గురువారం, అక్టోబర్ 22, 2009

బ్లాగులు-పరిమళం

లేతాకుపచ్చ రంగు చిగురుటాకులు.. వాటి మధ్యలో తెల్లని చిన్న చిన్న పువ్వులు.. కంటికి ఆహ్లాదకరమైన దృశ్యం. మరి ఇన్ని పూలున్నా పరిమళం రాదేమి? ప్రశ్న అవసరం లేదు.. కంప్యూటర్ తెర మీద ఆ పూల మధ్య ఒదిగిపోయిన అక్షరాలు పరిమళాలను వెదజల్లుతాయి. కవితలు, కథలు, జ్ఞాపకాలు, స్పందనలు, ప్రతి స్పందనలు... ఎన్నెన్నో భావాలు.. మరెన్నో పరిమళాలు.. వీటిని పంచే అచ్చ తెలుగు బ్లాగు పేరు 'పరిమళం.'

"తెలుగు దేశంలో తెలుగు తెలిసిన, తెలుగు మాత్రమే తెలిసిన ఒక సామాన్య గృహిణిని పెద్దగా చదువుకోలేదు, స్కూల్ డేస్ లోనే చదువుకు పుల్ స్టాప్ పెట్టాల్సివచ్చింది కొంచెం కట్టుబాట్లున్న మెట్టినిల్లు ప్రపంచాన్ని చూసింది యండమూరి వీరేంధ్రనాథ్ గారి రచనల్లో ........ ఇక ఇష్టాలు ...... కృష్ణుడు ...వెన్నెలా ... గోదావరి...... పువ్వులూ, పసిపాపల నవ్వులూ వర్షపు చినుకులు, సీతాకోక చిలుకలూ ఇలా..... చాలా.." 'గోదావరి' దగ్గర ఒక్క క్షణం ఆగాను, మొదటిసారి ఈ బ్లాగు చూసినప్పుడు.

అప్పుడప్పుడే బ్లాగులు చూడడం కొంచం అలవాటై, ప్రొఫైల్ ని కూడా గమనిస్తున్న సమయంలో, నేను చూసిన మెజారిటీ బ్లాగుల్లో హైదరాబాద్, గుంటూరు, అమెరికా అని కనిపిస్తుండగా (బ్లాగ్మిత్రులు తప్పట్టుకోకూడదు, ఉన్నమాట చెబుతున్నా) ఈ బ్లాగులో 'గోదావరి' కనిపించేసరికి 'ఓ గోదావరి ఆడపడుచు కూడా బ్లాగు రాస్తున్నారు కదా' అని కూసింత గర్వ పడ్డా. ఈ బ్లాగులో నేను చదివిన మొదటి టపాని ఎప్పటికీ మర్చిపోలేను. నేను బ్లాగు మొదలు పెట్టినప్పుడూ, ఇప్పటికీ అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చూసినప్పుడు ఆ టపా గుర్తొస్తూనే ఉంటుంది నాకు.

ఇంతకీ ఆ టపా పేరు 'అంతర్మధనం.' నేనంటూ బ్లాగు మొదలు పెడితే తప్పకుండా కామెంట్ మోడరేషన్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నది అప్పుడే. ఇక 'మా ఊరి సంబరాలు' టపా చదివినప్పుడైతే నాకూ ఓ బ్లాగుంటే మాఊరి విశేషాలు కూడా రాయొచ్చు కదా అనిపించింది. అలా బ్లాగర్ పరిమళం గారు నన్ను ప్రభావితం చేశారు. అప్పట్లో ఒకటికి నాలుగు సార్లు చదివిన టపా 'పదిలంగా అల్లుకున్నా..' టపాలు చదవడం ద్వారా కృష్ణశాస్త్రి, తిలక్ ల కవిత్వమంటే ఈ బ్లాగర్ కి ఎంత ఇష్టమో అర్ధమయ్యింది. సరిగ్గా అప్పుడే 'ఉత్తరాలు' టపా ద్వారా జ్ఞాపకాల తుట్టెను కదిపారు.

కొన్ని కొన్ని టపాలు చదువుతుంటే పరిమళం గారు తన గురించి రాసుకున్న "పెద్దగా చదువుకోలేదు" వాక్యం పెద్ద అబద్ధం అనిపించక మానదు. కానీ ఆవిడ తన జీవితంలో ముఖ్యమైన మలుపుని కళ్ళకి కడుతూ రాసిన 'అనుకోకుండా ఒకరోజు' సీరియల్ చదివాక నమ్మక తప్పదు. 'మేక నాది' లాంటి సరదా టపా రాసినా, 'రియల్ హీరోస్' లాంటి సీరియస్ టపా రాసినా ఆసాంతమూ చదివించడం పరిమళం గారి శైలి. 'మన్నించు నేస్తం' 'విరజాజిపూలు' లాంటి టపాలు కదిలిస్తాయి. 'నాన్న చెప్పిన కథలు' ఆలోచింపజేస్తే, 'పిట్ట కథలు' నవ్విస్తాయి.

అన్నట్టు ఈ బ్లాగు పాఠకులు కొన్ని రహస్యాలని కూడా కాపాడాల్సి ఉంటుంది. 'గోరింట పూసింది' టపాలో అలాంటి రహస్యం ఒకటి ఉంది. గత సంవత్సరం నవంబరు తొమ్మిదిన 'నీ మౌనం' టపా తో బ్లాగు ప్రారంభించిన పరిమళం ఈ మధ్యనే తన వందో టపాతో 'ఆనంద దీపావళి' జరుపుకున్నారు. టపాలకి మాత్రమే కాదు, వాటికి జతగా కూర్చే ఫోటోలకీ వంక వెతకలేము. అప్పుడప్పుడూ చెప్పా పెట్టకుండా మిస్సయిపోతూ ఉంటారన్నది ఈ బ్లాగరు మీద ఉన్న పెద్ద ఫిర్యాదు. 'పరిమళం' బ్లాగు నిత్య పరిమళాలని వెదజల్లాలని మనసారా కోరుకుంటూ...

27 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాసారండీ...పరిమళంగారి పరిమళాలు బ్లాగ్లోకంలో మరిన్ని పరిమళాలు వెదజల్లాలని కోరుకుంటున్నను.

    రిప్లయితొలగించండి
  2. చాలా చక్కగా వర్ణించారు సోదరా
    >>'పరిమళం' బ్లాగు నిత్య పరిమళాలని వెదజల్లాలని మనసారా కోరుకుంటూ...
    నేనుకూడా మనసారా కోరుకుంటున్నా!!

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయి మురళీ గారూ , మీ బ్లాగు స్మృతులు

    రిప్లయితొలగించండి
  4. మురళి ,మంచి బ్లాగ్ పరిచయం చేసారు ...నేను కూడా పరిమళాల పరిమళం కి ప్రేమలో పడిపోయాను ..ఆ పూలు వేప పూల లేక చెర్రీ న అని వీలున్నప్పుడల్లా ఆ బ్లాగ్ చూసేదాన్ని ...ఈమద్య నెల రోజులు మాయం అయినపుడు తన పాత టపా లన్ని తిరగేశాను ....నేను పరిమళం తో పాటు మరువానికి అభిమానిని .నా పూల పిచ్చి అటు లాక్కెళ్ళింది నన్ను నిరాశ పరచలేదు యేవిను.

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు ,
    పరిమళం గారి గురించి బాగా చెప్పారండి . నేను కూడ పరిమళం గారి అభిమానినే .

    రిప్లయితొలగించండి
  6. మీ నెమలి కన్ను ఎప్పుడు ఎవరి మీద ప్రసరించునో కదా .మొత్తానికి దానివల్ల వారి బ్లాగ్ లో మిస్ అయిన మంచి టపాలని చదివే అవకాశం మాత్రం కలుగుతోంది . కీప్ ఇట్ అప్ .

    రిప్లయితొలగించండి
  7. టపాలో బ్లాగర్ల గురించి రాయాలన్న మీ అలోచన బాగుంది. అభినందనలు. పేపర్లో పడినా ఇంత వివరంగా, విశ్లేషణతో ఇవ్వరండీ..ఏదో పై పైన చూసి ఓ రెండు ముక్కలు రాసేస్తారు. అందులోనూ నిష్పక్షపాతంగా బ్లాగుల ఏంపిక ఉంటుందన్న గ్యారెంటీ కూడా ఉండదు.
    ఇక పరిమళం బ్లాగు గురించి చెప్పాల్సిందంతా మీరు చెప్పేసారు...ఆమె ఇలాగే నిత్యం టపాల పరిమళాలు వ్యాపింపజేయాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  8. బాగా చెప్పారు మురళి గారు, నేను మొదట పరిమళం బ్లాగ్ చూసినప్పుడు తన ప్రొఫైల్ చూసి అనుకున్నా క్లాస్ రూంలొ చదివేదే చదువు కాదని, జీవితం ఇంకా ఎక్కువ నేర్పిస్తుంది అనీ. పరిమళం గారికి అభినందనలతో ......

    రిప్లయితొలగించండి
  9. పరిమళం గారి బ్లాగు నాక్కూడా చాలా నచ్చిన బ్లాగు . ఆ పరిమళాలు మరింత బ్లాగువ్యాపితమవ్వాలని కోరుకుందాము. :)

    రిప్లయితొలగించండి
  10. చాలా బాగా చెప్పేరు మురళి. నాకు బ్లాగ్ ల గురించి పరిచయ మయ్యిన కొత్తలో ఆస్వాదించిన తొలి పరిమళం ఇక్కడే. ఈ పరిమళపు కొమ్మ ఇలానే మనకందరికి ఇంకా వేవేల పరిమళాలు పంచాలని కోరుకుంటున్నా.

    రిప్లయితొలగించండి
  11. నాకిష్టమైన బ్లాగుల్లో పరిమళంగారి బ్లాగొకటి.

    మురళిగారూ, చక్కటి పునఃపరిచయం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మీరు పరిచయం చేసిన 'అనతం ' బ్లాగ్ చదివాను. అది చదువుతున్నంతసేపు వేరే లోకం లోకివెళ్ళిపోయాను. పరిమళం గారి బ్లాగ్ కొన్ని రోజుల నుంచి చదువుతూనే ఉన్నాను. మీ పరిచయం తరువాత ఇంకా ఎన్నో కొత్త అందాలు కనిపిస్తున్నాయి. చక్కటి రచనా శైలి, ఇంకా చదువుతూనే పోవాలి అన్న ఉత్సుకతని పేంచే శక్తి వారి రచనల్లో ఉంది. మీరు ఏ పరిచయాలు చేసినా చాలా చక్కటి విశ్లేషణ తోటి చేస్తారు. ఈనాడు లో వొచ్హిన మీ బ్లాగ్ మీది ఆర్టికల్ ఒక్కసారి చదవాలని ఉంది. ఆ అవకాశం కూడా మాకు కలిగించొచ్హు కదా!

    రిప్లయితొలగించండి
  13. పరిమళం, మీ బ్లాగు ఎప్పటికీ అప్రతిహతంగా సాగాలి.
    మురళి, నిజంగా సహృదయతకి మీ ఈ టపా గుర్తు. పరిమళం గారితో నాది దాదాపుగా నా మొదటి కవితల సమయం నుండీ అనుబంధం, ఒక్కోసారి ఆశ్చర్యమనిపిస్తుంది. తను ఎక్కడ ఆపారో ఆ టపా నుండి వరసగా చదువుకొచ్చి వ్యాఖ్యలు కలుపుతారు, అందుకే తనకోసం చూడటం అలవాటు.

    పోతే, "అన్నట్టు ఈ బ్లాగు పాఠకులు కొన్ని రహస్యాలని కూడా కాపాడాల్సి ఉంటుంది" కాస్త మెదడుకి పని పెట్టారు. నా వూహ తప్పు కావచ్చు ;)

    .. మీరు తనకి అన్నయ్య?
    .. రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తెలిసిన వారా?
    .. "నన్ను నేను ఇలా పరిచయం చేసుకోవచ్చని నన్ను ప్రోత్సహించింది నా.... హితుడు........ స్నేహితుడూ" పరిమళం గారి మాటలు మీ గురింఛేనా?

    ఆయ్ రహస్యం అన్నానా అనకండేం? మీరే కదా తీగ లాగారు, నేను డొంక వెదుకుతున్నాను.

    రిప్లయితొలగించండి
  14. చాలా బాగా చెప్పారు ..పరిమళం అంటే అందరికీ అభిమానమే ..మురళి గారు ధన్యవాదాలు నేను మిస్ అయిన టపాలను ఈరొజే చదువుకున్నా..పరిమళం గారు అభినందనలు

    రిప్లయితొలగించండి
  15. @తృష్ణ: 'పలికెడిది భాగవతమట..' ధన్యవాదాలు..
    @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: ఇవి కూడా జ్ఞాపకాలేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @చిలమకూరు విజయ మోహన్: ధన్యవాదాలు.
    @చిన్ని: నేను కూడా మొదట్లో చాలా ఆలోచించానండీ.. ఏ పూలై ఉంటాయా అని.. ఇప్పుడింక మానేశా :) ..ధన్యవాదాలు.
    @మాలాకుమార్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @రవిగారు: ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, చూస్తున్న బ్లాగులు.. ఇవండీ సంగతులు.. ధన్యవాదాలు.
    @Ruth: ఒప్పుకుంటానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @రాజశేఖరుని విజయ్ శర్మ: ధన్యవాదాలు.
    @భావన; నిజంగా!! ..ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @జయ: ప్రస్తుతం ఆ లింకు పనిచేస్తున్నట్టు లేదండీ.. ధన్యవాదాలు.
    @ఉష: మీరు పొరబడ్డారండీ.. పొరబడ్డారు. 'గోరింట పూసింది' టపా చదివితే మీకు విషయం అర్ధమవుతుంది.. పరిమళం గారు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారైతే బ్లాగు మొదటి రోజునుంచీ చదివే వాడిని కదండీ.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ : ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. యా యా పాయింటే. మరేమిటి చెప్మా? అయితే గియితే ఇదన్నమాట సంగతి, కాకపోతే వదిలేద్దాం. :) మన ముగ్గురుదీ గోదావరి జిల్లానే. శ్రీమతికి మీరు గోరింటాకు పెడతారు :)

    నా వాదనకి సపోర్ట్:

    .. శ్రీవారిచేత కుడిచేతికి పెట్టించుకోవడం అన్న విశేషం

    .. "చివరి లైన్లు చదువుతుంటే శ్రీరమణ 'మిధునం' కథ గుర్తొచ్చేసింది.. "మేము మరీ అంత పెద్దవాళ్ళమా?" అని కర్ర పుచ్చుకోవద్దు.. వయసు గురించి కాదండి..'అన్యోన్యత' విషయం లో" అని మీరనటం, "మా అన్యోన్యతకు గుర్తు నా కుడి అరచేయి" అని సమాధానం

    వదలదేమి అంటారా? ;) జీళ్ళపాకం మన జిల్లాల స్పెషల్ కదా......

    రిప్లయితొలగించండి
  21. అవి యాపిల్ పూలు. అడపా దడపా చూస్తాను కనుక ఈ బ్లాగు నాకు ఎక్కువ తెలియదు. ఇవ్వాళే చదివాను సగం టపాలు.

    రిప్లయితొలగించండి
  22. హైదరాబాదు, అమెరికా, సరె! గుంటూరు బ్లాగులు ఎన్ని ఉన్నాయి? మా గుంటూరోళ్ళం అందరం అలిగాము, మురళీ గారు ఈ సమస్యకు సమాధానం చెప్పాలిసిందే అని మనవి చేసుకుంటున్నాము, మేము నొచ్చుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  23. @ ఉష: ఏమండోయ్..ఇక్కడ గోదారి జిల్లాదాన్ని నేనొకత్తెను కూడా ఉన్నానండి బాబూ..గుర్తుంచుకోండి...పైగా "ఉభయ గొదారిజిల్లాల cusp" ని కూడా.(అమ్మది తూర్పు, నాన్నది పశ్చిమ గోదావరి..)

    ఆవిడకు ఎవరు గోరింటాకు పెట్టారనేదే దాచవలసిన రహస్యం.. అంతకు మించి వేరేది లేదేమో అని నా guess..

    రిప్లయితొలగించండి
  24. @ఉష: రహస్యాన్ని చేధించడమంటే మీకెంత ఇష్టమో కదా :):) మళ్ళీ తప్పారు.. సరైన సమాధానం తృష్ణ గారు చెప్పారు చూడండి.. అన్నట్టు ఆవిడకి కూడా గోదావరి క్లబ్ లో సభ్యత్వం ఇవ్వండి..
    @సునీత: గుంటూరోళ్ళు అలుగుతారని డౌటొచ్చే బ్రాకట్లో డిస్క్లైమర్ ఇచ్చేశానండి.. కొత్తల్లో రెండు మూడు చోట్ల కనిపించినా ఎక్కువమంది ఉన్నారు అనిపించడం సహజమే కదా.. యాపిల్ పూలు ఎప్పుడూ చూడలేదండీ.. అందుకే గుర్తుపట్టలేక పోయాను.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీకు నూటికి నూరు మార్కులు.. అభినందనలు కూడా..

    రిప్లయితొలగించండి
  25. మురళిగారు , ముందు ఈ టపా చూసినప్పుడు ఒకసారి కవిత రాస్తానని మాటిచ్చారు కదా ..అలా ఏదైనా కవిత రాసారేమో అనుకున్నా నండీ ...తీరావచ్చి చూశాక నా ఆశ్చర్యానికి అవధిలేదు . ఒక అతి సామాన్యమైన బ్లాగుని కూడా ఇంత అందంగా పరిచయం చేయడం మీకే సాధ్యం ! ఏం చెప్పగలను కృతఙ్ఞతలు తప్ప !
    @ బ్లాగ్ మిత్రులకు , మీరు నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచకపోతే నేను ఇన్నిరోజులు బ్లాగ్ రాయగలిగేదాన్ని కాదు. మీకందరకూ నెమలికన్ను సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకోవడం నాకు చాలా ఆనందదాయకం.

    రిప్లయితొలగించండి
  26. @పరిమళం: కవిత రాస్తానని మాటివ్వలేదండీ.. రాస్తానేమో అన్నాను... 'సామాన్యమైన బ్లాగు' అని మీరనుకోవచ్చు కానీ మేము ఒప్పుకోము కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి