శుక్రవారం, సెప్టెంబర్ 18, 2009

పుష్పక విమానము

టైటిల్ చూసి ఇది కేవలం తెలుగు సినిమా అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సినిమా.. తెర మీద కనిపించేది కేవలం భారతీయ నటీనటులు, సంస్కృతి, వాతావరణం కాబట్టి ఇది భారతీయ సినిమా.. ప్రయోగాలను అమితంగా ఇష్టపడే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తానే నిర్మాతగా 1988 లో రూపుదిద్దిన సినిమా 'పుష్పక విమానము.' మొదట కన్నడలో తీసి, ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా లో మాటలు ఉండవు.

కథ జరిగే నగరం పేరు, కథలో పాత్రల పేర్లు ప్రేక్షకులకి తెలియవు.. కానీ అవేవీ ఈ సినిమాని ఆస్వాదించడానికి అడ్డంకి కాదు. అంతేనా.. కమర్షియల్ హంగులైన పాటలు, ఫైట్లు కూడా ఈ సినిమా లో లేవు. ఉన్నవల్లా ఏమిటంటే ఉత్కంఠత రేకెత్తించే కథనం, సున్నితమైన హాస్యం, వీనుల విందైన నేపధ్య సంగీతం. సినిమా చూడడం మొదలు పెడితే నూట ముప్ఫై నిమిషాల సమయం మనకి తెలియకుండానే గడిచిపోతుంది.

ఇది ఒక నిరుద్యోగి (కమల్ హాసన్) కథ. ఒక పాతబడ్డ ఇల్లు 'ఆనంద భవన్' లో పెంట్ హౌస్ లో అతని నివాసం. పేపర్లలో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ, ఇంటర్వ్యూలకి వెళ్లి నిరాశగా తిరిగి వస్తూ ఉంటాడు.. డబ్బు సమస్య ఉండనే ఉంది. అతనికి ఓ హస్తకళల దుకాణంలో చిత్రంగా పరిచయం అవుతుంది ఓ అమ్మాయి (అమల), ఓ మెజీషియన్ (కే.ఎస్. రమేష్) కూతురు. తొలి పరిచయంలో అతనో లక్షాధికారిగా భ్రమ పడుతుంది ఆమె.

నగరంలో బాగా పేరున్న పెద్ద హోటల్ 'పుష్పక్' లో దిగుతాడు ఓ బిజినెస్ మాన్ (సమీర్ కక్కర్), విపరీతమైన తాగుబోతు. అతని భార్యకి, అతని స్నేహితుడు (ప్రతాప్ పోతన్) తో అక్రమ సంబంధం. సమీర్ ని అడ్డు తొలగించుకుని అతని ఆస్తి అనుభవించాలన్నది ప్రతాప్ పోతన్ ప్లాన్. ఇందుకోసం ఓ కిరాయి హంతకుడిని (టిను ఆనంద్) నియమిస్తాడు. సమీర్ కక్కర్ ఫోటో చూపకుండా 'పుష్పక్' లో అతని గది నెంబరు ఇచ్చి, ఆ గదిలో ఉన్నవాడిని చంపేయమంటాడు.

సరిగ్గా అదే సమయంలో 'పుష్పక్' బయట రోడ్డు మీద అపస్మారక స్థితిలో ఉన్న సమీర్ కక్కర్ ని చూసిన కమల్ హాసన్, అతన్ని తన గదిలో బంధించి, హోటల్ రూం తాళం సాయంతో తను అతని గదికి మారతాడు. అమల కూడా అదే హోటల్లో దిగడంతో వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పటి వరకు దరిద్రం అనుభవించిన కమల్ కి ఒక్కసారిగా అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో తెలియక పడే అవస్థలు ఒక పక్క, హోటల్ గదిలో ఉన్న కమల్ ని చంపడానికి టిను ఆనంద్ చేసే చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు మరో పక్క సాగుతూ ఉంటాయి.

తన మీద హత్యా యత్నాలు జరుగుతున్నాయని తెలిసిన కమల్ ఏం చేశాడు? అతని జీవితపు అసలు రంగు తెలిసిన అమల ఎలా స్పందించింది అన్నది సినిమా ముగింపు. ఎప్పటిలాగే కమల్ వంక పెట్టలేని నటనని ప్రదర్శించాడు. నిరుద్యోగిగానూ, డబ్బులో మునిగి తేలినప్పుడూ, సంపాదనకి సంబంధించి జీవిత సత్యాలు తెలుసుకున్నప్పుడూ అతని హావభావాలు గుర్తుండి పోతాయి. అమల అతనికి సరిజోడి.

నిజానికి ఈ సినిమా క్రెడిట్ లో అత్యధిక భాగం దర్శక నిర్మాత సింగీతం శ్రీనివాసరావు కి చెందుతుంది. తానే రాసుకున్న కథని ఒక్క డైలాగు కూడా లేకుండా తెరకెక్కించడంలో ఆయన చూపిన ప్రతిభ అసామాన్యం. ప్రారంభ దృశ్యాల్లో కమల్ ఉండే ఇంటి పనిమనిషి రేడియోలో వినిపించే సంగీతానికి అనుగుణంగా చీపురుతో నేల తుడిచే సన్నివేశం తోనే ప్రేక్షకులని కథలోకి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. పాత్రల స్వరూప స్వభావాలని ఫోటోల సాయంతో వివరించిన తీరు ఆశ్చర్య పరుస్తుంది.

నాయికా నాయకులు హోటల్ బాల్కనీలలో దూరంగా నిలబడి సైగలతో మాట్లాడుకోడం మొదలు, సినిమా హాల్లో చుంబన దృశ్యం వరకు వారి పరిచయం క్రమంగా పెరగడాన్ని అతి తక్కువ సీన్లలో చూపించారు. నాయిక ఇంటి వాతావరణం, ఆమె తల్లికీ తండ్రికీ పడక పోవడం, ఆమె అల్లరి చేష్టలు ఇలా అతి చిన్న విషయాలని కూడా శ్రద్ధగా చిత్రించడం గమనిస్తే మాటలకన్నా కూడా మౌనమే బలమైన మాధ్యమం అనిపించక మానదు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది పి.ఎల్. నారాయణ పోషించిన బిచ్చగాడి పాత్ర. ఇతను కనిపించేది మూడు సన్నివేశాల్లోనే అయినా మూడూ బలమైన సన్నివేశాలు. కథానాయకుడి ఆలోచనల్లో మార్పు రావడానికి ఈ బిచ్చగాడు కొంతవరకు కారణం. హీరోని ప్రభావితం చేసిన మరో వ్యక్తి 'పుష్పక్' హోటల్ ప్రొప్రైటర్. ఓ చిన్నటీ కొట్టుతో వ్యాపారం మొదలు పెట్టి, స్టార్ హోటల్ అధిపతి గా మారిన ఆయన జీవితం కమల్ డబ్బుకి సంబంధించి తన ఆలోచనలు మార్చుకునేలా చేస్తుంది.

ఆద్యంతమూ హాస్యరస భరితం ఈ సినిమా. ఉదహరించాలంటే అన్ని సన్నివేశాలనీ తిరిగి రాయాల్సిందే. హస్తకళల షాపులో మేనేజర్ పాత్రే 'క్షణ క్షణం' లో బ్రహ్మానందం పాత్రకి స్ఫూర్తి అనిపిస్తుంది. ఎల్. వైద్యనాధన్ అందించిన నేపధ్య సంగీతానిది ఈ సినిమాలో కీలకపాత్ర. బారెడు డైలాగు ఇవ్వలేని సందేశాన్ని ఒక చిన్న ఎక్స్ ప్రెషన్, వెనుక నేపధ్యంలో వినిపించే సంగీతం ప్రేక్షకుడికి అందిస్తాయి. అసలు శాస్త్రీయ సంగీత కళాకారుడితో నేపధ్య సంగీతం చేయించాలన్న ఆలోచనే గొప్పగా ఉంది.

నిజానికి ఈ సినిమా ద్వారా సింగీతం సినిమా పరిశ్రమకి ఒక కొత్త వ్యాపార సూత్రం చెప్పారు. మాటలు లేకుండా సినిమా తీసి విజయవంతం చేయగలిగితే ఆ సినిమాని అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల చేసి లాభాలు సంపాదించవచ్చు, డబ్బింగ్ లాంటి ఖర్చులు కూడా లేకుండా. కానీ ఆ తర్వాత ఎవరూ ఇలాంటి సినిమా తీయలేదు. మాటలు లేని ఈ సినిమా గురించి ఎన్ని మాటలు చెప్పినా ఇంకా చాలవేమో అనిపిస్తోంది..

28 కామెంట్‌లు:

  1. ఒక విషయాన్ని చెప్పటానికి మాటలే అవసరం లేదు అని తన సినిమా ద్వారా నిరూపించారు సింగీతం గారు.నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి.
    చిన్నప్పుడు ఒక కధ చదివాను,ఒక చేపలమ్ముకునే వాడికి పరిమళభరితమైన పూల దగ్గర పడుకొమన్నా నిద్ర పట్టదు.మళ్ళీ తన చేపల దగ్గరకు వెళ్తేనే సుఖంగా నిద్ర పొతాడు.అలాగ ఈ సినిమాలో కమల్ కి సినిమా తాలుకూ సౌండ్లు వినిపిస్తే కాని నిద్ర పట్టని సీన్ బాగుంటుంది..!
    కానీ ఆఖరులో అమల అడ్రస్ కాయితం కమల్ కు అందకుండా ఎగిరిపొవటమే నాకు నచ్చదు..దానికి వేరే సింబొలిక్ అర్ధాలేమున్నా సరే..!!

    రిప్లయితొలగించండి
  2. బిచ్చగాడు తన వద్ద ఉన్న దబ్బులు చూపించతం నవ్వు తెప్పిస్తే;అతను చనిపోయాకా అతని దబ్బులు మనుషులు ఏరుకునే సీన్ బాగా కదిలిస్తుంది..

    రిప్లయితొలగించండి
  3. పుష్పక విమానం సినిమా గురించి మీ పరిచయం చాలా బాగుంది. చిన్నపుడు ఈ సినిమా చూసిన రోజులు గుర్తుకొచ్చాయి. నెనర్లు.

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి సినిమా పరిచయం చేసారు మీరు. ఇందులో కొన్ని సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేము. అమల షాప్ లో చెవి లోలకులు కొనేటప్పుడు అప్పటి వరకు ఏమాత్రం పరిచయం లేని కమల్ హాసన్ హావభావాలను ఫాలో అవుతు చివరికి అతడు నచ్హి నవే కొనుక్కోటం, పి.ఎల్. నారాయణ అడుక్కుంటూ గడిపిన గొనె బస్తా కింద అతను చని పోయిన తరువాత కనిపించే ఎంతో డబ్బు, మాజిక్ షో లో ఐస్ కత్తి తో జరిగే గమ్మత్తులు, ఇలా చాలా, ప్రతీ సీన్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు, తృష్ణ గారు చెప్పింది నిజం "ఒక విషయాన్ని చెప్పటానికి మాటలే అవసరం లేదు", ఒక్కోసారి మాటలు లో చెప్పలేనిది హావభావాలను ఉపయోగించి చెపుతాము మనం, కానీ ఈలాంటి సినిమా తియ్యాలి అంటే నిజంగా సాహసమే. ఇప్పటికి ఈ సినిమా చాలా సార్లు చూసాను, చుసిన ప్రతిసారీ ఏదో కొత్తగా అనిపిస్తుంది. కమల్, అమల నటన ఒక అద్భుతం. కమల్, అమలలు బాల్కనీలలో నిలబడి సైగలతో మాట్లాడుకోడం అలాగే షాపులో మెజీషియన్ చేసే పనులు చాల బాగుంటుంది. ఈ సినిమా చూసి ప్రేమికులు చాలా నేర్చుకోవచు.

    రిప్లయితొలగించండి
  6. చాలా మంచిసినిమా ని గుర్తుచేసారు. కమల్ లేకుండా ఈ సినిమాని అసలు ఊహించలేం. ఈ సినిమా చూసిన కొత్తలో సీన్లు మళ్ళీమళ్ళీ, గుర్తుచేసుకుంటూ పడిపడీ నవ్వుకొనేవాళ్ళం.( బస్టాండులో కమల్ గిఫ్ట్ బోక్స్ వదిలే సిన్ గుర్తొస్తే ఆటొమేటిక్ గా చేతులు ముక్కుమీదికెళ్ళిపోతాయి) ఆ వయసుకి అదో పెద్దకామెడి అనిపించేది

    రిప్లయితొలగించండి
  7. Murali garu,

    Excellent review. Simgitam is an adventurer and he won his bet by taking a movy where no dialogue is needed, like Mel Brooks Cinema.

    Thanks for coming tomy blog and making a good comment on my article on CD/DVD quality. As there are may mistakes, I deleted the article and again uploaded as a new article with more material. Can you see the new article and write your comment.

    రిప్లయితొలగించండి
  8. చాలా మంచి చిత్రం....
    నాకు ఫ్రిజ్ తెరచి ఐస్ క్యూబ్స్ తీసినప్పుడల్లా ఈ చిత్రంలోని టినూఅనంద్ గారి ఐస్ తో హత్యా ప్రయత్నం గుర్తుకు వస్తుంది. అలా అని ఎవరిమీద మీ హత్యా ప్రయత్నం అని అడకండీ:)

    రిప్లయితొలగించండి
  9. ఎంత మంచి సినిమా గుర్తు చేసేరు మీదైన శైలి లో మురళి.. థ్యాంక్స్..

    రిప్లయితొలగించండి
  10. మీరు మా ఇంటి పక్కన వున్నా dvd షాప్ వాడిని పెంచి పోషిస్తున్నారు. మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత సినిమాలని గుర్తుచేయడం.. నేను వెంటనే ఆ షాప్ వాడి దగ్గర వాటిని అద్దెకు తెచ్చుకోవడం.. మామూలు విషయం అయిపోయిందండి..ఇంకా నయం రోజుకొక సినిమా గురించి పరిచయం చెయ్యట్లేదు.. అలా అయితే ఆ షాప్ వాడు నా పేరు , మీ పేరు చెప్పుకుని ఒక బిల్డింగ్ కట్టేస్తాడు..

    రిప్లయితొలగించండి
  11. నిజమే మాటలే లేని ఈ సినిమా గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే... పి. యల్ నారాయణ సన్నివేశాలు చాలా బాగుంటాయ్.

    రిప్లయితొలగించండి
  12. పోయినవారం మాకు ఒకట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. కమల్ ఉద్యోగంకోసం క్యూలో నిలబడి వెనక్కు రావటాం, అమలని మొదటిసారి చూడటం, ఆపై కారుపొగలో నిలబడటాం వరకు చూపెట్టారు. అక్కడదాకా బానే ఉన్నా తర్వాత ఆసీనుకి ఏమాత్రం సంబంధంలేని కాన్సెప్టు గంటసేపు చెప్పాడు. ఈసినిమా తెలియని వాళ్లు నాచేతిలో బలైపోయారు. (శ్రీలక్ష్మిలాగా "లలితశివజ్యోతి ఫిలింస్ లవకుశ- తారాగణం .. " అంటూమొదలెట్టా) లంచ్‌బ్రేక్‌లో. సాయంత్రం అందరికీ నాకంప్యూటరులోంచి కాపీచేసి ఇచ్చాను. సగంటీ ఉన్నకప్పులో బొత్తాలువేస్కోవటాం నాకునచ్చే సీన్.

    రిప్లయితొలగించండి
  13. @తృష్ణ: నాయికా నాయకులు ఇక కలుసుకోరు అని సింబాలిక్ గా చెప్పడం కోసం ముగింపు అలా తీసి ఉంటారండి.. ధన్యవాదాలు.
    @వెంకట గణేష్: ఎన్నిసార్లు చూసినా విసుగు రాని సినిమా అండీ నాకు.. ధన్యవాదాలు.
    @జయ: కొన్ని సీన్ల గురించి మాట్లాడుకుంటే మిగిలిన వాటికి అన్యాయం చేసినట్టేనండి.. మొత్తం సినిమా అంతా చెప్పుకోవాలి :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @RSS: నిజమేనండీ.. కోడ్ లాంగ్వేజ్.. చాలామంది నేర్చుకునే ఉంటారు :-) ..ధన్యవాదాలు.
    @లలిత: ఆ సీన్లో బస్టాపులో నిలబడి అనుమానంగా చూసే వ్యక్తి గుర్తున్నాడా మీకు? అతని హావభావాలు .:-) .ధన్యవాదాలు.
    @శివ: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @పద్మార్పిత: అడగనండీ.. కానీ ఊహించే ప్రయత్నం చేస్తాను :-) ..ధన్యవాదాలు.
    @భావన: ధన్యవాదాలు.
    @సత్య: అలా చూసి ఊరుకోకుండా ఆ సినిమాల గురించి ఓ నాలుగు ముక్కలు బ్లాగితే మేముకూడా చదువుతాం కదండీ..? ఈసారి ఆపని చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @వేణూ శ్రీకాంత్: చాలా బలమైన సన్నివేశాలు.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఈ సినిమా? మీ పనేదో బాగున్నట్టు ఉందండీ.. అవునూ.. ఈ సినిమా చూడని వాళ్ళు ఉన్నారా? సింగీతం అద్భుత సృష్టి ఈ సినిమా.. నెల్లూరా? మజాకా? :-) ...ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: నిజమేనండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. సినిమా చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేసినట్టు గుర్తు కానీ, ప్రత్యేకంగా సంఘటనలేవీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ రోజుల్లో చాలా సంచలనం సృష్టించిన ప్రయోగం, డయలాగుల్లేకుండా.
    సత్యగారి వ్యాఖ్య బాగుంది.

    రిప్లయితొలగించండి
  18. మంచి ప్రయోగాత్మకమైన సినిమా.
    కాని అంత మంచి సినిమాకి ఆ టాయిలెట్ సీన్లు అవసరమా?
    కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. (కొన్ని కాపీ సినిమాలు కూడా)
    సింగీతం గారిని మన తెలుగువాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు.
    బాలకృష్ణ మాత్రం రెండు సినిమాలు చేసాడు.

    రిప్లయితొలగించండి
  19. మీరు రాసారు అని నాకు తెలిదు ... సింగీతం గారి జన్మదినం సందర్భంగా నేను ఈ రోజు పెట్టాను.. శుక్రవారం నుంచి బిజీ గా ఉంది నేను బ్లాగ్స్ చెక్ చెయ్యలేదు ... లేక పొతే పెట్టె వాడిని కాదు ...

    రిప్లయితొలగించండి
  20. @కొత్తపాళీ: డీవీడీ దొరికితే చూడండి.. నాకు ఎన్నిసార్లు చూసినా విసుగు రాని సినిమాల్లో ఇది ఒకటి.. ధన్యవాదాలు.
    @బోనగిరి: నిజమేనండి.. టాయిలెట్ సీన్ల గురించి నాకూ అలాగే అనిపించింది.. కానీ హోటల్ రూం కి వెళ్లడానికి ముందు కమల్ ఎలాంటి జీవితం గడిపాడో చూపడం లో భాగంగా వాటిని చిత్రించి ఉంటారనుకున్నాను.. సింగీతం-బాలకృష్ణ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయండి.. ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం. మొదటి రెండూ హిట్టయ్యాయి.. మూడోది ఫ్లాప్.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @శ్రీ: అలా అంటారేమిటండి? ఒకరు రాసిన సినిమా గురించి మరొకరు రాయకూడదని రూల్ ఏమీ లేదు కదా.. పైగా మీరు మాకెవరికీ తెలియని తెర వెనుక సంగతులు అనేకం రాశారు.. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాశా.. ధన్యవాదాలు.
    @మోహనవంశీ: నిజమేనండీ.. ఈ సినిమా నిరూపించింది ఆ విషయాన్ని.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. అద్భుతమైన సినిమా.
    అసలు కమలహాసన్ గారి ప్రతీ సినిమా ఒక ప్రయోగంలాగే అనిపిస్తుంది నాకు..విశిష్టమైన నటుడు.
    భాష లేకుండా భావాన్ని, పలికించడం, అసలా ఆలోచన వచ్చి దాన్ని ఆచరణ లో చూపిన దర్శకుడు చాలా గ్రేట్.

    రిప్లయితొలగించండి
  23. @ప్రణీత స్వాతి: కమల్ అంటేనే ప్రయోగాలండీ.. భారతీయ తెర మీద అన్ని ప్రయోగాలు మరెవ్వరూ చెయ్యలేదేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. పుష్పకవిమానం నిజంగా ఒక మంచి సినిమా.. అప్పట్లో ఆసియన్ పనోరమ కు ఈ చిత్రం వెళ్లి అనేక ప్రశంసలు పొందింది.

    రిప్లయితొలగించండి
  25. మంచి సినిమా ! తనదైన ప్రత్యేక శైలిలో హాస్యాన్నీ , సెంటిమెంటునీ సమపాళ్ళలో పండించారు కమల్ హాసన్ .చాన్నాళ్ళ తర్వాత ఆ చిత్రంలోని సన్నివేశాలను గుర్తుచేసుకొని నవ్వుకున్నా! థాంక్స్ మురళి గారు !

    రిప్లయితొలగించండి
  26. @సృజన్: అవునండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: కేవలం నవ్వించి ఊరుకోకుండా ఆలోచింపజేస్తారండీ సింగీతం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి