ఎడారి దేశం లిబియా మళ్ళీ వార్తల్లోకెక్కింది. లిబియా ప్రజలు సమస్యల్లో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకన్నా ముందు అమెరికా గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగింది. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అన్నట్టుగా, అమెరికా ఏం చేసినా, చేయకపోయినా దాని ప్రభావం ఏదో ఒకరకంగా మిగతా ప్రపంచం మీద ఉండి తీరుతుంది. ప్రస్తుత లిబియా సంక్షోభమూ ఇందుకు మినహాయింపు కాదు.
ఉత్తరాఫ్రికా మధ్యధరా తీరంలో ఉన్న లిబియా దేశం, సహారా ఎడారి భాగంలోనిది కావడంతో ఆయిల్ వనరులు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఈ ఎడారి దేశానికి ఈ వనరులు వరమవ్వాలి. అదేం పాపమో కానీ, లిబియాకి మాత్రం ఇవే శాపమయ్యాయి. కేవలం ఈ ఆయిల్ కోసమే ఇటలీ లిబియా మీద కన్నేసి చాలా కాలంపాటు వలస పాలన సాగించింది. అన్నాళ్ళూ, ఇటలీ కర్ర పెత్తనానికి వ్యతిరేకంగా లిబియన్లు పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలోనే సూయజ్ కాలువ సంక్షోభం, అరబ్ జాతీయవాదం ఇవన్నీ లిబియాని పట్టి కుదిపాయి.
ఎట్టకేలకి, 1969 లో నాటి యువ సైన్యాధికారి కల్నల్ గడాఫీ సారధ్యంలో సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పటివరకూ పాలించిన రాచరికం స్థానంలో "స్వతంత్ర, లౌకిక, ప్రజాతంత్ర" రిపబ్లిక్ స్థాపన జరిగింది. ఓ చిన్న ఎడారి దేశం, ఆయిల్ తప్ప మరే ఆధారమూ, అంగబలమూ లేని దేశం స్వతంత్ర జెండా ఎగరేస్తే, చుట్టూ ఉన్న 'పెద్ద' దేశాల పరువేం కావాలి? కేవలం ఈ కారణానికే లిబియా మీద ఆంక్షల వర్షం కురిసింది. గడాఫీ ఇంటి మీద బాంబుల వర్షం కురిసింది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు.
ఒక నెలో, ఏడాదో కాదు, ఈ ఆంక్షలు ఇరవై రెండేళ్ళ పాటు కొనసాగాయి. గడాఫీ ప్రభుత్వానికి 'పెద్ద' దేశాలతో రాజీ పడక తప్పలేదు. పదేళ్ళ క్రితం ఈ రాజీ ఫలితంగా ఆంక్షల సడలింపు మొదలయ్యింది. అత్యంత సహజంగానే పశ్చిమ దేశాల ఆయిల్ కంపెనీలు లిబియా వైపు ప్రయాణించడానికి పోటీ పడ్డాయి. అయితే, లిబియా ఇక్కడో తెలివైన పని చేసింది. సౌదీ అరేబియా, బహ్రయిన్, కువైట్, కతార్ లాంటి గల్ఫ్ దేశాల్లా కాకుండా విదేశీ కంపెనీలు లిబియా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ సార్వభౌమత్వానికి లోబడి పనిచేయాలని ఖచ్చితమైన షరతు పెట్టింది. ఫలితం, లిబియా ఆయిల్ మీద పెద్ద దేశాలకి పెత్తనం చిక్కలేదు.
ఊహించని విధంగా గత నెలలో, లిబియా సైన్యం రెండుగా చీలిపోవడం, గడాఫీకి వ్యతిరేకంగా పోటీ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయింది. నిజానికి ఇది లిబియా అంతరంగిక సమస్య. ఆ దేశపు ప్రజలు పరిష్కరించుకోవాల్సిన సమస్య. తమకి అధినేతగా ఉండాల్సింది గడాఫీనా లేక మరోకరా అన్నది పూర్తిగా వాళ్ళ విచక్షణకి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ జరుగుతున్నది వేరు. అమెరికా తదితర అగ్ర దేశాలు కొత్త ప్రభుత్వాన్ని గడాఫీ బారినుంచి రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
లిబియా ప్రస్తుత జనాభా డెబ్భై లక్షల లోపే. వీళ్ళంతా ఇప్పుడు దాడుల బాధితులు. సంఘర్షణ వాళ్లకి కొత్త కాకపోవచ్చు. కానీ, వాళ్ళ రక్షణ పేరుతో జరుగుతున్న దాడుల వల్ల వాళ్లకి కలిగే లాభం కన్నా, ఇతరులకి కలిగే లాభమే పెద్దదిగా కనిపిస్తోంది. సాంకేతికత కారణంగా ప్రపంచం ఓ కుగ్రామంగా మారిందని చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో కూడా, అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు లిబియా లో జరుగుతున్న దాడులను గురించి గట్టిగా స్పందించక పోవడం తెర వెనుక సంగతులని చెప్పకనే చెబుతోంది. నాకెందుకో తిలక్ కథ 'లిబియా ఎడారిలో' పదేపదే గుర్తొస్తోంది.
//కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. //
రిప్లయితొలగించండిప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ. ... ఇది అమెరికా వర్తిస్తుంది అన్నట్టు వ్యవహరిస్తుంది.
దీని వల్ల తరువాత తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటోంది.
లిబియా చరిత్ర మీరు చెప్పే వరకూ తెలియదు. చదివాకా చాలా అన్యాయం అనిపిస్తోంది
మనది పెద్ద దేశం అవ్వడం మన పాలిట అదృష్టం అనిపిస్తోంది.
టైటిల్ చూసి మీరు తిలక్ కథని పరిచయం చేస్తున్నారనే అనుకున్నాను.
రిప్లయితొలగించండి@vasu మన దేశంలో కూడా చమురు పుష్కలంగా ఉంటే ఇంకెన్ని స్కాములు జరిగేవో?
మన నేతలు బయటివాళ్ళకు అవకాశమే ఇవ్వరు.
@వాసు: మనది పెద్ద దేశమే అయినా లిబియా విషయం లో స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదండీ ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: ఆ కథ కన్నా కూడా లిబియాని గురించి రాయాలని అనిపించిందండీ.. నిజమే..మనవళ్ళు ఎవరికీ అవకాశం ఇవ్వరు.. ఖత్రోచీ లాంటి కొందరు కావాల్సిన వాళ్లకి తప్ప :)) ..ధన్యవాదాలు.
బ్రిటన్ ప్రధాని ప్రకటన చూశారా? లిబియా ప్రజలు వాళ్ళ పాలకుల దారుణాల వల్ల అన్యాయంగా చనిపోతుంటే వారిని రక్షించడానికి తప్పనిసరి పరిస్థితులలోనే వారిమీద వీళ్ళు బాంబులవర్షం కురుపిస్తున్నారట.
రిప్లయితొలగించండి@శిశిర: చూశానండీ.. చూసి నవ్వుకున్నాను... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిLibya lo udyogam cheyadam saahasama?
రిప్లయితొలగించండి