శుక్రవారం, డిసెంబర్ 03, 2010

తోచీతోచని కబుర్లు

ఏమిటో.. ఏమీ తోచకుండా ఉంది. అలా అని పని లేకుండా లేదు. ఉంటూనే ఉంది.. అయినా తోచీతోచకుండా ఉంది. ఏ తోడల్లుడి పుట్టింటికన్నా వెళ్దామంటే ఎవరూ లేరు మరి. 'తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది' అని కదా సామెత. మరి తోచీ తోచనయ్య చేయాల్సింది ఇదే కదా. చదవాల్సిన పుస్తకాలు 'మా సంగతేమిటి?' అని ప్రశ్నిస్తున్నాయ్. ఉన్నవి చాలనట్టు మొన్ననే ఓ చిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్లి ఓ నాలుగు కొత్తవి తెచ్చా. లాభం లేదు, కొంచం స్పీడు పెంచాలి, చదివే విషయంలో.

పుస్తక ప్రదర్శన అంటే గుర్తొచ్చింది. ఓ కొత్త స్నేహితుడితో కలిసి వెళ్లాను పుస్తకాలు చూడ్డానికి. మేము తెలుగు పుస్తకాలు చూడడం పూర్తి చేసి ఇంగ్లీష్ సెక్షన్ వైపు వెళ్లాం. పాల్ కోయిలోనీ, చేతన్ భగత్ నీ మధ్యలో వదిలేసిన విషయం నేను గుర్తు చేసుకుంటుండగానే, "ఏడుతరాలు లేదా అంకుల్?" అని వినిపించింది వెనుక నుంచి. నన్నేమో అని తిరిగిచూశా కానీ, కాదు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు, మేనేజర్ని అడుగుతున్నారు. భలే సంతోషం కలిగింది. ఇద్దరూ నేరుగా కాలేజీ నుంచి వచ్చేసినట్టున్నారు. తెలుగు పుస్తకం, అందులోనూ ఏ వ్యక్తిత్వ వికాసమో కాకుండా 'ఏడుతరాలు' అడిగారు కదా మరి. మేమింకా పుస్తకాలు చూస్తుండగానే వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోయారు.

"జగన్ పార్టీ ఎలక్షన్లో గెలుస్తుందంటారా?" ఉదయాన్నే ఫోన్ పలకరింపు. నాకు "ఆలు లేదు, చూలు లేదు.." సామెత గుర్తొచ్చింది. ఏమిటో సామెతల మీద నడుస్తోంది బండి. ఇంకా పార్టీ పెట్టడం, ఎన్నికలు జరగడం ఏదీ లేదు కానీ, అప్పుడే ఫలితాల గురించి చర్చలు. వైఎస్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలట్ తాలూకు కుటుంబ సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడం లేదు. అతని పిల్లలు కూడా "మా నాన్న పైలట్ కాబట్టి, ఎలాంటి శిక్షణా లేకుండానే మమ్మల్నీ పైలట్లు చేసేయాల్సిందే" అని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదో మరి.

కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తే వినబడ్డ వ్యాఖ్యానాలు నవ్వు తెప్పించాయ్. "ముఖ్యమంత్రి మారినా కూరల రేట్లు తగ్గలేదు.." అనుకుంటున్నారు జనం. "సొరాజ్జం వస్తే మా ఊరి కానిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా" అంటూ 'కన్యాశుల్కం' లో బండి వాడి ప్రశ్న గుర్తొచ్చేసింది. ఎవరి సమస్యలు వాళ్ళవి మరి. అసలే ఓ పక్క మంత్రుల్ని బుజ్జగిస్తూ, కప్పల తక్కెడని బేలన్స్ చేయడంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి కూరల రేట్లు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే తీరిక ఉంటుందా? వీళ్ళ పిచ్చి కానీ.

వంశీ 'మాపసలపూడి కథలు' ని సీరియల్గా తీస్తున్నారుట. మా గోదారి తీరంలోనే షూటింగ్ జరుగుతోందిట. త్వరలోనే మాటీవీ లో ప్రసారం అవుతుందిట. వర్ణన ప్రధానంగా సాగే కథలకి దృశ్య రూపం ఎలా ఇస్తారో చూడాలని కుతూహలంగా ఉంది. మరోపక్క వంశీ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' పేరుతో అలనాటి హిట్ 'లేడీస్ టైలర్' కి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. తన కొత్తపుస్తకం 'ఆకుపచ్చని జ్ఞాపకం' కొన్నాను, ఫోటో ఆల్బంలా అందంగా ఉందీ పుస్తకం. కథలన్నీ చదివేసినవే. మళ్ళీ ఓసారి తిరగేయాలి.

థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు. నా టేస్ట్ లో ఏదో లోపం ఉందేమో మరి. కనీసం నిర్మాణం లో ఉన్న సినిమాలు కూడా ఏవీ చూడాలనే కుతూహలాన్ని కలిగించడం లేదు. రాబోయేకాలం అంతా డీవీడీలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చేలా ఉంది. శ్రీరమణ సంపాదకత్వంలో వస్తున్న 'పత్రిక' మాసపత్రిక తాత్కాలికంగా మూతపడిందని ఎక్కడో చదివి కలుక్కుమనిపించింది. మిత్రులొకరు ఇదే విషయం ధృవీకరిస్తూ మెయిల్ రాశారు. మంచి పత్రికలకి రోజులు కావేమో. ఈ పరిణామం ప్రభావం పరోక్షంగా అయినా వర్తమాన తెలుగు సాహిత్యం మీద ఉంటుందనే అనిపిస్తోంది. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా..

22 కామెంట్‌లు:

  1. కరకరలాడుతూ కమ్మగా ఉన్నై కబుర్లు. అంచేత అప్పుడప్పుడూ ఇలాక్కూడా వడ్డిస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  2. హ హ ...తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లిందట అన్న సామెత సూపరు ..అప్పుడెప్పుడో మా జర్నలిస్ట్ ఫ్రెండ్ ఒక పెళ్ళికి పిలిస్తే వెళ్ళాము పెళ్లి వాళ్ళు తెలీదు,నాలానే హైదరాబాద్ నుంచి కూడా ఇద్దరు వచ్చారువాళ్లకి అస్సలు పరిచయం లేదు.ఇంతకి పెళ్లి ఎవరిదంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క తోటికోడలు కూతురిదిఅందరం తను బలవంతం చేయబట్టి వెళ్ళాము వెళ్ళిన దగ్గరినుంచి ఇవే సామెతలు చెప్పుకోను నవ్వుకొను తిరిగి వెళ్ళేప్పుడు అంతా చెప్పాముఇప్పుడు పిలిస్తే పిలిచావుగాని మరల వీళ్ళ సీమంతాలకి బారసాల కి పిలవమాకు రాలేము అని జోక్స్ వేసాము .

    మీ టపా చాలా బాగుంది .

    రిప్లయితొలగించండి
  3. అతని పిల్లలు కూడా "మా నాన్న పైలట్ కాబట్టి, ఎలాంటి శిక్షణా లేకుండానే మమ్మల్నీ పైలట్లు చేసేయాల్సిందే" అని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదో మరి:))... కొత్త పాళీ గారు అన్నట్టు ..అప్పుడప్పుడూ...అప్పుడప్పుడూ ..

    రిప్లయితొలగించండి
  4. తొచీ తోచని కబుర్లు :) బాగున్నాయండి .

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు చాలా విషయాలే చెప్పారు. నేనుకూడా ఒక సారి మా తోటి కోడలి పుట్టింటికెళ్ళాను లెండి. ఏమోనండి, జగన్ పార్టీ మీద నాకైతే నమ్మకం లేదు. పసలపూడి కథలు సీరియల్ గా వస్తే మాత్రం తప్పకుండా చూస్తాను. మొదలైనప్పుడు ఆ వివరాలు మీరే చెప్పాలి మరి. ఇప్పటికీ నేను ఆ బుక్ చదవటం పూర్తి చేయలేదు:)

    రిప్లయితొలగించండి
  6. "చాలా సంతోషం వేసింది " ........అంకుల్ అన్నది మిమ్మల్ని కాదని తెలిసినందుకు కదూ !
    పసలపూడి కధలు సీరియల్ గా తీస్తున్నారని నేనూ పేపర్లో చూసానండీ . వంశీ కధల్లో సెన్సార్ చెయ్యవల్సిన విషయం చాలా వుంది . కేవలం బాసని యాసని నమ్ముకుని రంగంలోకి దిగిపోతే ఆ కధలకి న్యాయం చెయ్యలేడు డైరెక్టరు ఏమంటారు

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు....
    కమ్మగావున్నాయి కబుర్లు. మీరు భలే చెపుతారండి కబుర్లు.
    రఘురామ్

    రిప్లయితొలగించండి
  8. "థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు". థియెటర్ కెల్లి చూసె సినిమా లేమి ఉన్నాయండి ఇప్పుడు.రిలీస్ కుడా అవ్వకముందే అన్ని సినిమాల రివ్యులు అన్ని బ్లాగ్లల్లోను వచెస్తున్నాయికదా. చక్కగా డివిడి కొనుక్కోవడమే ఉత్తమం

    రిప్లయితొలగించండి
  9. murali garu,nenu e site ni appudappudu visit chestu untanu.kaani ippati nundi regular ga follow avutanu.Mee kaburlu maa manasu loni bhaavalaku addam padutunnai...

    రిప్లయితొలగించండి
  10. ఎదురుగా కూర్చుని బతాఖానీ పెడితే ఇక నేను కామెంటెయ్యడానికి ఏముంది? వెళ్ళొస్తా అని కండువా భుజాన వేస్కుంటూన్నా :)

    రిప్లయితొలగించండి
  11. కబుర్లు బాగున్నాయండీ! అయితే అప్పుడప్పుడూ మీకు ఇలా తోచీ తోచకుండా ఉంటే బాగుంటుందన్నమాట.. ఎంచక్కా మాకు కబుర్లు చెప్పేస్తారు కదా! ;)

    రిప్లయితొలగించండి
  12. హహ్హహ్హా.. మురళి గారు, భలే ఉన్నాయి మీ తోచీతోచని కబుర్లు..:)

    రిప్లయితొలగించండి
  13. @కొత్తపాళీ: 'కబుర్లు' మీద పేటెంట్ మీదే కదండీ :-) :-) ..ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: ఎప్పుడండీ? :-) ..ధన్యవాదాలు.
    @వోలేటి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. @చిన్ని: నేను చిన్నప్పుడే విన్నానండీ, బామ్మ దగ్గర!! ..ధన్యవాదాలు.
    @రాధిక (నాని): :-) :-) ..ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @జయ: జనవరి నుంచి వస్తాయని విన్నానండీ.. పుస్తకం చదవడం మొదలు పెట్టండి మరి.. ధన్యవాదాలు.
    @లలిత: నేను అంకుల్ అయి చాలా సంవత్సరాలే అయ్యిందండీ.. కాబట్టి సంతోషించింది వాళ్ళు 'ఏడు తరాలు' కొనుక్కున్నందుకే.. ధన్యవాదాలు.
    @రఘురాం: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. @స్ఫూర్తి: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @ప్రతిమ; ధన్యవాదాలండీ..
    @సుబ్రహ్మణ్య చైతన్య: అతేనంటారా? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @మధురవాణి: ఏవోనండీ, తోచీతోచని కబుర్లు :-) ..ధన్యవాదాలు.
    @మనసుపలికే: ధన్యవాదాలండీ..
    @భాను: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. పసలపూడి కథలు రాజోలులో షూటింగ్ జరుగుతూందటండి. రాజోలుని చూస్తూ పసలపూడిని ఫీలవ్వాలన్నమాట. :)

    రిప్లయితొలగించండి
  19. @శిశిర: అంటే, కథలన్నీ పసలపూడిలో జరిగినవి కాదు కదండీ.. పైగా ఇప్పటి పసలపూడి ఎలా ఉందో చివరి కథలో చెప్పాడు కదా.. అందుకోసం ఏదైనా ఏర్పాటేమో, చూడాలి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి