శుక్రవారం, జులై 15, 2011

రుక్మిణి

గోదారొడ్డున తీసిన అందమైన తెలుగు సినిమాల్లో 'రుక్మిణి' ఒకటి. చిన్న కథకి చక్కటి స్క్రీన్ ప్లే, శ్రావ్యమైన సంగీతం, బహు సుందరమైన లొకేషన్లూ జతపడ్డాయి. ఆదర్శ చిత్రాలయ పతాకంపై జొన్నాడ రమణమూర్తి పద్నాలుగేళ్ళ క్రితం నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించింది రీమేక్ సినిమాలతో ఎక్కువ పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి.

అప్పటికే తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన వినీత్ కథానాయకుడు కాగా, అలనాటి అందాల తార మంజుల కూతురు ప్రీత (ఈ సినిమా తర్వాత రుక్మిణి గా మారింది) కథానాయిక పాత్రనూ, చిన్న కూతురు శ్రీదేవి (తర్వాతి కాలంలో హీరోయిన్) బాలనటిగా సహాయ పాత్రనీ పోషించారు. ఈ అమ్మాయిలిద్దరి నిజ జనకుడు విజయకుమార్ రుక్మిణి తండ్రి దొరబాబుగా, చిరంజీవి సోదరుడు నాగబాబు రుక్మిణి మేనమామ బండబాబుగానూ చేశారు. దాసరి నారాయణరావు ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు.

గోదావరి తీరంలో ఉన్నఅందమైన పల్లెటూరు దొడ్డిపట్ల. ఈ లంక గ్రామాన్ని మిగిలిన ప్రపంచంతో కలిపే ప్రయాణ సాధనం పడవ మాత్రమే. ఆ ఊరి పెద్ద మనిషి, భూస్వామి దొరబాబు. అతని కూతురు రుక్మిణి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని, నాయనమ్మ పెంపకంలో పెరుగుతూ ఉంటుంది. స్నేహానికి ప్రాణమిస్తాడు దొరబాబు. ఇతని స్నేహితుడు గోవిందరావు (వంకాయల) బొంబాయిలో పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని కొడుకు కిరణ్ (దూరదర్శన్ కోసం కే.ఎస్. రామారావు తీసిన 'వెన్నెల్లో ఆడపిల్ల' సీరియల్లో రేవంత్ పాత్రధారి సాయికృష్ణ) కి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలని స్నేహితులిద్దరూ అనుకుంటారు.

సకలగుణాభిరాముడైన కిరణ్ బొంబాయిలో ఓ ఐదారుగురు అమ్మాయిలని ఏకకాలంలో ప్రేమిస్తూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ పల్లెటూరి పెళ్లి సంబంధం తప్పించుకోడానికి, తండ్రికి తెలియకుండా తన స్నేహితుడూ, మంచివాడూ అయిన రవి (వినీత్) ని దొడ్డిపట్ల పంపుతాడు, పెళ్ళిచూపులకి. అమ్మాయిని చూసి వచ్చేయమనీ, తను తన తండ్రికి అమ్మాయి నచ్చలేదని చెబుతాననీ, ఈ ఒక్క సాయం చేసి పెట్టమనీ రవిని బతిమాలి ఒప్పిస్తాడు.

పల్లెటూరికి వచ్చిన రవి రుక్మిణితో తొలిచూపులోనే ప్రేమలో పడిపోవడం, రుక్మిణి కూడా అతనితో ప్రేమలో పడ్డాక అప్పటివరకూ దాచిన తన రహస్యాన్ని ఆమెకి చెప్పేయడం, ఇంతలోనే రుక్మిణి ఆస్తికోసం తన మనసు మార్చుకుని తండ్రిలో కలిసి కిరణ్ ఆ పల్లెటూరికి వచ్చి పెళ్లికి సిద్ధ పడడంతో కథ చకచకా సాగి, కొన్ని కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత రవి-రుక్మిణి ఏకమవడంతో సుఖాంతమవుతుంది. సినిమా చూడగానే మొదట ఆకట్టుకునేది రాం పినిశెట్టి ఫోటోగ్రఫి. అందమైన గోదారినీ, లంకనీ, అక్కడి తోటలనీ, పొలాల్నీ అంతే అందంగా తెరకెక్కించాడు.

తర్వాత చెప్పుకోవాల్సింది సంగీతం. విద్యాసాగర్ సంగీత సారధ్యంలో సిరివెన్నెల రచించిన పాటలన్నీ దాదాపుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. అన్ని పాటలూ బాగున్నా 'గోదారి రేవులోన..' పాట నాక్కొంచం ఎక్కువ ఇష్టం. మిగిలిన వాటిలో 'ఉన్న మాట విన్నవించుకుంటా' ఎక్కడో విన్న బాణీలా అనిపించింది. 'బాగున్నావే..' పాట చిత్రీకరణ కే. రాఘవేంద్ర రావు శైలిలో సాగుతుంది. 'సరిగమపదని' పాట శైలిలో ఆ తర్వాత చాలా చాలా పాటలు చిత్రించారు, ముఖ్యంగా ఎస్.ఏ. రాజ్ కుమార్ సంగీతంలో వచ్చిన పాటలు. విద్యాసాగర్ పాడిన 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా..' పాటని దాసరిపై చిత్రించారు. 'శివశివ మూర్తివి గణనాధా' పాటలో నాగబాబు కూడా స్టెప్పులేశారు.

నేనీ సినిమా థియేటర్లో చూడడానికి వెళ్ళినప్పుడు, 'ఇప్పుడే మొదలైంది సార్' అన్న గేట్ కీపర్ మాటనమ్మి టికెట్ తీసుకుని లోపలి వెళ్లాను. అప్పటికి తెరమీద వినీత్ గోదారిమీద పడవలో ప్రయాణిస్తూ 'నాయనా క్షేమమా అన్నది ఈ ఊరు' అని పాడుకుంటున్నాడు. సినిమా హాయిగా సాగిపోతూ ఉండగా, ఉన్నట్టుండి సెకండాఫ్ లో దాసరి ముస్సలి గెటప్ లో ప్రత్యక్షమై 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా..' అని పాటందుకోగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. రెండో సారి చూసినప్పుడు అర్ధమైన విషయం ఏమిటంటే, సినిమా మొదలయ్యేదే దాసరి పోషించిన రచయిత పాత్రమీద.

ఆ మహా రచయిత అంతరించిపోతున్న తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించి తగుమాత్రం ఉపన్యసించి, 'రుక్మిణి' కథ రాయడానికి పూనుకుంటాడన్న మాట. ఒక పాటతో సహా అరగంట సినిమా అయ్యాక నేను మొదటిసారి చూసినప్పుడు మొదలెట్టిన సన్నివేశం వచ్చింది. అలా 'గేట్ కీపర్ మాట నమ్మరాదు' అనే నీతిని మరోసారి తెలుసుకున్నాను. వినీత్, రుక్మిణి బాగా చేశారు. రుక్మిణి కన్నా శ్రీదేవి ఎక్కువ మార్కులు కొట్టేసింది అప్పట్లో. బండబాబుగా నాగబాబు నటన మరీ మొనాటనస్ అనిపించింది.. క్లైమాక్స్ లో తప్ప ఆ పాత్ర అవసరం లేకపోవడం వల్ల కావొచ్చు. అతని అనుచరులుగా ఇప్పటి ప్రముఖ కమెడియన్స్ ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ కనిపిస్తారు.

సినిమా తీసేనాటికి సెల్ ఫోన్లూ అవీ వాడుకలో లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ని బాగా చూపించగలిగారు. రెండోసగంలో అనవసరపు నాటకీయతని కొంచం తగ్గిస్తే బాగుండేది. అలాగే అప్పటివరకూ కూతురు మీద విపరీతమైన ప్రేమ చూపించిన దొరబాబు మరీ అంత మూర్ఖంగా ప్రవర్తించడం కూడా అర్ధం కాని విషయం. అయినప్పటికీ ఇది చూడాల్సిన సినిమానే, క్లీన్ గా తీయడం, ద్వితీయార్ధం మొదటి సగం వరకూ ఆహ్లాదంగా సాగిపోవడం, మళ్ళీ చూడాలనిపించే పాటలు, హాస్యం, వీటన్నింటి వల్లా. డిస్క్ కోసం చాలా ప్రయత్నించినా దొరకలేదు నాకు. నిన్న రాత్రి ఈటీవీలో వస్తుంటే అర్ధరాత్రి రెండు వరకూ కూర్చుని చూశాను.

14 కామెంట్‌లు:

  1. బావుంది మురళిగారూ మీ పరిచయం. మీరు అన్నట్టు ఈ సినిమాలో ఫోటోగ్రఫీ, సంగీతం చాలా బావుంటాయి.మీలాగే నాకూ గోదారి రేవులోన పాట ఇష్టం.. నేను టీ.వీ లోనే చూసాను ఈ సినిమా.

    రిప్లయితొలగించండి
  2. సమీక్ష సంగతి పక్కనుంచి మీ జ్ఞాపక శక్తి మాత్రం అమోఘం!! నేను చెప్పేది సాయి కృష్ణ సంగతి. ఠక్కున చెప్పేసారు అతని పుట్టుపూర్వోత్తరాలు. ఎప్పటి దూ.ద. లో వెన్నెల్లో ఆడపిల్ల!నాకు గుర్తొచ్చేదేమో కానీ కాస్త చించుకుంటే వచ్చేదేమో! మీకు నిన్న రాత్రి సినిమా చూసి టపా వేసేసరికే వెలిగిందంటే మీరు పాదరసం. భలే!!

    రిప్లయితొలగించండి
  3. ఎందుకో గాని ఈ సినిమా చూడటం మిస్ అయ్యాను...బాగా గుర్తుచేసారు దొరికితే ఈ వీకెండ్ చూసేస్తాను :-)

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమా వచ్చేప్పటికి నేను చిన్నపిల్లణ్ణండీ. పోస్టర్లలో వినీత్ ని చూసి వెంకటేష్(అప్పట్లో నా ఫేవరెట్ హీరో) అనుకుని మావాళ్లు కాదని చెప్పినా నమ్మకుండా ఈ సినిమాకి వెళ్లాను. వినీత్ వెంకటేష్ లా అనిపించే అవకాశం లేదే అనుకోకండి చిన్నపిల్లలకి పోల్చుకునే శక్తి తక్కువ కావచ్చు(అప్పటికి నా వయసు ఎనిమిదేళ్ళుంటాయేమో).
    కానీ నాకీ సినిమా చాలా ఇష్టం. ముఖ్యంగా పాటలూ, నాగబబు-ఎమ్మెస్ ల మధ్య కామెడీ లాంటివి...ఎప్పుడు ఈటీవీలో వేసినా చూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  5. ఈ అమ్మాయిలిద్దరి నిజ జనకుడు విజయకుమార్ రుక్మిణి తండ్రి దొరబాబుగా
    సినిమా హాయిగా సాగిపోతూ ఉండగా, ఉన్నట్టుండి సెకండాఫ్ లో దాసరి ముస్సలి గెటప్ లో ప్రత్యక్షమై 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా..' అని పాటందుకోగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాను.
    ఆ మహా రచయిత అంతరించిపోతున్న తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించి తగుమాత్రం ఉపన్యసించి, 'రుక్మిణి' కథ రాయడానికి పూనుకుంటాడన్న మాట.
    :)) nice

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు... ఎమ్ ఎస్ మొదటి చిత్రం రుక్మిణి కాదు. అంతకు ముందే అయన పెదరాయుడు, ఎమ్ ధర్మరాజు ఎమ్ ఎ లాంటి చిత్రాల్లో నటించారు.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు... మరో సవరణ చెబుతున్నా ఏమి అనుకోవద్దు. మంజుల పెద్ద కుమార్తె వనిత. దేవి సినిమా హీరోయిన్. ప్రీత, శ్రీదేవి ఆ తరవాతివారు. విజయకుమార్ మొదటి భార్య పిల్లలు కవిత, అనిత, అరుణ్ విజయ్.

    రిప్లయితొలగించండి
  8. @ప్రసీద: థియేటర్లో ఇంకా బాగుందండీ.. హమ్మయ్య.. ఈ పాటకి ఫ్యాన్ ని నేనొక్కడినే అనుకున్నా!! ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: అప్పట్లో పదమూడు వారాలూ (అదేంటో, అప్పట్లో సీరియల్ అంటే కేవలం పదమూడే ఎపిసోడ్లు, అదికూడా వారానికొకటి) రెప్ప వాల్చకుండా సీరియల్ చూసేసి, సాయికృష్ణ కి నటుడిగా మాంచి భవిష్యత్తు ఉంటుందని మిత్రులకి జోస్యం చెప్పేశాను లెండి :)) అదీ కాకుండా అనవసరమైన విషయాలు నాక్కొంచం బాగానే గుర్తుంటాయి కూడా!! ..ధన్యవాదాలు.
    @శ్రీ: తప్పక చూడండి.. బాగుంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @పక్కింటబ్బాయి: అసలు అలా ఎలా అనుకున్నారండీ? అసలు వినీత్ యెంత బాగుంటాడో కదా! అలాంటిది... (మీరు 'అప్పట్లో' అని నొక్కి చెప్పారు కదా, అదీ ధైర్యం) .. మొత్తానికి మీకీ సినిమా నచ్చింది కదా.. ధన్యవాదాలు.
    @హరిచందన; :-) ధన్యవాదాలండీ..
    @చక్రవర్తి; చాలా చాలా ధన్యవాదాలండీ.. తప్పులన్నీ సరి చేశాను.. విజయకుమార్ సంతానాన్ని గురించి పూర్తిగా తెలిసింది ఇప్పుడే!!

    రిప్లయితొలగించండి
  10. బావుందండీ ! నేనూ చిన్నప్పుడు చూసాను ...నాకు "బాగున్నావే" పాట అంతే చాలా ఇష్టం

    రిప్లయితొలగించండి
  11. @పరుచూరి వంశీకృష్ణ: అవునండీ.. బాగుంటుంది ఆ పాట.. ముఖ్యంగా చిత్రీకరణ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఈ సినిమా విడుదలైనపుడు పబ్లిసిటీతో నా దృష్టిని ఆకట్టుకుందండీ.. సినిమా పూర్తిగా గుర్తులేదు కానీ కొంత గుర్తుంది.. ప్రీతి కన్నా కూడా శ్రీదేవి పాత్ర బాగుంటుంది :-) పాటలలో నాకు కూడా గోదారి రేవులోన ఇష్టమండి.. ఇంకో స్లో సాంగ్ ఒకటి ఉంటుంది “మెల్లగా ఊయలే ఊపిందిలే గాలీ” అది కూడా బాగుంటుంది. ఎమ్మెస్ హాస్యం కూడా బాగానే నవ్విస్తుంది.

    రిప్లయితొలగించండి
  13. @వేణూ శ్రీకాంత్: నేను మొదటిసారి థియేటర్లో చూసినప్పుడు వెళ్లేసరికి అవుతున్నది ఆ బిట్ సాంగేనండీ.. పాటతో పాటు చిత్రీకరణ కూడా బాగుంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. Unna maata neeku vinnavinchukuntaa is made with the same tune as "Chikkenamma chakkanamma janta" song from Dharmateja which is first film for vidyasagar as MD

    రిప్లయితొలగించండి