గురువారం, జూన్ 07, 2012

పెద్దాయనా... పెద్దాయనా...

మరో నాలుగు రోజుల్లో జరగబోతున్న ఉప ఎన్నికలకి, గతంలో ఏ ఉప ఎన్నికలకీ జరగనంత భారీగా ప్రచారం జరుగుతోంది. మొత్తం పద్ధెనిమిది  అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకి జరుగుతున్న ఉప ఎన్నికలో, ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానం మినహాయించి మిగిలిన అన్ని స్థానాలకీ ఎన్నిక రాడానికి కారణం యువజన, శ్రామిక, రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. అప్పటివరకూ కాంగ్రెస్ లో ఉన్నప్రజాప్రతినిధులు ఈ కొత్త పార్టీలోకి వచ్చి చేరడం ఈ ఎన్నికలకి ముఖ్య కారణం. ప్రధాన ప్రతిపక్ష పార్టీని (తెలుగుదేశం) మించిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఈ కొత్త పార్టీకి జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఈ ఎన్నికలని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అటు ముఖ్యమంత్రి కిరణ్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా, వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. ఇద్దరూ కలిసి కొత్తగాపుట్టిన పార్టీ మీదా, ఆ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడూ అయిన జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకున్నారు. కొత్త పార్టీ బలపడడం అన్నది ఇద్దరినీ ఇరుకున పెట్టే విషయమే. గడిచిన వారం పదిరోజుల్లో రాష్ట్రంలో జరిగిన ముఖ్య పరిణామాలు మంత్రి మోపిదేవి వెంకటరమణ మరియు జగన్మోహన్ రెడ్డిల అరెస్టు. నాయకులు, ప్రసార మాధ్యమాలు జగన్ అరెస్టుకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రమంత్రి అరెస్టు ఏమంత పెద్ద వార్త కాలేదు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు ఆర్జించాడన్నది అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ అక్రమార్జన కేసులోనే సిబిఐ జగన్ ని అరెస్టు చేసి, విచారణ జరుపుతోంది. జగన్ కి స్వంత ప్రచార సాధనాలు ఉన్నప్పటికీ, వాటి ద్వారా కన్నా ప్రభుత్వానికీ, ప్రతిపక్షానికీ అనుకూలమైన మీడియా ద్వారానే అతడికి ఎక్కువ ప్రచారం జరుగుతోన్నట్టుగా అనిపిస్తోంది. ఏమాత్రం ఆశ్చర్యం కలిగించని విధంగా జగన్ మీడియా అతడికి రక్షణ కవచంగా నిలబడేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా అతడు దివంగత వైఎస్ కి వారసుడన్నవిషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయడంతోపాటు, ప్రజలకి వైఎస్ చేసిన మేళ్ళు కొనసాగాలంటే జగన్ కి అధికారం ఇవ్వడం ఒక్కటే మార్గం అని చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతోంది.

ప్రస్తుతం, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అన్నది ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి అనుకూల అంశం కాగా ఆ వారసత్వాన్ని ఉపయోగించుకుని ఆకమార్జన చేశాడన్నది ప్రతికూల అంశం. ఆరేళ్ళ రాజశేఖర రెడ్డి పాలని సామాన్యులు ఇంకా మర్చిపోలేదన్నది నిజం. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య పించన్ల ఫలితాలు అందుకున్న పేదలు దాదాపు ప్రతి ఊరిలోనూ ఉన్నారు. వైఎస్ మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కావడం, నిన్న మొన్నటివరకూ వైఎస్ మా నాయకుడు అని చెప్పిన అధికార పార్టీ ఇప్పుడు క్రమంగా పక్కన పెట్టడం, విమాన ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనించాల్సిన అంశాలు.

జగన్ వ్యతిరేక మీడియాలో ప్రాముఖ్యంలో ఉన్న అంశం అవినీతి. ఈ అవినీతి అనే అంశం సామాన్య ఓటర్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు చూడాలి. నిజానికి రెండువేల తొమ్మిది ఎన్నికల్లో సైతం తెలుగుదేశం అనుకూల మీడియా ఈ అవినీతి పై విస్తృత ప్రచారం చేసింది. అయినప్పటికీ, గతంకన్నా మెజారిటీ తగ్గినప్పటికీ, కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ అవినీతిని గురించి చర్చించుకునే వాళ్ళెవరూ పోలింగ్ బూత్ వెళ్లకపోవడం, క్యూలో నిలబడి ఓటేసే మెజారిటీ ప్రజలకి అవినీతి అనేది అంత ప్రాముఖ్యం ఉన్న విషయం కాకపోవడం బహుశా ఇందుకు కారణం కావొచ్చు. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

సాధారణంగా ఉప ఎన్నికలు అనగానే అధికార పక్షం "ఈ ఎన్నికలు మా పాలనకి రిఫరెండం" అనో, ప్రతిపక్షాలు "ప్రభుత్వ వ్యతిరేకతకి రిఫరెండం" అనో ప్రకటించడం రివాజు. ఆశ్చర్యంగా ఈసారి ఈ రెండూ కూడా జరగలేదు. ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండో టర్మ్ సగంలో ఉన్న అధికార పార్టీ పై ప్రజా వ్యతిరేకత సహజమే అనుకున్నా, ప్రధాన ప్రతిపక్షం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అయితే, అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇద్దరి టార్గెట్ జగన్మోహన రెడ్డే అయినప్పటికీ "ఈ ఎన్నికలు అవినీతి వ్యరేకతపై ప్రభాభిప్రాయానికి రిఫరెండం" అనే సాహసాన్ని కూడా చేయలేకపోవడం గమనించాలి. మొత్తంమీద, 'జగన్' నామస్మరణతో జరుగుతున్న ఈ ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది వేచి చూడాల్సిన విషయం.

14 కామెంట్‌లు:

  1. అసందర్భ వాఖ్యే అనుకోండి కాని మీరు ఈ మధ్య నా లాంటి సుమన్ బాబు ఫాన్స్ ని బొత్తిగా నిరుత్సాహ పరుస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. nijame chudalandi.prajlani votti daddamalu anukuntunarau teerpu elavuntundo chudali.

    రిప్లయితొలగించండి
  3. తెలుగుదేశం , కాంగ్రెస్స్ లు అవినీతి వ్యతిరేకతపై ప్రజాభాభిప్రాయానికి రిఫరెండం అని సాహసం ఎలా చేస్తారు అసలు ?:))) విపరీతమైన డబ్బు ఖర్చుతో జరుతున్న ఎన్నికలు కదా ?

    ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది
    ------------------------

    హ హ ఏముంది ఇంకొంత మంది ఫిరాయింపుదార్లు బయలుదేరతారు , ఇంకొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగుతాయి

    రిప్లయితొలగించండి
  4. >>తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు ఆర్జించాడన్నది అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.

    ఈ విషయం ఒకటో తరగతి చదివే పిల్లాడికి కూడా తెలుసండి :)

    >>ప్రజలకి వైఎస్ చేసిన మేళ్ళు

    మీకేమయినా మేలు జరిగిందా? ప్రజల్లో మీరు లేరా?

    >>. ఈ అవినీతిని గురించి చర్చించుకునే వాళ్ళెవరూ పోలింగ్ బూత్ వెళ్లకపోవడం, క్యూలో నిలబడి ఓటేసే మెజారిటీ ప్రజలకి అవినీతి అనేది అంత ప్రాముఖ్యం ఉన్న విషయం కాకపోవడం బహుశా ఇందుకు కారణం కావొచ్చు.

    100 % నిజం,

    భాద్యతలను పట్టించుకోని వాళ్లకు, హక్కుల గురించి మాట్లాడే అర్హతలేదు. ఓటు వేసే తీరిక లేనివాళ్ళు బ్లాగుల్లో కామెంటు రాయడం, దేశం ఎటుపోతుందో అని అలోచిండడం హాస్యాస్పదం.

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి మురళీ గారు,
    ఈ మధ్య చూసిన బాలన్సుడ్ ఆర్టికల్స్ లో ఇది ఒకటి. పాపం YS అధికారం లో ఉంది 5 సంవత్సరాల మూడు నెలలు,కానీ అతని మీద దుష్ప్రచారం 8 సంవత్సరాలు పై గానే సాగుతుంది. ఇప్పటికి కొన్ని పత్రికలకి(???) ys ,జగన్ అవినీతే పతాక శీర్షికలు.
    ఇప్పటికి వరకు నలభయ్ కోట్ల నగదు, 10 కోట్ల బంగారం పట్టుకున్నారు అంటా. కాంగ్రెస్స్ ,తెలుగు దేశం కలిసి దాదాపుగా 500 కోట్లు పంచుతున్నారు అంటా. ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు చెప్తుంది ఏందో తెలుసా..అవినీతి వ్యతిరేఖ పోరాటం :) :) జనాలు దేనితో నవ్వుతారో అని కూడా సిగ్గులేదు సోనియా గాంధీ,కిరణ్ కుమార్, చంద్ర బాబుకి.

    ఒక ఆట ఆడేటప్పుడు ప్రత్యర్ధి కాళ్ళు చేతులు కట్టివేసి ఒంటి ఆట ఆడాలనుకోవడవం దద్దమ్మల లక్షణం. ప్రత్యర్ధిని జైలు లో పెట్టి తము మాత్రమె ప్రచారం చేసుకోవడం ప్రపంచ రాజకీయాల్లోనే వింత. దీనికి కొంత మంది మీడియా మోతుబరులు, బ్లాగు వీరులు సప్పోర్ట్ చెయ్యడం వాళ్ళ చరిత్ర గురించి తెలిసిన వాళ్లకి పెద్దగా ఆశ్చర్యం అనిపించదు.

    భారతీయిలు విజ్ఞులు. వాళ్లకి సమయం వచ్చినప్పుడు ఎవడికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడతారు. జూన్ 15 వరకు వేచి చూడటమే మనము చేయగలిగింది.

    రిప్లయితొలగించండి
  6. క్షమించాలి..ఇందాక నా వ్యాఖ్యలోని అర్ధం..ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రమే..

    రిప్లయితొలగించండి
  7. మొత్తం విషయాన్ని బాగా క్రోడీకరించారండీ.

    "ఈ ఎన్నికలు అవినీతి వ్యరేకతపై ప్రభాభిప్రాయానికి రిఫరెండం"

    ఇలా చెప్పడానికి మనస్సాక్షి అడ్డురాదూ! వాళ్ళేమైనా తక్కువ తిన్నారా....ఇంకొకరిని అనడానికి :)

    మొత్తానికి ఈ ఉప ఎన్నికలు మాత్రం కీలకమైనవి. రాష్ట్ర రాజకీయ, సాంఘిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.

    రిప్లయితొలగించండి
  8. రెఫరెండం సంగతి పక్కనపెడితే అరెస్ట్ ద్వారా జగన్ మరింత బలపడుతున్నాడేమోనని నాకు అనిపిస్తోంది మురళీగారూ. అతన్ని అరెస్ట్ చేయకుండా ఉంటే కొన్ని సీట్లు అయినా కాంగ్రెస్, టీడీపీలు గెలిచే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒకటీ అరా సీట్లతో సరిపెట్టుకోవాలేమో. అయితే ఈ బలం అంతా ఉప ఎన్నికల వరకే ఉంటుందనుకుంటున్నాను. దాన్ని 2014 లోపు పెంచుకోగలరా లేదా జగన్‌మోహన్‌రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది. వారి ప్రధాన బలం, బలహీనత జగనే. జగన్ తప్ప చెప్పుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటూ లేకుండా పోయింది. ఇక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తే శ్రావ్యగారు చెప్పినట్టు మరికొన్ని ఫిరాయింపులు తప్పవనుకుంటున్నాను. ఇప్పటికే మొదలైనట్టు అనిపిస్తున్నాయి.

    మీ పోస్ట్ మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా రాశారు. కానీ క్లుప్తంగా తేల్చేశారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఒక విస్తృతమైన విశ్లేషణ మీరు రాయాలని కోరుకుంటున్నాను. మీరైతే పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలరని నా నమ్మకం. :)

    రిప్లయితొలగించండి
  9. @గోదావరి: ధన్యవాదాలండీ..
    @వంశీకృష్ణ: బాబు చేయబోయే 'సందడి' కోసం ఎదురు చూస్తున్నానండీ.. ధన్యవాదాలు.
    @స్వాతి: అవునండీ.. నాకూ కుతూహలంగా ఉంది.. చూడాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @శ్రావ్య వట్టికూటి: నిజమే అనుకోండి.. అక్కడితో ఆగుతుందా ఇంకా ఏమన్నా జరుగుతుందా అన్నది చూడాలి... ధన్యవాదాలు.
    @శ్రీ: ఒకటో తరగతి చదివే పిల్లలకి తెలియడం చాలా ముఖ్యమండీ.. ఈ కేసులు తేలేసరికి వాళ్ళు పౌరులు అవుతారు కదా మరి.. ధన్యవాదాలు
    @భాస్కర రావు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @ఆ. సౌమ్య: నిజమే కదూ.. ధన్యవాదాలండీ..
    @చాణక్య: ముందుగా మీకు ధన్యవాదాలు .. ఇది ఒకసారి చూడండి.. http://www.thehindu.com/opinion/lead/article3501815.ece

    రిప్లయితొలగించండి
  12. మురళి గారికి, వైఎస్సార్ అంటే వ్యవసాయ శ్రామిక రైతు కాదు.. యువజన శ్రామిక రైతు.. ఏదో పొరబాటు దొర్లిపోయినట్లుంది. గమనించండి.

    రిప్లయితొలగించండి
  13. @సురేష్ పిళ్ళె: సరి చేశానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి