి మీద కాలు దువ్విన ఆ ‘రౌడీ కవి’ పద్మనాభం అనే వ్యక్తి విశ్వనాథ వారి నిజజీవితంలోని పాత్రేనా? మీకేమైనా ఐడియా ఉందా?
    —————————-
    ఆ పాతకాలపు ఇల్లు ఎక్కడ పట్టుకున్నారో గానీ ఆ నాటి ఇళ్లను మళ్లీ గుర్తు చేసింది 😌.

    విశ్వనాథ వారిని కలుసుకునే అదృష్టం ఓసారి కలిగింది 🙏. విజయవాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు (వారు పని చేసిన కాలేజీలో కాదు) ఓ సంవత్సరం కాలేజ్ డే కార్యక్రమానికి విశ్వనాథ వారిని ఆహ్వానించి రమ్మని మా ప్రిన్సిపాల్ గారు నన్ను పంపించారు. విజయవాడ మాచవరంలో ఉన్న విశ్వనాథ వారింటికి వెళ్లాను. బాగా మాట్లాడారు 🙏. కానీ ఆ ఇల్లు ఈ సినిమా ఇల్లు కాదు మరి.
    —————————-
    విశ్వనాథ వారు నిజంగా అన్నారో లేదో గానీ సినిమాలో ఒక చోట ఆయన పుస్తకంలో వ్రాసుకుంటూ “తెలుగు పదాలు ఇంగ్లీషులో వ్రాసే రోజులు వచ్చినా వస్తాయి” లాంటి వాక్యం పైకి అంటూ వ్రాసుకుంటారు చూసారా ….. చాలా futuristic గా ఉంది 😩🙏.
    ——————————
    ఒక మంచి చిత్రం చూసిన ఆనందం మరోసారి కలిగింది 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1. సవిత్ చంద్ర బెజవాడ కుర్రాడండి. సిద్ధార్థ కాలేజీలో చదివాడు. స్క్రిప్ట్ తయారు చేసుకుని ఎల్బీ ని కలిశాడు..రెస్టీజ్ హిస్టరీ.. (ఇతని ఇంటర్యూ వీడియోలు చాలానే వున్నాయి) 
      2. 'రౌడీ కవి' ఒక వ్యక్తి అని నాకు అనిపించలేదండీ.. విశ్వనాథ విమర్శకులందరినీ ఒక పాత్రగా చేసి (చాలా మందిని చూపించడం అనవసరం, ఖర్చు దండగ అని కావొచ్చు) పద్మనాభం పాత్రని సృష్టించారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ మీద కాలు దువ్విన (దువ్వుతున్న) వారనేకులు కదా. 
      ఆ ఇల్లు తూగోజీలో ఉన్నదని, కష్టపడి ఇంటి వారిని ఒప్పించి షూటింగ్ జరిపామని చాలా రోజుల క్రితం ఎల్బీ ఒక ఇంటర్యూలో చెప్పగా విన్నట్టు గుర్తండి నాకు ('వ్యూస్' ఛానల్, వైజయంతి (ఉషశ్రీ గారమ్మాయి) తో మాటామంతి ప్రోగ్రాం అని జ్ఞాపకం) 
      విశ్వనాథని కలిసే అవకాశం రాలేదు కానీ, మాచవరం ఇంటిని చూసే అవకాశం దొరికిందండి నాకు.. వైజయంతి గారు విశ్వనాథ గారమ్మాయి కనకదుర్గ గారిని ఇంటర్యూ చేశారు, వ్యూస్ (యూట్యూబ్) ఛానల్ లోనే వుంది, బాగుంది, చూడండి.. 
      'తెలుగు పదాలు ఇంగ్లీష్ లో రాసే రోజులు...' సినిమాటిక్ లిబర్టీయేమో అనిపించిందండి నాకు, ('నందమూరి తారక రామారావు' లాగా).. 

      ధన్యవాదాలండీ.. 

      తొలగించండి