చిన్నప్పుడు రేడియోలో ఇష్టమైన పాట వస్తూ ఉంటే, పని మానుకుని రేడియో గదిలో చేరేవాళ్ళం. ఒక్కోసారి ఉన్నట్టుండి పాట ఆగిపోయేది. కరెంటు పోయిందేమో అని చూసుకుని, ఆ తర్వాత నాబ్ లు తిప్పి రిపేర్లు చేసినా ఉపయోగం ఉండేది కాదు. ఓ రెండు నిమిషాల తర్వాత పాట లో చివరి భాగం వినిపించేది. మరి కాసేపటికి ప్రసారం లో ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇన్ని నిముషాల ఇన్ని సెకన్ల సేపు సాంకేతిక కారణాల వల్ల అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామంటూ ప్రకటన వచ్చేది.
అదేమిటో కానీ ఎప్పుడూ మంచి పాటలు వచ్చినప్పుడో, నాటకం మంచి రసకందాయంలో ఉన్నప్పుడో పగ పట్టినట్టు అంతరాయం వచ్చేసేది. పాటలంటే మరో సారి వచ్చినప్పుడు వినొచ్చు కానీ, నాటకం లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? పైగా అంతరాయం అందరి రేడియోల్లోనూ ఒకేసారి వస్తుంది కాబట్టి ఎవరినీ అడగడానికి కూడా ఉండేది కాదు. దాంతో ఆ టైములో కథ ఏ మలుపు తిరిగి ఉంటుందో మా ఊహా శక్తి మేరకు ఊహించుకునే వాళ్ళం.
టీవీ వచ్చాక సహజంగానే రేడియో వెనకబడింది. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారి ప్రసారాలు మొదటి నుంచి చివరి వరకూ దీక్షగా చూడాల్సిందే. సుబాబుల్ పంట లో తెగుళ్ళ నివారణ మొదలు, గొర్రెల్లో నట్టల వ్యాధి, శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కార్యక్రమాలు కూడా రెప్ప వెయ్యకుండా చూసిన రోజులు ఉన్నాయి.'ఓవర్ టు ఢిల్లీ' రాగానే టీవీ కట్టేసేవాళ్ళం మొదట్లో. తర్వాత 'చిత్రమాల' వగైరా కార్యక్రమాలు అలవాటయ్యాయి.
అలా శ్రద్ధగా టీవీ చూస్తుండగా ఉన్నట్టుండి బుల్లి తెర నిండా మెరుపులూ, మరకలూ కనిపించేవి. షరా మామూలుగా మనకి చేతనైన మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం. ఒక్కోసారి అంతరాయం అని బోర్డు పెట్టేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే కొన్ని కార్యక్రమాల కన్నా మధ్యలో వచ్చే అంతరాయమే బాగుండేది.
కాసేపయ్యాక ఎనౌన్సరు విషన్న వదనంతో ప్రత్యక్షమై (అప్పుడే టీవీ పెట్టిన వాళ్ళు ఏ దేశ నాయకుడో తనువు చాలించేశాడేమో అని సందేహించే విధంగా) ప్రసారంలో అంతరాయం కలిగినందుకు చింతించే కార్యక్రమం ఉండేది. అందరూ యధాశక్తిగా చింతించినప్పటికీ, నాకు గుర్తున్నంతవరకు మిగిలిన వాళ్ళ కన్నా శాంతి స్వరూప్, విజయదుర్గ చింతించే విధానం కొంచం ప్రత్యేకంగా ఉండేది. ఈ చింతించడం మీద బోల్డన్ని జోకులు ప్రచారంలో ఉండేవి. అనౌన్సర్ కన్నీళ్ళకి డ్రాయింగ్ రూం సగం మునిగిపోయినట్టు వచ్చిన కార్టూను ఇప్పటికీ గుర్తే.
శాటిలైట్ చానళ్ళు వచ్చి టీవీ కార్యక్రమాల ప్రసారం లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. వాటిలో ముఖ్యమైనది అంతరాయాలకి చింతించక పోవడం. 'వీళ్ళకి బొత్తిగా మర్యాద తెలీదు.. అదే దూరదర్శన్ వాళ్ళైతే ఎంత మర్యాదస్తులో' అన్న జోకులూ వినిపించాయి. ఇప్పుడిప్పుడు ఫలానా టైము నుంచి ఫలానా టైం వరకూ అంతరాయం వచ్చే అవకాశం ఉంది అన్న స్క్రోలింగులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీవీలో మొన్నో ఆసక్తి కరమైన విషయం కనిపించింది.
మొన్న రాత్రి టీవీ తొమ్మిది లో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు ఇంటర్వ్యూ వస్తోంది. యాంకరు తో పాటు, ప్రజా నాట్యమండలి కళాకారిణి/ కార్యకర్త దేవి కూడా వంగపండు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన పాపులర్ పాట 'ఏంపిల్లడో ఎల్దమొస్తవా..' ట్యూన్ తో వైఎస్ ని పొగుడుతూ ఒక పాట రాశారట వంగపండు. 'ఇది మీకు తగునా?' అని వాళ్ళిద్దరూ వంగపండుని చెరిగేస్తూ, చెడుగుడు ఆడుతూ, మధ్యలో ఆయన చేత పాటలు పాడిస్తున్నారు.
ఒక రెండు బ్రేకులు బ్రేకాక, ఫోన్ ఇన్ పెట్టారు. చానల్ వారి నిలయ విద్వాంసులు ఫోన్ లో వంగపండుని నిలదీస్తుండగా, మిగిలిన ఇద్దరూ చిరు నవ్వులు చిందిస్తున్నారు. అప్పుడు వచ్చిందో ఫోన్ కాల్. కాలర్ టీవీ తొమ్మిది వారిమీద విరుచుకు పడ్డాడు. ఇంతసేపటికి ఒక భిన్నస్వరం వినిపించింది కదా అనిపించింది. ఇంతకన్నా పెద్ద పెద్ద విప్లవ ద్రోహాలు చేస్తున్న వాళ్ళని వదిలి అమాయకుడైన వంగపండునే ఎదుకు టార్గెట్ చేశారు? మిగిలిన వాళ్ళతో మాట్లాడే ధైర్యం మీకు లేదు.. అని సూటిగానూ, స్పష్టంగానూ మాట్లాడుతున్న క్షణాల్లో వచ్చింది అంతరాయం.
పాపం.. యాంకరు శక్తి వంచన లేకుండా 'హలో..హలో..' అంటూనే ఉన్నాడు. ఫోన్లో అవతలి నుంచి స్పందన లేదు. చేసినాయన ఎవరో ప్రజాసంఘం నాయకుడే.. 'లైన్లో ఏదో ప్రాబ్లం' అని చెప్పి ప్రోగ్రాం కొనసాగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ తర్వాత కార్యక్రమం దాదాపు అరగంట సేపు కొనసాగినా ఆయన మళ్ళీ ఫోన్ చేయలేదు.. చానల్ వాళ్లైనా ఆయనకి ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుందామని ప్రయత్నించలేదు. కనీసం అంతరాయానికి చింతించనూ లేదు. తర్వాత అలా నిలదీసే కాల్ ఒక్కటి కూడా రాలేదు.
అంతరాయానికి చింతించడం అనేది ఒకకళ. అందరికీ సాధ్యపదేదికాదు. ఒక శాంతిస్వరూప్ ఒక విజయదుర్గ ఈరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అదేవిటో ఎంతచింతిస్తున్నా చెరగని చిరునవ్వు వీళ్ల సొంతం. అన్నట్టు రేడియోలో పక్కస్టేషన్లు లాగే ఎఫక్టు మర్చిపోయినట్టున్నారు. అప్పుడప్పుడూ మద్రాసు సెకండ్‌చానలు కూడా ఈఎఫెక్టు చూపేది.
రిప్లయితొలగించండినమస్తే మురళిగారు,
రిప్లయితొలగించండినేను కూడా ఆ programme చూసానండి.అది అంతరాయం అని కొంచెం సంస్కరమగా మీరు అనుటుంన్నారు
కానీ అది కేవలం వారికీ నచ్చ లేదు కబ్బటి కట్ చేసారు.మావారు ఇంటికి వచ్చాక చుపిద్దామని పెడితే(రెండో సారి ప్రసారం చేస్నిప్పుడు) అసలు ఆ కాల్ లేకుండా ఎడిట్ చేసి మరీ programme వేసుకున్నారు.అంత గోప్పవాళ్ళూ.చూసే మనమేంటో నాకర్థం కాలేదు.నేనుకూడా ఈ విషయం మీద పోస్ట్ రాసాను వీలైతె చుడండి.
http://elchuri-swathimadhav.blogspot.com/2009/09/blog-post_29.html
అంతరాయం మీద నాకూ ఒక జోకు గుర్తుంది. టి.వి. లో అంతరాయం చూసి చూసి పిచ్చెక్కిన ఒక పెద్దమనిషి తలకు నూనె రాసుకుంటూ "అంత రాయకపోతే మరెంత రాస్తారూ?" అని చిందులెయ్యటం :)
రిప్లయితొలగించండిమురళీ గారూ,
రిప్లయితొలగించండిభలేగా గుర్తు చేశారు. చిన్నప్పుడు దూరదర్శన్ చూసేప్పుడు 'ఓవర్ టు ఢిల్లీ' అని వచ్చి రెండు కొంగలు (?) ఎగిరే బొమ్మ వచ్చేది కదూ ;) అలాగే, సడన్ గా ఏదో ప్రోగ్రాం మధ్యలో ఏదో ఒక సీనరీ వచ్చి దాని మీద అంతరాయానికి చింతిస్తున్నాం అని రాసేవాళ్ళు. కొన్ని సార్లు ఒక పది నిముషాలు బయటికెళ్ళి వచ్చేసరికి కూడా అదే సీనరీ వెక్కిరిస్తూ కనిపించేది :) అప్పుడేమో అలా సరిపెట్టారు. ఇప్పుడేమో అన్ని ఛానళ్ళలోనూ నేరుగా ఫోనులో మాట్లాడడం కదా.. వాళ్లకి అనుకూలంగా లేదనుకున్నప్పుడు "హలో..హలో..వినిపించట్లేదే..అరెరే లైన్ కట్టయిపోయింది" అంటారు. ఎంత టెక్నాలజీ పెరిగినా, వాళ్ళు చేయాలనుకున్నది చేసేస్తున్నారు. మీడియా వాళ్ళు బ్రతకనేర్చినవారు సుమీ ;)
అంతరాయాలకు ఇప్పటికీ చింతించేది రేడియో వారూ,దూరదర్షన్ వారు మాత్రమే..!!
రిప్లయితొలగించండి"తెగుళ్ళ నివారణ మొదలు, గొర్రెల్లో నట్టల వ్యాధి, శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కార్యక్రమాలు కూడా రెప్ప వెయ్యకుండా చూసిన రోజులు ఉన్నాయి"
టి.వి.కొన్న కొత్తల్లో మాదీ ఇదే పరిస్థితి. డి.డి 1 లో "సప్తాహికి" లో చెప్పిన ప్రోగ్రామ్స్ లిస్ట్ అంతా ఓ పుస్తకంలో సీరియస్ గా చాలా రోజులు నోట్ చేసేవాళ్ళం.
ఇక ఇప్పటి సేటిలైట్ చానల్స్ వాళ్ళ బ్రేకుల సంగతి చెప్పలా...సినిమా చుడాలంటే .....ఏడ్స్ మధ్యన సినిమా కొంచేం కొంచెం వేసినట్లు ఉంటుంది.అవార్డ్స్ ప్రోగ్రాం చూడాలంటే స్పోన్సరర్ల ఏడ్స్ ముందు ,తరువాత అవార్డ్స్...!
అబ్బా! శాంతి స్వరూప్, విజయదుర్గ .ఎప్పటి వాళ్ళో!మీకెంత గుర్తు. ఈపదమే వినపడి చాలా రోజులైంది.
రిప్లయితొలగించండిమొన్నొకరోజు రాత్రి ఒక FM వాళ్ళు శాంతిస్వరూప్ గారితో షో ప్రసారం చేసారు.ఎవరన్నా విన్నారో లేదొ మరి.ప్రోగ్రాం లో ఆయనను ఏంఖర్ వార్తల మధ్య,సంతాపాల్లోనూ ఆయన ప్రదర్శించిన హావభావాల గురించి కుడా ప్రశ్నలు వేసింది.చాలా జ్ఞాపకాలను తలుచుకున్నారు ఆయన ఆ రాత్రి షోలో..!
రిప్లయితొలగించండిజ్ఞాపకాల దొంతరలు..కదిలించారు...సాంతిస్వరూప్ విగ్గుఎత్తి బట్టనెత్తి గోక్కుంటున్నప్పుడు పొరపాటున కెమేరాలో బంధించేసి ప్రసారం చేసిన సందర్భాలు.
రిప్లయితొలగించండి:):)
తర్వాత పద్మ అనే ఒక యాంకర్. మా అక్కయ్యేలే, ఎన్నో కబుర్లు చెప్పేది దూరదర్శన్ హైద్ గురించి.
బుధవారం సాయంత్రం హిందీ పాటల కార్యక్రమం, ఆదివారం పొద్దున్నే రంగోలి.
ప్రతీరోజు పొద్దున్నే ఓ గంట కార్యక్రమాలు. పదికో తొమ్మిదన్నరకో స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రసారాలు S.I.T.E వారివి అనుకుంటా. దాంట్లో కాకరాల, రావికొండలరావు లాంటి మహా మహులు వచ్చేవాళ్ళు.
అలానే మిడ్ 1990s లో భమిడిపాటి కధలు.
ఆహా!! ఓ కధ ఇప్పటికీ గుర్తు.
నర్రా మరియూ సుత్తివేలు స్నేహితులు. సుత్తివేలు ఇల్లుమారాలి అని వెతుకుతుంటాడు నర్రా సాహాయంతో. పలానీ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళి అని తెలుస్తుంది. వెళ్తారు. ఓనర్ కాకరాల.
అయ్యా ఇల్లు కావాలి.
ఎంతమంది ఉంటారు
యాట యాట యాట
పిల్లలెంతమంది
యాట యాట యాట
కుక్కలు పిల్లులు ఉన్నాయా
లేవు
ఏమీలేదు నాకు ధ్వని కాలుష్యం అంటే మహా చిరాకు.
మీ మంచం శాబ్దం చేస్తుందా?
మీకు శబ్దం చేసే బూట్లు ఉన్నాయా?
ఇలా ఓ వందప్రశ్నలు వేసాక,
అయ్యా నేనో రచయితని, నా పెన్ను రసేప్పుడు బరబర్లాడుతుంది అని చెప్తాడు సుత్తివేలు.
ఐతే మీకు ఇవ్వను ఇల్లు అనేసి తలుపేస్కుంటాడు కాకరాల.
తర్వాత తర్వాత జైరాం రమేశ్ ప్రోగ్రాం ఒకటి వచ్చేది, సమయం గుర్తురావట్లా.
భాస్కరన్నా అది SITE కాదు SIET
రిప్లయితొలగించండిఅచ్చతెలుగులో దృశ్యశ్రవణ విద్యావికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాదు.
నామట్టుకు నాకు మొదట 'కిట్టిగాడు ' అప్పట్లో మనకు రోల్‌మోడల్. ఇక భట్టివిక్రమార్క, అమరావతికథలు, అఖండదీపం, ఆగమనం, సీతారాముల సినిమాగోల, మనిషి అబ్బో చాలా.
రేడియోలో ఇష్టమైన పాట వస్తుంటే పరిగెత్తుకుని వెళ్లి అక్కడ వుండేదాన్ని అంత ఎకాగ్రతన్నమాట :) మంచి జ్ఞాపకాలు ..మా రోజుల్లోకేల్లాను
రిప్లయితొలగించండి"తెగుళ్ళ నివారణ మొదలు, గొర్రెల్లో నట్టల వ్యాధి, శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కార్యక్రమాలు కూడా రెప్ప వెయ్యకుండా చూసిన రోజులు ఉన్నాయి"..
రిప్లయితొలగించండిహ హ హ .. నేను కూడా అంతేనండి..ఎప్పుడు తలచుకుంటే నవ్వు వస్తోంది .. భలే గుర్తుచేసారు ...
చెప్పాల్సిన మాటలు పైన దొర్లిపోయాయి. copy and paste కూడా మీరు చేసేద్దురూ... :)
రిప్లయితొలగించండిమంచి టపా
రిప్లయితొలగించండిbagundi sir
రిప్లయితొలగించండిమురళీ గారు మీ 'అంతరాయం ' బాగుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లల్లో కూడా కొన్ని తరహాల అంతరాయాలకి గమ్మత్తుగ స్పందిస్తూ ఉంటారు.
రిప్లయితొలగించండిభలేగా గుర్తు చేసారండి . బాగుంది .
రిప్లయితొలగించండిబాగా గుర్తుచేశారు.నేను అనుకున్న కామెంట్స్ అందరు రాసారు.నేను దూరదర్శన్ లో బాగా వెయిట్ చేసి చూసే ప్రోగ్రాం రేపటిప్రసారాలు.
రిప్లయితొలగించండిఏదేమైనా దూరదర్శన్ రోజులే రోజులండీ...నేను 'జంగల్ బుక్' వచ్చినప్పుడు రెప్పార్పకుండా చూసేవాణ్ణి. అందులో మోగ్లీలాగానే ఒక్క చెడ్డీ మాత్రమే వేసుకుని చూసేవాణ్ణి నేనే మోగ్లీ అన్న ఫీల్ కోసం.... అలానే 'డక్ టేల్స్' కార్టూన్....
రిప్లయితొలగించండిఓ సారి ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చినప్పుడు ఇలానే 'అంతరాయానికి చింతిస్తున్నాం' అని బోర్డు తగిలించారు...అసలే పాత సినిమా చూస్తున్నానన్న చిరాకులో ఆ బోర్డుని 'చింతరాయానికి అంతిస్తున్నాం' అని చదివాను. అంతే మా నాన్న ఘాట్టిగా ఓ మొట్టికాయ వేసేసరికి పేరడీ తిక్క కాస్త వదిలింది.
అవునూ మీకెవరికీ 'హిమబిందు' సీరియల్ గుర్తులేదా? చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మా అమ్మ ఆ సీరియల్ లో వచ్చే టైటిల్ సాంగ్ నా చేత పాడించేది.
@సుబ్రహ్మణ్య చైతన్య: నిజమేనండీ.. వాళ్ళిద్దరి స్టైలే వేరు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్వాతి మాధవ్: చదివానండి.. చాలా బాగా రాశారు.. ధన్యవాదాలు.
@బృహస్పతి: బాగుందండీ జోకు.. ధన్యవాదాలు.
@మధురవాణి: మొదట్లో కొన్నాళ్ళు బాతుల్ని చూపించారు.. తర్వాత కొంగలకి మారారండి.. మీడియా వాళ్ళు నిజంగానే బతక నేర్చిన వాళ్ళు... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: నేను టీవీలో సినిమా చూడనండీ.. డీవీడీ నే.. ప్రకటనల బాధ పడలేక.. ధన్యవాదాలు.
@సునీత: వాళ్ళని మర్చిపోగలమా చెప్పండి? ..ధన్యవాదాలు.
@తృష్ణ: అయ్యో.. శాంతి స్వరూప్ గారి ప్రోగ్రామ్ మిస్సయ్యానండీ.. ఎన్నాళ్ళయిందో ఆయన్ని చూసి, గొంతు విని.. ...మీరు విన్నట్టయితే ఆ విశేషాలు మా అందరితో పంచుకోరాదూ?
రిప్లయితొలగించండి@భాస్కర్ రామరాజు: మీరు ఉదహరించిన కార్యక్రమం 'భమిడిపాటి రామగోపాలం కథలు' అవే పాత్రలతో చాలా కథలు తీశారు.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: ఎన్ని సీరియళ్ళు ఇచ్చినా చక్కగా పదమూడు వారాలకు అవగోట్టేసే వాళ్ళు.. ఇప్పుడు వాళ్ళు కూడా మెగా సీరియల్సే ఇస్తున్నారు..
@చిన్ని: రేడియోతో అనుబంధం ప్రత్యేకమైనదండీ.. నాక్కూడా చాలా గుర్తొస్తున్నాయి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నాగ వర్మ మంతెన: అప్పుడలా చూసేవాళ్ళం.. అదొక్కటే చానల్ కదండీ.. ధన్యవాదాలు..
@ఉష: అంతేనంటారా? ..ధన్యవాదాలు.
@సృజన: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: నిజమేనండీ.. మంచి విషయం గుర్తు చేశారు.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: ధన్యవాదాలు.
@మాఊరు: వాటిలో కూడా విజయదుర్గ శైలి ప్రత్యేకం.. 'ఎప్పటిలాగే వార్తలు' అని ఆవిడ మాత్రమే అనేవారు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: మోగ్లి చెడ్డీ..హ.హ..హ... 'జంగల్ జంగల్ బార్ చలీ హై..' ..'హిమబిందు' ఎవరు మచిపోతారండీ? 'బిందు లాలలా..హిమబిందు లాలలా..' ఈ పాటే కదా మీరు పాడింది? అన్నట్టు మీ పేరడీ కూడా సూపరు.. ప్చ్.. 'ఈ పెద్దోల్లున్నారే...' ('నువ్వు-నేను' లో ఉదయ్ కిరణ్ డైలాగ్ అన్నమాట!!) ...ధన్యవాదాలు.
శేఖర్ గారూ,"జంగిల్ బుక్" మేమూ చూసేవాళ్ళం..మురళిగారూ పాటలో ఒక పదం తప్పు రాసారు..:) :)
రిప్లయితొలగించండిహిమబిందుని మర్చిపోతామా?మా కాలేజి లోనే చదివేది తను. సిరియల్లో చూసిన తరువాత రోజూ కాలేజీలో చూస్తూంటే భలే గా ఉండేది.
అసలూ నేను దూరదర్షన్ మీద ఒక టపా రాయాలని..
భలే !చిన్నప్పుడు ఈ చిత్రమాల కోసం త్వరగా భోజనాలు కానిచ్చేసి మరీ ఎదురుచూసేవాళ్ళం మధ్య మధ్య అంతరాయాలతో ఓ మూడున్నర పాటలు వేసేవాడు :) :)
రిప్లయితొలగించండిఇప్పుడు ప్రకటనల గోల ఎక్కువైంది ప్రకటనలు పూర్తయ్యేసరికి ముందేం జరిగిందో మర్చిపోతున్నాం :) :)
@తృష్ణ: సరిగ్గా గుర్తు లేదండి.. మీ టపాలో రాయండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: 'చిత్రమాల' లో ఒకే ఒక్క తెలుగు పాట వచ్చేదండి.. దానికోసం మిగిలిన భాషల పాటలు చూసేవాళ్ళం. ధన్యవాదాలు.
అంతరాయం గురించి భలే వ్రాశారు. నిజ్జంగా వాళ్ళ ఫేసులు అలానే ఉండేవి. ఇంక టీవీ-9 విషయానికొస్తే, ఆ చానెల్ చూడకపోవటం చాలా ఉత్తమం. ఓ రోజు ఓ నలుగురు హీరోల అభిమాన సంఘాల అద్యక్షులను పిలిపించి "ఎవరు గొప్ప హీరో" అని వాళ్ళు కొట్టుకుంటుంటే సదరు ఏంకరు ఆనందంతో, చిరునవ్వులు చిందుస్తున్నాడు. చాలా చిరాకుగా అనిపించింది.
రిప్లయితొలగించండి