సోమవారం, జులై 20, 2026

దాయాదుల తోట

దాయాదులు అనే మాట వినగానే మొదట గుర్తొచ్చేది మహాభారతమే. అన్నదమ్ముల పిల్లలైన కౌరవ పాండవుల మధ్య రాజ్యాన్ని భాగాలు పంచుకోవడంలో వచ్చిన తేడాలు మహా యుద్ధానికి ఎలా దారితీశాయో చెబుతుందీ ఇతిహాసం. దాయాదుల పోరుతో పాటు భారతం చర్చకి పెట్టిన విషయాల్లో ఒకటి 'నియోగం'. రాజు రోగిష్టి అయి, పిల్లల్ని కనలేని స్థితిలో ఉంటే, రాణి వేరొక వ్యక్తితో కూడి సంతానవతి కావచ్చు. ఆ సంతానం రాజు సంతానంగానే గుర్తింపు పొందడంతో పాటు, పుత్రసంతానం అయితే వారసత్వంగా రాజ్యపాలనీ చేపట్టవచ్చు. ఈ దాయాదుల పోరుని, నియోగ పద్ధతినీ వ్యంగ్యాత్మకంగా చర్చకి పెట్టిన నవల మధురాంతకం నరేంద్ర రాసిన 'దాయాదుల తోట'. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటుగా, రాయలసీమ నీటి సమస్య, పాలన పరంగా తమిళనాడులో కలిసిన తెలుగు ప్రాంతాల్లో భాషాసేవ లాంటి అనేక ఆసక్తికర విషయాలనీ కథలో భాగం చేశారు. 

తిరుపతి-చిత్తూరు మధ్య ఉన్న యానాదుల తోటలో మొదలవుతుంది. జాన్ సుభాష్-సంగీతరెడ్డి దంపతులు, కొందరు స్నేహితులతో కలిసి యానాదులతోటలో ఓ ఫ్యాక్టరీ కట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, పనులు ప్రారంభించబోతూ ఉండగా,  వెంసూ అనే మాజీ నక్సలైటు స్థానికులని కూడదీసి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెడతాడు. వెంసూ మరణంతో కథ ప్రారంభమవుతుంది. సరిగ్గా అదే సమయానికి పెళ్లిచూపుల నిమిత్తం అమెరికా నుంచి ఇండియాకి వస్తాడు సంగీతరెడ్డి కొడుకు హర్ష. తనకి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం అనే తీగని పట్టుకుని హర్ష మొదలు పెట్టిన తన అస్తిత్వం తాలూకు వెతుకులాట ఎన్నెన్ని మలుపులు తిరిగి ఏ మజిలీకి చేరిందన్నది కథ. మొత్తం తొమ్మిది పాత్రలు కథని చెబుతాయి (నరేంద్ర గత నవల 'మనోధర్మ పరాగం' తో రేఖామాత్రపు పోలిక ఇక్కడ). 

సంగీతరెడ్డి స్వస్థలం కడప. బ్రిటిష్ పాలనా కాలంలో ఆమె పూర్వులు క్రైస్తవంలోకి మారి అనేక విధాలుగా లబ్దిపొందారు. ఒకవైపు నెత్తురోడే ఫ్యాక్షన్ నీ, మరోవైపు శాంతిని బోధించే క్రైస్తవాన్నీ ఏకకాలంలో బేలన్స్ చేసుకుంటూ వచ్చారు. ఓ పక్క ఈ కుటుంబాన్ని గురించి చెబుతూనే, రచయిత దళిత నేపధ్యం ఉన్న పాత్రల్ని పరిచయం చేస్తారు. ఆలయాల్లోకి ప్రవేశం లేకపోయినా, క్రైస్తవం రా రమ్మని పిలుస్తున్నా మతం మారని పాత్రలివి. నవల ఆసాంతమూ ఈ కాంట్రాస్ట్/బేలన్సింగ్ కనిపిస్తూనే వుంటుంది. హర్ష పుట్టాక, సంగీతరెడ్డికి జాన్ సుభాష్ తో పెళ్లవుతుంది. వాళ్ళిద్దరికీ ఓ కూతురు. హర్ష కొన్నాళ్ళు అమ్మమ్మ ఇంట్లో పెరిగి, అటుపై ఋషి వేలీ స్కూల్లో చదువుకుని, ప్లస్ టూ నాటికే అమెరికా వెళ్ళిపోయి, డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు కూడా సంపాదించేసుకుంటాడు. ఈ పెరిగిన వాతావరణం కారణంగా హర్షకి తన 'జన్మ రహస్యం' తెలియదు. 

తిరుపతి యూనివర్సిటీలో సంగీతరెడ్డి చదువుకునే రోజుల్లో ఆమెకి పరిచయమవుతాడు వెంసూ. బ్రాహ్మణ తండ్రికి, క్రైస్తవ తల్లికీ పుట్టిన వెంసూ రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటాడు. కొంత రహస్య జీవితం తర్వాత లా చదివి, పౌరహక్కుల లాయరవుతాడు. జీవితపు తర్వాతి దశలో ఆయుధం పట్టి అడవికి వెళ్తాడు. చివరి రోజుల్లో యానాదుల భూమి కోసం సంగీతరెడ్డి కుటుంబం నిర్మించ తలపెట్టిన ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు. వెంసూ జీవితంలో మొత్తం ముగ్గురు స్త్రీలు ఉంటారు. వాళ్ళ పట్లా, వాళ్ళ ద్వారా కలిగిన సంతానం పట్లా అతనికి ఎలాంటి బాధ్యతా వుండదు. వెంసూ కి కాంట్రాస్టుగా, వివాహేతర సంబంధం ద్వారా కలిగిన సంతానం పట్ల కూడా బాధ్యతగా వుండే దళిత నేపధ్యం వున్న పాత్రలు కనిపిస్తాయి. 

నవలలో ఆసక్తికరంగా అనిపించే రెండు పాత్రలు రాఘవరెడ్డి, నాగరాజు. మ్యాప్ ప్రకారం తమిళనాడులో ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో భాషా వ్యాప్తికి జరిగే ఉద్యమంలో పాల్గొనే కార్యకర్త రాఘవరెడ్డి. ఈ పాత్రకి ఆపాదించిన కృషి, అనుభవాలు అన్నీ కూడా తెలుగు భాషా ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న రచయిత స. వెం. రమేష్ అనుభవాలు, ఆలోచనలే. పైగా, వాటన్నింటినీ రమేష్ కథలుగానూ, వ్యాసాలుగానూ రికార్డు చేశారు కూడా. ఇక, నాగరాజు రాయలసీమ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. సీమ జిల్లాలకి నీటి పంపిణీ విషయంలో జరిగిన అన్యాయం, సరిదిద్దే మార్గాలు, ఇవన్నీ ఇతని నాలిక చివరన ఉంటాయి. ఈ సమాచారం మొత్తం కె. బాలగోపాల్ రాసిన 'జల పాఠాలు' పుస్తకంలో వున్నదే. అటు స.వెం. రమేష్ కి గానీ, ఇటు బాలగోపాల్ కి గానీ, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం కాదు కదా, కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు రచయిత. పైగా, నవల 'టోన్' వ్యంగ్యం కావడం వల్ల, ఈ రెండు పాత్రలూ చేసే కృషి మొత్తం వ్యంగ్యంగా ధ్వనించడం మరో విషాదం. 

నరేంద్ర గత రచనలతో పోల్చినప్పుడు ఈ నవలకి చదివించే గుణం తక్కువ. కథానాయకుడు వెతుకుతున్నది ఏమిటో పాఠకులకి మొదటి అధ్యాయంలోనే తెలిసిపోవడం, ఒక పాత్ర పేరు చూడగానే ఆ పాత్ర మంచిదో, చెడ్డదో అర్ధమైపోవడం, ముందుకు సాగడంతో పాఠకులకి ఎదురయ్యే ప్రధాన ఇబ్బందులు. అనేక పాత్రల దృష్టి కోణం నుంచి కథ చెప్పించడం అనే ప్రయోగం గత నవలలో కొత్తగా అనిపించింది కానీ, ఇప్పుడు బరువుగా అనిపించింది. సీరియస్ గా చర్చకి పెట్టాల్సిన విషయాలని కూడా వ్యంగ్యంగా చెప్పడం రసపోషణకి కాక, రసాభాసకే దారితీసింది చాలా చోట్ల. గడిచిన వందేళ్ల రాయలసీమ రాజకీయాలు, సాంఘిక, ఆర్ధిక పరిస్థితులు, సీమ ముఖచిత్రంలో వస్తున్న మార్పులు వీటన్నింటినీ చర్చకి పెట్టినా, రచయిత ఎంచుకున్న 'టోన్', పాత్రల డిజైనింగ్, కథని సూటిగా కాక తిప్పితిప్పి చెప్పడం లాంటి కారణాలకి ఈ నవల పాఠకుల నుంచి ఓపికని డిమాండ్ చేస్తుంది. 

('దాయాదుల తోట', అజు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 334, వెల రూ. 275) 

శనివారం, జులై 11, 2026

ఎస్. జానకి ...

వంశీ సినిమా 'సితార' ప్రారంభంలో సంగీత వాయిద్యాలు గోదారి నీళ్ళమీద తేలుతూ ఉండగా, నేపథ్యంలో సంగీతం వినిపిస్తూ ఉండగా టైటిల్స్ పడతాయి. ఆ వాయిద్యాలన్నీ నీళ్ల మీద తేలుతున్నట్టు కాక, నిప్పుల్లో పడుతున్న భావన కలిగింది, అభిమాన గాయని ఎస్. జానకి ఇక లేరన్న వార్త తెలియగానే. దశాబ్దాల అనుబంధం ఆ గొంతుతో. అతి కొద్దిపాటి పరిచయం ఆ వ్యక్తితో. ఆ గొంతు విన్న ప్రతిరోజూ, ఆ వ్యక్తి రూపం కళ్ళముందు కదలాడుతూ ఉంది కాసేపటి క్రితం వరకూ. ఇప్పుడిక ఒక శూన్యాన్ని ఊహించుకుంటూ ఆమె పాటలు వినాలి కాబోలు. ఆమె పాడిన అన్ని వేల పాటలనీ నేను వినలేదు. కొన్ని వందల పాటల్ని మాత్రమే విని ఉంటాను. వాటిలో కొన్ని పదుల పాటల్ని మాత్రం మళ్ళీ మళ్ళీ విన్నాను, వింటాను. 

జానకి గొంతు పట్ల నాలో కలిగి పెరిగిన మోహానికి ఒకే ఒక్క కారణం ఆ గొంతు పలికించే భావం.. ఎక్స్ ప్రెషన్.. అది మానవ మాత్రులకి అనితరసాధ్యం. ఆమె పాడిన ఏ పదిపాటలనైనా వరసగా విన్నవాళ్ళు ఎదురైనా వెంటనే గమనించే విషయం ఒక్కటే, ఆమె గంధర్వ గాయని అని. ఆమె గొంతు ఏ భావాన్నైనా అలవోకగా పలికించ గలదు. ఎక్కడ, ఏ భావాన్ని ఏ మోతాదులో పలికించాలి అన్నది ఆమెకి బహుశా సుకృతంగా కలిగిన జ్ఞానం. పాట సాహిత్యంలో ఒక్క పదంలోనే, లేదా ఒకే ఒక్క అక్షరంలోనో ఎక్స్ ప్రెషన్ ని తగు మోతాదులో కూరి వినిపించడం జానకికి వెన్నతో పెట్టిన విద్య. 'కీచుగొంతు గాయని' అనే విమర్శని తుత్తినియలు చేయడానికి ఆమెకి అక్కరకు వచ్చినది ఈ విద్యే. ఆ గొంతులో మాధుర్యం లేకపోలేదు, కానీ ఆమె పాటల్లో వినిపించే భావానిదే పైచేయి. 

'ఎందుకో చేరువై, దూరమౌతావు' అని జానకి గొంతులో వింటున్నప్పుడు, 'దూరమౌతావు' దగ్గరకి వచేసరికి తెలుగు తెలియని వాళ్లకి కూడా బెంగ అర్ధమవుతుంది. 'భేషజం చూపుతూ దోహదం చేయవూ..' అంటుంటే సాహిత్యం అర్ధమైన వాళ్ళకీ, కాని వాళ్ళకీ కూడా కవ్వింపు చెవిని తాకుతుంది. అర్ధమైన వాళ్ళకి గిలిగింత కలుగుతుంది, పాట విన్న ప్రతిసారీ. 'ఈ మంచు బొమ్మలొకటై' కళ్ళుమూసుకుని వింటుంటే మంచు బొమ్మలు కరిగి నీరయ్యే దృశ్యం కనిపించకుండా ఉంటుందా? జీవన వేణువులలో మోహన వినిపించకుండా ఉంటుందా?? ఆ గొంతే 'తప్పుడు కథల అప్పారావు జటకా ఎక్కు కోటిపల్లిలో' అంటూ బేరం చేయడం ఎలాగో కొంటెగా నేర్పిస్తుంది. 'అణువు అణువు ప్రణయ మధువు' వింటున్న తనువు శివధనువు కావాల్సిందే కదా. 'ఇవి ఏడడుగులా, వలపు మడుగులా' మడుగులు కట్టిన వలపు చెవుల్లోకి ప్రవహిస్తున్న భావన. 

Google Image

ప్రత్యేకంగా చెప్పాల్సింది సినిమాయేతర పాటల్ని గురించి. తన అక్క కొడుకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీత సారధ్యంలో అన్నమయ్య సంకీర్తనలు కొన్ని రికార్డులు ఇచ్చారు జానకి. వాటిలో నేను తరచూ వినే కీర్తన 'రాధా మాధవ రతిచరితం'. శృంగార ప్రధానమైన ఈ కీర్తనని చాలాసార్లు విన్న తర్వాత అర్ధం తెలుసుకున్నాను. అయితే, కీర్తనలో భావం మనసుకి పట్టేయడం వల్ల కావచ్చు, ఆ అర్ధం కొత్తగా తెలుకున్నట్టుగా కాక, తెలిసిన విషయాన్ని మళ్ళీ వింటున్నట్టుగా అనిపించింది. త్యాగరాజ కీర్తనల్లో 'నగుమోము..' రికార్డు నాకెంతో ఇష్టమైన జేసుదాస్ తో సహా ఎంతోమంది గాయకుల గొంతుల్లో అందుబాటులో వుంది. కానీ నేనెప్పుడూ వినేది జానకి పాడిన కీర్తనే. ఆమె గొంతులో 'గగనానికి ఇలకీ..' ఇప్పుడు విన్నా తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. 

'పాడుతా తీయగా' కార్యక్రమం మొదలైన కొత్త రోజులు. మిత్రుల ఇంట్లో టీవీలో వాళ్ళతో కలిసి ప్రోగ్రాం చూస్తున్నా. సెమీ ఫైనల్స్ అని జ్ఞాపకం. ఒకమ్మాయి చాలా బాగా పాడుతోంది. "ఈ అమ్మాయి సినిమాల్లో ప్రయత్నిస్తే మంచి గాయని అవుతుంది" ఆ ఇంట్లో పెద్దావిడ అన్నారు. "జానకికి రాంప్రసాద్ దొరికినట్టుగా, మంచి భర్త దొరికితే..." అనేసి ఆగిపోయాను. తెలియకుండానే లోపల్నుంచి వచ్చేసిన మాట అది. ఇప్పుడున్నన్ని వీడియో ఇంటర్యూలు అవీ అప్పటికి లేకపోయినా, భర్త నుంచి, అత్తమామల నుంచీ జానకికి దొరికిన ప్రోత్సాహం తెలుసు. ఆ ప్రోత్సాహం లేని కారణంగా ఇబ్బందులు పడ్డ గాయనుల కథలూ తెలుసు. అందుకే కాబోలు, ఆమె పాటకి గొప్ప సపోర్ట్ సిస్టమ్ నిలబడ్డ రాంప్రసాద్ గారంటే గొప్ప గౌరవం నాకు. వాళ్ళ ఏకైక సంతానం మురళీకృష్ణ, 'శ్రుతిలయలు' సినిమాలో నటించాడు. 

పాతికేళ్ళకి అటూ ఇటూగా ఒకనాడు జానకిని కలిసి కాసేపు మాట్లాడే అవకాశం దొరికింది, చాలా యాదృచ్చికంగా. ఆవేళ సాయంత్రం ఆవిడ పాట కచేరి, సన్మానం. కొడుకుతో కలిసి ఆమె ఓ హోటల్లో దిగారు. నిర్వాహకులు ఆమెని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తూ, కూడా నిలబడమన్నారు. అప్పటికి ఆమె ఫోటోలు చూడడమే. మధ్యతరగతి గృహిణిలా, ఇంకా చెప్పాలంటే దగ్గరి బంధువులా అనిపించారు. ఎక్కడ మొదలయ్యాయో గుర్తు లేదు కానీ, కబుర్లు ఎడతెగకుండా సాగిపోతున్నాయి. కొద్ది నిముషాలు గడిచేసరికి భగవంతుడు స్నేహితుడిగా మారిపోయిన భావన. ఆ గదిలో మా ఇద్దరి గొంతులే వినిపిస్తున్నాయి, ఒకటి సంగీతం, మరొకటి చప్పుడు. మిగిలిన వాళ్ళు శ్రోతలు. 

ఉన్నట్టుండి అపశృతి, "వాళ్ళని పంపుతావా?" విసుగు నింపుకున్న మురళీకృష్ణ గొంతు. ఆమె ఏకాలంలోనే తల్లీ, అతిధేయి కూడా అయ్యారు. "వస్తున్నాను నాన్నా" అని అక్కడా, "మీరు మద్రాసు రండి, మనం మాట్లాడుకుందాం" అని నాకూ ఒకే లాలనతో చెప్పారు. ఆ ఆహ్వానం చెవుల్లో మారుమోగుతూనే వుంది, ఇప్పటికీ. కొడుకు ప్రభావం ఆమె మీద చాలానే వుంది. కేవలం అతని పట్టుదల వల్లనే ఆమె  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాన్ని తిరస్కరించారని వినిపించిన వార్తలు నిజమే అయి ఉంటాయని నా నమ్మకం. 'భారత రత్న' కి ఆమె అర్హురాలని అతనికి మాత్రమే కాదు, అభిమానుల అందరికీ నమ్మకం. పురస్కార ప్రదాతలకి ఆ నమ్మకం కలగాల్సివుంది. ఇప్పుడు ఆమె లేదు, కానీ ఆమె పాటలు నిలిచి వుంటాయి, కనీసం కొన్ని తరాల పాటు.