సంస్కృత నాటకం అనగానే మొదట గుర్తొచ్చే పేరు మహాకవి కాళిదాసు. "ఉపమా కాళిదాసస్య.." అని ఆర్యోక్తి. ఉపమానాలు వాడడంలో కాళిదాసు తర్వాతే ఎవరైనా అని భావం. ఉపమానాలు మాత్రమే కాదు, పాత్రలని తీర్చి దిద్దడంలోనూ, ప్రకృతి వర్ణనలోనూ, కథని తీరుగా నడిపించడంలోనూ కాళిదాసుది ప్రత్యేకమైన బాణీ. ఈ మహాకవి రాసిన మూడు ప్రసిద్ధ నాటకాలని పరిచయం చేస్తూ పీకాక్ క్లాసిక్స్ వెలువరించిన చిరు పొత్తం 'కాళిదాసు మూడు నాటకాలు.'
'మాళవికాగ్నిమిత్రం,' 'విక్రమోర్వశీయం,' 'అభిజ్ఞాన శాకుంతలం' ఈ మూడూ కాళిదాసు పేరు చెప్పగానే గుర్తొచ్చే నాటకాలు. వీటిని తెలుగులో సంక్షిప్తీకరించారు దోనెపూడి రామాంజనేయ శర్మ. మూడూ వేటికవే ప్రత్యేకమైన నాటకాలు. మూడింటి పరిచయాలూ ఒకేసారి చదివినప్పుడు నాకు వీటిలో కనిపించిన సామ్యం 'విరహం.' మాళవిక మీద మనసుపడ్డ అగ్నిమిత్రుడూ, ఊర్వశిచేత మోహితుడైన పురూరవుడూ, తొలిపరిచయం తర్వాత శకుంతలా, దుష్యంతుడూ అనుభవించిన విరహాన్ని కాళిదాసు వర్ణించిన తీరు అమోఘం.
నర్తకి మాళవిక చిత్తరువుని చూసిన మహారాజు అగ్నిమిత్రుడు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తన స్నేహితుడైన విదూషకుడికి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. రాజు విరహం చూడలేని విదూషకుడు, నాట్య గురువులిరువురి మధ్య స్పర్ధ కలిగించి, రాజు ఎదుట మాళవిక నాట్య ప్రదర్శన ఏర్పాటు జరిగేలా చేస్తాడు. మాళవిక సైతం అగ్నిమిత్రుడితో తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది. వారిరువురి ప్రణయం, వివాహానికి ఎలా దారి తీసిందన్నదే 'మాళవికాగ్నిమిత్రం'నాటకం ముగింపు.
స్వర్గాధిపతిదేవేంద్రుడి స్నేహితుడు పురూరవుడు. ఓ ప్రమాదం నుంచి దేవ నర్తకి ఊర్వశిని రక్షించిన ఆ రాజు, ఆమెతో ప్రేమలో పడతాడు. రాజు భుజ బలాన్నీ, శౌర్యాన్నీ, సాయం చేసే గుణాన్నీ దగ్గరనుంచి చూసిన ఊర్వశి సైతం అతనితో ప్రేమలో పడుతుంది. ఊర్వశి ప్రేమని ఆమోదిస్తాడు దేవేంద్రుడు. మరోవంక, అంతఃపురంలో రాణులు సైతం పురూరవుడు తన వాంఛ నెరవేర్చుకోడానికి అనుమతి ఇస్తారు. రాజ్యానికి దూరంగా పర్వత సానువుల్లో, చెట్టూ చేమల్లో ప్రణయ కలాపంలో మునిగి తేలిన ఊర్వశీ పురూరవులకి అనుకోకుండా విరహం సంభవిస్తుంది. వారి పునస్సమాగమం ఎలా జరిగిందన్నదే 'విక్రమోర్వశీయం' నాటక కథ.
'అభిజ్ఞాన శాకుంతలం' కథ రేఖామాత్రంగానైనా తెలియని భారతీయులు తక్కువ. భరతుడి పేరిట ఏర్పడ్డ భరత ఖండ వాసులు కదా మరి. ఆ భరతుడి తల్లిదండ్రులు శకుంతలా, దుష్యంతులు. కణ్వ మహర్షి ఆశ్రమం సాక్షిగా మొదలైన వారి ప్రేమ కథ ఎన్నెన్ని మలుపులు తిరిగిందో కాళిదాసు కలం నుంచే తెలుసుకోవాలి. మరీముఖ్యంగా, తొలి పరిచయం తర్వాత అటు శకుంతల, ఇటు దుష్యంతుడు అనుభవించిన విరహాన్ని ఉపమాన సహితంగా వర్ణించారు కాళిదాసు.
పుస్తకం విషయానికి వస్తే, 'మాళవికాగ్నిమిత్రం' ప్రారంభంలో కించిత్ ఇబ్బంది అనిపించినా, రానురానూ చకచకా సాగిపోయింది. అనువాదం అత్యంత సరళంగా సాగింది. 'విక్రమోర్వశీయం' లో ముని శాపానికి ఊర్వశి పూలతీగెగా మారిపోయిన సంగతి తెలియని పురూరవుడు, ఆమెకోసం అనుభవించిన విరహబాధ, చెట్టునీ, పుట్టనీ, పామునీ, పురుగునీ సైతం వదలకుండా ఆమె ఆచూకీ అడిగిన వైనం చదువుతుంటే ఆలస్యం చేయకుండా సంస్కృతం నేర్చేసుకుని, మూల గ్రంథం చదివేయాలన్న కోరిక బలపడింది.
ఇదివరకు వసంతసేన గురించి చదివినప్పుడు, మరీముఖ్యంగా 'కన్యాశుల్కం' నాయిక మధురవాణి కి వసంతసేనే స్ఫూర్తి అని గుర్తొచ్చినప్పుడు, 'మృచ్ఛకటికమ్' నాటకాన్ని ఇంగ్లిష్ లో చదివాను నేను. అప్పటికన్నా, ఈ క్లుప్తీకరించిన తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు కథలో బాగా లీనం కాగలిగాను. ఈ పుస్తకం తేవడంలో ఉద్దేశ్యం, కాళిదాసు మూడు నాటకాలని పరిచయం చేయడమే కాబట్టి, ఆ ఉద్దేశ్యం నూరు శాతం నెరవేరిందనే చెప్పాలి. (పేజీలు 173, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)
మంచి పరిచయం మురళి గారూ, ధన్యవాదాలు. ఈ కాళిదాస కావ్య మకరందం ఓ చుక్క చప్పరించి ఊరుకోవడం అసాధ్యం సుమండీ..! మీరు త్వరలో సంస్కృతం నేర్చుకోవాలని, మరిన్ని మంచి విషయాలు చదివి మాతో పంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :)
రిప్లయితొలగించండి'మాళవికాగ్నిమిత్రం' ప్రారంభంలో కించిత్ ఇబ్బంది అనిపించినా -- ఇబ్బంది భాష విషయంలోనా అండీ?
రిప్లయితొలగించండిమూడింటిలో ఈ మాళవికాగ్నిమిత్రం నాకు కొత్త.. మీ పరిచయం ఎప్పట్లానే 'ఎప్పుడెప్పుడు పుస్తకాన్ని చదువుదామా' అనిపించేలా ఉంది! :-)
ఈ మధ్యనే నేనూ కాళిదాసు కవ్యాలపై పరిచయ వాక్యాలున్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను..
@కొత్తావకాయ: "ఆరంభింపరు నీచ మానవుల్.." గుర్తు చేసుకుని ఎప్పుడో మొదలు పెట్టేస్తానండీ... నాకూ ఎప్పుడెప్పుడా అనే ఉంది.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@నిషిగంధ: భాష ఒక్కటే కాదండీ... కొంచం ఎక్కువగా ఉన్న పాత్రలు, మరీ దగ్గరగా అనిపించే పేర్లు.. వీటివల్ల కించిత్ ఇబ్బంది.. కథలో పడే వరకే లెండి.. ధన్యవాదాలు..