చంద్రుడు నడినెత్తికి వచ్చాడు. పున్నమి రాత్రి కావడంతో చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. నగరం అంతా గాఢ సుషుప్తి లో ఉంది. మేడ మెట్ల మీద కుర్చుని ఆకాశంలోకి చూస్తున్నా.. నాకు చంద్రుడికి మధ్య గున్నమావిడి చెట్టు. చైత్రం వచ్చేస్తోందిగా..ఉగాదికి వగరు పిందెలని ఇవ్వడం కోసం ఒళ్ళంతా పూలతో ఆయత్తమైపోతోంది.. లేత మామిడిపూల వాసన వగరుగా.. నిన్న మొన్నటిదాకా విరగబూసిన నిలువెత్తు పారిజాతం చెట్టు ఇప్పుడేదో పూయాలి కదా అన్నట్టు పూస్తోంది. ధనుర్మాసం ఐపోయింది కదా.. మామిడి కొమ్మల్లోనుంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. నా చేతిలో ఉన్న గ్లాసులో వేడి వేడి పాలు..చెవుల్లో జానకి జీవన వేణువులలో మోహన పాడుతోంది..
ఒక్కగుక్క పాలు తాగి చంద్రుణ్ణి చూశా..చాలా దూరంగా ఉన్నాడు. చిన్నప్పుడు పెద్దయ్యాక పెద్ద మేడ కట్టుకుంటే చందమామను అందుకోవచ్చు అనుకోవడం గుర్తొచ్చి నవ్వొచ్చింది..అజ్ఞానంలో ఎంత ఆనందం ఉందో కదా.. చంద్రుడిలో ఉన్నది కుందేలా లేక రాధా క్రిష్ణులా? ఎప్పుడూ సందేహమే నాకు.. రాధా బాధితున్నిలే.. అంటున్నాడు బాలు నా చెవిలో.. జారుపైట లాగనేలరా ఆహా ఆరుబయట అల్లరేలరా అంటూ జానకి..మళ్ళీ చిరునవ్వు.. కొంచం కొంచం పాలు తాగుతున్నా.. చలి అనిపించడంలేదు.. అప్పుడే వేసవి వచ్చేస్తోందా.. ఇలా అనుకోవడం ఆలస్యం..నా సందేహం అర్ధం చేసుకున్నట్టుగా చిరుగాలి తాకి వెళ్ళింది నన్ను..
పాలు తాగడం పూర్తయింది..నుదిటిమీద చిరు చెమట..చల్లగాలి తగిలి చాలా ఆహ్లాదంగా ఉంది.. మామిడి కొమ్మలు అడ్డొచ్చి చంద్రుడు సరిగా కనిపించడంలా.. చెవుల్లో జానకి మౌనమేలనోయి అంటూ.. చంద్రుడి కోసం బాల్కనీ లోకి కుర్చీ లాక్కున్నా..ఓ తెల్ల మబ్బు చంద్రుడి దగ్గరకి వెళ్ళే సాహసం చేయలేక దూరంగా జరిగి వదిగి వెళ్ళిపోయింది.. ఇళయరాజా ఫ్లూట్ బిట్ ఎంత బాగుంది..జానకి కి కొంచం విశ్రాంతి ఇచ్చి సునీత అందుకుంది ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అంటూ.. రెండో ఆట సినిమా వదిలినట్టున్నారు.. ఓ నలుగురైదుగురు సినిమా కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు. కుర్చీలో వెనక్కి వాలి మళ్ళీ చంద్రాస్వాదన..
పక్కింటాయన బయటికి వచ్చారు..పలకరించబోయి ఇయర్ ఫోన్స్ వైపు చూసి ఆగిపోయారు. పలకరింపుగా నవ్వా.. మసక వెలుతురులో కనిపించిందో లేదో.. ఆయన లోపలికి వెళ్లిపోయారు., చంద్రుడికి నాకు ఏకాంతం కల్పిస్తూ.. చిన్నప్పటినుంచీ చూస్తున్న చంద్రుడే అయినా ప్రతి పున్నమికీ కొత్తగానే ఉంటాడు.. 'సహస్ర చంద్ర దర్శనం' అని ఫంక్షన్స్ చేస్తుంటారు కాని వాళ్లు నిజంగా వెయ్యి సార్లూ పున్నమి చంద్రుడిని 'చూసి' ఉంటారా? నా ఆలోచనలో నేనుండగా మళ్ళీ బాలు, వాణి జయరాం తో కలిసి కురిసేను విరి జల్లులే.. అంటూ.. అమృతవర్షిణి రాగం నిజంగానే చెవుల్లో అమృతం కురిపిస్తోంది.. పూసిన కాసిని పూలనీ నిశ్శబ్దంగా రాలుస్తోంది పారిజాతం..విధి నిర్వహణ... తెల్లారి చేయాల్సిన పనుల జాబితా గుర్తొచ్చింది హఠాత్తుగా.. ఇష్టం లేకపోయినా చంద్రుడికి వీడ్కోలు చెప్పేశా... ప్రతి ఆనందానికీ ఓ ముగింపు ఉంటుంది.
మురళిగారు, ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా ఠపీమని నేల మీద పడేసారు, ఇదేమైనా న్యాయమా??
రిప్లయితొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండిచాలా బావుంది.
పున్నమి చంద్రుడంటే ఎవరికిష్టం ఉండదు? అయితే నాకు మాత్రం చిన్నప్పుడు ఆ చంద్రునిలో మచ్చని చూపి పేదరాశి పెద్దమ్మ అట్లు పోసుకుంటొంది అనేవారు. మనిషి ఆకారం, చేతిలో అట్లకాడ,అట్లపెనం కోసం ఎన్నిసార్లు కళ్ళు చికిలించి చూసానో..
ఓపిగ్గా అన్నీ చదివి మీరు నాబ్లాగులో పెట్టిన కామెంటు కి ధన్యవాదాలు
"షోడా నాయుడు" దొరకలేదండీ. మీ దగ్గర స్కాన్ చేసిన కాపీ ఉంటే nenunaaprapamcham@gmail.com కి పంపగలరా? మీకు శ్రమ లేక పోతేనే..మీరు ఈ విషయంలో ఏ మాత్రం శ్రమ తీసుకోవటం నాకిష్టం లేదు. అలానే "మనసులో వాన" కూడా.. మీకు వీలైతేనే సుమా...
నేను రాద్దామనుకున్న కామెంట్ లక్ష్మి గారు రాసేసారు ..:(
రిప్లయితొలగించండి@laxmi, నేస్తం: చెప్పాను కదండీ, ప్రతి ఆనందానికి ఓ ముగింపు ఉంటుందని.. మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఉమాశంకర్: త్వరలోనే మీకు పంపుతానండి.. మీ బ్లాగు చాలా బాగుంది. ధన్యవాదాలు.
chala bagundi.
రిప్లయితొలగించండిnannu nenu marchipoyannate nammamdi.
mukyam gaaa jani garu,sunithagaru,atruvata balugaru,vani gari raakalu matram super ante super
inka raayandi,all the best.
బాగుందండీ...చదివిన తరువాత వెన్నెలలో పాలు త్రాగిన ఫీలింగ్....
రిప్లయితొలగించండి@అజ్ఞాత: ధన్యవాదాలు. మీరు తెలుగు లో రాయడానికి ఈ లింక్ ను ఉపయోగించవచ్చు:
రిప్లయితొలగించండిhttp://www.google.co.in/transliterate/indic/telugu
@Padmarpita: ధన్యవాదాలు.
పైన వాళ్లందరూ చెప్పిన భావాలే నావీనూ..! అప్పుడే అయిపోయిందా.. అనిపించింది చదువుతుంటే.. :(
రిప్లయితొలగించండినేనయితే మీ వర్ణన ప్రకారం సీన్ చిత్రీకరించేసాను కూడా :)
ఎంత బాగా చెప్పారండీ..! ఎన్నో రోజులుగా ఈ దేశంలో మిస్ అయిపోతున్న వెన్నెలని మీరు అందించారు ఈ పోస్టుతో :) బోలెడన్ని థాంకులు మీకు..!
మురళి గారు,
రిప్లయితొలగించండిబావుంది అని చెప్తే చాలా చిన్నదైపోతుంది, పొందిన అనుభూతికి న్యాయం చేకూరదు......
కొంచం ఎక్కువ చేస్తే అది పొగడ్త అయిపోతుంది.....
ఎలా చెప్పాలో తెలీట్లేదు అంట బావుంది మీ వెన్నెల పానం
మీకు సంగీతం వచ్చా? రాగాలను గూర్చి చెప్పారుగా అందుకని :-)
"ప్రతి ఆనందానికీ ఓ ముగింపు ఉంటుంది" మీ కవిత పూర్తయ్యాక అది తెలిసింది. చాలా బాగుందండీ.
రిప్లయితొలగించండి@మధురవాణి: మీకు బోలెడన్ని ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావకుడన్: మీ పేరు చాలా బాగుందండి.. కొన్ని అనుభూతులని మాటల్లోకి తర్జుమా చేయడం చాల కష్టమని ఈ అనుభూతిని అక్షరీకరిస్తున్నప్పుడు మరోసారి అర్ధమైందండీ.. సంగీతం కొద్దిగా తెలుసు, అంటే మిడి మిడి జ్ఞానం అన్నమాట. ధన్యవాదాలు.
@పరిమళం: పేరు చూడగానే పూలరాసుల మధ్య ఉన్నానన్న ఫీలింగ్ కలిగిందండి. పొగడ్త కాదు సుమా.. కవిత కాదండి..అనుభూతిని అక్షరాలలోకి మార్చే ప్రయత్నం అంతే.. ధన్యవాదాలు.
మురళీ, చాలా చక్కగా రాస్తున్నావు. నీ టపాలు మొదటినుంచీ చదువుతున్నాను. ప్రతి పోస్టుకీ వ్యాఖ్య రాయలేదనుకోకు. నిజంగా చాలా బాగా రాస్తునావు. నిషిగంధ గుర్తొస్తోంది. ఇంకేం చెప్పాలో తెలీడం లేదు. చదువుతుంటే మనసుకు సాంత్వనగా ఉంది. నాకంటే చిన్నవాడివన్న ఉద్దేశంతో(అవునో కాదో తెలీదనుకోండి) ఏకవచనంలో సంబోధిస్తున్నాను. అభ్యంతరమనుకుంటే చెప్పండి.
రిప్లయితొలగించండి@సుజాత: ధన్యవాదాలు. పెద్దవాడినో, చిన్నవాడినో తెలియాలంటే మీ వయసెంతో తెలియాలి:) ...పిలుపుల పట్టింపు ఏమి లేదండి, మీ ఇష్టం. బ్లాగులోకానికి నేను కొత్త, నిషిగంధ గురించి కొంచం చెబుతారా?
రిప్లయితొలగించండిhttp://nishigandha-poetry.blogspot.com/
రిప్లయితొలగించండిMurali, check this link. you'll come to know about nishi and her poetry.
@సుజాత: యాదృచ్చికం! ఇప్పుడే 'నిషిగంధ' కామెంట్.. థాంక్స్ ఫర్ ది లింక్.
రిప్లయితొలగించండిఅద్భుతం గా వర్ణించారు."అజ్ఞానం లో ఆనందం" నిజమే కింద వుండి మబ్బుల్ల వెనుక ఏముందో అనుకొని కట్టుకున్న ఊహాప్రపంచం అంత అందం గా విమానంలో కూర్చుని చూస్తే వుండదు కదా.
రిప్లయితొలగించండిఅద్భుతం గా వర్ణించారు."అజ్ఞానం లో ఆనందం" నిజమే కింద వుండి మబ్బుల్ల వెనుక ఏముందో అనుకొని కట్టుకున్న ఊహాప్రపంచం అంత అందం గా విమానంలో కూర్చుని చూస్తే వుండదు కదా.
రిప్లయితొలగించండి@రాధిక: ఊహా ప్రపంచం అన్నది ఎవరి శక్తి మేరకు వారు నిర్మించుకోవచ్చు. కాని వాస్తవాలు వేరుగా ఉంటాయి. ఊహలే లేకపోతె జీవితం మరీ నిస్సారంగా ఉండదూ? మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపాలు-వెన్నెల-పాటలు!! ఎప్పుడెప్పుడు ప్రయతించి చూద్దామా అనిపిస్తోంది ఈ సన్నివేశం చదువుతుంటే.. చదువుతున్నంత సేపూ చాలా హాయిగా అనిపించింది :-)
రిప్లయితొలగించండిSujata.. very sweet of you :-)
రిప్లయితొలగించండిso,me vennello vedipaalu amdarni ekadiko teeskeltonai...memukooda try chesamu pch kudarledu,bahusha adi meekumaatrame somthamani ardamaindandi,paarijaatalu,maamidipootha..ivanni o chota kudaravu kadandi...mee raatalatho,maatalatho ekadiko teeskeltaru,..emthaina aa godavari neella tho perigarae.....
రిప్లయితొలగించండి@నిషిగంధ: ప్రయత్నించి ఊరుకోకుండా ఆ అనుభూతిని మా అందరితో పంచుకుంటారని ఆశిస్తూ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: అనుభూతి అన్నది ఏ ఒక్క ప్రాంతం వాళ్ళకో పరిమితమైనది కాదండి. అదే చంద్రుడు..నగరం, ఊరు, అడవి, గోదారి..ఎక్కడైనా.. మీరు కామెంట్ తెలుగులో రాస్తే బాగుంటుందని ఓ చిన్న సూచన. మీకు ధన్యవాదాలు.