మంగళవారం, జూన్ 28, 2011

తీరిన దాహం

"ప్రపంచమొక పద్మవ్యూహం.. కవిత్వమొక తీరని దాహం.." అన్న మహాకవికి తొలి వందనం. ప్రతి ఒక్కరిలోనూ కళాకారులు ఉంటారు. అంటే ఒక రచయిత, కవి, చిత్రకారుడూ, నటుడూ, గాయకుడూ...ఇలాగన్నమాట. అన్నీ కలిసొచ్చిన వాళ్ళకి వాళ్ళలో ఉన్న కళ బహిర్గతమై, బోల్డంత పేరొస్తుంది. మిగిలిన వాళ్ళని విధి ఏదో ఒక రూపంలో అడ్డుకుంటుంది. ఇంత బరువైన డైలాగులు ఎందుకూ అంటే... మనం అలా అలా కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకూ నడుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

అవి నేను అప్పుడే నిక్కర్లు వేసుకోవడం నేర్చుకుని బడికి వెళ్ళడం మొదలు పెట్టిన రోజులు. అప్పట్లో మా ఇంట్లో ఉన్న ఏకైక వినోద సాధనం రేడియో. నాకే కాదు, మా ఇంటిళ్ళపాదికీ రేడియో అంటే ఒక్కొక్కరికీ ఒక్కోందుకు ఇష్టం. ఈ కారణానికి ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో రేడియో స్టేషన్ మొదలయ్యింది మొదలు, కార్యక్రమాలు పూర్తయ్యి 'కూ..ఊ..ఊ..' అనేంత వరకూ సదరు బుల్లిపెట్టి మోగుతూ ఉండాల్సిందే. రేడియో నాటకాల పుణ్యమా అని మూడో తరగతి చదివే రోజుల్లోనే నాలో రచయిత మేల్కొని నాచేత ఒక నాటిక రాయించేశాడు.

ఐదారు తరగతుల్లోకి వచ్చేసరికి నన్ను అమితంగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమం కవి సమ్మేళనం. నాకు పెద్దగా అర్ధమవ్వక పోయినా సరే, ఆ కవితలన్నీ శ్రద్ధగా వినేవాడిని. కవులంతా తమ తమ కవితలని గానం చేసే విధానం, ముఖ్యంగా ఒక్కో లైనూ రెండేసి సార్లు చదవడం భలేగా నచ్చేసింది నాకు. ఆరో తరగతిలో ఉమామహేశ్వర రావు గారు మాకు తెలుగు చెప్పేవారు. ఆయనది శ్రావ్యమైన కంఠం. ఆయన పద్యాలు చదువుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలని అనిపించేది.

ఒకరోజు ఆయన క్లాసులో పాఠం చెబుతూ, రవీంద్రనాథ్ టాగోర్ చాలా చిన్నప్పటినుంచే కవితలు రాయడం మొదలు పెట్టాడని చెప్పారు. అది నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. "టాగోర్ ఎక్కువేమిటి? నా తక్కువేమిటి?" అన్న ఆలోచన మొదలై, మర్నాటికల్లా న చేత ఒక పద్యం (???) రాయించేసింది. ప్రధమ పాఠకుడు - పాపం మా తెలుగు మేష్టారే. 'పుష్పము లోని తేనియనంతయు గ్రోలుచు..' అన్నది మొదటి లైన్ అని జ్ఞాపకం. మా క్లాస్ రూం పక్కనే ఉన్న తోటలో తుమ్మెదలని చూస్తూ వాటిమీద రాసిన పద్యం అది. "పద్యాలు రాయాలంటే చందస్సూ అవీ రావాలి. కొంచం పెద్దయ్యాక ప్రయత్నిద్దువుగానిలే" అన్నారాయన బలహీనంగా.

నేనస్సలు నిరుత్సాహ పడలేదు. పద్యాలకైతే ఆగాలి కానీ, కవితలకి ఆగక్కర్లేదు కదా అని నిశ్చయించేసుకుని కనిపించిన ప్రతి వ్యక్తి, వస్తువు మీదా ఆశువుగా కవితలల్లడం మొదలు పెట్టాను. ఇది ఎలా మొదలయ్యిందంటే, ఒక రోజు నేను వీధిలో కూర్చుని చదువుకుంటూ ఉండగా మీరయ్య రోడ్డున వెళ్తూ కనిపించాడు. "మడేలు" అని నా నోటంట అప్రయత్నంగా వచ్చి, ఆ వెంటనే "మడేలు మడేలు మడేలు" అని రాగయుక్తంగా మారింది. అది కవితావేశం అని అర్ధమైపోయింది నాకు. పెద్దగా ఆలోచించక్కర్లేకుండానే "ఫిడేలు ఫిడేలు ఫిడేలు" అన్నది రెండో పంక్తిగా దొరికేసింది.

కవితక్కూడా కనీసం నాలుగు పంక్తులుండాలన్నఅప్పటి నా చాదస్తం కారణంగా మిగిలిన రెండు పంక్తుల కోసం తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాను, చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి. నిజానికి మా మీరయ్యకి ఫిడేలంటే ఏమిటో కూడా తెలీదు. అయినప్పటికీ నా కవితలో మూడో పంక్తి "మడేలు వాయిస్తాడు ఫిడేలు" అయ్యింది. ఇక చివరి పంక్తి కోసం అస్సలు తడుముకోలేదు.. "ఫిడేలు వాయించేది మడేలు.." అంతే! కవిత అయిపోయింది. చివర్లో రాగం కోసం మళ్ళీ "మడేలు మడేలు మడేలు... ఫిడేలు ఫిడేలు ఫిడేలు..." జత చేశాను.

కవిత్వంలో ఉన్న సమస్య ఏమిటంటే, వెంటనే ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపిస్తుంది. నాకు ఎదురుగా అమ్మ కనిపించింది. అంతే, వెంటనే నా కవిత వినిపించేశాను. తల్లి ఋణం తీర్చుకోలేనిది అని ఎందుకంటారు అని ఎవరన్నా అడిగితే, ఇదిగో ఈ సందర్భాన్ని కూడా ఉదహరించొచ్చు. అమ్మ అస్సలు తిట్టకపోగా, బాగుందని మెచ్చుకుంది. నేనింక నా కవితని రేడియోలో చదివేయొచ్చు అనుకున్నాను. ఇంతలో నా స్ఫూర్తి ప్రదాత మీరయ్య వాళ్ళింటికి తిరిగి వెళ్తూ కనిపించాడు. ఆపి, నాకవితని వినిపించాను. "పిడేలంటే ఏటి బాబయ్యా" అని సిగ్గుపడుతూ అడిగాడు. అమ్మ తనకి ఓ గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది, ఎందుకో నాకప్పుడు అర్ధం కాలేదు.

అది మొదలు నాలో కవితా ఝరి ఉప్పెనై ఎగసి పడడం మొదలు పెట్టింది. ఎన్ని కవితలని గుర్తు పెట్టుకుంటాం. అందుకే ఓ చిన్న నోటు పుస్తకం రహస్యంగా సంపాదించి నా ఆశు కవితలన్నీ అందులో రాయడం మొదలు పెట్టాను, రవీంద్రుడి 'గీతాంజలి' లాగా ఓ సంపుటం తేవాలన్న ఆలోచనతో. (నేనప్పటికి 'గీతాంజలి' చదవలేదు. కానీ అది చాలా గొప్ప పుస్తకమని మా తెలుగు మేష్టారు చెప్పడం వల్ల, ఆ రికార్డు బద్దలు కొట్టాలని నా ప్రయత్నం - అమంగళం ప్రతిహతమగు గాక!) అమ్మ నా కవితల్ని మెచ్చుకుంటూ వింటోంది. చూస్తుండగానే నా కవితల పుస్తకంలో తెల్ల పేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

అప్పట్లో నా దృష్టిలో ఆరోజు తెలుగు కవిత్వానికి దుర్దినం. ఆవేళ బడికి సెలవు. నాన్న ఇంట్లోనే ఉన్నారు. సెలవు రోజుల్లో పాఠాలు అప్పచెప్పించుకోవడం, పుస్తకాలకి అట్టలూ అవీ వేసి పెట్టడం లాంటివి చేసేవాళ్ళు అప్పుడప్పుడూ. ఆవేళ కూడా అలాగే నా బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు తీస్తూ, నా కవితల పుస్తకం చూసేశారు. నాన్ననెందుకూ అనుకోవడం, నేనే కొంచం అజాగ్రత్తగా ఉండి దాచడం మర్చిపోయాను. సీన్ కట్ చేస్తే, నాకు మళ్ళీ ఎప్పుడూ కవిత్వం రాయాలని అనిపించలేదు. బ్లాగ్మిత్రులు 'పరిమళం ' గారిలాంటి వాళ్ళు అప్పుడప్పుడూ కవిత్వం ప్రయత్నించ మని సూచిస్తున్నప్పుడల్లా నాకీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది.

17 కామెంట్‌లు:

  1. హ హహ హ హ మురళి గారు టపా సూపరండీ :-)
    పాపం చివరికి అలా దాహంతీరిందనమాటా... ఇంతకీ ఏమైందో చెప్పనేలేదు.. మీ ఫిడేలు కవిత్వం చదివిన మీ నాన్న గారు మీ వీపు ఫెడేలు మనిపించారా.. అయ్ బాబోయ్ ఏంటండోయ్ మీ పోస్ట్ చదివాక నాకు కూడా కవిత్వం వచ్చేస్తున్నట్లుంది..

    రిప్లయితొలగించండి
  2. హ హ మీ నాన్నారు బాఘా ప్రవేట్ చెప్పినట్లున్నారు మీకు :)
    మీ నాన్న గారికి నా ధన్యవాదాలు లేకపోతే నేను నెమలికన్ను బ్లాగులో కొన్ని పోస్టులన్నా మిస్ కొట్టాల్సి ఉండేది , ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు :)

    రిప్లయితొలగించండి
  3. కవిత్వంలో ఉన్న సమస్య ఏమిటంటే, వెంటనే ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపిస్తుంది. నాకు ఎదురుగా అమ్మ కనిపించింది. అంతే, వెంటనే నా కవిత వినిపించేశాను. తల్లి ఋణం తీర్చుకోలేనిది అని ఎందుకంటారు అని ఎవరన్నా అడిగితే, ఇదిగో ఈ సందర్భాన్ని కూడా ఉదహరించొచ్చు
    ultimate:);)

    రిప్లయితొలగించండి
  4. ఐతే కవితా ప్రియులు ఓ మంచి కవిని అలా కోల్పోయారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  5. మూడో తరగతిలో నాటిక, ఆరో తరగతిలో ఎదో ఒకలా పద్యం (లాంటిది), నాలుగేం ఖర్మ ఏకంగా ఆరు పంక్తుల కవిత
    "మడేలు మడేలు మడేలు
    ఫిడేలు ఫిడేలు ఫిడేలు
    మడేలు వాయిస్తాడు ఫిడేలు
    ఫిడేలు వాయించేది మడేలు
    మడేలు మడేలు మడేలు
    ఫిడేలు ఫిడేలు ఫిడేలు"
    ఇదంతా మాతో పంచుకోవడానికి ఇంత ఆలస్యమెందుకు చేశారు మురళీగారూ? మీ నాటిక, పద్యం ఎలా ఉన్నా కవితావేశం వల్ల వచ్చిన కవిత అద్భుతం. నాకు చాలా నచ్చింది. ఇకపై మీ ప్రతి టపా చివరన ఇలాంటి ఒక కవిత కొసరుగా వడ్డిస్తారని ఆశిస్తూ..
    --- మీ కవితాభిమాని (మీ కవిత్వానికి అభిమాని కాదు, మీ కవితకి అభిమాని అని గమనించగలరు).

    రిప్లయితొలగించండి
  6. హహహహహా.. భలే బావుందండీ మీ కవితాదాహం! :))))
    పక్కింటబ్బాయ్ గారు చెప్పిన మాటే నాది కూడా! :)

    రిప్లయితొలగించండి
  7. మురళీజీ,
    పై వ్యాఖ్యలో రాయడం మరిచాను. మీ మడేలు తవికలాంటిది ఆచార్య తిరుమల"నవ్వుటద్దాలు" పుస్తకంలో ఒకటి రాస్తారు..వాళ్ల శిష్యుడు(లాంటివాడొకడు) తిరుమల గారు అతని రూంకి వస్తే కవిత్ రాశాను, వినండి అని వినిపిస్తాడు.వీడు కవితలు రాయడే ఎప్పుడూ కవుల్ని వెక్కిరిస్తాడు అనుకుంటూ వినడం మొదలుపెట్టాట్ట..."నేనొక లుంగీ కొన్నాను".....ఊ...."నేనొక లుంగీ కొన్నాను"...సరే...."నేనొక లుంగీ కొన్నాను"....కొన్నావ్ లేవయ్యా తర్వాతేంటో చెప్పన్నారు విసుగ్గా.."నేనందులోనే ఉన్నాను".
    --సూరంపూడి పవన్ సంతోష్.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు నెలంతా, ముప్పై రోజులకి ముప్పై రచనలు చేసి మొత్తానికి మీరు 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ' కొట్టేసారండి. సింప్లీ గ్రేట్. మీ కవితలేమో గాని, నాకైతే మీ మీద ఓ కవిత వెంఠనే రాసేయాలనిపిస్తోంది.
    మీ నల్లబడ్డ బుక్ లోని కాయితాలన్నీ మాముందెప్పుడుంచుతారు:)

    రిప్లయితొలగించండి
  9. "పిడేలంటే ఏటి బాబయ్యా" అని సిగ్గుపడుతూ అడిగాడు.
    అమ్మ తనకి ఓ గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది, ఎందుకో నాకప్పుడు అర్ధం కాలేదు.
    ha ha ha ROFL!!

    రిప్లయితొలగించండి
  10. ఆంధ్రా యూనివర్సిటీ లో చేరిన కొత్తలో మా నాన్న గారికి ఒక ఉత్తరం వ్రాసాను డబ్బులు పంపించమని. తెలుగు మాష్టారిని ఇంప్రెస్ చేద్దామని ఒక పద్యం గ్రాంధికము ఉపయోగించి వ్రాసాను. తిరుగు టపాలో ఒక కవరు వచ్చింది. అందులో నేను వ్రాసిన ఉత్తరం. ఖాళీ లేకుండా రెడ్ ఇంక్ మార్కులు.వాటి కరక్షన్స్. అన్నీ పదిమాట్లు ఇంపోజిషన్ వ్రాసి పంపితే తప్ప MO పంపను, అని. మళ్ళీ కవిత్వం జోలికి వెళ్లలేదు నేను.

    తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్లాగు జనుల దురదృష్టం కొద్దీ కధలు అనుకొని వ్రాస్తున్నాను. ఎప్పుడో కవిత్వం కూడా వ్రాసేస్తాను. నన్ను ఇంత భరించిన వాళ్ళు నా కవిత్వం భరించలేరా?

    మీ కధ నాకు ఇన్స్పిరేషన్. :))

    రిప్లయితొలగించండి
  11. చాలా బావుంది :)
    బులుసుగారూ ఈ మధ్యనే ఎవరో పెద్దలు గుర్తు చేసుకున్న వారి జ్ఞాపకం ఒకటి .. డీగ్రీలో తెలుగు పేపర్లో ప్రశ్నలకి ఛందోబద్ధ పద్యాల్లో సమాధానాలు రాశారు అట. బహుశా తిరుమలకృష్ణ దేశికాచార్యులు గారనుకుంటా ఈ విషయం చెప్పింది.

    రిప్లయితొలగించండి
  12. @వేణూ శ్రీకాంత్: వావ్.. నా కవితకన్నా, మీ కవితాత్మకమైన వ్యాఖ్య చాలా బాగుందండీ.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: మామూలుగా కాదండీ.. ఇప్పటికీ కవిత్వం అనగానే ఆ వాతలు గుర్తొస్తూ ఉంటాయ్ నాకు :-) ..ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: :-) :-) బాగుందండీ మీ లుంగీ కవిత.. ఇలాంటిదే తనికెళ్ళ భరణి 'పరికిణీ' ఆవిష్కరణలో బ్రహ్మానందం చెప్పాడు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @మాలాకుమార్: 'మంచి కవి' అన్నందుకు బోల్డన్ని ధన్యవాదాలండీ :-) :-)
    @శిశిర: ఆహా.. ఏమి నా కవిత భాగ్యము.. యెంత మంచి అభిమాని దొరికారో కదా.. ఐబాబోయ్.. ఇప్పుడు వడ్డించడం అంటే చాలా కష్టం అండీ.. నాన్నగారు నాకు వడ్డించినవి ఇంకా మర్చిపోలేదు నేను :-) :-) ...ధన్యవాదాలు.
    @మధురవాణి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. @జయ: ఆ పుస్తకానికి ఆరోజే నూకలు చెల్లిపోయాయండీ.. అన్నట్టు వరసగా రాయడం కూడా అచీవ్మేంటేనంటారా? ..ధన్యవాదాలు.

    @హరిచందన: :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @బులుసు సుబ్రహ్మణ్యం: రాయండి.. రాయండి.. మీ కథల్లాగే కవితలకీ బోల్డంత మంది అభిమానులు దొరుకుతారు.. వాళ్ళు నన్ను థాంక్ చేస్తారేమో కూడా :-) ..ధన్యవాదాలండీ..

    @కొత్తపాళీ: ఆయనెవరో నేనూ చూద్దామంటే లంకె పనిచేయడం లేదండీ :(( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @ మురళి - లంకె ఇదిగో
    http://www.kavya-nandanam.com/

    రిప్లయితొలగించండి
  17. @కొత్తపాళీ: ఇది పని చేస్తోంది.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి