మూడు రూపాయల డెబ్భై ఐదు పైసలు. ఏమిటీ మొత్తం అని
కదూ సందేహం? తెలుగు సినిమా పరిశ్రమ గత సంవత్సరం చెల్లించవలసిన ప్రతి
వందరూపాయల ఆదాయపు పన్నులోనూ ఇప్పటివరకూ చెల్లించిన మొత్తం. చెల్లించాల్సిన
బకాయి అక్షరాలా నూటికి తొంభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలు! ఓ పక్క హీరోలు
వాళ్ళ వాళ్ళ సినిమాలు వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించాయని తొడకొట్టి
మీసాలు మెలేస్తూ, మరోపక్క వారి వారి అభిమానులు టీవీ కెమెరాల సాక్షిగా
చొక్కాలు చింపుకుంటున్న తరుణంలో, పన్నుల వసూళ్లు ఇంతగా మందగించడం
ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
కొందరు కొన్ని పనులు చేస్తే
చూడ్డానికి ఏమాత్రం బావుండదు. సినిమా వాళ్ళు 'బీద కబుర్లు చెప్పడం' అలాంటి
వాటిలో ఒకటి. ఇక్కడ 'సినిమా వాళ్ళు' అంటే పెద్ద పెద్ద స్టార్లు, బడా స్టార్
నిర్మాతలు, ఓవర్ స్టార్ దర్శకులే తప్ప రెండో పూట పని దొరుకుతుందో, దొరకదో
అని నిత్యం భయపడే జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతమాత్రమూ కాదు.
సినిమా వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా, ఆదాయపు పన్ను
శాఖ వాళ్ళు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన 'అవగాహన' కార్యక్రమంలో పాల్గొన్న
తెలుగు సినిమా పెద్దలు, పరిశ్రమ ఎన్ని కష్టాల్లో ఉందో కన్నీళ్ళే తక్కువగా వర్ణించి చెప్పారు.
సినిమా
వాళ్ళ ఆదాయ వ్యయాలు ఒకప్పుడు గుట్టుగా ఉండేవేమో కానీ, ఈ ప్రచార యుగంలో
అన్ని విషయాలతో పాటే అవీ బహిరంగ రహస్యాలు అయిపోయాయి. దీనికి తోడు, విడుదలైన
రెండో రోజు నుంచే సినిమా ఎంతగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో స్వయంగా
నిర్మాతలే ప్రకటిస్తున్నారు కూడా. ఒక్కో సినిమాకీ వాళ్ళ అభిమాన నాయికా
నాయకులు పారితోషికాలు ఎంతగా పెరిగాయన్న లెక్కలు ప్రతి అభిమానికీ నాలుక చివర
ఉండనే ఉంటాయి ఒకవేళ విధి వక్రించి సినిమా ఆడకపోయినా పారితోషికాలు ఆసరికే
అందేసి ఉంటాయికాబట్టి నిర్మాత మినహా మిగిలిన ఎవరికీ ఇబ్బంది లేదు.
చాలామంది
నిర్మాతలు షూటింగ్ అవుతూ ఉండగానే శాటిలైట్ తో సహా అన్ని హక్కులూ
అమ్మేస్తున్నారు కాబట్టి, సినిమా సరిగా ఆడని పక్షంలో ఆశించిన మేరకి లాభాలు
రాకపోవచ్చేమో తప్పించి, నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం లేదు. మరి, వీళ్ళెవరూ
ఆదాయం పన్ను ఎందుకు కట్టడం లేదు? మామూలు ఉద్యోగుల దగ్గర ముందస్తు ఆదాయం
పన్ను మినహాయించుకుని తప్ప జీతాలు చెల్లించని, చెల్లించనివ్వని ప్రభుత్వం,
పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళ విషయంలో చూసీ చూడనట్టుగా ఎందుకు వదిలేస్తోంది?
'అవగాహన
సదస్సు' లో పాల్గొన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు "తెలుగు చలనచిత్ర
పరిశ్రమలో ఆదాయపు పన్ను చెల్లింపులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి" అన్నారని
పేపరు వార్త. వారి లెక్కల ప్రకారం గతేడాది మొత్తం వసూలు కావాల్సిన పన్ను
రెండువేల కోట్లు కాగా, వసూలైన మొత్తం కేవలం డెబ్భై ఐదు కోట్లు! గౌరవ
పార్లమెంట్ సభ్యులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్
"గ్యారంటీ లేనివే సినిమా వాళ్ళ బ్రతుకులు" అన్నారట. అక్కడికేదో మిగిలిన
సమస్త జీవకోటి జీవితాలకీ గ్యారంటీ ఉన్నట్టు. సినిమా పరిశ్రమని ప్రత్యేక
విభాగంగా పరిగణించి పన్నులు వసూలు చేయాలన్నది వీరి సూచన.
ఇక
కేంద్ర బొగ్గు శాఖ గౌరవ మాజీ సహాయ మంత్రి, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు
సినిమా రంగం పరిశ్రమే కాదని కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం పరిశ్రమగా
గుర్తించిందే తప్ప, వసతులు సమకూర్చలేదని ఆవేదన చెందారు. (స్టూడియోలకి భూముల
కేటాయింపు మొదలు, స్థానికంగా షూటింగ్ చేస్తే పన్ను మినహాయింపు వరకూ
ప్రభుత్వం చేసినవేవీ వీరు పరిగణించినట్టు లేరు). "సినిమా వాళ్ళ జీవితాలు
బీడీ కార్మికుల కన్నా దుర్భరంగా ఉన్నాయి" అని దాసరి అన్నారంటే, ఆయన ఎంత
బాధలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. (బీడీ కార్మికులు పెద్ద పెద్ద సినిమా
వాళ్ళలా విలాసంగా జీవిస్తున్నారని అపార్ధం కూడదు).
కేంద్ర
ప్రభుత్వం సినిమా వాళ్లకి 'పద్మ' అవార్డులు ప్రకటించేప్పుడు వాళ్ళ ఆదాయపు
పన్ను చెల్లింపులని పరిశీలిస్తుందనీ, కొన్నేళ్ళ పాటు పన్ను సక్రమంగా
చెల్లించని కారణంగానే ఓ ప్రముఖ నటుడికి 'పద్మ' అవార్డు ఆలస్యంగా వచ్చిందనీ
ఫిలింనగర్లో ఒకానొక టాక్. ఒకవేళ అలాంటి నిబంధన ఏదీ లేకపోతే వెంటనే ప్రవేశ
పెట్టాలి. అనుమతుల మొదలు అవార్డుల వరకూ ఐటీ రిటర్న్స్ కాపీ జత చేయడాన్ని
తప్పనిసరి చేయాలి. మరీ ముఖ్యంగా, ఆదాయపు పన్ను బకాయిల వివరాలు
ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు
'లోపాయకారీ ఇచ్చి పుచ్చుకోడాలకి' దూరంగా ఉండాలి. ఇవన్నీ జరిగే పనులేనా?
ఇటువంటి వాటినే సినేమా కష్టాలు అంటారు.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: అవునండీ అవును :) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిఇలాంటివి చదివి మనం నవ్వుకుంటాం చూడండి, అదీ, "ఏడవలేక నవ్వడం" అంటే !
రిప్లయితొలగించండిశారద
@శారద: అంతేనండీ.. ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి