గురువారం, జూన్ 02, 2016

రెండేళ్ళు.. రెండు రాష్ట్రాలు..

తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఆవిర్భావ దినోత్సవం సంబరంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అరవయ్యేళ్ళ కల, చేసిన పోరాటాలు, తగిలిన ఎదురుదెబ్బలు, వెన్నుపోట్లు అన్నీ దాటుకుని, పట్టు వదలకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుని రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సత్రాజిత్తు దగ్గర 'శమంతకమణి' లాగా నిత్యం ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ నగరం కారణంగా ఆర్ధిక ఇబ్బందులు లేవు కొత్త రాష్ట్రానికి. రెండేళ్ళక్రితం కొందరు మిత్రులు 'పాలనానుభావం లేని ముఖ్యమంత్రి' అంటూ కె. చంద్రశేఖర రావుని గురించి సందేహాలు వెలిబుచ్చారు. పాలన పగ్గాలందుకున్న రెండేళ్ళ తర్వాత కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడాన్ని పదేపదే నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్.

అసలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎందుకు మొదలయ్యింది? దీనికి జవాబు వెనుకబాటు తనం. వనరులు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అభివృద్ధి జరగకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోవిధంగా అభివృద్ధి జరిగే అవకాశం ఏమాత్రం లేదని గ్రామీణ తెలంగాణా బలంగా నమ్మింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలని మినహాయిస్తే, మిగిలిన జిల్లాల పరిస్థిత దారుణం. బీటలు తీసిన నేలలు, ఎక్కడా కానరాని పరిశ్రమలు, ఉపాధి కావాలంటే వలస తప్ప మరో దారి లేదు. ఇది పదిహేనేళ్ళ క్రితం నేను చూసిన తెలంగాణా గ్రామాల పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం మీద అక్కడి ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యక్షంగా చూసిందీ అప్పుడే.

కొత్త రాష్ట్రం వచ్చింది మొదలు నిత్యం అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకి కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులూ వస్తున్నాయి. మిగిలిన ఏడు జిల్లాల పరిస్థితి ఏమిటి? మరీ ముఖ్యంగా గ్రామీణ తెలంగాణాలో పరిస్థితులు ఏమన్నా మెరుగు పడ్డాయా? మిత్రులు చెప్పిన ప్రకారం వ్యవసాయ రంగ పరిస్థితులు ఇంకా మెరుగు పడలేదు. సాగునీటి సమస్య ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఉపాధి చూపించాల్సిన అవసరమూ ఉంది. పించను పథకాలూ, ఉపాధి హామీ కొంత మేరకి గ్రామీణ ప్రజల్ని ఆదుకుంటున్నాయని సమాచారం. గ్రామీణ తెలంగాణా మీద దృష్టి సారించి, అభివృద్ధిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని గురించి కేసీఆర్ కి ప్రత్యేకంగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు.


ఇక, బలవంతంగా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రెండేళ్ళ తర్వాత కూడా 'అడ్డగోలుగా విభజించారు' అన్న ఆక్రోశాన్ని వెళ్లగక్కే దగ్గరే ఉంది. రెండేళ్లుగా పాడుతున్న ఈ పాటలో ఎలాంటి మార్పూ లేదు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఈ రెండు ప్రకటనలూ వచ్చి కూడా రెండేళ్ళు పూర్తయ్యింది. ఏ పని జరగడానికైనా కావాల్సిన ప్రధాన వనరు విత్తం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దగ్గర లేనిదీ అదే. కేంద్రం దగ్గర ఎన్నిసార్లు చెయ్యి చాపినా, అయితే మొండిచెయ్యి, లేదంటే కాస్తో కూస్తో విదిలింపులు. జరిగే ఖర్చులకీ, వస్తున్న ఆదాయానికీ లంగరు కుదరడం లేదు. పోనీ, ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అంటే, అది జరిగే పని కాదు. ఇన్నాళ్ళుగా అలవాటైపోయిన సౌకర్యాలు.. వేటిని వదులుకోవడం కుదురుతుంది?

పన్నులు, చార్జీలు ఎన్నిసార్లు పెంచినా, రుణమాఫీ హామీలని మర్చిపోయినా ప్రజలు కిమ్మనకుండా సహకరిస్తున్నారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిని వాడుకునే హక్కు ఉన్నప్పటికీ, రాజకీయ కారణాల వల్ల వీలైనంత త్వరగా సొంత కుంపటి పెట్టేసుకోవాల్సిన పరిస్థితి. అలా అని, అదేమన్నా చిన్న పనా? ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, అది కూడా డబ్బొచ్చే దారేదీ ఇదమిద్దంగా తెలియకుండా, జరిగిపోవాలంటే మాటలతో అయ్యే పని కాదు. అన్నిటికన్నా ముందు, తప్పొప్పులు అడిగేవాళ్ళు లేకుండా చేసుకోవాలి కదా. ఆ పని మాత్రం ఆఘమేఘాల మీద జరిగిపోతోంది. మిగిలినవి వరుసలో జరుగుతాయి. బోల్డంత అనుభవం, కష్టపడే స్వభావం ఉన్న నేతలు ఉన్నారు కాబట్టి ఏమీ పర్వాలేదు. పరిశ్రమల అభివృద్ధికి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు కాగితాల మీద వచ్చేసి ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్ర ప్రజలు అవతరణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకి నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలచేత ప్రమాణం చేయించింది ప్రభుత్వం. ఈ మధ్యలో 2022 నాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగానూ, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగానూ మార్చవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, లంచగొండితనం లాంటి చిన్న చిన్న సమస్యలని మర్చిపోయి ఈ పెద్ద లక్ష్యాలని సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకం కావాల్సి ఉంది. 'అడ్డగోలు విభజన' కి గురయిన వాళ్ళకీ, రాజకీయ కుట్ర'లకి బలయిన వాళ్ళకీ అంతకన్నా ప్రత్యామ్నాయం ఏముంటుంది మరి?

5 కామెంట్‌లు:

  1. ఆకలి,పేదరికం,నిరుద్యోగంలాంటివి ఆంద్రాలో కనిపించవు కనుకనే ఆంధ్రా వారికొక పెద్ద లక్ష్యం ఏర్పడింది.ఈ లక్ష్యం సాధించడానికేగదండీ అందరం ఏకమయి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకువచ్చారు. లక్ష్యం అంటేనే లక్ష అవరోధాలుంటాయి,నిదానంగా దాటేద్దాం !

    రిప్లయితొలగించండి
  2. రెండన రాష్ట్రాలు !

    రెండన పోటీ !

    రెండన తారీఫు !

    వచ్చెనుగ తెలంగాణా !
    తెచ్చెను స్ఫూర్తిని ! జిలేబి తీక్ష్ణత పెరిగెన్ !
    మెచ్చుదురు, తెలుగు వారలు
    నెచ్చెలి, విను,దేశమునకు నెమలీకయనన్ !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. @నీహారిక: నిజమేనండీ, కనిపించవు.. ఒకవేళ కనిపించినా ప్రజలు త్యాగాలు చేస్తూ ఆ ప్రకారంగా ముందుకి పోవాల్సిందే.. అభివృద్ధి ఊరికే వచ్చేస్తుందామరి.. ..ధన్యవాదాలు..
    @జిలేబి: :))
    ...ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికి పట్టుదలా లేదు.
    ముఖ్యమంత్రికి మంత్రులమీద పట్టూ లేదు.
    ప్రజల్లో మన రాష్ట్రం అన్న భావనా లేదు.
    మొదటేడు హుద్ హుద్ వచ్చింది. కొన్నాళ్ళపాటు ముఖ్యమంత్రికి సాకు చూపించింది.
    తరువాత ఏడు గోదావరి పుష్కరాలు. పదమూడు జిల్లాలలోని పాలనా స్తంబింపజేసి పుష్కరాలు నిర్వహించి, సాధారణ పాలనని అటకెక్కించారు.
    నిజాణికి ప్రభుత్వం ఇంతలా ఊదరగొట్టకపోతే రాజమండ్రి సామర్ధ్యాణికి మించిన పుష్కర యాత్రీకులు వచ్చే వారు కాదు. జాతీయ రహదారులు గంటలపాటు జామయ్యేవి కాదు.

    ఇదిలా ఉండగా, కొంతమంది మంత్రులు నెలల తరబడి తమశాఖల ఫైళ్ళు చూడట్లేదు. వాళ్ళని నియంత్రించే శక్తి ముఖ్యమంత్రికి లేదు.

    2003 లో చంద్రబాబుకు మంత్రి వర్గం మీద ఉన్న పట్టులో ఇప్పటీ చంద్రబాబుకి పదిశాతం పట్టు ఐనా ఉందా?

    75 కోట్ల రూపాయల రైలు తగలబడి, వేయికి పైగా ప్రయాణీకులు రోజంతా ఉస్సురుమని పడిగాపులు పడితే దోషులుగా దొరికిన పదమూడుమందినీ జైల్లో ఉంచే దమ్ములేని ప్రభుత్వం.

    చూడబోతే, మరో మూడేళ్ళలోపల కొత్తరాజధాణి పేరుతో విడూదలయ్యే నిధులకోసం కాసుక్కూర్చున్న వాళ్ళ దయా దాక్షిణ్యాళమీద అధికారాంలోకొచ్చినట్టుంది ఈ ప్రభుత్వం.

    రిప్లయితొలగించండి
  5. రవికుమార్ మూలా: ఇప్పుడనే కాదండీ, ప్రజాస్వామ్య పరిరక్షణగా పిలవబడిన వెన్నుపోటు నాటినుంచి, ఇప్పటివరకూ ఈ తరహా విమర్శలు ఏం వచ్చినా, గౌరవ ముఖ్యమంత్రి గారి అభిమానుల దగ్గర రెండు రెడీమేడ్ జవాబులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి.
    మొదటిది: మాన్య ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం రోజూ ఇరవై రెండు గంటలు కష్టపడుతున్నారు కానీ (ఇప్పుడు మనవడితో కూడా ఆదుకోకుండా), మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఆయనతో కలిసిరావడం లేదు. ఆయన పడే శ్రమలో వాళ్ళు మూడో వంతు శ్రమించినా రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోతుంది.
    రెండోది: గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తుంటే దుష్ట ప్రతిపక్షం (నాడు కాంగ్రెస్, నేడు వైఎస్సార్ కాంగ్రెస్) అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటోంది (నిజానికి అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రతిపక్షం బలం నామమాత్రమే - తీర్మానాలపై ఓటింగ్ పరంగా).
    ఈ రెండూ కాకుండా కొత్త జవాబులు ఏమన్నా వినిపిస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి