జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళూ, తమకి ఏం కావాలో
స్పష్టంగా తెలిసిన వాళ్ళూ కొందరే ఉంటారు. వాళ్ళలో కూడా, కావలసినదాన్ని
సాధించుకునే చొరవా, తెగువా ఉన్నవాళ్ళు తక్కువే. ఈ లక్షణాలన్నీ ఓ అమ్మాయికి
ఉంటే, ఆమె 'స్రవంతి' అవుతుంది. జీవితం పూలపానుపు కాదు స్రవంతికి. వయసులో బాగా
పెద్దవాడూ, తనని నిర్లక్ష్యం చేసినవాడూ అయిన భర్త. ఐదుగురు స్త్రీలతో
సంబంధం పెట్టుకున్న అతగాడు, ఓ రాత్రివేళ హత్యకి గురవుతాడు. శవాన్ని
గుర్తించడమే కష్టమవుతుంది పోలీసులకి.
భర్త మరణం ఇరవై ఏడేళ్ళ స్రవంతికి స్వేచ్చని
ఇస్తుంది. సౌకర్యంగా బతకడానికి అవసరమైన డబ్బునీ ఇస్తుంది. అయితే, ఓ వయసులో
ఉన్న స్త్రీకి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇవి మాత్రమే సరిపోతాయా?
తనకి చాలవని స్పష్టంగా తెలుసు స్రవంతికి. కావలసినవి ఏమిటో కూడా తెలుసు.
భర్త సంవత్సరీకం రోజున దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్ళిన స్రవంతికి
కనిపిస్తాడు శ్రీనివాస్. తను ఉంటున్న హైదరాబాద్ లోనే ఉంటూ, అంతకు మునుపే
కొద్దిపాటి పరిచయమైన శ్రీనివాస్ తో అనుబంధం పెంచుకోవాలని
నిర్ణయించుకుంటుంది ఆమె.
స్వతహాగా తెలివైన అమ్మాయి స్రవంతి. తొందరపడి నిర్ణయం తీసుకోదు. ఒకసారి తీసుకున్నాక, వెనక్కి తగ్గదు. అనుకున్నది సాధించుకోవడం ఎలాగో ఆమెకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే ముప్ఫై నాలుగేళ్ల శ్రీనివాస్ కి భార్య ఇందిర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందిరతో సఖ్యంగానే ఉంటున్న శ్రీనివాస్ దృష్టిలో మరో స్త్రీ లేదు. జీవితం సంతోషంగానే ఉంది అతనికి. ఓ మొక్కు తీర్చుకోడానికి ఒంటరిగా తిరుపతి వెళ్ళిన శ్రీనివాస్ పక్క కాటేజీలోనే తనూ గది తీసుకుంటుంది స్రవంతి. ఓ రాత్రివేళ అతనికి దగ్గరవుతుంది. శ్రీనివాస్ దృష్టిలో ఆ పరిచయం ఆ రాత్రికే పరిమితం.. కానీ స్రవంతి ఆలోచన వేరు. ఆమెకి అతను కావాలి.
హైదరాబాద్ తిరిగి వచ్చాక కూడా, స్రవంతితో అనుబంధం కొనసాగుతుంది శ్రీనివాస్ కి. స్రవంతి చొరవే ఇందుకు కారణం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్రవంతి, ఒంటరిగా ఉంటోంది ఓ అపార్ట్ మెంట్లో. ఆ ఇంటి డూప్లికేట్ తాళం చెవి శ్రీనివాస్ కి ఇస్తుంది, అతను ఏ వేళలో అన్నా ఆమె ఇంటికి రాడానికి వీలుగా. అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టనవసరం లేకుండా. తన జీవితంలో అతను తప్ప మరో మగాడు లేడని చెప్పకనే చెబుతుందామె. పూర్తిగా మధ్యతరగతి మనస్తత్వం శ్రీనివాస్ ది. ఏ ఖర్చూ లేకుండా దొరికే శారీరక సౌఖ్యం సంతోష పెడుతుంది అతన్ని. అంతకు మించి, ఇందిరకి అన్యాయం చేస్తున్నానన్న భావన నిలువనివ్వదు. ఇంట్లో ఉన్నంతసేపూ భార్యని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ, ఆ లోటుని భర్తీ చేసుకుంటున్నట్టుగా భావించుకుని తృప్తి పడుతూ ఉంటాడతను.
స్రవంతికి తెలుసు, ఇందిర విషయంలో శ్రీనివాస్ మానసిక సంఘర్షణ. కానీ, ఆమెకి శ్రీనివాస్ కావాలి. శ్రీనివాస్ మాత్రమే కావాలి. ఎందుకంటే, అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది ఆమె. మొదట్లో కేవలం శారీరక సుఖం కోసమే స్రవంతి ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ కి ఆమెతో ప్రేమలో పడడానికి, మానసిక అనుబంధం ధృడ పడడానికీ ఎక్కువ సమయం పట్టదు. పట్టనివ్వదు స్రవంతి. అతని సమక్షంలో అతనికి నచ్చే మాటలే మాట్లాడుతుంది, ఇష్టమైన పనులే చేస్తుంది. అతనిలో ఉన్న బద్ధకాన్నీ, చిన్న చిన్న చెడు అలవాట్లనీ వదిలిస్తుంది. మొత్తంగా, అతని జీవితం మీద తనదైన ముద్ర వేస్తుంది స్రవంతి. అయినప్పటికీ, అతని విషయంలో ఆమెలో ఏదో అభద్రత.
స్రవంతి భయపడినట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి, ఆమెకి దూరంగా జరగాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు శ్రీనివాస్. దూరం ఊరికి బదిలీ కోరతాడు కూడా. ఆమె ఇంటికి వెళ్ళకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నించి, కొంత మేరకు విజయం సాధిస్తాడు. కానీ, అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్న స్రవంతి, అతన్ని దూరంగా ఉండనివ్వదు. తన నిర్ణయాన్ని ఆమెకి చెప్పేసి, విడిపోవడం కోసం ఆమె ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ ని, ఆ నిర్ణయాన్ని కేవలం రెండు నెలలు వాయిదా వెయ్యమని కోరుతుంది స్రవంతి. అయితే, ఆ రెండు నెలల కన్నా ముందే ఆశ్చర్యకరంగా అతని జీవితం నుంచి తప్పుకుంటుంది ఆమె.
జీవితంలో మనకి ఎదురయ్యే అందరినీ తప్పొప్పుల తూకంలో వేయలేం. ఎందుకంటే ఈ తప్పూ, ఒప్పూ అనేవి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటాయి. స్రవంతిని కూడా అంతే. తనకి కావల్సిందేమిటో తెలిసిన స్రవంతి, దానిని సాధించుకునే ఓర్పూ, నేర్పూ ఉన్న స్రవంతి... అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. శ్రీనివాస్ సంఘర్షణని అర్ధం చేసుకుని అతన్ని ఊరడించినది. అతన్ని కేవలం తన అవసరం తీర్చుకునే సాధనంగా కాక, తనవాడిగా ప్రేమించింది. జీవితాన్ని ఎంత బాగా గడపొచ్చో అతనికి నేర్పించింది. అతని ఎదురుగా తను లేకపోయినా, అతని ఆలోచనలలో ఎప్పటికీ ఉండిపోయేలాంటి అనుభవాలనీ, అనుభూతులనీ పంచింది.
"భగవంతుడు వజ్రానికుండే కాఠిన్యాన్ని, పులికుండే క్రూరత్వాన్ని, గుంటనక్కకుండే జిత్తులమారి తనాన్ని, మేఘానికుండే కన్నీటిని, గాలికి ఉండే చలనాన్ని, తేనెకుండే తీయదనాన్ని, ఉదయపుటెండకుండే వెచ్చదనాన్ని, పక్షి ఈకకుండే మృదుత్వాన్ని, లేడిపిల్లకుండే చురుకుదనాన్ని, పురివిప్పి ఆడే నెమలికుండే ఆకర్షణని, కుందేలుకుండే భయాన్ని తీసుకున్నాడు. వాటికి సామర్ధ్యాన్ని కలిపి, ఆ మొత్తాన్ని బాగా రంగరించి, ఆ మిశ్రమం లోంచి ఒక యువతిని తయారు చేశాడు. ఆమెని మగవాడికి బహుమతిగా ఇచ్చాడు." స్రవంతిని గురించి ఆమె సృష్టికర్త, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన పరిచయం ఇది. 'స్రవంతి' నవల చదువుతున్నప్పుడో, లేక చదివి పక్కన పెట్టాకో "ఇలాంటి స్త్రీ పరిచయం అయితే బాగుండు" అని కనీసం ఒక్క క్షణమన్నా ప్రతి పాఠకుడూ అనుకుంటాడనడం అతిశయోక్తి కాదు.
('స్రవంతి' నవల ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా.. స్రవంతిని గురించి నాలుగు మాటలు రాయమని సూచించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు)
"జీవితంలో మనకి ఎదురయ్యే అందరినీ తప్పొప్పుల తూకంలో వేయలేం. ఎందుకంటే ఈ తప్పూ, ఒప్పూ అనేవి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటాయి. స్రవంతి కూడా అంతే."
రిప్లయితొలగించండిఇంతకంటే బాగా స్రవంతిని, ప్రత్యేక వ్యక్తిత్వాలున్న చాలా మంది వ్యక్తులనూ ఎవరూ అభివర్ణించలేరు. చాలా బావుంది సమీక్ష. అభినందనలు.
wow స్రవంతి ని గురించిన పరిచయం బావుందండి . నాకు చదివానో లేదో గుర్తు రావటం ఇంకొంచెం రాస్తే గుర్తు పట్టగలను అనుకుంటా :))
రిప్లయితొలగించండి"స్రవంతి" నచ్చిందండి. Thank you.
రిప్లయితొలగించండిwow!ఎప్పుడో చదివినా గుర్తుండి పోయిన నవల ఇది. థాంక్స్ ఫర్ రివ్యు.
రిప్లయితొలగించండిపెళ్ళాం పోయిన మగాడు ఎవరితో అయినా అక్రమసంబంధం పెట్టుకుంటే వాడు "కోరికలు అణచుకోలేని చిత్తకార్తె కుక్క, వ్యభిచారి"
రిప్లయితొలగించండిఅదే మొగుడుపోయిన స్త్రీ అక్రమసంబంధం పెట్టుకొని సంసారాలు నాశనం చేస్తుంటే "అవసరం, త్యాగం, వ్యక్తిత్వం .." అంటూ రచనలు!
ఈ రచయితలు మారరా మురళి గారు?
@కొత్తావకాయ: ఓ చిన్న పరిచయం.. అంతేనండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: మరికొంచం చెప్పడం అంటే, కథ మొత్తం చెప్పేయడం అవుతుందేమోనండీ :-) ..ధన్యవాదాలు.
@ఇండియన్ మినర్వా: ధన్యవాదాలండీ..
@jignaci: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@జీడిపప్పు: ఓ చిన్న వివరణ అండీ.. "పెళ్ళాం పోయిన మగాడు ఎవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే.." ..నా దృష్టిలో అది సంబంధం మాత్రమే, అక్రమ సంబంధం కాదు. ఒకవేళ, ఆటను సంబంధం పెట్టుకున్న స్త్రీ భర్తతో ఉంటున్నట్టయితే ఆమె పరంగా అది అక్రమ సంబంధం. ఇక్కడ నవలలో, స్రవంతి శ్రీనివాస్‌తో పెట్టుకున్నది సంబంధం మాత్రమే. కానీ, శ్రీనివాస్ ది అక్రమ సంబంధం. భార్య/భర్త జీవించి ఉండగానే, సంసారం చేస్తూ కూడా, వేరొకరితో సంబంధం పెట్టుకునే వారి విషయంలో మీ వ్యాఖ్య వర్తిస్తుందని అనుకుంటున్నాను.. ధన్యవాదాలు.
పరిచయం చాలా చక్కగా రాశారు మురళిగారు. తన భాగస్వామి తనని స్రవంతి అంత ఘాడంగా ప్రేమించాలని కోరుకోని మగాడు ఉండడేమో అనిపించింది చదివినపుడు. ఈనవల రచనాకాలం తెలుసా మీకు. నేను డెబ్బై/ఎనభైలలో రాశారేమో అనుకున్నాను. అప్పట్లోనే మల్లాది పాఠకులకు ఓకొత్తలోకాన్ని పరిచయం చేశారా అనిపించింది.
రిప్లయితొలగించండిఅయితే జీడిపప్పుగారికి మీరిచ్చిన వివరణను నేను పూర్తిగా అంగీకరించలేను. ఈకథలో స్రవంతిది సంబంధం మాత్రమే అనండి నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే కథాపరంగా ఈబంధం ఏర్పడడాకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణమయ్యాయి అలాగే ఈబంధం నుండి తనేం ఆశిస్తుందో తన హద్దులేమిటో స్పష్టంగా తెలిసిన పూర్తి మెచ్యూరిటీకలిగిన స్త్రీగా చిత్రించారు స్రవంతిని. అంతేకానీ తన పార్టనర్ లేనందువలనో తను సింగిల్ అవడం వలనో పార్టనర్ ఉన్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం అక్రమసంబంధం కాదంటే నేను ఒప్పుకోలేను. ఇద్దరిలో ఎవరు పార్టనర్ ని చీట్ చేసినా ఆవిషయం ఇద్దరికీ తెలిసినపుడు ఇద్దరిపరంగా కూడా అది అక్రమసంబంధమే.
అయితే మీరన్నట్లు తప్పొప్పులనేవి ఒకోసారి పరిస్థితులని బట్టి మారిపోతుంటాయి కనుక అదినిర్ణయించగలిగిన వాళ్ళం బయటివాళ్ళం కాదు.
స్రవంతి నవలా పరిచయం,కామెంట్స్.. రెండు కలిపి.. ఈ నవల ని తప్పక చదివితీరానే ఆసక్తి కల్గిస్తున్నాయి. ధన్యవాదములు మురళీ గారు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ఆలోచించాల్సిన విషయమండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@వనజ వనమాలి : నవల మిమ్మల్ని నిరాశ పరచదు వనజ గారూ.. ధన్యవాదాలు.