గురువారం, ఏప్రిల్ 09, 2009

రెండు కార్యక్రమాలు

శ్రీరామ నవమి సందర్భంగా గత వారం మా కాలనీ లో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావడంతో హాజరు వేయించుకోవడం తప్పని సరి. అదీకాక, ఏ కార్యక్రమాలు జరుగుతాయో అన్న కుతూహలం కూడా ఉండడంతో రెండు సాయంత్రాలను నవమి పందిట్లో గడిపాను.

మొదటి కార్యక్రమానికి మావాళ్ళు పెట్టిన పేరు 'డాన్స్ డాన్స్.' ఏ రోజు ఏ టీవీ చానల్ తిప్పినా వచ్చేదే. కాకపోతే ఇక్కడ డాన్స్ చేసేది మా కాలనీ పిల్లలు. ఎదురు పడినప్పుడల్లా నవ్వుతూ విష్ చేసే పిల్లలంతా కార్యక్రమం బాధ్యత తమ భుజాల మీద వేసుకోవడం చూడడానికి ముచ్చటగా అనిపించింది..

కార్యక్రమం మొదలవ్వక ముందే పందిరి నిండిపోయింది. వెండితెర వేల్పులను మరపిస్తూ పిల్లలు 'ఫాషనబుల్' గా తయారయ్యారు. తల్లిదండ్రులూ ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు, సెల్ ఫోన్ లు రెడీ చేసుకున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకోడానికి. పిల్లలు సీడీ లతో రెడీ అయిపోయారు. వాళ్ళంతట వాళ్ళే ఓ జాబితా తయారు చేసుకున్నారు, ఏ పాట తర్వాత ఏ పాట అనే వివరాలతో.

వాళ్ళు డాన్స్ చేసిన పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా వరకు ఏకార్దాలున్న -- కనీసం ద్వంద్వార్దాలైనా కాదు -- పాటలే. తలిదండ్రులు ఈలలు చప్పట్ల తో ప్రోత్సహించడం. 'మీ పాపని టీవీ ప్రోగ్రాం కి పంపిచండి.. ఎంత చక్కగా చేస్తోందో..' అంటోంది ఒకావిడ తన పక్కావిడతో. ఈ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతున్నారు కాబట్టి పాటలకి అర్ధాలు తెలియక పోవచ్చు. తల్లిదండ్రులకి కూడా తెలియదా?

ప్రోగ్రాం అయిపోయిందని ప్రకటించేసరికి కొందరు ప్రేక్షకులు గొడవ చేశారు, ఇంకొన్ని పాటలు వెయ్యాలని. 'పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి.. మనం వాళ్లకి సహకరించాలి (!!)' అని మా కాలనీ ప్రెసిడెంట్ ఓ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఇంటికి పంపారు. ఇలాంటి ప్రోగ్రాములని టీవీలు అలవాటు చేసినా, కళ్ళముందు తిరిగే పిల్లలు చేస్తుంటే చూడడం ఇబ్బందిగానే అనిపించింది.

రెండో కార్యక్రమం శాస్త్రీయ నృత్య ప్రదర్శన. మా కాలనీ పిల్లలు కొందరు కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఆ మాస్టారు తన సీనియర్ శిష్యులు కొందరిని, మా కాలనీ పిల్లలు కొందరిని కలిపి ట్రూపుగా కూర్చి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లల తల్లి దండ్రులు, వారి బంధువులు తప్ప పెద్దగా జనం లేరు. కెమెరాలు మామూలే. డాన్స్ మాస్టారు నట్టువాంగం, ఆయన కూతురి గాత్ర సహకారం, మరో ఇద్దరి వాద్య సహకారం.

పిల్లలంతా ఆరు నుంచి పద్నాలుగేళ్ళ వయస్సు మధ్యలో ఉన్నారు. కొందరు చక్కగా చేస్తున్నారు. మరికొందరికి ముద్రలు పట్టడం కూడా రావడం లేదు. పాడుతూనే వాళ్లకి సూచనలిచ్చేస్తోంది మాస్టారి అమ్మాయి. మాస్టారు మాత్రం ప్రతి పాట చివర నృత్యం చేసిన అమ్మాయిలను పేరు పేరున అభినందిస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల కళాభిమానాన్నిపొగుడుతున్నారు.

బాగా చేస్తున్న వాళ్ళ పక్కన, అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళని నిలబెట్టడంతో వీళ్ళ లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఫారిన్ లో కూచిపూడికి బాగా డిమాండ్ ఉందంట.. అందుకే పాపకి నేర్పిస్తున్నాం' నా వెనుకాయన ఎవరికో చెబుతున్న మాట వినిపించింది. పూర్తిగా శాస్త్రీయం చేయించారా అంటే అదీ లేదు. జానపదం పేరుతొ ఇక్కడా సినిమా పాటలే.. కాకపొతే పాత పాటలు.

జనం పెద్దగా రానందుకు కొందరు తలిదండ్రులు నొచ్చుకున్నారు. 'ఈ రోజుల్లో కూడా మన కాలనీ పిల్లలు శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నందుకు మనమంతా గర్వించాలి. ఈ చిన్నారులు భవిష్యత్తులో అమెరికాలో ప్రదర్శన ఇచ్చి అక్కడ మన కాలనీ పేరు నిలబెట్టాలని ఆశీర్వదిస్తున్నా..' అంటూ మా ప్రెసిడెంట్ గారు కార్యక్రమం ముగించారు.

8 కామెంట్‌లు:

  1. ఏం పర్లేదు లేండి, ఇక్కడా అదే నిర్వాకం. అక్కడ ఉండి ప్రత్యక్షంగా అక్కడి టీవీ ప్రోగ్రాముల్లో తమ పిల్లలు పాల్గొనలేకపోతున్నారే అని దిగులుపడే ఎన్నారై తెలుగు తలిదండ్రులెందరో!

    రిప్లయితొలగించండి
  2. 'ఫారిన్ లో కూచిపూడికి బాగా డిమాండ్ ఉందంట.. అందుకే పాపకి నేర్పిస్తున్నాం' ప్చ్ ...

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి మీ నిశిత పరిశీలన ,,కాలం మార్పు .....

    రిప్లయితొలగించండి
  4. నాకైతే ఆ డాన్స్ ప్రొగ్రాములు చూసి చూసి మొహమ్మొత్తేసింది. పాటల ప్రోగ్రాముల్లో కూడా ఇదే తంతు..బాలూ గారు బానే చురకలేస్తారు "ఏమ్మా ఈ పాట అర్ధం తెలిసే పాడావా" అని..

    చాలా మంది దృష్టిలో కళ ఇప్పుడు ఒకరకమయిన స్టేటస్ సింబల్ గా మారింది.. .

    రిప్లయితొలగించండి
  5. మా ఊళ్లో టెలు న్యూ ఇయర్ బాగా చేసారు.
    గనగన గనపటి అనే పాటతో మొదలుబెట్టారు. ఒక ఆరు ఏడు మందిపిల్లలు, ఏడు ఎనిమిది వయ్యస్సువాళ్లు పాడారా గనగన గనపటి పాటాని. అందులో ఒక పాప, చూయింగం తింటూ చక్కగా పాడింది.
    అయ్యాక, నేను మనసు బాగోక ఇంటికి వచ్చేసా. :)

    రిప్లయితొలగించండి
  6. @కొత్తపాళీ: అవునా.. ఇది వార్తేనండి మాకు.. ఇక్కడి తలిదండ్రులు గర్వపడడానికి మరో కారణం చూపించారు మీరు. ధన్యవాదాలు.
    @పరిమళం: అవునండి.. అది వాళ్ళ అభిప్రాయం.. ధన్యవాదాలు.
    @చిన్ని: పరిశీలన ఏమి లేదండి.. కొన్ని కొన్ని వద్దన్నా దృష్టిలో పడుతూ ఉంటాయి. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: నిజమేనండి.. స్టేటస్ సింబల్.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: పండగ పూటా మనసు పాడు చేసుకున్నారన్న మాట.. ఏం పిల్లలో 'గన గన గనపతి' పాత వినాయక చవితికి పాదాలని, టెల్గూ న్యూ ఇయర్ కి కాదని కూడా తెలీదు :) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. గత వారం లో ఇద్దరు సోదరీమణుల అరంగ్రేటం, చూశా, ఏ టివి లోనో గుర్తులేదు, కార్యక్రమం పేరు నృత్యాంజలి ఎమో..
    ఏ కోశానా వాళ్లు నృత్యం చేస్తున్నట్టు అనిపించలా, చిన్న అమ్మ్యీఇతే వాల్లా అక్కను చూస్తూ ఆవిడ ఎటు తిప్పితే ఇమె అలానే తిప్పి అయ్యిందనిపించిది...
    డురదర్స్నం లో మువ్వల సవ్వడి అని ఓ కార్యక్రమం వస్తుంది అది కాస్త మెరుగేమో...

    పై రెండూ శాష్రీయ నృత్యాల గురుంచి పెట్టిన కార్యక్రమాలు..

    టి.వి ల మీదా పడి ఏకార్ధ సినిమా పాటలు పడి, డాన్స్ చేశే 16 యేల్లలోపు బాల బాలికల గురించి, ఆ యా కార్యక్రమాలా న్యాయ నిర్ణేతల గురుంఛీ, బాల బాలికల తల్లిడండ్రులగురించి నన్ను అడగకండి, ఏకార్ధాలు కాదు, స్వచ్ఛమైన బూతులే రాలతాయి

    రిప్లయితొలగించండి
  8. @ఊకదంపుడు: ఇదో ట్రెండ్ అండి.. కొన్నాళ్ళు ఉంటుంది..మరొకటి వచ్చేవరకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి