గురువారం, డిసెంబర్ 31, 2015

ఇంకో ఏడాది ...

వచ్చినంత తొందరగానూ వెళ్ళిపోతోంది రెండువేల పదిహేను. మనం పని తొందరలో ఉన్నప్పుడు కాలం పరిగెడుతున్నట్టూ, ఖాళీగా ఉన్నప్పుడు ఎంతకీ కదలనట్టుగానూ అనిపించడం మామూలే కదా. గత కొన్నేళ్లుగా నడకకి అలవాటు పడ్డానేమో, ఈ ఏడాది మళ్ళీ పరుగందుకోవాల్సి రావడంతో త్వరత్వరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎప్పటిలాగే తీపినీ, చేదునీ కలగలిపి అందించి తనదోవన తను వెళ్ళిపోతోంది ఇంకో సంవత్సరం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గోదావరి మహాపుష్కరాలు, అమరావతి శంకుస్థాపన, ఆయుత చండీ యాగం.. ఇవన్నీ వెళ్ళిపోతున్న ఏడాది తాలూకు గుర్తులు. పుష్కర ప్రారంభ సంరంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన సామాన్యుల ఆత్మలకి శాంతి కలుగుగాక. అంత పెద్ద విషాదం జరిగినా ఎలాంటి విచారణా జరక్కపోవడం, ఎవరిమీదా ఎలాంటి చర్యలూ లేకపోవడం ఓ విచిత్రం.

ఇక, గోదావరి పుష్కరాలని నోరారా విమర్శించి, 'మేము స్నానం చేసేది లేదు' అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు సైతం ఆయుత చండీ యాగానికి హాజరై పట్టు శాలువాలు కప్పించుకోవడం మరో విచిత్రం. బహుశా స్థల, కాలాదుల ప్రభావం కాబోలు. యాగం చివర్రోజు జరిగిన అగ్నిప్రమాదం, ఫలితంగా రద్దైన రాష్ట్రపతి కార్యక్రమం వార్తల్లో ఎక్కడా కనిపించలేదు. జనమంతా ఎటూ లైవ్ లో చూశారు కాబట్టి, మళ్ళీ ప్రత్యేకం చెప్పక్కర్లేదనుకున్నారేమో.

ఏమైనప్పటికీ, పుష్కరాల విషయంలో వచ్చిన విమర్శలు, జరిగిన చర్చల్లో ఒకవంతు కూడా యాగాన్ని గురించి ఎక్కడా జగరలేదు. స్వయం ప్రకటిత హేతువాదులు సైతం నోరు విప్పలేదు ఎందుకనో. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ప్రస్తుతానికింకా కలల్లోనే ఉంది. 'నేను సైతం' అంటూ దేశ ప్రధాని తెచ్చి ఇచ్చిన మట్టీ, నీరూ పునాదిరాయి వెయ్యడానికి ఉపయోగపడ్డాయి. నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కేవలం మట్టీ, నీళ్ళూ చాలవు కదా.

అధికార పార్టీకి శాసన సభలో తగినంత సంఖ్యా బలం ఉంటే చాలు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనడానికి రెండు తెలుగు రాష్ట్రాలు మంచి ఉదాహరణలుగా నిలబడ్డాయి ఈ సంవత్సరం. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతిపక్షానికి తగినంత 'బలం' లేదన్నది నిజం. ఫలితమే, వోటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు రెండూ కూడా ఇట్టే తెరమరుగైపోయాయి. ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఒకరిది 'ఆకర్ష' మార్గం, మరొకరిది బెదిరింపుల మార్గం. ప్రసార మాధ్యమాల పూర్తి మద్దతు బాగా కలిసొస్తోంది రెండు ప్రభుత్వాలకీ.

కేంద్ర ప్రభుత్వం 'అసహనం' గొడవల్లోనుంచి బయట పడింది. బీహార్ శాసనసభ ఫలితాల తర్వాత నేలవైపు చూడడం మొదలు పెట్టినట్టుగా అనిపిస్తోంది. 'స్వచ్చ భారత్' ఫలితంగా పరిశుభ్రత మాటెలా ఉన్నా అదనపు పన్ను భారాన్ని జనం మీద మోపే అవకాశం దక్కించుకుంది. 'అవసరం' ఉన్న రాష్ట్రాలతో ఉదారంగానూ, మిగిలిన వాటితో ఉదాసీనంగానూ వ్యవహరిస్తోంది ప్రస్తుతానికి. తుపాను తాకిడికి విలవిల్లాడిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కేంద్రం అందించిన సాయమే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ.

అటు కేంద్రం వల్లా, ఇటు రాష్ట్రాల వల్లా సామాన్యులకి కొత్త పన్నులు మినహా ఒనగూరిన ప్రయోజనాలు ఏవీ లెక్కకి రావడం లేదు. వాళ్ళ దోషం లేకుండా అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రులూ నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఆస్థాన ప్రవచనకారులు సెలవిస్తున్నట్టుగా ప్రజలకి సేవలు పొందే 'యోగం' ఉండాలి కదా. సదరు యోగాన్ని కొత్త సంవత్సరం తన వెంట తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

సోమవారం, డిసెంబర్ 21, 2015

కొల్లాయిగట్టితేనేమి?

కోనసీమలో ఉన్న ముంగండ అగ్రహారానికి ప్రపంచవ్యాప్తంగా పేరు. కేవలం వేదపండితులు, ప్రాచీన శాస్త్రాలలో నిష్ణాతులు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఎందరికో ముంగండ పుట్టినూరు. ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు రెండు శతాబ్దాలకి పూర్వమే ఢిల్లీ సుల్తానుల ఆదరణకు పాత్రుడవ్వడం మాత్రమే కాదు, దర్బారు రాజనర్తకిని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయాడు. ఝాన్సీ లక్ష్మిబాయి సైన్యంలో పనిచేసిన ముఖ్య సైనికుల్లో కొందరు ముంగండ వాస్తవ్యులే. వేదఘోషతో మారుమోగే ఆ పల్లెటూరిలో ఆధునికతకీ లోటులేదు. అలాంటి ముంగండ అగ్రహారాన్ని కథా స్థలంగా తీసుకుని మహీధర రామమోహన రావు రాసిన చారిత్రాత్మక నవల 'కొల్లాయిగట్టితేనేమి?'

జాతీయోద్యమ స్ఫూర్తి, స్వతంత్ర కాంక్ష దేశం నలుమూలలా పాకిపోయిన 1920-22 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రదేశంలో జరిగిన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిణామాలని ముంగండ అగ్రహారపు దృష్టి కోణం నుంచి చూస్తూ 1964 లో ఈ నవలని రాశారు రామమోహన రావు. నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నదీ పుస్తకం. ముంగండలోనే పుట్టిపెరిగిన మహీధర, బాల్యంలో తను చూసిన ఎందరో వ్యక్తులనీ, ఎన్నో సంఘటనలనీ నవలలో చిత్రించినా అది "కల్పనలో కొంత భారం తప్పించుకునేటందుకు తప్ప, దీనిలో పాత్రలేవీ యదార్ధాలు కావు. కథ జరిగి ఉండనూ లేదు" అని స్పష్టంగా చెప్పారు ముందుమాటలో.

రాజమండ్రి కళాశాలలో చదువుతున్న రామనాధం, గాంధీజీ పిలుపు అందుకుని విదేశీ వస్త్ర దహనం కార్యక్రమంలో తన దుస్తులూ, దుప్పట్లనీ తగలబెట్టి, అర్ధంతరంగా చదువుమాని ముంగండకి ప్రయాణం కావడం కథా ప్రారంభం. పడవ ప్రయాణంలో తోటి ప్రయాణికురాలు స్వరాజ్యం తో పరిచయం అవుతుంది అతనికి. ముంగండ పక్కనే ఉన్న చిరతపూడి వాస్తవ్యుడు, బ్రహ్మ సమాజికుడూ అయిన అబ్బాయి నాయుడి కూతురామె. అత్తవారి అభీష్టానికి వ్యతిరేకంగా కాలేజీలో చదువుకుంటోంది. ముంగండ లో రామనాధం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకీ కూడా అతని నిర్ణయం అర్ధం కాదు. నేడో రేపో ఇంగ్లండు వెళ్లి ఐసీఎస్ పరీక్ష ఇచ్చి కలెక్టరుగా రావాల్సిన తాను ఇలా చదువు మధ్యలో మానుకుని రావడం ఎందుకో వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పడం అతనికి చేతకాదు.


నిజానికి చదువైతే మానుకున్నాడు కానీ, తర్వాత ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేదతనికి. చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్న రామనాధాన్ని నిస్సంతు అయిన అతని బాబాయి శంకరశాస్త్రి పెంచి పెద్ద చేశాడు. రామనాధంతో పాటు అతని ఆస్తినీ పెంచి పెద్దచేసిన శంకరశాస్త్రి, అమలాపురం పోలీసు ఇన్స్పెక్టర్ ఆదినారాయణ మూర్తి కూతురు సుందరితో కుర్రాడికి బాల్య వివాహమూ జరిపించేశాడు. అల్లుడు చదువు మానుకోడం, పైగా గాంధీ ఉద్యమంలో చేరాలనుకోడం కొరుకుడు పడదు నారాయణమూర్తికి. ఓ పక్క శంకరశాస్త్రి-నారాయణ మూర్తి కలిసి రామనాధాన్ని "దారిలో పెట్టే" ప్రయత్నాలు చేస్తూండగానే, ఊహించని విధంగా జైలుపాలై, శిక్ష పూర్తయ్యాక కూడా అగ్రహారీకులు సూచించిన ప్రాయశ్చిత్తానికి నిరాకరించి కులం నుంచి వెలివేయబడతాడు రామనాధం.

తోటలో ఓ చిన్న పాకలో ఒక్కడూ జీవితం మొదలు పెట్టి, చరఖా ఉద్యమాన్ని ఇంటింటి ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు ఆరంభిస్తాడు.జాతీయోద్యమంలో ముంగండ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తి రామనాధం పెదనాన్న విశ్వనాథం. అయితే, విశ్వనాథానికి అన్యకులానికి చెందిన స్త్రీ వల్ల కలిగిన కొడుకు వెంకటరమణకి మాత్రం ఆంగ్లేయులపై మోజు. అభివృద్ధి, కులవ్యవస్థ నిర్మూలన వాళ్ళ వల్లే సాధ్యమని నమ్ముతాడు. సంప్రదాయాన్ని ప్రాణం కన్నా మిన్నగా భావించే ముంగండ అగ్రహారీకులు ఊరి చెరువుకి నిత్యం కాపలా కాస్తూ ఉంటారు. పంచములు ఆ చెరువు నీటిని ముట్టుకోవడం నిషేధం. వాళ్లకి నీళ్ళు కావాలంటే ఎవరన్నా తోడి పోయాల్సిందే. మంచినీటి సమస్యని  పరిష్కరించాలని నిర్ణయించుకున్న రామనాథానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.

చదువు మానేసిన రామనాధంతో కాపురం చేయడానికి సుందరి నిరాకరిస్తుంది. మరోపక్క చదువుకున్న కారణానికి స్వరాజ్యాన్ని విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె భర్త. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఊహించని విధంగా రామనాథానికి పేరొచ్చి పెద్ద నాయకుల దృష్టిలో పడతాడు. గోదావరి జిల్లా పర్యటనకి రాబోతున్న గాంధీజీని ముంగండ తీసుకెళ్ళి తను చేస్తున్న కృషిని పరిచయం చేయాలన్నది రామనాధం కోరిక. అందుకు ప్రయత్నాలు ఆరంభిస్తాడు. స్వరాజ్యం, రామనాధాల జీవితాలు ఏ మలుపు తిరిగాయన్నదానితో పాటు, కలెక్టరు కావాల్సిన రామనాధం చదువు మానేయడానికి గాంధీయే కారణమని దుమ్మెత్తి పోసే అతని కుటుంబ సభ్యులు, అగ్రహారీకులు గాంధీజీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నారన్నది నవల ముగింపు. ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. పాత్రలు, సన్నివేశాలు అన్నీ కళ్ళముందు కనిపిస్తాయి.

చదువుతున్నంతసేపూ ఇదే నేపధ్యంతో వచ్చిన నవలలు'చదువు,' 'మాలపల్లి,' 'నారాయణరావు,' 'వేయిపడగలు,' 'రామరాజ్యానికి రహదారి' పదేపదే గుర్తొస్తూనే ఉంటాయి. సంభాషణలు క్లుప్తంగా ఉండడం, సన్నివేశాల ద్వారానే కథని చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అందుకే కావొచ్చు, నాటకీయత బహుతక్కువగా ఉంది. ప్రదాన పాత్రలతో పాటు వితంతువు నరసమ్మ, ఖద్దరు అమ్మే దువ్వూరి సుబ్బమ్మ, లెక్చరర్ రంగనాధరావు పాత్రలు బాగా గుర్తుండిపోతాయి. జాతీయోద్యమం నేపధ్యంలో వచ్చిన తెలుగు సాహిత్యంలో ఈ నవలకి ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు 364, వెల రూ 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, డిసెంబర్ 15, 2015

హాలికులు కుశలమా!

'రాయలసీమలో ప్రజలు నిత్యం కత్తులు నూరుకుంటూ, బాంబులు విసురుకుంటూ ఉంటారు' ..ఇది  చాలామంది సినిమావాళ్ళు చేసిన ప్రచారం. 'రాయలసీమ ప్రజలు బూతు లేకుండా ఒక్క మాటా మాట్లాడరు' ..ఇది కొందరు రచయితలు ఆ ప్రాంతానికి ఇచ్చిన ఇమేజి. అయితే.. మంచీ, చెడ్డా అన్నవి విశ్వం అంతటా ఉన్నాయనీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టే రాయలసీమలోనూ మంచి ఉన్నదనీ తన కథల ద్వారా ప్రపంచానికి చాటిన కథా రచయిత ఒకరున్నారు. ఆయనే 'దామల్ చెరువు అయ్యోరు' గా తెలుగు సాహితీలోకంలో సుప్రసిద్ధులైన మధురాంతకం రాజారాం.

రాయలసీమ పల్లెల్ని, మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లె జీవితాలని తన కథల ద్వారా  పటం కట్టిన రాజారాం రాసిన మూడొందల పైచిలుకు కథల్లోనూ మట్టి వాసనలు గుభాళిస్తాయి. సీమ ప్రజల భాష, యాస, పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలు, అభిమానాలు.. ఇవన్నీ పాఠకులకి కనిపింపజేస్తాయి, వినిపింపజేస్తాయి కూడా. రాజారాం రాసిన ప్రతికథా దేనికదే ప్రత్యేకమైనదే అయినప్పటికీ, దాదాపు యాభయ్యేళ్ళ క్రితం రాసిన 'హాలికులు కుశలమా!' కథ మరింత ప్రత్యేకమైనది. ఎంచుకున్న వస్తువు మొదలు, కథని తీర్చిదిద్దిన విధానం, మరీ ముఖ్యంగా ముగించిన తీరు ఈ కథని ఓ పట్టాన మర్చిపోనివ్వవు.

ఇది, రాయదుర్గం నరసప్ప అనే ఓ సామాన్య బడిపంతులు కథ. ఆయన టీచరు ట్రైనింగు పొందిన వాడూ, పరిక్షలు పాసైన వాడూ కాదు. సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుని, పద్యాలు అల్లడం నేర్చుకున్న వాడు. జిల్లా బోర్డు ప్రెసిడెంటు దర్శనం చేసుకుని, పంచరత్నాలు చదివితే, ఆ ప్రెసిడెంటు గారు మురిసిపోయి బహుమానం ఇవ్వబోతే, డబ్బుకి బదులుగా బడిపంతులు ఉద్యోగం కావాలని అడిగి ఉద్యోగంలో చేరినవాడు. నరసప్ప గారి వేషం, భాష అన్నీ ప్రత్యేకమైనవి. ఆయన పాండిత్యం పిల్లలకి పాఠాలు చెప్పేదీ, వాళ్లకి పరిక్షలు నిర్వహించేదీ కాదు. అయినప్పటికీ, కృత్యదవస్థ మీద బండి లాగించేస్తూ ఉంటాడు. ఆయన శిష్యులలో ఒకానొకడు రాజు (రచయిత) పెరిగి పెద్దై, బడి పంతులు ఉద్యోగంలోనే చేరతాడు.

కార్యార్దియై ఓ పల్లెటూరికి వెళ్ళిన రాజు, అనుకోకుండా ఒకరోజంతా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. పుస్తకం చదవకపోతే రోజు గడవదు రాజుకి. ఆ పల్లెలో పుస్తకం కావాలంటే రాయదుర్గం నరసప్ప గారిని దర్శించాల్సిందే అంటాడు గృహస్తు. తనకి చదువు చెప్పిన మేష్టారు ఆ ఊళ్లోనే ఉన్నారని తెలిసిన రాజు, వెంటనే ఆయనింటికి బయలుదేరతాడు. మేష్టారు పొలానికి వెళ్ళారని చెబుతారు ఇంట్లో వాళ్ళు. ఉద్యోగం చేయాల్సిన మేష్టారు వ్యయసాయంలోకి దిగడం ఏమిటన్న ఆశ్చర్యాన్ని ఆపుకోలేని రాజు పొలానికి బయలుదేరతాడు. అక్కడ పాదుల మధ్యలో కనిపించిన నరసప్ప గారిని పలకరిస్తూ "హాలికులు కుశలమేనటండీ మేష్టరు గారూ?" అని అడుగుతూనే తన ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా సంధించేస్తాడు.

రాజు చదువయిన కొద్ది కాలానికి నరసప్ప గారు ఉద్యోగం వదిలేశారు. అందుకు కారణం కొత్తగా వచ్చిన కుర్ర హెడ్మాస్టారు. అతడికి అయ్యవార్లు సక్రమంగా పాఠాలు చెప్పడం కన్నా తనకి లొంగి ఉండడం ముఖ్యం. ఆత్మాభిమానాన్ని వదులుకోలేని నరసప్ప ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రైతుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. అదేమంత సులభం కాలేదు. ఎందుకూ అంటే, "మనిషి స్వభావానికీ, వాడు చేస్తున్న పనికీ సామరస్యం లేకపోతే, బ్రతుకు బ్రతుకంతా ఒక తీవ్ర సంఘర్షణగా పరిణమిస్తుందేమో" అంటారు. అయితే, ఇరుసుకీ, చక్రానికీ ఏనాటికీ ఘర్షణ తప్పదని తెలిసిన వాడూ, ఇరుసుకి కందెన వేసి ఘర్షణని అదుపులోకి తెచ్చుకోవచ్చన్న సూక్ష్మం గ్రహించిన వాడూ కాబట్టి ఆ సమస్యని ఆయన పరిష్కరించుకున్నాడు.

తన పొలంలో కొబ్బరి చెట్లనీ, అరటి చెట్లనీ, మామిడి తోటనీ, పండ్లు, పూల మొక్కలనీ శిష్యుడికి ఇష్టంగా పరిచయం చేశారు నరసప్పగారు. అయితే, అర్ధం చేసుకోడానికి రాజుకి కొంచం సమయం పట్టింది. అర్ధమైన మరుక్షణం తనూ ఉత్సాహంగా ఎన్నో ప్రశ్నలు వేశాడు. చీకటి పడే వరకూ సంభాషణ సాగించాడు. బంధువుల ఇంటికి వెళ్ళబోతున్న రాజుని ఆపి, ఆపూట తనతో భోజనం చేస్తే తప్ప వల్లకాదన్నారు నరసప్ప గారు. అంతేనా? భోజనానికి కూర్చోబోతూ ఓ ఆర్ద్రమైన కోరిక కోరారు కూడా. నరసప్ప గారు ఉపయోగించిన కందెననీ, ఆయన కోరిన కోరికనీ తెలుసుకోవాలంటే మధురాంతకం రాజారం కథా సంపుటాల్లో అందుబాటులో ఉన్న 'హాలికులు కుశలమా!' కథని చదవాల్సిందే.. కథ పూర్తిచేశాక రాయదుర్గం నరసప్ప గారిని మర్చిపోడం ఏమంత సులభం కాదు.