Saturday, January 29, 2011
ఎర్నూగు పూలు
Thursday, January 27, 2011
కొమ్మకొమ్మకో సన్నాయి
Monday, January 24, 2011
రెండేళ్ళ తర్వాత...
మొదటి సంవత్సరంతో పోల్చినప్పుడు, రెండో సంవత్సరంలో టపాల సంఖ్య తగ్గిందన్నది కనిపిస్తున్న సత్యమే. "కేవలం సంఖ్య మాత్రమేనా? లేక టపాలలో నాణ్యత కూడానా?" అన్నది ఈమధ్యనే నన్ను తొలచిన ప్రశ్న. కొన్ని ఇటీవలి టపాలని మళ్ళీ ఓసారి చదువుకున్నప్పుడు నాకే సంతృప్తికరంగా అనిపించలేదు. అదే సమయంలో కొందరు మిత్రులు కూడా నేరుగానూ, పరోక్షంగానూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇది నేను పట్టించుకోవాల్సిన విషయమే.. అలెర్ట్ చేసిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు.Friday, January 21, 2011
వంశీ 'మా' పసలపూడి కథలు
Wednesday, January 19, 2011
బంగారు మురుగు
Monday, January 17, 2011
ప్రభలతీర్ధం - మెమరీకార్డ్

ప్రభ ఊరేగింపు మొదలయ్యింది. డప్పులు దరువేస్తుండగా కొందరు ఉత్సాహవంతులు చిందేస్తున్నారు. ఆదివారం కావడంతో చర్చిలన్నీ రద్దీగా ఉన్నాయి. ప్రభువు పాటలు డప్పుల మోతలతో పోటీ పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా, చేతిలో ఫోను, కెమెరా ఉన్న ప్రతి ఒక్కరూ ఊరేగింపుని తదేక దీక్షతో రికార్డు చేసేస్తున్నారు. "మెమరీ ఫుల్లయ్యిందే. నువ్వు కంజూస్.. టూజీబీ తీస్కోవచ్చు కదా..." అంటోందో ఆమ్మాయి.." హైడ్రాబేడ్ రిటర్న్డ్ అనుకుంటా. "లాష్టియర్ షిల్పారామం లో కైట్ ఫెస్టివల్ ఎంతబాగా జరిగిందో తెల్సా..." అంటూ మరో గొంతు.
Friday, January 14, 2011
హరిదాసు
Sunday, January 09, 2011
సాగర సంగమం
భారతీయ నృత్య రీతులమీద సాధికారికంగా మాట్లాడగల మాధవి వాటిని గురించి ఓ ఆంగ్ల పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉంటుంది. అదిగో, ఆ పనిలో ఉండగానే మాధవికి బాలూ పరిచయమవుతాడు. నాట్యం అంటే ప్రాణం బాలూకి. భారతీయ నాట్యరీతులన్నీఅవుపోసన పట్టి ఓ కొత్త రీతిని తయారు చేయాలన్నది బాలూ కల. అయితే, మాధవి లాగా అతను డబ్బున్నవాడు కాదు. వంటలు చేసి పొట్ట పోషించుకునే తల్లి, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునే మిత్రుడు రఘు.. ఇవీ బాలూ ఆస్థిపాస్తులు.
బాలూ ఎంతటి అభిమానధనుడంటే, మాధవి తీసిన తన ఫోటోలలో ఒకదానిని తన తల్లికోసం అడిగి తీసుకోడానికి కూడా మొహమాట పడేటంత. అప్పటికే బాలూ నేర్చుకున్న నాట్య రీతుల మీద అతనికున్న పట్టు, అంతకు మించి నాట్యం పట్ల అతడికున్న అవ్యాజ్యమైన ప్రేమని అతి తక్కువ కాలంలోనే అర్ధం చేసుకుంది మాధవి. తన పరపతి ఉపయోగించి, ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో నృత్య ప్రదర్శన
చేయగలిగే అరుదైన అవకాశాన్ని బాలూకి ఇప్పించగలిగింది. మాధవి సాంగత్యంలో అప్పుడప్పుడే ఎదుటివారిని అర్ధం చేసుకోడం మొదలు పెట్టిన బాలూ, ఇన్విటేషన్లో తన ఫోటో చూసుకుని చేష్టలుడిగి పోతాడు. ఆక్షణంలో అతడు తన భావోద్వేగాలని నిస్సంకోచంగా పంచుకున్నది మాధవితోనే.
తనతోపాటు తల్లినీ ఫెస్టివల్ కి తీసుకెళ్ళి, ప్రేక్షకుల్లో ముందువరుసలో ఆమెని కూర్చోబెట్టి, ఆమహాజనం ముందు తను నాట్యం చేస్తుండగా ఆమె కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూడాలన్న బాలూ కోరిక మాధవికి తెలియనిది కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే విధినీ, దేవుడినీ తలచుకునే వాళ్ళెవరు? ప్రయాణం రెండు రోజులుందనగా తీవ్ర అనారోగ్యంతో కన్ను మూస్తుంది బాలూ తల్లి. పోతూ పోతూ తన అంత్య క్రియల కోసం దాచుకున్న డబ్బు కొడుక్కి అందేలా చేస్తుంది. ఆ మహా విషాదాన్ని బాలూ పంచుకున్నది కూడా మాధవితోనే.
బాలూని మామూలు మనిషిని చేయాలన్నది మాధవి సంకల్పం. అందుకే అతడిని తనున్నాననీ, ఎప్పటికీ అతడితోనే ఉంటాననీ చెబుతుంది మాధవి. తల్లి మరణంతో కుంగిపోయిన బాలూలో ఓ కదలిక ఉవ్వెత్తున ఎగసింది. మాధవిని తను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ ఆమెకి చెబుతాడు బాలూ. మాధవిలో సంకోచం, సందిగ్ధత. అతనికి ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అయోమయం. అతడు సున్నితంగా అందించిన గులాబీని సంకోచంగా అందుకుని తన జడలో తురుముకుంటుంది. ఆమె నీలి కళ్ళలో మాటలకందని భావాలు.
గతాన్నితుడిచేయగలమా? వెంటాడే జ్ఞాపకాలని కడిగేయగలమా? తనకో తోడు దొరికిందన్న ఆనందం బాలూని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్షణాల్లోనే, గత జ్ఞాపకాలని వదిలించుకుని కొత్తజీవితం మొదలుపెట్టే ప్రయత్నం ఆరంభించింది మాధవి. స్వతహాగా ఆవేశ పరుడు బాలూ. అందుకే కావొచ్చు, తన ప్రతిపాదనకి మాధవి నోటినుంచి ఎలాంటి జవాబూ రాకముందే, మాధవిని పెళ్లి చేసుకోవాలన్న తన ఆలోచనని ఆమె తండ్రితో పంచుకున్నాడు. మాధవి వివాహిత అనీ, ఆస్తి తగాదాల కారణంగా పెళ్ళైన మూడో రోజే పుట్టింటికి తిరిగి వచ్చేసిందనీ చెబుతాడు ఆమె తండ్రి.
మాధవి అదృష్టవంతురాలు. ఆమెని పెళ్ళిచేసుకున్న గోపాలరావు, ప్రేమించిన బాలూ ఇద్దరూ మంచివాళ్ళే. మాధవి-బాలూల పెళ్లి చేయాలని గోపాలరావు నిర్ణయించుకుంటే, మాధవిని గోపాలరావుతో కాపురానికి పంపాలని అనుకుంటాడు బాలూ. దేవుడిమీద భక్తి, బాలూమీద నమ్మకం ఉన్న మాధవి బాలూ మాటని గౌరవించింది. సకోచంగా జడతో తురుముకున్న గులాబీని తీసి తన పెళ్లి ఆల్బం మీద ఉంచింది, స్థిరంగా. ఆమె పక్కన తనకి చోటులేదన్న వాస్తవాన్ని అంగీకరించిన బాలూ, శాశ్వితంగా కెనడా వెళ్ళిపోతున్న గోపాలరావు, మాధవిల ఫోటో తీసుకున్నాడు. తర్వాత అతను ఏడాదంతా బతికింది తను వాళ్ళిద్దరినీ కలిపిన రోజు కోసమే..ఆ రోజున వాళ్ళ క్షేమం కోరుతూ అన్ని గుళ్ళూ తిరగడానికే.
కాలానికి కనికరం లేదు. అందుకే అది ఎవ్వరికోసమూ ఆగదు. నాట్యం అంటే తనకున్న మక్కువని తన కూతురు శైలజని నర్తకిగా తీర్చి దిద్దడం ద్వారా తీర్చుకుంది మాధవి. గోపాలరావు మరణం తర్వాత, కూతురితో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలూని చూసిన మాధవి అతడి స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కళలో ఏకోన్ముఖుడు కాలేకపోయిన ఆ సున్నిత హృదయుడు మద్యానికి బానిసై, మరణానికి చేరువగా ఉన్నాడు. మరోపక్క శైలజ మిడిమిడిజ్ఞానంతో తానో గొప్ప నాట్యకత్తెనని మిడిసిపడుతోంది. నేర్చుకోవాల్సింది ఏదీ లేదన్న అహంకారం కమ్మేసిందామెని.
బాలూలోని కళాకారుడు బహిర్గతం కాకుండా ఉండిపోయిన సంగతి తెలుసు మాధవికి. అందుకు కారణాలనీ అర్ధం చేసుకుంది. అతడి ఆరోగ్యాన్ని బాగు చేయడం అసాధ్యం అని అర్ధమయ్యాక, శైలజని బాలూ శిష్యురాలిగా చేసి, బాలూ కళని బతికించే ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చింది మాధవికి. అటు బాలూ స్నేహితురాలిగానూ, ఇటు శైలజ తల్లిగానూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. చివరిరోజుల్లో ఉన్న బాలూని బాధ పెట్టడం ఇష్టం లేక తను వితంతువన్న నిజాన్ని దాస్తుంది మాధవి. ఇందుకుగాను కన్న కూతురి నుంచి ఏతల్లీ పొందకూడని అవమానాన్ని పొందుతుంది.
తన కళని బతికించుకోవడం కోసం, అంతకు మించి మాధవికిచ్చిన మాట కోసం, మరణంతో పోరాడి మరీ నాట్య కళలో మెళకువలన్నీ శైలజకి నేర్పాడు బాలూ. తన నాట్యం చూడకుండా మరణించిన తల్లిలా మాధవి కాకూడదని అనుకున్నాడు. తన కళకి గుర్తింపు, గౌరవం తేవడం కోసం కృషి చేసిన 'మహాతల్లి' మాధవికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పరివర్తన వచ్చిన శైలజలో పరిపూర్ణమైన తన కళని చూసుకుని కన్నుమూశాడు. స్నేహితుడి పార్ధివ దేహం వర్షంలో తడవకుండా రఘు తన శరీరాన్నే గొడుగుగా చేస్తే, గొడుగుతో పరుగున వచ్చిన మాధవి తను తడుస్తూ బాలూ శరీరానికి గొడుగు పట్టింది.
నది సముద్రంలో కలిసినట్టుగా కళ, కళతోనే కలుస్తుంది. అది కళా సాగర సంగమం. స్త్రీ జీవితాన్ని నదితో పోల్చడానికి మాధవిని మించిన ఉదాహరణ ఎవరు. ఎన్నో ఎత్తుపల్లాలని దాటుకుని గంభీరంగా ప్రవహించే నది, సాగర సంగమ వేళ పిల్ల కాలువగా మారిపోతుంది. అలాగని ఆ నదిని శాంత స్వరూపిణి అనుకోగలమా? తరచి చూస్తే ఎన్ని సుడిగుండాలో... మాధవిని కేవలం ఓ కల్పిత పాత్రగా మర్చిపోలేం. 'సాగర సంగమం' చూసిన ప్రతిసారీ తను విడవకుండా వెంటాడుతుంది మనల్ని.
.....రాస్తుండగానే మూడొందల టపాలు పూర్తయ్యాయి.....
Thursday, January 06, 2011
దేవాంగుల మణి
Wednesday, January 05, 2011
మధురవాణి - ఊహాత్మక ఆత్మకథ
'ఊహాత్మక ఆత్మకథ' అన్నది తెలుగు సాహిత్యం లో ఓ కొత్త ప్రక్రియ అని చెప్పాలి. ఈ ప్రక్రియ మొదలయ్యింది ఆంధ్రుల అభిమాన నాయిక గురజాడ అప్పారావుగారి సృష్టీ అయిన నాయిక 'మధురవాణి' తో కావడం 'కన్యాశుల్కం' నాటకాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ సంతోషం కలిగించే విషయం. గురజాడ రచనలపట్ల అవ్యాజ్యమైన అభిమానం ఉన్న పెన్నేపల్లి గోపాలకృష్ణ 'మధురవాణి' ఊహాత్మక ఆత్మకతకి మూడేళ్ళ క్రితం అక్షర రూపం ఇచ్చారు.
"ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలోని మొత్తం 33 దృశ్యాలలో మధురవాణి కనిపించేది కేవలం ఏడెనిమిది దృశ్యాలలో మాత్రమే. నాటకానికి ఆమె అవసరం ఎంతవరకూ ఉందో అంతవరకూ మాత్రమే ఉంది" అంటూ ముందుమాటలో రాసిన రచయిత, మధురవాణి ఆత్మకథని రాయడం కోసం గురజాడ రచనలనీ, ఉత్తరాలనీ క్షుణ్ణంగా చదివారు. "మధురవాణిని సజీవరూపంగా ఊహించుకుని, ఆవాహన చేసుకుని, నన్ను నేనే ఆమెగా భావించుకుని" ఆత్మకథ రాశానన్నారు.
'ఊరు-పేరు' తో మొదలు పెట్టిన తొలి అధ్యాయంలో తన గురించి చెప్పుకున్న మధురవాణి, తర్వాతి అధ్యాయాలలో తన తల్లి గురించీ, వేశ్యా వృత్తిని గురించీ, తన జీవన విధానాన్ని గురించీ, 'కన్యాశుల్కం' లో ప్రధాన పాత్రలన్నింటి గురించీ సవివరంగా, విశ్లేషణాత్మకంగా వివరించడం కనిపిస్తుంది. గిరీశం మొదలు, సౌజన్యరావు పంతులు వరకూ ప్రతి ఒక్కరినీ సునిశితంగా పరికించి విమర్శిస్తుంది మధురవాణి. అలాగే పూటకూళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షిల పట్ల అభిమానాన్నీ, వాత్సల్యాన్నీ ప్రదర్శించింది.
కరకట శాస్త్రులు, మహేశం, అగ్నిహోత్రావధాన్లు, లుబ్దావధాన్లు, వెంకటేశం లాంటి నిడివి ఉన్న పాత్రల మొదలు, మాయగుంట, కనిష్టీబు, బైరాగి, అసిరి లాంటి చిన్న పాత్రల వరకూ ప్రతి పాత్రనీ మధురవాణి దృష్టికోణం నుంచి పరిశీలించి, ఆయా పాత్రలని ఓ కొత్త కోణంలో చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారనే చెప్పాలి. నూట పదిహేనేళ్ళనాటి (కన్యాశుల్కం రచనాకాలం) విజయనగరం సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని అర్ధం చేసుకోడానికీ ఈ రచన ఉపకరిస్తుంది.
"అనాదీ వేశ్యకి జీవనాధారం సంగీతం, నాట్యమే కానీ ఇతరం కాదు. కాలగతిలో సంగీతం, నాట్యం అదృశ్యమై, అగ్రకులాల వశమై, మాకు దేహం మటుక్కు మిగిలింది జీవనానికి!" లాంటి నిష్టుర సత్యాలూ, "వేశ్యా వృత్తి భ్రష్టు పడి లోకుల దృష్టిలో చులకన కావడానికి ప్రధాన హేతువు వేశ్య మాతే సుమా!" లాంటి చారిత్రిక సత్యాలూ, "భార్యాభర్తల మధ్య ప్రేమలేని దాంపత్యాలెన్ని లేవు? అట్టి భార్యల స్థితి కంటే వేశ్య మేలు కాదు?" లాంటి సూటి ప్రశ్నలూ చాలానే కనిపిస్తాయి ఈ పుస్తకం నిండా.
మధురవాణి స్వాభావిక లక్షణాలని ఏమాత్రం విస్మరించకుండా, గురజాడ రచనా శైలిని విడిచిపెట్టకుండా రాసిన ఈ ఆత్మకథ ఆసాంతమూ చదివిస్తుంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎంత ఆకర్షణీయంగా ఉందో, మోహన్ గీసిన లోపలి చిత్రాలు అంత సొగసుగానూ ఉన్నాయి. ముఖ్యంగా లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు బొమ్మలు చూడాల్సిందే. నాచ్ కల్చర్ కి సంబంధించిన కొన్ని అరుదైన ఛాయా చిత్రాలూ ఉన్నాయి ఇందులో.
ఆత్మకథని పూర్తి చేశాక మధురవాణి అనే స్త్రీ హృదయానికి బదులుగా పురుష హృదయం కనిపించింది. మధురవాణిని సృష్టించిన గురజాడ, ఆత్మకథ రాసిన పెన్నేపల్లి పురుషులే కావడం ఇందుకు కారణం కావచ్చేమో బహుశా. ఏదేమైనా మధురవాణి పాత్రకి దక్కిన మరో గౌరవం ఈ ఆత్మకథ. సుమారు రెండు దశాబ్దాల క్రితం 'మిసిమి' పత్రికలో ప్రచురితమైన 'మధురవాణి ఇంటర్వ్యూలు' కూడా పుస్తక రూపంలో వస్తే బాగుండును. (మధురవాణి ఊహాత్మక ఆత్మకథ - విసు కమ్యూనికేషన్స్ ప్రచురణ, పేజీలు 202, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
Tuesday, January 04, 2011
ఓ సంభాషణ...
చాలా ఏళ్ళ పాటు ఓ కాలేజీలో పనిచేసిన లక్ష్మణ్, కొన్ని నెలల క్రితం ఉద్యోగం మానేసి, బ్యాంకు లోనుతో టాక్సీ కొన్నారు. "చాలామంది నేనో మెట్టు దిగుతున్నాను అన్నారు సార్. నేను పట్టించుకోలేదు. కష్టపడి పని చేసి సంపాదించడం, మన అవసరాలు గడుపుకోడం ముఖ్యం. కాలేజీలో పనిచేయడం ఎక్కువా కాదు, కారు నడపడం తక్కువా కాదు," అని చెప్పినప్పుడు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది నాకు.
"ఖర్చులు పెరిగిపోతున్నాయి సార్.." అని తను అన్నప్పుడు "అవునండీ, ఐదొందల నోటు జేబులోనుంచి తీస్తే ఐదు నిమిషాల్లో ఖర్చైపోతోంది. కొన్నవేవీ కనిపించడం లేదు," అన్నాన్నేను. టాక్సీలో ఉన్నది మేమిద్దరమే. "మా వంద, మీ ఐదొందలు సమానం సార్," అన్నాడతను నవ్వుతూ. "కాయగూరల కన్నా నాన్వెజ్ కొనుక్కోడమే సులువుగా ఉంది," అంటూ కొనసాగించాడు. రోడ్డు అంతగా బాగోలేదు, ఒకటే గతుకులు. "అర్జెంట్ ఏమీలేదండీ.. నెమ్మదిగా వెళ్దాం .." నా మాట పూర్తయ్యిందో లేదో, "మీరు నన్ను స్పీడుగా నడపమన్నా నడపను సార్. రిస్కు తీసుకోను. ఎవరైనా ముసలాడివా అని ఎటకారం చేసినా నా పద్ధతి ఇదే," అన్న జవాబు వచ్చేసింది.
"పొట్ట వచ్చేస్తోంది సార్. రాత్రిపూట భోజనం మానేయమంటారా?" అని అడిగాడు తను. అంతలోనే "అంటే, భోజనం మానేసి చపాతీ లాంటిది తింటే.." అన్న కొనసాగింపు. "భోజనం మానకండి, కానీ తగ్గించండి. వీలైనంత త్వరగా తినేయండి. వీలయితే కొంచం నడవండి.." అంటూ డైటీషియన్ అవతారం ఎత్తబోయా. "చపాతీ ఎందుకు వద్దంటారు?" తను వదలలేదు. "మీరు చపాతీతో తినే దుంపల కూర వల్ల బరువు పెరుగుతారు. ఇంట్లో కాకుండా బయట హోటల్లో అయితే నూనె బాగా ఎక్కువ వాడతారు. దానివల్ల ఇతరత్రా హెల్త్ సమస్యలు రావొచ్చు.." అని వివరించాను.
రోడ్డు పక్కన పార్టీల జెండాలు కనిపించడంతో సంభాషణ రాజకీయాల వైపు మళ్ళింది. "మంచి పనులు చేసిన నాయకులు ఇద్దరే సార్. చంద్రబాబు, వైఎస్. చంద్రబాబు రోడ్లు బాగుచేశాడు," అంటూనే "ఇప్పుడు సోనియా జగన్ ని కాంగ్రెస్ లోకి పిలిచి ముఖ్యమంత్రిని చేస్తాను అందనుకోండి, అతను ఎలక్షన్లో గెలుస్తాడంటారా?" అని ప్రశ్న సంధించాడు. "రాజకీయాల్లో ఏమన్నా జరగొచ్చు కాబట్టి ఒకవేళ జరిగితే?" అని తన కొనసాగింపు. "గెలుస్తాడు" అన్నాను, రెండో ఆలోచన లేకుండా.
అత్యంత సహజంగానే సంభాషణ అవినీతి వైపుకి జరిగింది. "రాజకీయాలనే కాదు సార్. అన్నిచోట్లా అవినీతి పెరిగిపోయింది. నీతిగా బతికేవాళ్ళని చూసి అందరూ నవ్వే రోజులు వచ్చాయి. మనం నీతిగా ఉండాలా? అవినీతిగానా?" నేను ఆలోచనలో పడ్డాను. తనే కొనసాగించాడు.. "డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకుంటున్నారు సార్. ఏదో ఒకటి చేసి సంపాదించేస్తున్నారు. జనం కూడా ఎంత సంపాదించాడు అని ఆలోచిస్తున్నారే తప్ప ఎలా సంపాదించాడు అని ఆలోచించడం లేదు. ఎలా ఉంటే మంచిదా అనిపిస్తోంది.."
నేను నోరు తెరిచాను.. "ఎలా ఉండాలి అన్నది మనకి సంబంధించిన విషయం అండీ. నీతిగా ఉండాలా లేక ఎలా అయినా డబ్బు సంపాదించాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనం. మనకి కావాల్సింది నీతిగా ఉండడం, అంతరాత్మకి సమాధానం చెప్పుకోవడం అయినప్పుడు, వేరెవరో డబ్బు సంపాదించేస్తున్నారని ఆలోచించడం అనవసరం. అలాకాకుండా, డబ్బే ప్రధానం అనుకున్నప్పుడు విలువల గురించిన ఆలోచన అనవసరం. చివరికి మన సంతృప్తి మనకి ముఖ్యం. మీరే చెప్పారు కదా, ఉద్యోగం మానేయడం గురించి ఎవరేమన్నా పట్టించుకోలేదని .."
ఇద్దరం ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉన్నాం. అర్ధరాత్రి కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అద్దం కొద్దిగా దించగానే చల్లగాలి పలకరించింది. ఉన్నట్టుండి అలుముకున్న నిశ్శబ్దం కొత్తగా అనిపించింది. "2012 కలియుగాంతం అంటున్నారు. నిజమేనా సార్?" అన్నాడు తను, నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ. ఈ ప్రశ్న చుట్టూ మిత్రులతో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. "అయితే మాత్రం ఏమవుతుందండీ?" అన్నాను. "అదేంటి సార్, అలా అంటారు? యుగాంతం అంటే..." తను మాటలకోసం వెతుక్కుంటున్నాడు.
"మనం తప్ప మిగిలిన ప్రపంచం యధావిధిగా ఉంటుందంటే మనం బాధ పడాలి. అలాకాకుండా, మిగిలిన ప్రపంచం అంతా తుడిచి పెట్టుకుపోయి మనం ఒక్కళ్ళమే మిగులుతామన్నా బెంగ పడాలి. ఒకవేళ యుగాంతమే జరిగినా నష్టం ఏముంది చెప్పండి? మనమూ ఉండం, ప్రపంచమూ ఉండదు. అంతే కదా.." అన్నాను. "నిజమే కదా సార్. నిజంగా జరిగినా మనం ఆపలేం. అయినా ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయంటారు?"
తక్కువ టైములో, యెంతో పరిచయస్తుడిలా మాట కలిపి ఎన్నో విషయాలు మాట్లాడిన అతణ్ణి గురించి ఆలోచనలో ఉన్నాన్నేను. గమ్యస్థానం వచ్చేసింది. "ముఖ్యమైన విషయాల నుంచి మన దృష్టి మరల్చడానికి. మనం మన సమస్యలని గురించి కాకుండా ఇతర విషయాలని గురించి ఆలోచించడానికి అయి ఉంటుంది. దీనివల్ల ఎవరికి లాభమో నేను మీకు చెప్పక్కర్లేదు కదా.." అన్నాను టాక్సీ దిగుతూ. తనతో కరచాలనం చేసి, విషెస్ చెప్పడం మరచిపోలేదు నేను.
Monday, January 03, 2011
పడవ ప్రయాణం
పాలగుమ్మి పద్మరాజుకి కథారచయితగా యెనలేని ఖ్యాతి తెచ్చిన రెండు కథల్లో మొదటిది 'గాలివాన' కాగా, రెండో కథ 'పడవ ప్రయాణం.' నాయికా నాయకులు రంగి, పద్దాలు. స్త్రీ ఒక మగవాడిని మనసా వాచా 'తనవాడిగా' నమ్మిందంటే, అతడి కోసం ఆమె ఏమైనా చేయగలదు. అది కూడా అతడిని అతడిగా అంగీకరిస్తూ, అతడి నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా. ఇందుకు ఉదాహరణ రంగి, ఓ పల్లెటూరి మనిషి.
రంగి, పద్దాలు తాళి కట్టిన భార్య కాదు. అతడు లేవదీసుకుని వచ్చిన మనిషి. ఆమెకి అతడే లోకం. కానీ అతడి లోకంలో ఆమె స్థానం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే, తను మనసు పడ్డ మరో ఆడ మనిషి రంగి మెడలో ఉన్న నగ మీద మోజు పడితే, ఆ నగ ఇవ్వడానికి రంగి తిరస్కరిస్తే, రంగిని గుడిసెలో పెట్టి తాళమేసి గుడిసెకి నిప్పంటించడానికి వెనుకాడనంత.
అయితే రంగి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె తన మగవాడికోసం నిరంతరం తపిస్తుంది. కానీ అతడు నిర్దుష్టంగా, నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. అతని సుగుణాలతో, అవగుణాలతో అతణ్ణి ఆమె అంగీకరించింది. పద్దాలు రంగిని "తాగి సావగొడతాడు.." కానీ ఉత్తప్పుడు "ఎన్నలా కరిగిపోతాడు. వొంద మందితో పోయినా సరే ఆడు నాకాడికొచ్చి తీరతాడు. నేను లేకపొతే గుండగిలి సచ్చిపోడూ?" అని అడుగుతుంది రంగి.
మానవ మనస్తత్వ చిత్రణమీద పద్మరాజు గారికి ఉన్న పట్టు కథా ప్రారంభం నుంచే తెలిసిపోతూ ఉంటుంది. ప్రారంభ వాక్యాలతోనే పాఠకులని కథ తాలూకు మూడ్ లోకి తీసుకుపోతారాయన. "పొద్దు కుంకిన తరువాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటి మీద జారుతోంది. నీరు పడవ పక్కని కలకలమంటూ రాసుకున్తోంది. చూపురలా జీవ సంచలనం లేని ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని చెవులకు వినపడక దేహాన్నంతనీ తాకుతోంది. మనస్సులో లోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది..." ఇవీ 'పడవ ప్రయాణం' ప్రారంభ వాక్యాలు.
గోదావరి కాలవ మీద బెల్లం, చింతపండూ తదితర సరుకులని రవాణా చేస్తున్న పడవ టాపు మీద వెల్లకిలా పడుకున్న రచయిత తనతో పాటు పాఠకులనీ పడవలో తీసుకుపోతారు. ఓ రాత్రి వేళ రంగీ, పద్దాలూ పడవలో చేరతారు. అప్పటికే రెండు మూడు దొంగతనాలు చేసిన పద్దాలు పడవలో ఉండడానికి వీల్లేదంటారు గుమస్తా గారు. రంగి ఆయన్ని బతిమాలుకుంటుంది. ఆ తర్వాత చుక్కాని కాసే వాణ్ణి మంచి చేసుకుని, వాణ్ణి నిద్రపొమ్మని చుక్కానిని తను అందుకుంటుంది.
ఓ రాత్రివేళ కొంత సరుకుతో పద్దాలు పడవ దిగిపోతాడు. పడవ వాళ్లకి రంగి దొరికిపోతుంది. మిగిలిన ప్రయాణంలో రంగితో మాట కలుపుతాడు రచయిత. "ఈ సొమ్మంతా మళ్ళీ ఆ గుంటకే దక్కుడు. దానిమీద మోజు తగ్గీదాకా దాన్నొదలడు. నేను ఈ కట్టాలన్నీని. దొంగనెంజ! నా ఉసురోసుకుంటది," అంటుంది రంగి, ఏమాత్రం ఉద్రేకం వినిపించని స్వరంలో. అంతేనా? "ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నావోడు. నా దగ్గరికే వొత్తాడు" అని తనలో తను అనుకుంటుంది. "అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి.." అంటాడు రచయిత, కథని ముగించబోతూ.
Saturday, January 01, 2011
మామూలు రోజు...
బ్లాగ్మిత్రులు మధురవాణి గారు పంపిన ఈబుక్ తిరగేస్తే ఎందరివి ఎన్ని జ్ఞాపకాలో. అన్నీ నూతన సంవత్సరానికే సంబంధించినవి కావడం ఈ సంకలనం ప్రత్యేకం. కొందరు బ్లాగ్మిత్రుల ఫోటోలని చూసే అవకాశం కూడా కల్పించిందీబుక్. అప్పటివరకూ టపాలు చదివి ఊహల్లో గీసుకున్న బొమ్మలకీ, కొన్ని టపాల చివర్లో ఇచ్చిన బ్లాగరుల ఫోటోలకీ పోలికలు దొరక్కపోవడం ఓ చమత్కారం. పుస్తకం పూర్తి చేశాక మధురవాణి గారికీ, సుజ్జీ గారికీ అభినందనలు చెప్పకుండా ఉండలేం. అన్నట్టు భవదీయుడి టపాకి కూడా ఈ సంకలనంలో చోటిచ్చారు.
న్యూ ఇయర్ రిజల్యూషన్ కాదు కానీ, రోజంతా తీరిక దొరుకుతుంది కాబట్టి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలి అనుకున్నా. న్యూ ఇయర్ రోజున అనుకున్నందుకో ఏమో తెలీదు కానీ, ఒక్కపనీ పూర్తి కాకుండానే రోజు గడిచిపోయింది. తనకున్న పని తినకున్నా తప్పదు కాబట్టి, పైగా రోజూ క్రమం తప్పకుండా బోయినం చేస్తున్నాను కాబట్టీ నాపనులు నేను చేసుకోక తప్పదు.
ఉదయాన్నే తెలిసిన ఓ చిన్న శుభవార్త సంతోషాన్ని కలిగించింది. కొందరు మిత్రులతో పంచుకున్నప్పుడు వాళ్ళు దాన్ని కొత్త సంవత్సరంతో ముడి పెట్టారు. "మంచి కబురు తెలిసిన ప్రతిరోజూ మంచిరోజే" లాంటి వేదాంతాలు చెప్పి వాళ్ళ మూడ్ పాడు చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయా. కొందరు మిత్రులతో పాటు నేను కూడా కొద్ది రోజులుగా ఇలాంటి వార్త కోసం ఎదురుచూస్తున్నా. మాకందరికీ ప్రయోజనం కలిగించే విషయం మరి. దీనినో మంచి శకునంగా అనుకుందాం అని ఏకాభిప్రాయానికి వచ్చాం.
మధ్యాహ్నానికి ఫోన్ సర్విస్ పునరుద్దరింపబడింది. అది మొదలు ఫోన్లు, సందేశాలు. జవాబిచ్చే విషయంలో ఎప్పటిలాగే ప్రాంప్ట్ గా ఉన్నాను. ముఖ్యంగా తర్వాతెప్పుడో కనబడి "...అప్పుడు మీకు మెసేజ్ ఇస్తే కనీసం రిప్లయ్ ఇవ్వలేదు.." అని సాధించే మిత్రులని గుర్తు పెట్టుకుని మరీ, నా జవాబు వారికి చేరిందన్న విషయాన్ని నిర్ధారణ చేసుకున్నా. హమ్మయ్య, ఇప్పుడింక విష్ చేసిన వాళ్ళ చేత మాట పడక్కర్లేదు.
ఫోనుల్లో బోల్డన్ని విషయాలు చర్చకి వచ్చేశాయి. కుటుంబ విషయాలు మొదలు, ఆఫీసులో జరుగుతున్న అన్యాయాల వరకూ అనేకానేక సంగతులు అలవోకగా మాట్లాడేసుకున్నాం. ఎప్పుడూ అలవాటు లేని మధ్యాహ్నం నిద్రకి ప్రయత్నించి భంగపడ్డా. టీవీలో ఏదన్నా సినిమా చూడాలన్న ప్రయత్నమూ అంతగా సాగలేదు. బ్లాగు తెరిస్తే మిత్రుల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు కనిపించాయి. మన బ్లాగు మన డైరీనే కదా, డైరీ రాసినట్టే ఓ టపా రాద్దాం అని మొదలు పెట్టా.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.







