గురువారం, జూన్ 09, 2011

గుప్పెడు మనసు

కేవలం బలమైన కథని మాత్రమే నమ్ముకుని కే.బాలచందర్ తీసిన సినిమాల పరంపరలో ఒకటి, ముప్ఫై మూడేళ్ళ క్రితం విడుదలైన 'గుప్పెడు మనసు.' పెద్ద పెద్ద స్టార్లు లేరు. భారీ సెట్టింగులు లేవు. లెక్కకు మిక్కిలి పాటలూ, హీరోచితంగా సాగే ఫైట్లూ కూడా లేవు. అయినా, ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చింది. ఎంతగా అంటే, ఇప్పటికీ వీడియో డిస్కులకి డిమాండ్ తగ్గనంతగా. ఏముందీ సినిమాలో? కథ.. కేవలం కథ.. అందుకు తగ్గట్టుగా పాత్రోచితమైన నటీనటుల నటన.

సివిల్ ఇంజనీర్ బుచ్చిబాబు (శరత్ బాబు) అతని భార్య విద్య (సుజాత) ల కథ ఇది. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. స్కూల్లో చదువుకునే ఓ కూతురు వాళ్లకి. విద్య చదువుకున్నది. రచయిత్రి, సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ కూడా. మాజీ సిని నటి శ్రీమతి ఇంటి పక్క బంగాళాలోకి మారతారు వాళ్ళు. శ్రీమతికి పెళ్లి, సంసారం లేవు. ఆమెకి ఓ రాజకీయ నాయకుడితో ఏర్పడ్డ సంబంధం కారణంగా పుట్టినమ్మాయి బేబీ (సరిత).

బేబీ వట్టి అల్లరిపిల్ల. ఎంతటి వాళ్ళనీ అల్లరి పెట్టకుండా వదలదు. పక్కింటి అంకుల్ బుచ్చిబాబు కూడా ఇందుకు మినహాయింపు కాదు. బుచ్చిబాబు, విద్య, బేబీ అల్లరిని సంతోషంగా భరిస్తారు. రెండు కుటుంబాలూ కలిసి సరదాలూ, సంబరాలూ, బీచిలూ, షికార్లూ.. ఈ క్రమంలో బుచ్చిబాబు కుటుంబానికి బాగా దగ్గరవుతుంది బేబీ. అప్పుడే, మెడిసిన్ చదువుతున్న విద్య తమ్ముడు మౌళి (నారాయణరావు) అక్కని చూడ్డానికి వచ్చి, బేబీతో ప్రేమలో పడిపోతాడు. కాకపోతే పైకి చెప్పడు.

ఇటు విద్యకి కూడా బేబీని తన తమ్ముడికిచ్చి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది. భర్తతో అంటుంది కూడా. అతను సరిగ్గా సమాధానం చెప్పడు. ఇంతలో తల్లి హఠాత్తుగా మరణించడంతో ఒక్క రాత్రిలోనే అనాధ అయిపోతుంది బేబీ. ఆమెని తన ఇంట్లోనే ఉంచుకుంటుంది విద్య. ఆమెకి తన కూతురు ఎంతో, బేబీ కూడా అంతే. నెమ్మదిగా దుఃఖాన్ని మర్చిపోయిన బేబీ కాలేజీలో చేరుతుంది.

విద్య, పాప ఇంట్లో లేని ఒక వర్షపు మధ్యాహ్నం అనుకోని పరిస్థితుల్లో ఒకటవుతారు బుచ్చిబాబు, బేబీ. అప్పుడే ఇంటికి వచ్చిన విద్య కంట పడుతుందీ దృశ్యం. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి శాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుంది విద్య. బేబీని ఎప్పటిలాగే ఆదరిస్తుంది. భర్తని మాత్రం దూరం పెడుతుంది. విద్యలో సామాన్య గృహిణి- రచయిత్రిల మధ్యన సంఘర్షణ మొదలవుతుంది. అక్క ఇంటికి వచ్చిన మౌళి, జరిగింది తెలుసుకుంటాడు. బేబీని స్వీకరించడానికి తనకేమీ అభ్యంతరం లేదంటాడు.

కానీ బేబీ అంగీకరించదు, అప్పటికే ఆమె గర్భవతి. అంతే కాదు, ఆమె మనసులో బుచ్చిబాబు ఉన్నాడు. జరిగిన దానికి బేబీ దగ్గర పశ్చాత్తాప పడతాడు బుచ్చిబాబు. అతనిదే తప్పంటే అంగీకరించదు ఆమె. తనకూ భాగం ఉందంటుంది. అయితే, విద్య దగ్గర పశ్చాత్తాప పడడానికి మేల్ ఇగో అడ్డొస్తుంది బుచ్చిబాబుకి. అది ఎంతగానో బాధిస్తుంది విద్యని. ఫలితం, కూతుర్ని బుచ్చిబాబు దగ్గర వదిలేసి, తను తన తండ్రి (రమణమూర్తి) దగ్గరికి వెళ్ళిపోతుంది.

జరిగిన సంఘటన నలుగురి జీవితాలని మార్చివేసింది. బేబీ బుచ్చిబాబు ఇంట్లోనుంచి వెళ్లి పోయి ఒక బిడ్డని కని, ఉద్యోగం చేస్తూ ఆ బిడ్డని పెంచుతూ ఉంటుంది. బేబీ కి తప్ప మరొకరికి తన భార్య స్థానం ఇవ్వలేనని అవివాహితుడిగానే ఉండిపోతాడు మౌళి. కూతుర్నీ అల్లుడినీ కలపడానికి విద్య తండ్రి చేసే ప్రయత్నాలు ఫలించవు. చివరికి బేబీ అందుకు ప్రయత్నం చేసి, విజయం సాధించడం ముగింపు. చిన్న కథని రెండు గంటల సినిమాగా మలచడంలో బాల చందర్ కృషీ, నటీనటవర్గం కృషీ మెచ్చదగినవి.

దర్శకత్వ పరంగా నాకు నచ్చినవి పాత్రలని పరిచయం చేసిన తీరు, చిన్న చిన్న షాట్ల ద్వారా జరగబోయే కథని సింబాలిక్ గా చెప్పడం. బుచ్చిబాబుని పరిచయం చేసేటప్పుడే అతను సరసుడన్న విషయం ప్రేక్షకులకి చెప్పేస్తాడు దర్శకుడు. అలాగే బేబీని విద్య కేవలం తల్లిలా చూస్తుండగా, బుచ్చిబాబు మాత్రం అదోలా చూడడాన్నీ గమనించవచ్చు. ముఖ్యంగా బీచ్ దృశ్యంలో. విద్య పాత్ర పరిచయంలో ఆమె ఓ పుస్తకాల పురుగనీ, రచయిత్రి, సెన్సార్ బోర్డ్ సభ్యురాలనీ చెప్పే సీన్లో విద్య చదివే పుస్తకం ఆల్విన్ టాఫ్లర్ రాసిన 'ఫ్యూచర్ షాక్.' (ఒకప్పుడు నేను వెతికి వెతికి చదివింది). గొప్ప సింబాలిక్ షాట్ అనిపించింది. అలాగే ఆమె సెన్సార్ బోర్డ్ సభ్యత్వాన్ని కథలో ముఖ్య మలుపు కోసం వాడుకోవడమూ బాగుంది.

బేబీ ఆహార్యంలో 'మరోచరిత్ర' స్వప్నని గుర్తు చేయగా, ఆమె అల్లరి చేష్టలు 'అంతులేనికథ' చంద్ర ని తల్చుకునేలా చేసింది. ఆశ్చర్యం లేదు, రెండూ బాలచందర్ సినిమాలే. నటన పరంగా చెప్పాలంటే సుజాత, సరిత, శరత్ బాబు, నారాయణ రావు నలుగురూ నాలుగు స్తంభాలు. ముఖ్యంగా సుజాత. బుచ్చిబాబు-బేబీ ఏకమవడాన్ని చూసినప్పుడూ, తర్వాత వచ్చే సన్నివేశాల్లోనూ ఆమె నటన పతాక స్థాయికి చేరిందనిపిస్తుంది. సరిత అల్లరిపిల్లగా ఎంత బాగా చేసిందో, ఆ తర్వాత మానసిక సంఘర్షణనీ అంత చక్కగానూ అభినయించింది. శరత్ బాబుకి ఈతరహా పాత్రలు కొట్టిన పిండి. ఇక నారాయణ రావుకి చిన్నదైనా మంచి పాత్ర దొరికింది.

ఉన్న నాలుగు పాటల్లోనూ మూడు పాటలు మళ్ళీ మళ్ళీ వినేవే. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం. బాల మురళి గళం పలికిన ఆత్రేయ రచన 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా..' ఓ గొప్ప పాట. ముఖ్యంగా మనసు బాగోనప్పుడు వినాల్సిన మొదటి పాట. అసలే మనసు పాట, ఆపై ఆత్రేయ. ఇక సాహిత్యాన్ని గురించి చెప్పడానికి ఏముంటుంది? సందర్భానికి చక్కగా సరిపోయిన నేపధ్య గీతం ఇది. బాలూ-వాణీ జయరాం ల యుగళం "నేనా.. పాడనా పాట..." నాకు బాగా ఇష్టమైన వాణీ జయరాం పాటల్లో ఒకటి. బాలూ సోలో "నువ్వేనా.. " ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూ ఉంటుంది.

నాకు అస్సలు నచ్చని విషయం ముగింపు. తన బిడ్డని మౌళి కి అప్పగించి బేబీ ఆత్మహత్య చేసుకోవడం ఏ రకంగా సమర్ధనీయమో నాకు అర్ధం కాదు. ఏదో ఒక ముగింపు ఇవ్వాలి కాబట్టా? సినిమాని విషాదాంతం చేయాలి కాబట్టా? (బాలచందర్ సినిమా కదా). తన కారణంగా వచ్చిన సమస్యకి తనే పరిష్కారం చెబుతానంటుంది బేబీ.. సమస్య ఏర్పడడంలో బుచ్చిబాబుకీ భాగం ఉందన్న విషయాన్ని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతుంది. ఈ టైటిల్ అంటే బాలచందర్ కి మక్కువ ఎక్కువ అనుకుంటా ఇదే పేరుతో ఓ టీవీ సీరియల్ వచ్చింది తన నుంచి. ఈ ద్విభాషా చిత్రానికి (తెలుగు, తమిళం) మూలం ఓ మలయాళం సినిమా అన్నది వికీ సమాచారం. ప్రీ-క్లైమాక్స్ వరకూ నాకు బాగా నచ్చే సినిమా ఇది.

12 కామెంట్‌లు:

  1. నాకు కూడా క్లైమాక్స్ అసలు నచ్చదు.మంచి పరిచయం మురళిగారు

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు,
    ఈ సినేమాను చూసినపుడు నాకేందుకో వాలదిమిర్ నుబకోవ్ రాసిన "లోలితా" నవల గుర్తుకు వచ్చింది.
    ఇక ఇటువంటి సైకో అనాలిసిస్ సినేమాలను తీయటం లో బాలచందర్ గారి గురించి చెప్పనక్కరలేదు. మనుషులలో ఉండే ద్వంద స్వభావాన్ని, విలువల విషయం లో ఊగిసలాట ధోరణిని కాలనుగుణంగా చూపిస్తూ విషాదముగింపులతో సినేమాను తీసి సొమ్ములు చేసుకొన్న వారి లో బాలచందర్ గారు అగ్రగణ్యులు. తెలుగులో మన దర్శకరత్న వీరి మార్గాన్ని అనుసరించారు. ప్రతి సినేమాని ఎడుపుతో ముగించి ఆనందించేవారు. హిందిలో మహేష్ భట్ గారు కూడా బాలచందర్ గారిలా సారాంశ్, అర్థ్ మొదలైన సినేమాలు తీసినా తరువాత బాలచందర్ గారి కన్నా ముందరగానే మహేష్ భట్ తన పంథాను మార్చుకొన్నాడు. కాని బాలచందర్ గారు గ్లోబలైసేషన్ మొదలయ్యేంతవరకు తన స్టైల్ని పెద్దగా మార్చలేదు.

    రిప్లయితొలగించండి
  3. ఈ సినిమా లో పాటలన్నీ బాగుంటాయ్ కానీ.. నా ఆల్ టైం ఫేవరెట్ పాట..."నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా..జాబిలి నవ్వున నువ్వేనా..గోదారి పొంగున నువ్వేనా.." సంగీతం, సాహిత్యం + బాలు కంఠం మెస్మరైజ్ చేసేస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. మంచి సినిమా,పాటలు అన్నీ చాలా బాగుంటాయి.

    ఇద్దరు హీరోయిన్లు ఉన్నపుడు ఒకరిని చంపేయడం ఈజీ సొల్యూషన్. చావే పరిష్కారం అన్న ముగింపుని నేను కూడ ఖండిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  5. ఈ పోస్టు చదివాకా ఈ సినిమా ఎప్పుడో చూసిన గుర్తు లీల గా వస్తుంది , కాని ఎంత బుర్ర చించుకున్నా ఎండింగ్ ఏమి ఉంటుందో గుర్తు రావటం లేదు :(

    రిప్లయితొలగించండి
  6. ఈ సినిమా చూసాను కానీ ఇదే గుప్పెడు మనసు సినిమా అని తెలియదు. చాలా సినిమాలు పేర్లు తెలియకుండానే చూసేస్తుంటానులెండి. చాలాసార్లు ఏ టి.విలో వస్తున్నప్పుడో సినిమా మొదలయ్యాక చూడడం మొదలుపెట్టి మొత్తం సినిమా చూసేయడం. పేరు తెలియకపోవడం. మీరన్నట్టు ముగింపు నాకూ నచ్చదు. ఎందుకో ఆ ముగింపు అంగీకరించాలనిపించదు. ఆ అమ్మాయి చనిపోతే మాత్రం విద్య బుచ్చిబాబుని ఎలా అంగీకరించగలుగుతుంది? ఆమె అతనికి దూరమయింది ఆ అమ్మాయి బ్రతికుందని కాదు కదా.

    రిప్లయితొలగించండి
  7. ప్రేక్షకుల హృదయాలు బరువెక్కితే కానీ బాలచందర్ సినిమా అనిపించుకోదు. ముగింపు మాటెలా ఉన్నా సినిమా మొత్తం అధ్బుతంగా నడిపిస్తారు, ముఖ్యంగా పాత్రల చిత్రీకరణ అలా ఆ పాత్ర మనసులో నిలిచిపోయేలా ఉంటుంది.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  8. @మురళి: ధన్యవాదాలండీ..
    @శ్రీకర్: 'లోలితా..' భలేగా పట్టుకున్నారండీ.. బాలచందర్ సినిమాల్లో బాగా నచ్చేది నేటివిటీ.. ముఖ్యంగా మధ్యతరగతి చిత్రణలో తన తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది, కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు. అన్నట్టు 'పరవశం' చూశారా? నన్ను చాలా నిరాశ పరిచిన సినిమా అది.. అప్పటికే టీవీ సీరియళ్ళకి మళ్ళిన బాలచందర్ అదే పంధాలో తీసిన సినిమాగా అనిపించింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @ప్రణీత స్వాతి: కానీ, చిత్రీకరణ కొంచం నిరాశ పరుస్తుందండీ.. నిజమే వినడానికి మాత్రం ఆ పాట భలేగా ఉంటుంది.. ధన్యవాదాలు.
    @శ్రీ: చావే పరిష్కారం అయితే, ఇంటర్వల్ లోనే ఒక హీరోయిన్ని చంపెయ్యొచ్చు కదా అనిపిస్తుందండీ నాకు... ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: రాశాను కదండీ, సరిత ఆత్మహత్య. మేడ మీదనుంచి దూకేస్తుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @శిశిర: నిజమేనండీ.. విద్య సమస్య సమస్యగానే ఉండిపోయింది, కేవలం బేబీకి ఇచ్చిన మాట కోసం ఇష్టం లేని భర్తతో కాపురం చేయాలన్న మాట! ..ధన్యవాదాలు.
    @శ్రీరాగ: అవునండీ.. నాక్కూడా ముగింపు మినహా సినిమా నచ్చుతుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కే.బి. గారు కాలను గుణం గా తన పంథాను మార్చారనటానికి కారణం, ఆయన నిర్మాత గా తమీళ్ లో తీసిన విక్రం, త్రిష ల "సామి" సినేమా, ఆ సినేమాలో హీరొ పోలిసు ఉద్యోగానికి లంచం ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించటం, నేను కన్విన్స్ కాలేదు. నాకేందుకో ఆయన హీరో స్థాయిని దిగజార్చారు అని అనిపించింది. ఆసమయానికి దాదాపు నూరు సినేమాలు తీసిన ఒక గొప్ప దర్శకుడి స్వంత సినేమా అది. కె. రాఘవేందర్ రావు, పూరి జగన్నాథ్, రాజ మౌళి లాంటి వారు చూపితే అది వేరే విషయం. నేను పరవశం సినేమాను చూడాలనుకొనే లోపే దానిని థీయేటర్ లో నుంచి తీసివేశారు.
    -----------------
    *నేటివిటీ.. ముఖ్యంగా మధ్యతరగతి చిత్రణలో తన తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది, కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు.*
    100 % correct. నా అభిమానదర్శకులలో ఆయన ఒకరు. టి వి లో ఆయన సినేమా ఎది వస్తున్నా, మధ్యలో సినేమా చూడటం మొదలు పెట్టినా, నాకు తెలికుండానే పాత్రల గుణగణాలను పరిశిలించటం మొదలు పెడతాను. మిగతా దర్శకుల సినేమాలు చూసేటప్పుడు పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి విశ్లేషణ చేయను. అది బాలచందర్ గారి ప్రత్యేకత.

    రిప్లయితొలగించండి
  12. @శ్రీకర్: నిజమేనండీ, ఒకప్పటి బాలచందర్ సినిమాల్లో ప్రతి చిన్న పాత్రనీ జాగ్రత్తగా తీర్చి దిద్దడం (ఉదా: 'అంతులేని కథ' లో సరిత కుటుంబ సభ్యులు), అనవసరపు సన్నివేశాలు (దాదాపుగా) లేకుండా చూసుకోవడం ఉండేది.. 'మార్పు సహజం' అనుకోవాలేమో...

    రిప్లయితొలగించండి