"నోటి దుర్వాసన మీకు చింతా? కారణం.. క్రిములు.." అంటూ వచ్చే వాణిజ్య ప్రకటన రెండు రోజులుగా తరచూ గుర్తొస్తూ ఉంది. ఇది ఎప్పుడు మొదలయ్యిందంటే, ఓ ప్రముఖ సిని నిర్మాత "కొందరు దర్శకులు తెలుగు సిని పరిశ్రమకి క్రిములుగా మారారు" అంటూ సుదీర్ఘంగా ఆవేదన చెందడాన్ని టీవీలో చూసినప్పటి నుంచీ. ఆయన తాజాగా నిర్మించిన ఓ భారీ సినిమా అంచనాల మేరకి ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడంతో, కేవలం ఆ దర్శకుడిని మాత్రం అనలేక "కొందరు" అంటూ వ్యాఖ్య చేశాడని వినికిడి.
నిజానికి సినిమానష్టాల గురించి చర్చ ఇవాల్టిది కాదు. ఎప్పటినుంచో నడుస్తున్నదే.. కాకపొతే సదరు అగ్ర నిర్మాత తన ఆవేదనని ఆగ్రహంగా ప్రకటించడంతో మరోసారి చర్చకి వచ్చింది అంతే. ముఖ్యంగా, దర్శకుల హవా తగ్గిపోయాక, నిర్మాతల పెత్తనంలో ఉన్న తెలుగు సినిమా పగ్గాలు, వరుస విజయాలు సాధించిన కొందరు యువ దర్శకుల కారణంగా తిరిగి దర్శకుల చేతిలోకి వచ్చిన తరుణంలో వచ్చిన ప్రకటన కాబట్టి, దీనిని కేవలం ఓ నిర్మాత ఆవేదనగానో, ఆక్రోశంగానో కొట్టి పారేయలేం.
తెలుగు సినిమా గతిని పరిశీలిస్తే, సినిమా నిర్మాణం పెత్తనం మొత్తం ఉంటే నిర్మాత చేతిలో ఉంటోంది. లేని పక్షంలో అగ్ర హీరోలు లేదా దర్శకుల చేతిలో ఉంటోంది. అంతే తప్ప సమిష్టి కృషి అన్నది అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. మరి ఇరవైనాలుగు కళల సమాహారమైన సినిమాని నిర్మించడం అన్నది పూర్తిగా ఒక వ్యక్తి అధీనంలో ఉంచడం (డబ్బు ఎవరిదైనప్పటికీ) ఎంతవరకూ సమంజసం? సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయనక్కరలేదా?
ప్రముఖ స్టూడియోలు సినిమాలు తీసిన రోజుల్లో, నటీనటులు, సాంకేతిక నిపుణులని నెల జీతానికి నియమించుకుని సినిమా పూర్తయ్యేవరకూ వాళ్ళ చేత పని చేయించుకునేవి. అలా వచ్చిన సినిమాల్లో హిట్టైన వాటి పుణ్యమాని అగ్ర కథానాయకులుగా వెలుగొందిన వాళ్ళు తర్వాతి కాలంలో సినిమాని శాసించారు. నిర్మాత మొదలు, కథారచయిత, కథానాయిక ఎంపిక వరకూ ప్రతి ఒక్కటి వారి కనుసన్నల్లో జరిగేది. కొన్ని సినిమాలు ఫెయిలవ్వడంతో, సదరు తారల ప్రభ కాసింత మసకబారడం, అదే సమయంలో కొత్త దర్శకులు తక్కువ బడ్జెట్ తో విజయాలు సాధించడంతో సినిమా నావకి దర్శకుడే చుక్కాని అనే ట్రెండ్ వచ్చింది.
తర్వాత జరిగిన శాఖాచంక్రమణాల్లో సినిమా నావ చుక్కాని అనేక చేతులు మారి మళ్ళీ దర్శకుల చేతుల్లోకి వచ్చింది. కాలంతో పాటు మారిన విలువలు డబ్బు విలువని మరింత పెంచేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకైనా వెనుకాడని నిర్మాతలు బయలుదేరారు. డబ్బు ఖర్చు విషయంలో నిర్మాతే రాజీ పడడం లేదు కాబట్టి, తనది కాని డబ్బుని ఖర్చు పెట్టడంలో దర్శకులూ రాజీ పడడం లేదు. ఒక్క సినిమా భారీ విజయం సాధించడంతో డబ్బు, అవకాశాలూ వచ్చి పడుతూ ఉండడంతో దర్శకులకి 'రేపు' గురించి ఆలోచన ఉండడం లేదు.
నిజానికి ఇప్పుడు సినిమా నిర్మాణంలో బాధ్యత ఎవరికి ఉంది? నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప సినిమా గురించి సమిష్టిగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. నిర్మాత ఖర్చుకి వెనకాడడు. దర్శకుడు ప్రతి ఫ్రేం నీ రిచ్ గా తీస్తాడు. హీరోకి తన సినిమా బడ్జెట్ తన పోటీ హీరో సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఆవిషయాన్ని తన అభిమానులు ఘనంగా చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ ఎంత ఎక్కువ కాలం జరిగితే అంత గొప్ప.
తను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి' గా మారాడన్న విషయం నిర్మాతకి మొదట్లోనే ఎందుకు తెలియలేదన్నది ప్రశ్న. రోజూ ఎంత షూటింగ్ జరుగుతోందో తెలుసుకుని, ఇంత మాత్రమే ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగితే, అదేదో "తోటకూర నాడే.." సామెతలా విషయం ఇంత దూరం రాదు కదా. హీరోకి నటన రాకపోవడం వల్ల అనో, హీరోయిన్ షూటింగుకి ఆలస్యంగా వచ్చిందనో, హాస్య నటుడు మధ్యలోనే షూటింగ్ ఎగ్గొట్టి వెళ్లి పోయాడనో... ఇలా తనకి ఎదురైన సమస్యని దర్శకుడు నిర్మాతకి చెప్పి ఉండేవాడు, ఇద్దరూ కలిసి పరిస్థితి చక్కదిద్దే వారు.
ఊహాత్మకమైన ప్రశ్నే అయినా, జవాబు కష్టం కాదు. ఎంత ఖర్చు చేయించినా, సినిమా విజయవంతం అయ్యి పెట్టిన డబ్బు పిల్లాపాపలతో తిరిగొస్తే, నిర్మాతకి దర్శకుడు 'క్రిమి' గా కాక 'దేవుడి'గా కనిపించి ఉండేవాడే కదా? ఇది దర్శకుడిని సమర్ధించడం కాదు. కానీ దర్శకుడిని మాత్రమే బాద్యుడిని చేయడం ఎంతవరకూ సబబు? దర్శకుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయడం సమర్ధనీయమేనా? టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడికి తెర వెనుక పెత్తనం ఎవరు చేశారన్నది అనవసరం. సినిమా బాగోకపోతే, టిక్కెట్ కి పెట్టిన డబ్బు వృధా అనిపిస్తే, ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరూ క్రిములే...
మీరు చెప్పినదాంట్లో నిజాలు ఉన్నాయి అండీ....నేను ఇదే విషయం మీద నా బ్లాగ్ లో కూడా రాస....
రిప్లయితొలగించండిమరో చిన్న మనవి....నేను ఇంట్లో నా సిస్టం లో MAC OS వాడుతున్న...ఆది మా అన్నయ్య laptop వదిలేసి అమెరికా వెళ్ళాడు...నెట్ పెట్టించా...బ్లాగింగు చేద్దాం అంటే తెలుగు ఫాంట్ రావడం లేదు ఏదో సున్నాలు సున్నాలు ల వస్తుంది కొంచెం తెలుగు ఫాంట్ ఎలా వస్తుందో చెప్పండి....
మొరళి గారు..
రిప్లయితొలగించండిమన తెలుగు సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో ప్రస్తుతకాలం లో. "క్రిమి"సంహారక మందులు అన్నీ కలిపి పిచికారి చేసి ఈ చీడను వదిలించాల్సిందే.
రఘురామ్
భలే చెప్పారు..చప్పట్లు..
రిప్లయితొలగించండిపాపం ఆ నిర్మాతకి ఉక్రోషం ఎవరిమీద చూపించాలొ తెలియక మాట్లాడినట్లుందండి.
రిప్లయితొలగించండిటపాబాగుంది, కంక్లూజన్ మరీబాగుంది.
ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరూ క్రిములే... ఇది మాత్రం నిజం
రిప్లయితొలగించండితను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి' గా మారాడన్న విషయం నిర్మాతకి మొదట్లోనే ఎందుకు తెలియలేదన్నది ప్రశ్న. రోజూ ఎంత షూటింగ్ జరుగుతోందో తెలుసుకుని, ఇంత మాత్రమే ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగితే, అదేదో "తోటకూర నాడే.." సామెతలా విషయం ఇంత దూరం రాదు కదా...
రిప్లయితొలగించండిబాగా చెప్పేరు, కంక్లూజన్ కూడా బాగుంది మురళి గారు.నేనూ చప్పట్లు కొడుతున్నా:)
ఆరెంజ్ సినిమా చూసి నేనూ అనుకున్నా మురళిగారు. రాంచరణ్ ఆ సినిమాలో అస్సలు బాగాలేడు. కనీసం ఆ విషయం లో నన్న కొంత శ్రద్ధ తీసుకోవాల్సింది. జెనీలియా ఓవరాక్షన్, బొమ్మరిల్లు ఇమేజ్ తో సినిమాని డౌన్ చేసింది. థీం కూడా పటిస్టం గా లేదు. ఇలాంటి లోపాలు సినిమా నిండా ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయిందంటే దర్శకుడితో పాటూ వీరందరూ కారకులే. నాకు తెలిసిన ఆరెంజ్, నాగబాబు ఇంటర్వ్యూ లను దృష్టిలో పెట్టుకొని చెప్తున్న నా అభిప్రాయం ఇది.
రిప్లయితొలగించండిరెండొందల మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటరునీటిలోకలిపి వాళ్ళగొంతులో పిచ్చికారి చేసేద్దామా
రిప్లయితొలగించండి@రాజేష్: మీరు తెలుగు రాయడానికి గూగుల్ టూల్స్ ఉపయోగించండి.. అంటే జిమెయిల్ లేదా ట్రాన్స్లిటరేట్.. అన్నట్టు మీ బ్లాగు ఓపెన్ చేస్తుంటే సిస్టం డౌన్ అవుతోందండీ.. మీ సెట్టింగ్స్ ఒకసారి చూడండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రఘురాం: పిచికారీ.. బాగా చెప్పారండీ, ధన్యవాదాలు.
@హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
@వేణూ శ్రీకాంత్: చెప్పిన విధానం అతని స్థాయికి తగ్గట్టుగా లేదనిపించిందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@అను: ధన్యవాదాలండీ..
@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@జయ: కానీ వాళ్ళ లోపాలని వాళ్ళు ఒప్పుకోరు కదండీ.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: వాళ్ళే ఒకళ్ళ నోళ్ళలో ఒకళ్ళు పిచ్చికారీ చేసేసుకునేలా ఉన్నారండీ.. ధన్యవాదాలు.