శనివారం, అక్టోబర్ 17, 2026

గరివిడి లక్ష్మి

ఉత్తరాంధ్ర ప్రాంతపు ఎమోషన్ 'గరివిడి లక్మి'. ఆమె బుర్రకథకి కొత్తరూపు ఇచ్చి జనంలోకి మరింతగా చేరువ చేసిందన్న ప్రసంశ, బూతుమయం చేసిందన్న విమర్శ ఎదుర్కొన్న కళాకారిణి. ఈ క్రమంలో ఆమె సంపాదించుకున్నది ఏవిటో తెలియదు కానీ, పోగొట్టుకున్నది మాత్రం తన 'ఐడెంటిటీ'ని. పంతొమ్మిది వందల తొంభయ్యో దశకం స్మార్ట్ కాలం కాకపోవడంతో, గరివిడి లక్ష్మి ప్రదర్శనని నేరుగా చూడని వాళ్లకి ఆమె ఎవరో గుర్తుపట్టే అవకాశం లేదు. ఒకపక్క విపరీతమైన పేరు, ఊపిరి సలపనన్ని ప్రోగ్రాంలూ ఉన్నా, ఆ కార్యక్రమాలకి ఉన్న డిమాండ్ రెట్టింపు. ఇదిగో, ఇక్కడి నుంచే అనేకమంది గరివిడి లక్ష్మిలు పుట్టుకొచ్చారు. ఒక కాలంలో ఉత్తరాంధ్రలో బుర్రకథ చెప్పిన ప్రతిస్త్రీ పేరూ గరివిడి లక్ష్మే అనడం అతిశయోక్తి కాదు. మరి, అసలు 'గరివిడి లక్ష్మి' వీటన్నింటినీ ఎలా తీసుకుంది? ఇంతమంది లక్ష్ములు పుట్టుకురావడం వెనుక ఆమె పాత్ర ఏమిటన్నది ఇంతకాలం ఎవరికీ తెలియదు. ఇప్పుడా అవకాశం వచ్చింది, ఔత్సాహిక దర్శకుడు గౌరినాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'గరివిడి లక్ష్మి' సినిమా రూపంలో. 

'గరివిడి లక్ష్మి' బయోపిక్ అనే వార్త ఏడాదిగా ఊరిస్తోంది. ఆరునెలలుగా పాటలు ఒక్కొక్కటీ విడుదలవుతున్నాయి. సినిమా ప్రామిసింగ్ గా ఉండబోతోందన్న అంచనా నానాటికీ పెరుగుతుండగా, ఎట్టకేలకి ఈవేళ థియేటర్లలోకి వచ్చింది సినిమా. తెలుగమ్మాయి ఆనంది టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని గురించి మాట్లాడేప్పుడు  'మహానటి' సినిమాతో పోలిక తప్పదు. రెండూ స్త్రీల కథలు. ఇద్దరూ శక్తిమంతులైన స్త్రీలు. పట్టుదలకు ప్రాణమిచ్చే వాళ్ళు. ఇద్దరి జీవితాలూ సవాళ్లమయం. వాటిని ఎదుర్కొన్న మార్గాలు మాత్రం వేర్వేరు. ఒకరి గుర్తింపు వెండితెర రూపం అయితే, మరొకరి గుర్తింపు కేవలం గొంతు. ఇక్కడే ఈ రెండు కథల్లోనూ ప్రధానమైన భేదం కనిపిస్తుంది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న స్త్రీ, వేరెవరో తన పేరుతో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు "నేనే అసలు గరివిడి లక్ష్మిని" అని చెప్పుకోవాల్సి రావడాన్ని మించిన విషాదం వుండదు. అప్పటికే ఆమె ఆ చెప్పుకోవాలనే ఆలోచననీ, ఆసక్తినీ పరిస్థితుల కారణంగా కోల్పోతే?? జవాబు, 'రెండు గంటల ఇరవై నిమిషాలు అప్పుడే గడిచిపోయేయా?' అనిపించే ఈ సినిమా. 

దేవుడమ్మ (రాశి) ఒంటిమీదకి దేవుడొచ్చి తమ ప్రశ్నలకి సమాధానాలు చెబుతాడని ఆ చుట్టుపక్కల ప్రజల నమ్మిక. ఒక పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం. ఆలయాలు, పూజలు, భక్తుల ప్రశ్నలకి జవాబులు..వీటితో క్షణం తీరిక వుండదు ఆమెకి. చివరికి కూతురు విజయలక్ష్మిని చూసుకోడానికి కూడా. ఆ పిల్ల తనకి తెలియకుండానే పాట మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. అనుకోకుండా బుర్రకథ మార్గంలో ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ బుర్రకథకి కొత్త  మెరుగులు దిద్దాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. ప్రయత్నించి, విజయవంతమవుతుంది. అయితే, దేవుడమ్మ తీసుకున్న రెండు నిర్ణయాలు విజయలక్ష్మి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆ అమ్మాయి 'గరివిడి లక్ష్మి' గా మారి ఉజ్వలమైన కీర్తిని ఆర్జించినా ఆ రెండు నిర్ణయాల తాలూకు చీకటి ఆమెని విడిచిపెట్టదు. వీటికి తోడు, ఆమె స్వయంగా  తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు -- అన్నీ కూడా మనుషుల మీద నమ్మకంతో తీసుకున్నవే -- లక్ష్మి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి. 

బుర్రకథకి నగిషీ చెక్కే క్రమంలో లక్ష్మి ప్రవేశ పెట్టిన జానపద బాణీల అశ్లీలం, ఆమె కళ్ళముందే పెరిగి పెద్దదై, "గుడ్డలిప్పుకుని ఆడతాదేటి?" అని జనం ఆశగా అడిగే వరకూ వెళ్లడాన్ని ఈ సినిమా దాచలేదు. ఒక ఆడియో కంపెనీ వాళ్ళు ఆమె బుర్రకథని రికార్డు చేసుకుని, వేరే కవి పేరుతో చెలామణి చేసుకున్న విషయాన్నీ, ఆర్ఫీ పట్నాయక్ ఆమెకి సినిమాకి పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చి ఆమె బుర్రకథ ట్యూన్ ని 'చిత్రం' సినిమా కోసం వాడుకోడాన్ని నేరుగానే చూపించింది. ఇక వ్యక్తిగత జీవితంలో జరిగిన నమ్మకద్రోహాన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ పురుష పాత్రని కేవలం అవకాశవాదిగా చూపారే తప్ప ప్రయత్న పూర్వకంగా విలన్ ని చేయలేదు. ఆమె పేరు మీదో, సంపాదన మీదో అసూయ పడుతున్నట్టుగా కూడా చిత్రించలేదు. అతనంతే అని చెప్పి వదిలేశారు. అయితే, చివర్లో ఆడియో కంపెనీ వాళ్ళు, ఆర్ఫీ పట్నాయక్ మాట్లాడిన క్లిప్స్ చూపించకపోయినా సినిమాకేమీ నష్టం లేదనిపించింది. చూపించడం వల్ల కొత్తగా ఒరిగేది కూడా ఏదీ లేదు. 

నటీనటుల విషయంలో ముందుగా చెప్పాల్సింది టైటిల్ పాత్రధారిణి ఆనంది గురించే. స్టేజి మీద మాత్రమే కాదు, నిజజీవితంలోనూ గరివిడి లక్ష్మి ఇలాగే ఉండేదేమో అనిపించేలా నటించింది. ఎక్కడా అతి అని కానీ, పాత్ర నుంచి దూరం జరిగినట్టు కానీ అనిపించలేదు. సత్తిబాబుగా రాగ మయూర్ కి గుర్తుండిపోయే పాత్ర దొరికింది. నేను ఊహించిన కన్నా బాగా చేశాడు. మరో రెండు ముఖ్యమైన పాత్రలు రాశి, నరేష్ లవి. ఇద్దరికీ చాలా మంచి పాత్రలు దొరికాయి. ఇద్దరూ నూటికి నూరుశాతం న్యాయం చేశారు. తర్వాత చెప్పుకోవాల్సింది, లక్ష్మి స్నేహితురాలు విజయగా నటించిన శరణ్య ప్రదీప్ గురించి. మంచి పాత్ర, పాత్రకి తగ్గ నటన. బుర్రకథ గురువుగా ఎల్ బీ శ్రీరామ్ కనిపించారు. నరేష్ పోషించిన రాంబాబు పాత్ర, 'మహానటి' లో ఇతని పాత్రకి కొంచం దగ్గరగా అనిపించింది. అయితే ఇక్కడ కేవలం కథ చెప్పే పాత్ర మాత్రమే కాదు, ఆమె కథని మలుపు తిప్పే పాత్ర కూడా. 

బుర్రకథ కళాకారిణి కథలో పాటలది కీలక పాత్ర. చరణ్ అర్జున్ సంగీతంలో చాలావరకు గరివిడి లక్ష్మి ఒరిజినల్ ట్యూన్స్ వినిపించాయి. నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ (రవితేజ గిరిజాల) ఎంత చక్కగా కుదిరిందంటే, ఇంటర్వల్ లో 'అప్పుడే మొదటి సగం అయిపోయిందా' అనిపించింది. కథ రీత్యా, రెండో సగంలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు (మొదటిసగంలో వచ్చినవి) చూపాలి. ఇలా చూపాల్సిన సందర్భం రెండుసార్లు వచ్చింది. రెండుసార్లూ ఆయా సన్నివేశాలని పూర్తిగా చూడడం వల్ల, ఆ సన్నివేశాలని మూడోసారి కూడా చూశారు ప్రేక్షకులు. ఈ పునరుక్తిని కొంత పరిహరించవచ్చు. లివింగ్ లెజెండ్స్ బయోపిక్ లకి ప్రధానమైన ఛాలెంజ్ ముగింపు. 'గరివిడి లక్ష్మి' విషయంలో సినిమా మొత్తం నిజాయితీగానూ, ముగింపు తెలివిగానూ అనిపించింది. కళల మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి మాత్రమే కాదు, రొటీన్ సినిమాలు నచ్చని వాళ్లకి కూడా నచ్చేసే సినిమా 'గరివిడి లక్ష్మి'. ఎండ్ టైటిల్స్ పడుతుండగా దర్శకుడి గురించి ఒకటే అనిపించింది, యితడు 'గౌరినాయుడు జెమ్' అని. 

శనివారం, అక్టోబర్ 10, 2026

చీకటి యుద్ధం

కొట్టం రామకృష్ణా రెడ్డి కథల సంపుటికి 'చీకటి యుద్ధం' అన్న పేరే పెద్ద విరోధాభాస. ఈ కథల్లో చీకటి లేదు, యుద్ధమూ లేదు, చీకటితో చేసే యుద్ధం అంతకన్నా లేదు. సంపుటిలో ఈ పేరుతో ఉన్న కథ ముగింపు చీకటిలో జరిగిన యుద్ధాన్ని స్ఫురణకి తెచ్చి, పాఠకులకి మెరుపు ముగింపు చదివిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ కథ, ఆ ముగింపూ రచయితకి బాగా దగ్గరగా అనిపించి ఉంటాయి బహుశా. కవర్ డిజైన్ లో వెన్నెల వెలుగుని చూపించే ప్రయత్నంలో మొత్తం నలుపుని అద్దారు. ఇంత చెప్పడం ఎందుకంటే, ఈ పుస్తకాన్ని కొని చాలా రోజులే అయినా 'నెగటివ్ కథలు ఇప్పుడెందుకు' అన్న ఆలోచనలో చదవడాన్ని అలా అలా వాయిదా వేస్తూ వచ్చాను. రచయితా, పబ్లిషరూ కలిసి మిస్లీడ్ చేశారు అనడం కన్నా, నేనే మిస్ లీడ్ అయ్యాను అనుకోవడం సబబు. 'ఇంకొంచం ముందే చదివేసి ఉండాల్సిందే' అని మాత్రం అనిపించింది. 

సంపుటిలోని మొత్తం పదిహేను కథల్లో ఐదు కథలు తెలంగాణ మాండలీకంలో వున్నాయి. వీటిలో రెండు కథలు నాకు బాగా నచ్చాయి. 'జాయిజాదులు', 'పెద్ద దిక్కు' ఈ రెండు కథలూ చదువుతున్నంతసేపూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు గుర్తొస్తూనే వున్నాయి. శ్రీపాద రాసిన చాలా కథల్లో కథనం మనల్ని ఆ స్థలకాలాల్లోకి తీసుకుపోతుంది. ఒకటి రెండు పేజీలు తిరిగేసరికి, కథ చదువుతున్నట్టుగా కాక కళ్ళముందు చూస్తున్న భావన వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే కుతూహలం కన్నా జరుగుతున్న కథని ఆస్వాదించడానికే పెద్దపీట వేస్తాం. కథ ఎటూ ఉంటుంది. ఈ రెండు కథలూ చదువుతున్నంత సేపూ నాకు కలిగిన భావన అదే 'జాయిజాదులు' చివర్లో లచ్చుమమ్మ మొగుడు చెప్పే మాటలు పాఠకులకి ఆసరికే ఆలోచనకి వస్తాయి. వాటిని వాచ్యంగా చెప్పించనవసరం లేదు. అలాగే, 'పెద్ద దిక్కు' ముగింపులో బాపు మాటలని బాగా కుదించడం ద్వారా చర్విత చర్వణాన్ని ఆపే వీలుంది. 

'చీకటి యుద్ధం' కథకి కొనసాగింపుగా అనిపించే కథ 'వీడని నీడ'. రెండూ ఆలుమగల కథలే. రెండు కథలూ కూడా ఇద్దరి వైపు నుంచీ చెప్పినవే. రెండింటిలోనూ ఇద్దరూ తమ భాగస్వామి గురించి వరుసగా ఫిర్యాదులు చేస్తూనే వుంటారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని రచయిత వాచ్యంగా చెప్పరు. కథల ముగింపులో చెప్పకనే చెబుతారు. నిజానికి ఈ సంపుటిలో మెజారిటీ కథలు భార్యాభర్తల కథలే. భిన్నమైన ఇతివృత్తంతో సాగుతూనే, కాస్త దగ్గరగా అనిపించే కథలు 'స్పర్శ', 'విస్పర్'. 'స్పర్శ' కథలో ముగింపు, అత్తగారి పాత్రా బాగా గుర్తుండిపోతాయి. తాపీగా సాగే కథ, ప్రి-క్లైమాక్స్ నుంచి పరుగందుకుంటుంది. 'విస్పర్' కథ సాగుతున్నంతసేపూ ముగింపుకి సంబంధించిన క్లూలు కనిపిస్తూనే వుంటాయి. ఈ రెండూ సమకాలీన సమాజం నుంచి వచ్చిన కథలు. వీటిలో కనిపించే లాంటి ఆదర్శమే (?) తొలి కథ 'దిద్దుబాటు' లోనూ కనిపిస్తుంది. 

కాస్త సుదీర్ఘంగా సాగినట్టు అనిపించే కథ 'చెల్లని మొహం'. సంపుటిలో చివరి కథ 'నేను..తను..అతను' స్త్రీవాద కథలా అనిపిస్తుంది. 'చెల్లని మొహం' వర్తమానంలో జరిగే కథ. కథా నాయకుడి ఫుల్ టైం ప్రొఫెషన్ కమర్షియల్ రైటర్. సినిమాలకి, సీరియళ్ళకీ రాయడం కాదు, కేవలం కథా, నవలా సాహిత్యాన్ని తెలుగులో రాస్తూ ఉంటాడు, అది కూడా ప్రత్యేకంగా ఒక ఆఫీసుని ఏర్పాటు చేసుకుని!! 'భయం' కథని వన్ సైడ్ లవ్ స్టోరీ అని ఒక్కమాటలో తేల్చేయలేం. నేరేషన్ ఈ కథకి ప్రత్యేకమైన అందాన్నిచ్చింది. 'హద్దులు' కథలో సరిహద్దు ప్రాంతపు వర్ణన, ఇదే ఇతివృత్తంతో వచ్చిన ఇతర కథల్లో కనిపించే వర్ణనకి భిన్నంగా వుంది. యుద్ధ క్షేత్రాన్ని కాక, దానికి సమీపంలో సామాన్యులు ఉండే ఆవాసాన్ని కథాస్థలంగా ఎంచుకోవడం కథకి ఒక ప్రత్యేకతని అద్దింది. 

'జాయిజాదులు' లాగా హాయిగా సాగిపోయే కథ 'ఒకరికొకరు'. నెమ్మదిగా కనుమరుగవుతున్న ఒక సంప్రదాయాన్ని రికార్డు చేసేందుకు మాత్రమే కాదు, 'నీటికన్నా రక్తం చిక్కన' అనే సత్యాన్ని మరోమారు చెప్పేందుకు రాసిన కథలా అనిపించింది. 'ఉనికి' 'తొవ్వ' ఇవి రెండూ తెలంగాణ మాండలీకంలో సాగే స్కెచ్ లు. కుటుంబ బంధాల ప్రాశస్త్యాన్ని చెప్పే కథలే రెండూను. ఉనికి కథ ఒక సుదీర్ఘ జీవితంలో దశలని చిత్రిస్తే, 'తొవ్వ' కథ ఒక మరణవార్తతో మొదలై తలపోతలతో సాగి, ఆర్ద్రంగా ముగుస్తుంది. ఒకేసన్నివేశాన్ని వివిధ పాత్రల వ్యూపాయింట్ నుంచి చూపుతూ రాసిన కథ 'నైజం'. ప్రతి పాత్రా మిగిలిన పాత్రల్ని కామెంట్ చేస్తుంది. కథ ఆ పాత్ర వైపు నుంచి చదివేప్పుడు, మిగిలిన పాత్రలు చేసిన కామెంట్స్ లో ఏవి ఎంత నిజం అనే నిర్ధారణకి రాగలుగుతారు పాఠకులు. ఇందుకోసం ఈ కథని కనీసం రెండుసార్లు చదవాలి. హాయైన కథల్నీ, ఆపకుండా చదివించే కథల్నీ ఇష్టపడే పాఠకులకి నచ్చే సంకలనం ఈ 'చీకటి యుద్ధం'. (బోధి ఫౌండేషన్ ప్రచురణ, పేజీలు 152, వెల రూ. 225) 

ఆదివారం, అక్టోబర్ 04, 2026

సింగీతం శ్రీనివాసరావు ..

'తరం వెళ్ళిపోయింది' అనే మాట మనం తరచుగా వాడేస్తూ ఉంటాం.. కానీ వాడాల్సిన సందర్భాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భం, నిరూపమాన సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిష్క్రమణం. తెలుగు వారి గర్వకారణం అలనాటి విజయా వారి 'మాయా బజార్' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్, నిన్న మొన్నటి 'సింగ్ గీతం' సినిమా వరకూ సినిమా రంగంలోనే నిలబడి ఉండడం, తాను మాత్రమే తీయగలిగిన సినిమాలని అందించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా మీద తనదైన ముద్రని వేసిన నిపుణుడీయన.  కథని ఎంపిక చేసుకోవడంలో నవ్యతకి ప్రాధాన్యత ఇవ్వడం, సంగీతసాహిత్యాల పట్ల అభిరుచి ఉండడం మాత్రమే కాదు, నటీనటుల నుంచి రాబట్టుకోవాల్సిన నటనని గురింఛీ స్పష్టమైన అభిప్రాయం ఉన్న దర్శకుడు సింగీతం. 

హిట్, ఫ్లాప్ అనే చట్రంలో బంధించలేని సినిమాలు అందించేవాళ్ళు కొందరే ఉంటారు, ఆ కొందరిలో ఒకరు సింగీతం శ్రీనివాస రావు. అందుకే ఫ్లాపులు వచ్చినా ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఆమాటకి వస్తే దర్శకత్వం వహించిన తొలి సినిమా 'నీతి-నిజాయితీ' నే పెద్ద ఫ్లాప్. కానీ, సినిమా పరిశ్రమ ఆయన టాలెంట్ ని గుర్తించింది. వరుస అవకాశాలతో ప్రోత్సహించింది. ఫలితంగా, సినిమా పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగే సినిమాలని ఆయన నుంచి రాబట్టుకుంది. వెండితెరమీద సింగీతం చేసిన ప్రయోగాలు ఎన్నో. వీటిలో చాలా వరకు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే, అలా పొందనివేవీ నిర్మాతలని భారీ నష్టాలలో ముంచెత్తలేదు. ఎందుకంటే, సింగీతం ప్రయోగాలకి పెట్టుబడి భారీ మొత్తంలో బడ్జెట్ (డబ్బు) కాదు, కొత్త తరహా ఆలోచన. ఆ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే. కథకి తగినట్టుగా ఇతరత్రా హంగులు. 

విజయా నాగిరెడ్డి కుమారులు చాలా ఏళ్ళ తర్వాత సినిమా నిర్మాణం తిరిగి ప్రారంభించాలి అనుకున్నప్పుడు వాళ్లకి గుర్తొచ్చిన దర్శకుడు సింగీతం. ఆ సినిమా 'బృందావనం'. గట్టిగా పది పన్నెండు మంది నటీనటులు. మధ్యతరగతి నేపథ్యంలో సాగే కథ. చక్కని సంగీతం, గుర్తుండిపోయే పాటలు. మళ్ళీ చూడాలనిపించే హాస్యం. ఆ సినిమా సాధించిన విజయం, 'చందమామ విజయా కంబైన్స్' వారితో రెండు భారీ సినిమాలు తీయించింది. వాటికీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావే. వాటిలో జానపద చిత్రం 'భైరవద్వీపం' భారీ విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరచగా, పౌరాణిక చిత్రం 'శ్రీకృష్ణార్జున విజయం' విజయాన్ని సాధించక నాబోటి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే, అటు 'భైరవద్వీపం' కానీ, ఇటు 'శ్రీకృష్ణార్జున విజయం' కానీ తెరమీద భారీగా కనిపిస్తాయి, అయితే బడ్జెట్ మరీ ఆసాధారణమేమీ కాదు. ఒకరూపాయి ఖర్చుకి కనీసం ఐదారు రూపాయల ఔట్పుట్ ని తెరమీద చూపించగల ప్రతిభ సింగీతం సొంతం. 

Google Image

ఇదే కోవలో వచ్చిన మరో భారీ ప్రయోగాత్మక చిత్రం 'ఆదిత్య 369'. నిర్మాతలు మారారు తప్ప, హీరో బాలకృష్ణే. భూత, భవిష్యత్, వర్తమానాలు మూడింటినీ కథలో భాగం చేయడం, భూత కాలానికి హంపీని ఎంచుకోవడం వల్ల ప్రేక్షకులకి కలిగిన థ్రిల్ ప్రత్యేకమైనది. గ్రాఫిక్స్ లేని ఆ కాలంలో, కేవలం ఆప్టిక్ వర్క్ ద్వారా తెరమీద అద్భుతాలు ఆవిష్కరించగలిగారు. వీటి వెనుక ఉన్నవి దర్శకుడి మేధస్సు, శ్రమ. నిర్మాతలు, దర్శకుడి మీద ఉంచిన నమ్మకం. ఈ నమ్మకమే లేని ఓ నిర్మాత, సింగీతాన్ని తన సినిమా షూటింగ్ ఆసాంతమూ అవమానాలకి గురి చేయడమే కాదు, టైటిల్ కార్డు 'దర్శకత్వం ఎస్. శ్రీనివాస రావు' అని వేసి ఐడెంటిటీ లేకుండా చేయాలనుకోవడం, పైగా అవే విషయాలని తన ఆత్మకథలో గర్వంగా రాసుకోవడం సినిమా పరిశ్రమలో మాత్రమే సాధ్యమయ్యే విషయాలు. సింగీతం గౌరవం ఏమీ తగ్గలేదు, 'జేగంటలు' సాక్షిగా. 

సింగీతం గురించి మాట్లాడాలన్నా, కమల్ హాసన్ గురించి మాట్లాడాలన్నా, వీళ్లిద్దరి కాంబినేషన్ గురించి ప్రస్థావన లేకపోతే అది అసంపూర్ణమే. ఇద్దరూ ప్రయోగాలకి పెద్ద పీట వేసే వాళ్ళే కావడంతో, వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనగానే 'కచ్చితంగా ఏదో ప్రయోగమే' అని అందరూ ఎదురు చూసే లాంటి సినిమాలు ఇచ్చారు ఇద్దరూ కలిసి. అమ్మాయిల కలల రాకుమారుడు కమల్ ని అంధుడిగా చూపించాలంటే, అది కూడా సినిమా ఆసాంతమూ, ఎంత ధైర్యం కావాలి? అలాంటి ధైర్యం నుంచే 'అమావాస్య చంద్రుడు' వచ్చాడు. మాటలే (అవసరం) లేని 'పుష్పక విమానము', ముగ్గురు కమల్ హాసన్ల (అందులోనూ ఒకడు మరగుజ్జు) 'అపూర్వ సహోదరులు', నలుగురు కమల్ లతో 'మైకేల్ మదన కామరాజు' ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుని, కొన్ని సార్లు రి-షూట్లు చేసి తెరకెక్కించినవి. కానీ, 'నవ్వండి-లవ్వండి' సినిమాకి మొదట అనుకున్న దర్శకుడు సింగీతం కాదు. అనూహ్య పరిస్థితులలో, చివరి నిమిషంలో దర్శకత్వ బాధ్యతని తీసుకున్నా, ఆ సినిమాలోనూ తన మార్కుని చూపించడం చెప్పుకోవాల్సిన విషయం. 

సింగీతం ఇంటర్యూలు, పాడ్ కాస్ట్ లు అనేకం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆయన స్వవిషయాలు చెప్పుకున్నవి చాలా తక్కువ. (సింగీతం వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆయన భార్య సింగీతం లక్ష్మీ కళ్యాణి రాసిన 'శ్రీ కళ్యాణీయం' పుస్తకం చదవవొచ్చు). ఆయన మాట్లాడింది ఎక్కువగా టెక్నీకల్ విషయాలే. సినిమాకి సబ్జెక్టుల ఎంపిక, స్క్రిప్ట్ తయారు మొదలు, రొటీన్ కి భిన్నంగా ఆలోచించే విధానం, చిత్రీకరణలో పాటించ దగిన టెక్నిక్స్ గురించే ఎక్కువగా చెప్పారు. సినిమా నిర్మాణాన్ని గురించి ఆసక్తి ఉన్నవాళ్ళకి, ఈ రంగం పట్ల కుతూహలం ఉన్నవాళ్ళకి కూడా బోలెడంత రిఫరెన్స్ మెటీరియల్ ఈ వీడియోలు. హోస్టులు ఎలాంటి హోమ్ వర్కూ చేయకుండా, ఆయన ముందు మైకు పెట్టేసినా, తను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఓపికగా చెప్పారాయన. 

'సింగ్ గీతం' ప్రమోషన్ ఇంటర్యూల సమయంలో, ఒక జర్నలిస్టు చేసిన వీడియో ఇంటర్యూలో ఆ సినిమా సింగీతం 'హంసగీతం' (చివరి సినిమా) అనే అర్ధంలో మాట్లాడారు. సింగీతం మాత్రం అదేమీ పట్టించుకోకుండా, తర్వాత సినిమా కోసం చేస్తున్న స్క్రిప్ట్ వర్క్ గురించి చెప్పారు. ఆ జర్నలిస్ట్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యం ఎన్నో విషయాలు చెబుతుంది -- సింగీతాన్ని గురించీ, మిగుల్చుకోవాల్సిన జీవన లాలసని గురించీ.. ఒక తరాన్ని తనతో తీసుకెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలగాలి.