Sunday, January 31, 2010

ఓ అడుగు పడింది..

గడిచిన రెండు రోజులుగా టీవీ చానళ్ళ, ముఖ్యంగా వార్తా చానళ్ళ, ప్రసారం లో వచ్చిన మార్పు నిత్యం టీవీ చూసే వాళ్ళలో చాలా మందిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఉన్నట్టుండి చానళ్ళన్నీ సంయమనం వహించడం మొదలు పెట్టాయి. ఏ చిన్న వార్త దొరికినా దానిని అతి చేసి హడావిడి చేసే తమ నైజాన్ని పక్కన పెట్టాయి. యెంతో ప్రాముఖ్యత ఉన్న (చానళ్ళ దృష్టిలో) వార్తలని సైతం ఆచి తూచి ప్రసారం చేశాయి.

అడ్డూ అదుపూ లేకుండా వార్తల పేరుతో నిరంతర ప్రసార స్రవంతిని జనం మీదకి వదులుతున్న చానళ్ళకి మార్గ దర్శకాలు విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కి తొలి వందనం. వార్తల ముసుగులో ప్రసారం చేస్తున్న హింసాత్మక, అశ్లీల కార్యక్రమాల పట్ల హైకోర్టు ఒకింత ఘాటుగానే స్పందించింది. టీవీల్లో చూపిస్తున్న దృశ్యాలు, ఉపయోగిస్తున్న భాష, వివిధ రకాల కార్యక్రమాలు, వాటిని రూపొందించి ప్రసారం చేస్తున్న తీరుని నిశితంగా పరిశీలించిన మీదట ఉత్తర్వులని జారీ చేసింది.



రెండు రోజుల టీవీ కార్యక్రమాలు చూసినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు అమలవ్వడం మొదలయ్యాయనే అనిపించింది. రెండు రోజులుగా ప్రమాదాలు జరిగినా మృతదేహాలని క్లోజప్ లో చూపలేదు. గాయాల మీద కెమెరా ఉంచి ప్రసారాలు చేయలేదు. రక్త దృశ్యాలని సాధ్యమైనంత వరకూ చూపకుండా ఉండడానికి దాదాపు "అన్ని చానళ్ళూ" ప్రయత్నించాయి. తెలుగు ప్రేక్షకులకి ఇదొక శుభ పరిణామం.

నిజానికి ప్రజాస్వామ్యంలో మిగిలిన వ్యవస్థలతో సమాన గౌరవాన్నీ, హోదాన్నీ అందుకున్న మీడియా ఇలా "చెప్పించుకోవాల్సి రావడం" ఓ దురదృష్టకర పరిణామం. ప్రజలకి మంచి-చెడు చెప్పాల్సిన, వాళ్లకి మార్గదర్శకత్వం వహించాల్సిన మీడియా మరో వ్యవస్థ చేత చెప్పించుకోవడం అంటే తన విలువనీ, గౌరవాన్నీ తగ్గించుకోవడమే.

అయితేనేం.. హైకోర్టు చెప్పింది మెజారిటీ ప్రజల, ప్రేక్షకుల మనోభీష్టానికి అనుకూలంగా ఉంది. వార్తల పేరిట ప్రసారమవుతున్న వికృత కార్యక్రమాల పట్ల జనం ఎంతగా విసిగిపోయారో తెలుసుకోడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. 'కూడలి' లేదా 'జల్లెడ' చూస్తే చాలు. బరి తెగించిన టీవీ ప్రసారాల గురించి ప్రతి రోజూ టపాలు కనిపిస్తున్నాయిక్కడ.

ఇప్పుడింక టీవీ కార్యక్రమాల ప్రసార సరళి పూర్తిగా మారిపోయినట్టేనా? ఈ ప్రశ్నకి జవాబు ఇప్పటికిప్పుడు చెప్పగలిగేది కాదు. కొన్నాళ్ళు వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయం. అయితే, టీవీ కార్యక్రమాల ప్రసారాలని నిత్యం గమనిస్తూ ఉండడానికి, దారి తప్పిన/తప్పుతున్న చానళ్ళపై తక్షణ చర్యలు తీసుకోడానికీ ఒక బలమైన, చురుకైన వ్యవస్థ అవసరాన్ని ఈ పరిణామం మరోసారి నొక్కి చెప్పింది.

Thursday, January 28, 2010

నా రెండో కథ...

నా మొదటి కథ 'బెల్లం టీ' కి మీ నుంచి వచ్చిన స్పందన నన్ను మరో కథ రాసేలా ప్రోత్సహించింది.. ఫలితమే 'ఉత్పరివర్తనం.' "బాల్య జ్ఞాపకాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతివృత్తం తీసుకుని కథ రాయమని" నాకు పరిక్ష పెట్టిన బ్లాగ్మిత్రులు, 'మానసవీణ' బ్లాగరి నిషిగంధ గారికి, కథను ప్రచురించిన 'పొద్దు' వారికీ కృతజ్ఞతలు. నేను పరిక్ష రాసేశాను.. నిర్మొహమాటంగా ఫలితం చెప్పాల్సింది మీరే..

Tuesday, January 26, 2010

శంభో..శివ శంభో...

విజయవంతమైన తమిళ సినిమా 'నాడోడిగళ్' కి తెలుగు రీమేక్ 'శంభో..శివ శంభో..' సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో, మిగిలిన రెండింటితో పోలిస్తే ప్రచారంలో ఒకింత వెనుకబడిన సినిమా అయినా, నేను మొదటగా చూద్దామనుకున్నది ఈ సినిమానే. కొంచం ఆలస్యంగా చూడగలిగాను. స్టార్ హీరో అన్నీ తానై సినిమాని తన భుజాల మీద మోస్తున్న ప్రస్తుత ట్రెండ్ కి భిన్నంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయకులు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఒక్క డ్యూయట్టూ లేదు.. ఈ సినిమా కథే వేరు.
ఓ పిల్లా పిల్లాడూ ప్రేమించుకోడం, రెండువైపుల పెద్ద వాళ్ళూ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోక పోవడం, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహం కోసం, ప్రేమని గెలిపించడం కోసం అన్నీ తామే అయ్యి వాళ్ళ పెళ్లి జరిపించడం అన్నది గత పడి, పన్నెండేళ్ళుగా తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ఇంత మంది, ఇన్ని త్యాగాలు చేసి పెళ్లి జరిపిస్తే, ఆ జంట సవ్యంగా కాపురం చేస్తుందా? పెళ్లి జరిపించిన మిత్రుల పట్ల వాళ్లకి గౌరవం, కృతజ్ఞత ఉంటుందా? సరిగ్గా ఈ పాయింట్
నే పట్టుకుని తమిళ దర్శకుడు సముద్రఖని ఈ తెలుగు సినిమాని తీశారు.

అందరూ కర్ణ అని పిలుచుకునే కరుణాకర్ (రవితేజ) ఆశయం ప్రభుత్వ ఉద్యోగి కావడం. బీయే గోల్డ్ మెడల్ తెచ్చుకుని, సర్విస్ కమిషన్ పరిక్షలు రాస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటే అతనికి మామ (తనికెళ్ళ భరణి) కూతురు (ప్రియమణి) అంతే ప్రేమ. ఆ మామకేమో తన అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలని కల. గవర్నమెంట్ జాబ్ చేసేవాదికే తన కూతుర్ని ఇస్తానని తరచూ చెబుతూ ఉంటాడతను. కర్ణ ప్రాణ స్నేహితులు మల్లి (అల్లరి నరేష్), చంద్ర (శివ బాలాజీ). కర్ణ చెల్లెలు పవిత్ర (అభినయ), చంద్ర ప్రేమించుకుంటూ ఉంటారు. చూసీ, చూడనట్టు నటిస్తూ ఉంటాడు కర్ణ.

మాజీ ఎంపీ భవాని (రోజా) కొడుకు సంతోష్ ('వినాయకుడు' ఫేం అల్తాఫ్). ఇతను కర్నూల్ ఫ్యాక్షనిస్ట్ నరసింహా రెడ్డి (ముఖేష్ రుషి) కూతురితో ప్రేమలో పడతాడు. ఇరువైపులా పెద్దలూ రాజకీయ కక్షల వల్ల పెళ్ళికి అంగీకరించారు. తమ పెళ్లి జరిపించాల్సిందిగా ప్రాణ స్నేహితుడు కర్ణ ని కోరతాడు సంతోష్. కర్ణ తన స్నేహితులతో కలిసి హీరోచితంగా సీమకి వెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి సంతోష్ తో పెళ్లి జరిపిస్తాడు. ఇందుకోసం చంద్ర ఒక కాలినీ, మల్లి తన వినికిడి శక్తినీ 'త్యాగం' చేయాల్సి వస్తుంది. కర్ణ పోలీసు కేసులో ఇరుక్కుని గవర్నమెంట్ జాబ్ కి పనికి రాకుండా పోతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ.

సినిమా చూస్తున్నంతసేపూ తెలుగు నటులంతా తమిళంలో నటిస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే, తమిళ దర్శకుడు, తమిళ కథకి తెలుగు నటులని ఎంచుకుని, రాజమండ్రి, కర్నూలులో తమిళ సినిమా తీసి దానిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసినట్టుగా ఉందీ సినిమా. ఒక్కమాటలో సినిమాకి నేటివిటీ లోపించింది. చూస్తున్నంతసేపూ ఎక్కడా ఇది మన పక్కన జరుగుతున్న కథ అన్న భావన కలుగలేదు. నటీనటుల ఆహార్యం, మాటలు, పాటలు, చివరికి కృష్ణ భగవాన్ మీద పెట్టిన కామెడీ ట్రాక్ కూడా తమిళ వాసనే కొట్టింది.

యువకుడిగా కనిపించడం కోసం రవితేజ బానే చిక్కాడు కానీ, అతను పరిక్షలు రాయడం లాంటివి అసహజంగా అనిపించాయి. రవితేజ కి భిన్నంగా శివబాలాజీ కొంచం (బాగానే) వొళ్ళు చేశాడు. మరికొంచం వొళ్ళు చేయకుండా జాగ్రత్త పడాలి. ముగ్గురు హీరోల్లోనూ మంచి మార్కులు కొట్టేసినవాడు అల్లరి నరేష్. దర్శకుడు కనుక మల్లి పాత్రను తీర్చి దిద్దడం మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పాత్ర నరేష్ కి మరో 'గాలి శీను' పాత్ర అయి ఉండేది.

ప్రియమణి తక్కువ మేకప్ తో కనిపించింది కానీ, నటించడానికి పెద్దగా ఏమీ లేని పాత్ర. వినికిడి శక్తి లేని, మాట్లాడలేని అమ్మాయి అభినయ పవిత్ర పాత్ర బాగా చేసింది. రెండు మూడు మంచి సన్నివేశాలు దొరికాయి ఈ అమ్మాయికి. రాజకీయ నాయకురాలి పాత్రలో రోజాని చూసినప్పుడు, ఒక మహిళా నేతని అనుకరించే ప్రయత్నం చేసిందని అనిపించింది. ఆహుతి ప్రసాద్, సుధా లవి రొటీన్ తల్లిదండ్రుల పాత్రలు కాగా, రాధాకుమారి అంతగా ప్రాధాన్యం లేని నాయనమ్మ పాత్రలో కనిపించింది. టీవీ నటిగా స్థిరపడ్డ ఒకప్పటి సిని నటి కిన్నెర తనికెళ్ళ భరణి భార్యగా ఒక్క డైలాగూ లేని పాత్రలో నటించింది.

కృష్ణ భగవాన్ మీద తీసిన కామెడీ ట్రాక్ ప్రస్తుత 'పబ్లిసిటీ రాజకీయాల' మీద మంచి సెటైర్.. ముఖ్యంగా అతని మీద తీసిన 'రాజువయ్యా.. మహ రాజువయ్యా..' బిట్ థియేటర్ మొత్తాన్ని నవ్వించింది. హీరోల కర్నూలు స్నేహితుడిగా సునీల్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎల్బీ శ్రీరామ్ ది బొత్తిగా ప్రాధాన్యత లేని పాత్ర. కోటి తండ్రిగా కోట బాగా చేశాడు. నటీ నటులెవ్వరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపించింది.

దర్శకత్వం గురించి చెప్పాలంటే.. సముద్రఖని తెలుగు నేటివిటీని అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది. కథని స్ట్రెయిట్ నేరేషన్ లో చెప్పడం వల్ల మొదటి సగం చాలా నెమ్మదిగానూ, రెండో సగం హడావిడిగానూ సాగిపోయినట్టు అనిపించింది. ప్రేమ గురించీ, స్నేహం గురించీ రవితేజ, రావు రమేష్ ల చేత చెప్పించిన 'పవర్ఫుల్' డైలాగులు సినిమాలో నాటకీయతని పెంచాయి. రావు రమేష్ ప్రేమ సలహాలిచ్చే పాత్రలు తగ్గించుకోక పోతే ఒక బ్రాండ్ పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంగ వికలుర చేత హాస్యం పుట్టించడాన్ని ఇంకా ఎన్నాళ్ళు చూడాలో ఏమిటో.

ముత్తయ్య సినిమాటోగ్రఫీ బాగుంది. సుందర్ సి. బాబు సంగీతాన్ని గురించీ, పాటల గురించీ చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు రీమేక్ అనుకునే కన్నా, తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకుని చూస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సినిమాకీ, టైటిల్ కీ ఉన్న సంబంధం ఏమిటో మాత్రం నాకింకా అర్ధం కాలేదు.

Sunday, January 24, 2010

తొలి వసంతం

నిన్నగాక మొన్ననే మొదలుపెట్టినట్టు ఉంది.. ప్రతి రోజూ కొన్ని కొత్త సందేహాలు, సమాధానాలు.. కొత్త మిత్రులు.. కొందరు చేరువయ్యారు.. మరి కొందరు చేరువై దూరమయ్యారు.. ఇంకొందరు దూరమై చేరువయ్యారు.. అంతా రెప్ప పాటులో జరిగిపోయినట్టుగా ఉంది.. కేలండర్ చూస్తే అప్పుడే గిర్రున ఏడాది తిరిగిపోయింది.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున 'నెమలికన్ను'తెరిచింది.



నిజంగా నేనేనా? అన్నది ఎప్పుడూ నన్ను వేధించే ప్రశ్న. తల్చుకున్నది ఏదైనా ఆలస్యం లేకుండా చేసేసే నా అలవాటు నాకు మంచీ చేసింది, చెడూ చేసింది. అలా తలచుకోగానే ఏమీ ఆలోచించకుండా మొదలు పెట్టేసిన పనుల్లో బ్లాగింగ్ ఒకటి. ఎన్నెన్నో బ్లాగులు.. రకరకాల టపాలు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. ఏ బ్లాగు తెరిచినా ఏదో ఒక కొత్త విషయం.. అప్పుడే తుఫాను వెలిసిన బ్లాగ్వాతావరణం.

ఏడాది క్రితం 'నెమలికన్ను' తొలి అడుగు వేసేనాటికి బ్లాగావరణం పరిస్థితి ఇది. "వీటి మధ్య మరో బ్లాగు అవసరమా?" అనుకోలేదు నేను. "మనమూ రాద్దాం" అనుకున్నాను. అలా అనుకునే మొదలు పెట్టాను. ఏడాది కాలం మరీ ఎక్కువేమీ కాకపోవచ్చు.. కానీ ఒకసారి వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని చూసుకోడానికీ, వెళ్ళాల్సిన మార్గం నిర్ణయించుకోడానికీ పనికొచ్చే ఒక మైలు రాయి.

మంచైనా, చెడైనా ప్రతి అనుభవమూ ఒక పాఠమే.. నేర్చుకో గలగాలే కానీ మనకి తారసపడే ప్రతి వ్యకీ ఒక పాఠం నేర్పుతారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. నా అభిరుచులకి తగ్గ సమాచారం సేకరించుకున్నాను. ఓ పుస్తకం చదివినప్పుడో, ఓ సినిమా చూసినప్పుడో, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఏదైనా కొత్త విషయాన్ని గమనించినప్పుడో, మనసుకి సంతోషం వేసినప్పుడో, బాధ కలిగినప్పుడో..నాకు ఏదైనా ఎవరితోనైనా పంచుకోవాల్సింది ఉంది అనిపించినప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను.

ఈ బ్లాగుకి ఉన్న రీచ్ తక్కువే కావొచ్చు. కానీ నా ఆలోచన ఏమిటంటే బ్లాగ్ అనేదే లేకపోతే కనీసం ఈ కొందరితో అయినా నా భావాలు ఎలా పంచుకోగలను? వాళ్ళ అభిప్రాయాలు ఎలా తెలుసుకో గలను? అందువల్ల నా బ్లాగు నాకు అపురూపమే. బ్లాగ్మిత్రులు కొందరు చెబుతున్నట్టుగా బ్లాగులకి అడిక్ట్ కావడం, చూడకుండా ఉండలేక పోవడం అనే సమస్య నాకింకా కలగలేదు. కాబట్టి బ్లాగింగ్ ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని చెప్పగలను.

ఏపనినైనా క్రమం తప్పకుండా చేయడానికి ఏదో ఒక రూపంలో ఒక ఉత్ప్రేరకం అవసరం అవుతుంది. వ్యాపారం అయితే లాభాలు, ఉద్యోగం అయితే జీత భత్యాలు, పదోన్నతి.. ఇలాంటివన్న మాట.. మరి బ్లాగింగ్ కి?? పాఠకుల నుంచి వచ్చే స్పందన. సలహాలు, సూచనలు. ఈ విషయంలోనూ నేను అదృష్టవంతుడినే.. 'నెమలికన్ను' పాఠకులు తమ సమయాన్ని వెచ్చించి ఇస్తున్న సలహాలు, సూచనలు నాలో రాయాలనే ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

నా టపా చదివి ఓ పుస్తకం చదివామనో, ఓ సినిమా చూశామనో మిత్రులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. బ్లాగు మొదలయిన ఆరు నెలలకి తెలుగు దిన పత్రిక 'ఈనాడు,' గత నెలలో బ్లాగరి 'సిరిసిరిమువ్వ' గారు 'నెమలికన్ను' ని సమీక్షించారు. 'కృతజ్ఞతలు' అన్నది చాలా చిన్న మాటే అవుతుంది. వారి సూచనలు దృష్టిలో ఉంచుకుంటాను. నాకు సంబంధించి, మెరుగు పరుచుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.

బ్లాగ్మిత్రులతో మాట్లాడడానికి కామెంట్ బాక్స్ తో పాటు మరేదైనా వేదిక ఉంటే బాగుండునన్న ఆలోచన ఫలితమే nemalikannu@gmail.com. తమ సలహాలు, సూచనలను వివరంగా అందించాలనుకున్న బ్లాగ్మిత్రులు మెయిల్ పంపవచ్చు. మీ అభిప్రాయాలు నాకు అమూల్యమైనవి. ఏడాది బ్లాగింగు అనుభవంలో సినిమా సమీక్షల వంటివి రాయడాన్ని కొంత మెరుగు పరుచుకోడంతో పాటు, అనుకోకుండా ఒక కథనీ రాయగలిగాను. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

Friday, January 22, 2010

బ్లాగులు-మధురవాణి

ఆ బ్లాగు లో టపాలు చదువుతూ ఉంటే రోజూ మన కళ్ళెదురుగా తిరిగే పక్కింటి అమ్మాయి గలగలా చెబుతున్న కబుర్లు వింటున్నట్టుగా ఉంటుంది. వట్టి కాలక్షేపం కబుర్లు కాదు సుమా.. సరదా చమక్కులతో పాటు, మనసుకు పట్టేసేవి, మనకి పనికొచ్చేవి ఎన్నో ఉంటాయి.. కేవలం మాటలు మాత్రమే కాదు.. అపురూపమైన పాటలూ దొరికే ఆ బ్లాగు పేరు 'మధురవాణి' ..బ్లాగరు పేరు కూడా అదే.

తెలుగు సాహిత్యంలో నా అభిమాన నాయికల్లో అగ్రస్థానంలో ఉన్న నాయిక పేరుతో ఒక బ్లాగు నా కంట పడినప్పుడు చదవకుండా ఉంటానా? గబగబా చదివేశాను. చదవగానే ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని జెర్మనీ కి ఎగిరిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే 'మధురవాణి-తెలుగురాణి' బ్లాగులో నేను మొదటగా చదివిన టపా 'జర్మనీలో క్రిస్మస్ మార్కెట్-గ్లూ వైన్ విశేషాలు.' జర్మనీలో ఎన్ని రకాల వైన్లు ఏయే రుచులలో దొరుకుతాయో రాసి నోరూరించారు మధురవాణి. ఆవిడ జర్మనీలో ఉంటారని తెలిసింది, ఆ టపా వల్ల.

ఒక్కసారి పాత టపాలు తిరగేస్తే తెలిసింది ఆ బ్లాగు కేవలం కబుర్ల పుట్ట మాత్రమే కాదనీ, పాటల ఖజానా కూడా అనీ.. పాతా, కొత్త అని కాకుండా వినసొంపైన పాటలన్నీ దొరుకుతాయిక్కడ. వినడమే కాదు చక్కగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.. నేను మొదటగా డౌన్ లోడ్ చేసుకున్న పాట 'శుభోదయం' లో 'కంచికి పోతావా కృష్ణమ్మా..' ఈ సినిమా గురించి 'నవతరంగం' లో ఒక చక్కని సమీక్ష కూడా రాశారు మధురవాణి.

కొంచం చరిత్ర లోకి వెళ్తే, 2008 సెప్టెంబర్ 27 న 'Welcome to Madhuravaani' అనే ఆంగ్ల శీర్షికతో మొదటి టపా రాశారు. బాపు బొమ్మలు, సుమతీ శతక పద్యాలతో అందంగా అలంకరించారు బ్లాగుని. త్వరలోనే తెలుగు కి మారిపోయినా, అప్పుడప్పుడూ ఆంగ్ల టపాలు తళుక్కు మంటూనే ఉన్నాయి, ప్రారంభంలో. ఐతే రాను రానూ తెలుగు టపాల మీదే దృష్టి పెట్టారు.

నీతి కథలు చెప్పినా, వాళ్ళ బంగారం విశేషాలు రాసినా, ముద్దు పేర్లను గురించి ముచ్చట్లు వివరించినా మనం అలా అలా చదువుకుంటూ వెళ్లి పోవాల్సిందే. 'అమ్మ' గురించి రాసిన టపా కదిలిస్తే, వాళ్ళింటి 'గుర్రం బొమ్మ' గురించి రాసిన టపా కాసేపు ఆలోచనల్లో పడేస్తుంది. వాళ్ళ పెరటి జామచెట్టు గాధ చదివాక మన కళ్ళ ముందు ఒక బుల్లి రాజు గారూ, మరో బుల్లి మంత్రి గారూ మెదలక మానరు. సినిమా పాటలతో పాటు సీరియస్ సాహిత్యాన్ని గురించీ చెప్పే మధురవాణి మహాకవి 'శ్రీశ్రీ' గొంతు వినిపించారు ఇక్కడ.

అప్రస్తుతం కాదు కాబట్టి ఇక్కడ నా గురించి కొంచం చెప్పాలి. నేను సాంకేతిక విషయాలు ఏవీ తెలుసుకోకుండా ఒకలాంటి మొండి తనంతో బ్లాగు మొదలు పెట్టేసి, బిక్కుబిక్కు మంటున్న వేళ తనంతట తానుగా వచ్చి నాకు సూచనలు చేశారు మధురవాణి. అప్పుడే తెలిసింది, ఇక్కడ మనకి సాయం చేసేవాళ్ళకి లోటు లేదని. అంతేనా.. నాకో చక్కని బహుమతిని కూడా ఇచ్చారు.

అన్నట్టు మధురవాణి గారు కేవలం బ్లాగరి మాత్రమే కాదు, రచయిత్రి కూడా. ఆవిడ మొదటి కథ 'ఆవృతం' పొద్దు లో ప్రచురితమయ్యింది. 2008 లో చాలా ఉత్సాహంగా టపాలు రాసిన మధురవాణి గారు - ఒక్క అక్టోబర్ నెలలోనే 36 టపాలు - 2009 లో బ్లాగింగ్ కి అతి కొద్ది సమయం మాత్రమే కేటాయించారు.. ఏడాది మొత్తం లో రాసినవి కేవలం 32 టపాలు మాత్రమే. 'మధురవాణి' తో పాటు మరో మూడు బ్లాగుల్ని నిర్వహిస్తున్నారు మరి. ఇప్పటి నుంచైనా కొంచం తరచుగా కబుర్లు చెబుతారనీ, కథలు రాస్తారనీ ఎదురు చూస్తున్నాను..

Wednesday, January 20, 2010

(ఇం)కోతి కొమ్మచ్చి

చూడదగ్గ సినిమాలని నేను రెండు రకాలుగా వర్గీకరించుకుంటాను. గొప్ప సినిమాలు, మంచి సినిమాలు. గొప్ప సినిమా మనం థియేటర్ నుంచి బయటికి వచ్చినా మనల్ని వెంటాడుతుంది. అందులో పాత్రలో, మాటలో, పాటలో, కొండొకచో మొత్తం సినిమాలో కొన్నాళ్ళ పాటు మనకు తరచూ గుర్తొస్తూ ఉంటాయి. ఇక మంచి సినిమా అంటే, చూసినంత సేపూ సినిమాని ఆస్వాదిస్తాం. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా నుంచి బయటికి వచ్చాక తల్చుకోడానికి, గుర్తు చేసుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు.

సిని రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ 'సిరీస్' గా రాస్తున్న తన జీవిత చరిత్రలో మొదటి భాగం 'కోతి కొమ్మచ్చి' గొప్ప సినిమా అయితే, రెండో భాగం '(ఇం)కోతి కొమ్మచ్చి' ని మంచి సినిమా అనొచ్చు. సినిమా వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి సినిమాలతో పోలిక సరైనదేనేమో. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయడం తో మొదటి భాగాన్ని ముగించిన రమణ, అదే అంశంతో రెండో భాగాన్ని ప్రారంభించి, సిని రంగ ప్రవేశాన్ని గురించి సుదీర్ఘంగా వివరించారు.


విమర్శకుడిగా అప్పటివరకూ విడుదలైన సినిమాలని చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసిన రమణ, సినిమా కి రచన చేసే అవకాశం రాగానే సహజంగానే కొంచం భయపడ్డారు. వద్దనుకున్నారు. చివరికి దిగారు. రచయితగా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా ఎదిగారు. అయితే ఇదంతా మంచినీళ్ళు తాగినంత సులువుగా జరిగిపోలేదు. ఎందుకంటే రమణ జేబు నిండా సొమ్ములున్న వ్యక్తి కాదు. కేవలం టాలెంట్ ని నమ్ముకుని ధైర్యం చేసిన వ్యక్తి. పక్కనే బాపూ కొండంత అండ.

'కోతి కొమ్మచ్చి' లో రమణ బాల్యం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, అలవి కాని కష్టాలని కూడా చిరునవ్వుతో భరించిన వైనాన్ని అత్యంత హాస్య భరితంగా చెప్పారు మనకి. అయితే రెండో భాగంలో కేవలం సినిమా రంగం మాత్రమే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని కేవలం రెండు మూడు పేజీలకి మాత్రమే కుదించారు. ఫలితం, సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రెండో భాగాన్ని ఆస్వాదించ గలుగుతారు. పైగా, సినిమా రంగ వార్తలని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లకి కొత్తగా అనిపించే విషయాలు కొన్నే ఉన్నాయి.

నిర్మొహమాటంగా రాయడం రమణ శైలే అయినా, ఆత్రేయ గురించీ, ఆదుర్తి గురించీ రాసిన కబుర్లు చివుక్కు మనిపిస్తాయి. ఎంతైనా 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' కదా.. ఆత్రేయ డబ్బు తీసుకుని 'సాక్షి' సినిమాకి పాట రాయకపోవడం, ఆదుర్తి 'మూగమనసులు' సినిమాకి కథ, మాటలు రాయించుకుని డబ్బు ఎగ్గొట్టడాన్నిగురించి రమణ రాసిన విధానం చదివితే ఆయనలోని నిర్మాతే మన కళ్ళ ముందు మెదులుతాడు. ఎస్వీఆర్ భోజనం, జమునతో షూటింగ్ అనుభవాలు, 'బుద్ధిమంతుడు' లో నటిస్తానని భానుమతి అడిగినప్పుడు రమణ గుండెల్లో రాయి పడడం లాంటివి నవ్విస్తాయి.

మొదటి భాగం తో పోల్చినప్పుడు పుస్తకం రెండో భాగంలో కథనం కొంచం పల్చబడిందని అనిపించింది. ఒక ఆత్మకథని కాక సినిమా కబుర్ల పుస్తకం చదువుతున్న భావన కలిగింది. మొత్తం మీద మొదటి భాగం అందించిన రసానుభూతి రెండో భాగంలో లోపించింది. అందువల్లనే కావొచ్చు, పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చిన విషయాలేవీ లేవు నాకు. బాపు బొమ్మలతో 'హాసం' ప్రచురించిన '(ఇం)కోతి కొమ్మచ్చి' పేజీలు 200, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్మిత్రులు వేణూ శ్రీకాంత్ గారి టపాని ఇక్కడ చదవొచ్చు.

Tuesday, January 19, 2010

ఆంధ్రలేఖ వారికి...

ఆంధ్రలేఖ వారికి,

నమస్తే. నా పేరు మురళి. గత ఏడాది కాలంగా 'నెమలికన్ను' (http://nemalikannu.blogspot.com/) పేరుతో తెలుగు బ్లాగు రాస్తున్నాను. మీరు ప్రకటించిన బ్లాగుల పోటీకి నా బ్లాగు ఎంట్రీ గా వచ్చిందని, టాప్ టెన్ కి ఎంపికయ్యిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నా బ్లాగును ఎంట్రీ గా నేను పంపలేదు. పోటీలో పాల్గొనడం నా అభిమతం కాదు కాబట్టి మీరు ప్రకటించిన పోటీకి నేను దూరంగా ఉన్నాను.

'చైతన్య యామినేని' పేరుతో మీకు ఎంట్రీ రావడం నన్ను షాక్ కి గురిచేసింది. ఇది ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు. ఏమైనప్పటికీ, ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న పోటీ నుంచి 'నెమలికన్ను' ఎంట్రీ ని తొలగించాల్సిందిగా కోరుతున్నాను. మీకు పంపుతున్న ఈ ఉత్తరాన్ని నా బ్లాగులో కూడా ప్రచురిస్తున్నాను.

ధన్యవాదాలతో..
--
మురళి
http://nemalikannu.blogspot.com/

Tuesday, January 12, 2010

సుబ్బీ గొబ్బెమ్మా...

అసలు పండగంటే పల్లెటూరిలోనే చూడాలి.. ఇక సంక్రాంతి పండుగ సంబరాలు చూడాలంటే గోదారి ఒడ్డున పల్లెటూరుకి ప్రయాణమై వెళ్ళాల్సిందే. రాత్రిపూట చలి ముదిరి రగ్గు కప్పుకోవాల్సి వచ్చిందంటే, వీధిలో బంతి మొక్కలు నవలాడుతూ ఎదిగి పూతకి సిద్ధమవుతున్నాయంటే, డిసెంబరాలు విరగబూయడం మొదలు పెట్టాయంటే అర్ధమైపోయేది చిన్నప్పుడు, సంక్రాంతి పండుగ రాబోతోందని.

గుళ్ళో ధనుర్మాసం సేవ మొదలవ్వడం, అమ్మ రోజూ వేసే ముగ్గుకు బదులుగా నెలపట్టు ముగ్గు వేయడం కొండ గుర్తులు. అమ్మో సంక్రాంతి అంటే ఎన్ని పనులు.. భోగి పిడకలు చేసుకోడం మొదలు, కొత్త బట్టలు కుట్టించుకోడం వరకూ.. అస్సలు ఊపిరి సలుపుతుందా?? వీధిలో అందరికన్నా మన ఇంటి ముందు వేసే భోగి మంటే పెద్దదిగా ఉండాలా.. పైగా మనం వేసే భోగి దండే పొడుగ్గా ఉండాలి.. కనీసం లక్ష పిడకలైనా ఉంటే కానీ (లెక్కల్లో నేను చిన్నప్పటి నుంచీ వీకే) అంత పెద్ద దండ రాదు మరి.

మరి భోగి పిడకలు చేసుకోడం మొదలు పెట్టాలంటే గొబ్బిళ్ళు పెట్టే వరకు ఆగి, వాటిని కూడా ఆవు పేడలో కలిపి అప్పుడు కదా పని మొదలు పెట్టాలి. అమ్మ వీధికంతటికీ 'అత్తయ్ గారు' కాబట్టి చుట్టు పక్కల ఆడపిల్లలంతా మనింటికి వచ్చి సందె గొబ్బిళ్ళు పెట్టుకోవాల్సిందే. అమ్మ పెరడంతా బాగు చేసి, కల్లాపి జల్లి ముగ్గులేసి, నేను కష్టపడి సంపాదించి తెచ్చిన ఆవుపేడతో గొబ్బెమ్మలు చేశాక అప్పుడు వచ్చే వాళ్ళు అమ్మాయిలు పూల బుట్టలు పట్టుకుని.

వీళ్ళీ గొబ్బిళ్ళేవో పెట్టేసుకుంటే రేపటినుంచి భోగి పిడకల పని మొదలు పెట్టేసుకోవచ్చు కదా అన్నది నా మొదటి ఆలోచన. ఈ పూజా కార్యక్రమమేదో తొందరగా అయిపోతే నాన బెట్టిన అటుకుల్లో, బెల్లం పొడీ, కొబ్బరి కోరూ, ఏలకు పొడీ కలిపి చేసిన ప్రసాదాన్ని రుచి చూడచ్చు కదా అన్నది రెండో ఆలోచన. వచ్చిన వాళ్లకి మంచినీళ్ళు, వాళ్ళు తెచ్చుకోడం మర్చిపోయిన పూజ వస్తువులు అందించే అదనపు డ్యూటీ కూడా పడేది.

అమ్మ తన పూజ పుస్తకాల్లోనుంచి ఓ పుస్తకం చూసి ఏదో చదివితే, ఆడ పిల్లలంతా గొబ్బెమ్మలకి పూజ చేసేవాళ్ళు. చివరగా వాళ్ళంతా గొబ్బిళ్ళు పెట్టిన ముగ్గు చుట్టూ ప్రదిక్షిణ చేస్తూ 'పాట' పాడేశారంటే గొబ్బిళ్ళు పెట్టడం అయిపోయినట్టే. ఇంక ప్రసాదాలు పెట్టేస్తారు. అమ్మ పాట చెబుతుంటే వాళ్ళు అందుకుని చప్పట్ల దరువేస్తూ, ప్రదిక్షణ చేస్తూ పాడేవాళ్ళు.


"సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే..
మొగలి పూవంటీ.. మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే.."

పాట చివరికొచ్చేసరికి ఆడపిల్లలంతా ఉన్నట్టుండి పాడడం మానేసేవాళ్ళు.. "ఊ... అనాలమ్మా.." అని అమ్మ కొంచం నొక్కి చెబితే ఇక తప్పక లోగొంతుకతో చెప్పేవాళ్ళు చివరి వాక్యం.. వెంటనే బాగా నవ్వుకునే వాళ్ళని జ్ఞాపకం. ఆలోచనలు ప్రసాదం మీద, భోగి పిడకల మీదా ఉండడంతో పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. చూస్తుండగానే కొన్ని సంక్రాంతులు గడిచిపోడం, నేను కాలేజీకి వచ్చేయడం జరిగిపోయింది. దృష్టి భోగి పిడకల లాంటి చిన్న విషయాల నుంచి 'ఇతర' విషయాల మీదికి మళ్లడం సహజమే కదా..

ఎప్పటిలాగే మా పెరట్లో గొబ్బిళ్ళు. నా డ్యూటీ నేను చేస్తున్నా, కించిత్ కుతూహలంగా.. అమ్మాయిలు వచ్చేశారు.. ఎక్కువ మంది నా ఈడు వాళ్ళు.. ఒకరిద్దరు కొంచం అటూఇటూ గా ఉన్నవాళ్ళూ.. నేను పెరట్లోనే యేవో పనులు కల్పించుకుని, నా పనుల్లో నేనున్నా.. వాళ్ళు ఎప్పటికీ పూజ మొదలు పెట్టరు.. ఇంతలో ఒకమ్మాయి 'అత్తయ్ గారి' చెవి కొరికింది. అమ్మ యెంతో లాలనగా "వీధిలోకెళ్లి చదువుకో నాన్నా.. " అని ఆర్డరేసేసింది. ఇంక చేసేదేముంది..

మామూలప్పుడే ఇంగ్లిష్ పాఠం అంతంతమాత్రంగా అర్ధమవుతుంది.. పెరట్లో అంత హంగామా జరుగుతుంటే, ఏ కుర్రాడైనా వీధిలో కూర్చుని షెల్లీ గురించో షేక్స్పియర్ గురించో చదవగలడా? నేనూ అంతే.. పైగా, గొబ్బిళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ చేసిన నాకు పూజ చూసే కనీస హక్కుందని ఆ క్షణంలో చాలా బలంగా అనిపించింది. దేవుడి గదికి ఉన్న చిన్న కిటికీ రెక్కని కొంచం పక్కకి తప్పిస్తే పెరడంతా చక్కగా కనిపిస్తుందన్న విషయం ఏదో ఆశరీరవాణి చెప్పినట్టుగా గుర్తొచ్చేసింది.

అసలే నాకు ఎప్పుడు ఏ పని అనుకుంటే అది వెంటనే చేసేసే అలవాటు అవడంతో, పుస్తకం పక్కన పెట్టి పిల్లిలా దేవుడిగదిలోకి ప్రవేశించాను. అమ్మ గొంతు వినిపిస్తోంది, అమ్మాయిలు కనిపిస్తున్నారు. నాక్కావాల్సిన పాట వచ్చేసింది. 'మొగలీ పువ్వంటీ..' తర్వాత నిశ్శబ్దం.. ఈసారి అమ్మ మాట వెంటనే వినలేదు వాళ్ళు. మొత్తం మీద అమ్మ సాధించింది.

వోణీలు నోటికి అడ్డం పెట్టుకుని, నేల చూపులు చూసుకుంటూ మొదటి సారి మెల్లిగా గొణిగి, రెండోసారి కొంచం గట్టిగా చెప్పారు వాళ్ళు. నేను బుద్ధిగా చదువుకోడం కోసం వీధి ఆరుగు మీదికి వెళ్ళబోతుండగా దేవుడి గది గుమ్మం దగ్గర .అలికిడయ్యింది. చూస్తే.. ఎదురుగా అమ్మ..

...బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

Sunday, January 10, 2010

చిన్ని చిన్ని కన్నయ్యా..

ఏడు పదుల జీవితం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ముళ్ళు..మరెన్నో పూలు.. స్వర సామ్రాజ్యంలో అధిరోహించిన శిఖరాలు ఎన్నో ఎన్నెన్నో.. భక్తి గీతం ఆలపిస్తున్నప్పుడు ఆ స్వరంలో వినిపించే ఆర్తి, విషాద గీతానికి స్వరం అందించేటప్పుడు అలవోకగా తొణికిసలాడే భావోద్వేగం అనితర సాధ్యం. కట్టసేరి జోసెఫ్ ఏసుదాస్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చేమో కానీ.. కేజే ఏసుదాస్ అన్నా, క్లుప్తంగా జేసుదాస్ అన్నా ఆ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ఓ హృద్యమైన స్వరం.. నా అభిమాన స్వరరాజుకి డెబ్భయ్యో జన్మదిన శుభాకాంక్షలు.


పాటల ప్రవాహం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క్షణాలివి. ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో మునక వేయగలగడమూ ఒక అదృష్టమే. కె. బాలచందర్ అపూర్వ సృష్టి 'అంతులేని కథ' నాకు చేరువ చేసిన ఇద్దరిలో ఒకరు జేసుదాస్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' పాట వస్తున్నప్పుడు తెరమీద కనిపిస్తున్న దృశ్యం లో కన్నా వినిపిస్తున్న గొంతులోని ఆర్ధ్రతే ముందుగా మనసుకి తాకింది. సినిమా పూర్తయినా ఆ గొంతు వెంటాడుతూనే ఉంది.. అది కేవలం ప్రారంభం.. ఆ తర్వాత ఎన్ని పాటలో..

రేడియోలో జేసుదాస్ పాట వస్తూ ఉంటే, ఎంత అర్జెంటు పని ఉన్నా పాట పూర్తయ్యేవరకూ కదలకపోవడం నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది. గ్రామ ఫోన్ రికార్డు మీద గడ్డం తో ఉన్న జేసుదాస్ ఫోటో ఇంకా తడి ఆరని జ్ఞాపకం లాగా ఉంది. జేసుదాస్ పాటలు ఉన్న ఆడియో కేసెట్ల టేపులు తెగిపోవడం రాను రాను చాలా మామూలు అనుభవం అయిపోయింది.. మామూలు సందర్భాలలో కన్నా మనసు బాగోలేనప్పుడో, బరువెక్కినప్పుడో జేసుదాస్ పాటలు వినడం ఓ గొప్ప అనుభవం.. ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం.

యాభయ్యేళ్ళ కెరీర్ లో జేసుదాస్ పదిహేడు భాషల్లో నలభైవేల పాటలు పాడినా, నేను విన్నవి - కేవలం మూడు భాషల్లో - కొన్ని వందలు మాత్రమే. వాటిలో ఒక్కసారి మాత్రమే విన్నవి బహుశా లేవేమో. తను తెలుగు వాడు కాదు అన్న విషయం తెలిసింది అతి కొద్ది సందర్భాలలో మాత్రమే.. అదికూడా అతి చిన్న ఉచ్చారణా దోషాల వల్ల. భాష, భావం విషయంలో జేసుదాస్ తీసుకునే శ్రద్ధ పరభాషా గాయకులందరికీ ఆదర్శనీయం.

జేసుదాస్ పాటలు విని ఆనందిస్తూ, కేవలం తన పాటల కోసమే ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలు చూస్తున్న నాకు జేసుదాస్ కచేరీకి హాజరయ్యే అవకాశం వచ్చినప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టినట్టు అనిపించింది. నిజానికి ఇప్పటివరకూ ఆ అదృష్టం రెండుసార్లు కలిగింది నాకు. మొదటిది శాస్త్రీయ సంగీత కచేరీ కాగా, రెండోది భక్తి సంగీత విభావరి. రవీంద్రభారతి స్టేజిపై డిం లైట్ల కాంతిలో శ్వేత వస్త్రధారియై "వాతాపి గణపతింభజే.." తో ప్రారంబించి దాదాపు రెండున్నర గంటలపాటు సాగించిన కచేరీ యావత్తు ప్రేక్షకుల్నీ ఏవేవో లోకాల్లో తిప్పి తీసుకొచ్చింది.

రెండోది ఓ ఆరుబయటి పందిరిలో జరిగిన అయ్యప్పభజన. భక్తి పూరిత వాతావరణం. "శరణమయ్యపా.." అంటూ జేసుదాస్ గళం విప్పగానే పరమ నాస్తికులు సైతం భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదనిపించింది. వినాయకుడిని స్తుతించినా, అయ్యప్ప పాటలు పాడినా, సాయిబాబా లీలలు వర్ణించినా అవన్నీ జేసుదాస్ గొంతులో కొత్తగా వినిపిస్తాయి నాకు. ఆ గొంతులో వినిపించే ఆర్తి కట్టి పడేస్తుంది నన్ను. మంచు వర్షంలా కురుస్తున్న ఆ ధనుర్మాసపు రాత్రి, జేసుదాస్ భక్తిగాన వర్షంలో తడవడం ఓ జీవితకాల జ్ఞాపకం.

ఊహించని అదృష్టం ఎదురైనప్పటికీ ఇంకా ఏదో కావాలనుకోడం మానవ నైజం కదా.. అందుకేనేమో, ఓ కోరిక చిన్నగా మొలకెత్తి మెల్లగా మహా వృక్షమయ్యింది.. కొన్ని క్షణాలు..కనీసం అతి కొద్ది క్షణాలైనా జేసుదాస్ తో మాట్లాడాలని.. ఆయన అలవాట్లని గురించి తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు.. కానీ ఏమో.. ఎవరికి తెలుసు? ఎప్పటికైనా సాధ్యమవుతుందేమో.. జేసుదాస్ శతాధిక జన్మదినాలు జరుపుకోవాలని, అత్యధికకాలం మధురమైన గొంతుతో పాటలు పాడిన గాయకుడిగా కొత్త రికార్డు స్థాపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. కన్నయ్యకు మరోమారు జన్మదిన శుభాకాంక్షలు..

Saturday, January 09, 2010

నాలుగో స్థంభం

రాష్ట్రంలో ఊహించని పరిణామాలు కొన్ని శరవేగంగా జరుగుతున్నాయి. టీవీ చానళ్ళు తాము తలచుకుంటే చేయగలిగింది ఏమిటో నిరూపించిన ఇరవై నాలుగు గంటలు గడవక మునుపే పోలీసులు తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ సంస్థల కుట్ర దాగి ఉందన్న రష్యన్ వెబ్సైట్ కథనాన్ని ఆధారంగా చేసుకుని మూడు నాలుగు గంటలపాటు కథనాలు ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తే, జరిగిన పరిణామాలకి టీవీ చానళ్ళని బాధ్యులని చేస్తూ మొదటగా ఆ కథనాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు పోలీసులు.

జరిగిన దానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కారణమని ఆ చానల్ ప్రతినిధులు, చానల్ వారి అతి వల్లనే అరెస్టులు తప్పనిసరి అయ్యాయని పోలీసులూ చెబుతున్నారు. అయితే, చానళ్ళ వారికి పెద్ద ఎత్తున మద్దతు లభించక పోవడం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం. గతంలో పత్రికలలో పనిచేసే వారి మీద ఎలాంటి దాడి జరిగినా, సంస్థల మధ్య వ్యాపార పోటీనీ, లావాదేవీలనీ పక్కన పెట్టి, అన్ని పత్రికల ఉద్యోగులూ ప్రదర్శనలు చేయడాన్ని మనం చూశాం. జరిగిన దాడిని పత్రికా స్వేచ్చ మీద దాడిగా అభివర్ణిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాల ప్రదర్శన జరిగేది.

ఐతే ప్రస్తుత సంఘటనలో, ఒకపక్క అరెస్టులు జరుగుతూ ఉండగా, రష్యన్ పత్రిక కథనాన్ని ప్రసారం చేయని చానళ్ళు 'మీడియా బాధ్యత' ని గురించి చర్చా కార్యక్రమాలు నిర్వహించి, ఆ మూడు చానళ్ళనీ ఇతోధికంగా తప్పు పట్టడమే కాక, సుద్దులు చెప్పే ప్రయత్నాలు సైతం చేశాయి. అరెస్టులు జరిగిన టీవీ చానళ్ళ రిపోర్టర్లు మాత్రం, జరుగుతున్న పరిణామాలని లైవ్ లో చూపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనని వక్కాణించారు. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా దూరం నుంచైనా సరే మీడియా పనితీరుని గమనిస్తున్న వారికి ఇది ఒక ఆసక్తి కరమైన పరిణామం.

జనం సంగతి పక్కన పెట్టి, సాటి మీడియా సంస్థల నుంచే ఆ మూడు చానళ్ళూ మద్దతు పొందలేక పోడానికి కారణం కేవలం వార్తా కథనంలో విశ్వసనీయత లేకపోవడం మాత్రమేనా? మరి అలా అయితే, గతంలో ఎన్నో సందర్భాలలో మీడియాని పరోక్షంగానే అయినా 'సీజర్స్ భార్య' గా అభివర్ణించి ప్రభుత్వ చర్యలని ముక్త కంఠంతో వ్యతిరేకించారు కదా.. మరి ఇప్పుడు ఒక్కరు కూడా ఆ మూడు చానళ్ళకి మద్దతుగా మాట్లాడడం లేదేం? జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయాలని కుదిపెసిదే కావడం వల్లనా లేక ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ కి నష్టం కలిగించడం వల్లనా?

మద్దతు పలకడం మాట పక్కనుంచి, సుద్దులు చెప్పడానికి ఒకరితో ఒకరు పోటీ పడడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. "మాది చాలా బాధ్యత గల మీడియా సంస్థ.. అలాంటి కథనాలు మేమెప్పుడూ ప్రసారం చేయలేదు.. చేయబోము.." అని చెప్పుకోడానికి మిగిలిన చానళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తోంది. ఓ నాయకుడు మరణించగానే, వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ప్రతినిదులకి లైవ్ లో ఫోన్ చేసి ఎక్కడ ఎన్ని బస్సులు తగలబడుతున్నాయో లెక్కలు తీయడం.. 'మీ ఊళ్ళో ఇంకా మొదలవ్వలేదా?' అని పరోక్షంగా జనాన్ని రెచ్చగొట్టడం, వార్తల మాటున బూతు ప్రసారాలు తదితర తప్పులన్నీ ఈ విధంగా ప్రక్షాళన చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నాయి.

గడిచిన రెండు మూడేళ్ళలో చానళ్ళ సంఖ్య విపరీతంగా పెరగడం, దాదాపు ప్రతి చానలూ అస్తిత్వ పోరాటంలో భాగంగా దొరికింది దొరికినట్టు ప్రసారం చేయడం.. ఈ అతికి ఏదో రూపంలో కళ్ళెం పడితే బాగుండు అనుకున్న సామాన్య ప్రేక్షకులకి మాత్రం జరిగిన పరిణామం ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. మీడియాలో వర్గపోరు, వివిధ రాజకీయ పక్షాలకి కొమ్ము కాసే విధానం గురించి ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలియడం వల్ల మన నాయకులు, అధికారులు మీడియాకి 'భయపడడాన్ని' తగ్గిస్తారు బహుశా.. ఒక వార్తాసంస్థ ఏదైనా వ్యతిరేక కథనం ప్రసారం చేసినా, మరో సంస్థ దానిని ఖండించే పని చూసుకుంటుంది కదా.. ప్రజాస్వామ్యం తాలూకు నాలుగు మూల స్తంభాల్లోనూ మూడింటి మీద ఇప్పటికే సడలిన నమ్మకం, ఇప్పుడు నాలుగో స్థంభం వైపుకి కూడా విస్తరించింది.

Wednesday, January 06, 2010

గాలివాన

కొందరు రచయితలు ఉంటారు.. వాళ్ళ మానాన వాళ్ళు రాసుకు పోతారు.. మిగిలిన విషయాల మీద వాళ్ళకి పెద్దగా దృష్టి ఉండదు. అలాంటి వాళ్ళ రచనలు చదివినప్పుడు మనకి అనిపిస్తుంది, వాళ్లకి రావల్సినంత పేరు రాలేదని. తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. వస్తు వైవిధ్యం మొదలు, భావ వ్యక్తీకరణ వరకూ 'తెలుగు కథ' కి ఒక రిఫరెన్స్ గా చెప్పగలిగిన కథలు రాసినా, ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ.

పాలగుమ్మి పద్మరాజు రచించిన అరవై ఆరు కథలతో (యాభై తొమ్మిది తెలుగు కథలు, ఏడు అనువాదాలు) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గత సంవత్సరం ఒక సంపుటం తెచ్చింది. ఈ సంస్థ ప్రచురిస్తున్న 'పాలగుమ్మి పద్మరాజు రచనలు' సిరీస్ లో మొదటి పుస్తకం ఇది. ఇవన్నీ ఏకబిగిన చదివే కథలు కాదు. చదివి, ఆలోచనల్లో పడి, తేరుకుని, మళ్ళీ చదివి.. మనసుతో పాటు, మెదడుకి పట్టించుకునే కథలు. మొత్తం కథల గురించి చెప్పబోవడం సాహసమే అవుతుంది కాబట్టి, 'గాలివాన' కథ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.



న్యూయార్క్-హెరాల్డ్ ట్రిబ్యూన్ 1956 లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీలో రెండో బహుమతి పొందిన కథ 'గాలివాన.' నాకు తెలిసినంత వరకూ, తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మొదటి కథ. ప్రధాన పాత్ర రావుగారు. సంఘంలో గౌరవ ప్రదమైన వ్యక్తి. వకీలుగా పని చేసి, కొడుకు న్యాయవాద పరీక్షలు నెగ్గాక, తన వృత్తిని అతనికి అప్పగించి విశ్రాంత జీవితం గడుపుతూ ఉంటారు. జీవితం పట్ల కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్న రావు గారు తన నలుగురు పిల్లల్నీ చాలా క్రమశిక్షణతో పెంచారు.

రావుగారి క్రమశిక్షణ ఎంతటిదంటే తన ఇద్దరు కూతుళ్ళూ ఎలా తల దువ్వుకోవాలో కూడా ఆయనే నిర్ణయించారు. స్వీయ నియంత్రణల మధ్య జీవితం చాలా సాఫీగానూ, సంతోషంగానూ గడిచిపోతూ ఉంటుంది రావుగారికి. ఉపన్యాసాలమీద ఆసక్తి ఉన్న రావు గారు, వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు భిన్న అంశాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. 'సత్వము-తత్వము' 'ప్రకృతి-పరిష్క్రుతి' ..ఇలా ఉంటాయి ఉపన్యాసాల కోసం ఆయన ఎంచుకునే అంశాలు. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయి కానీ అర్ధ స్ఫురణని బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తూ ఉంటారు.

'ఆస్తిక మహా సమాజము' వారి ఆహ్వానం మేరకు 'సామ్యవాదము-రమ్య రసామోదము' అనే అంశం మీద ఉపన్యాసం ఇవ్వడానికి రావుగారు రైల్లో బయలుదేరినప్పుడు చిన్నగా వర్షం మొదలై, ఆయన గమ్యస్థానం చేరేసరికి గాలివానగా తీవ్ర రూపం దాలుస్తుంది. రైల్లో తను బిచ్చం వెయ్యకుండా అసహ్యించుకున్న ముప్ఫై ఏళ్ళ యువతి మాత్రమే ఆయనకి సాయంగా ఉంటుంది ఆ రాత్రి, కూలిపోడానికి సిద్ధంగా ఉన్న వెయిటింగ్ రూములో. క్షణ క్షణానికి ఉద్ద్రుతమవుతున్న గాలివానని చూసి ధైర్యం కోల్పోతారు రావుగారు. కానీ ఆమె దేని గురించీ బాధ పడదు, గాలివానను గురించి కూడా.

"జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకి సజీవమైన అనుబంధం, గడిచిన కాలపు స్మృతుల బరువుగానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలుగానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలసలే లేవు. నిత్యమూ ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వమగానీ ఆమెకు లేవు.." ఆయన ప్రాణభయంతో వణుకుతుంటే "సరిగ్గా కూకోని నా సుట్టూ సేతులేసుకోండి.. కాంత ఎచ్చగుంటది పాపం!" అనగలదు ఆమె.

ప్రకృతి ప్రళయ భీభత్సాన్ని చూపిన ఆ రాత్రి, ఏ విలువలకీ లొంగని జీవితాన్ని గడుపుతున్న బిచ్చగత్తె, రావుగారు తను నమ్మిన విలువలూ, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం.. వీటన్నింటినీ త్యజించడానికి సిద్ధపడేలా ఎలా చేయగలిగిందన్నది కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. పుస్తకం ముందుమాటలో ఏటుకూరి ప్రసాద్ చెప్పినట్టుగా పద్మరాజు గారి కథలు చాలా భాగం పాఠకుల "గుండెకు కాకుండా మెదడుకు గురిపెట్టినవే!" కథలని ఇష్టపడేవాళ్ళు చదివి తీరాల్సిన ఈ 499 పేజీల పుస్తకం వెల రూ. 250, విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది.

Saturday, January 02, 2010

సువర్ణ సుందరి

నేను ఒక సినిమా చూసి ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్నది మొదటిసారి జరిగింది 'సువర్ణ సుందరి' సినిమాతో. హీరోయిన్ అంజలీ దేవి. ఆమెతో ప్రేమలో పడ్డ ముహూర్త బలం ఏమిటో కానీ, నా హీరోయిన్ల జాబితాకి అంతు లేకుండా పోతోంది. పిడకల వేటని పక్కన పెట్టి, అసలు కథ లోకి వస్తే, యాభై రెండేళ్ళ క్రితం వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాని ఆపాత మధురాల్లో ఒక ఆణిముత్యం అనడానికి అభ్యంతర పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరేమో.

అంజలీ పిక్చర్స్ పతాకం పై అంజలి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు నిర్మించి, సంగీతం సమకూర్చిన 'సువర్ణ సుందరి' సినిమాకి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. టైటిల్ పాత్రని అంజలీ దేవి, ఆమె సరసన కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వర రావు నటించారు. కథాశివబ్రహ్మం గా పేరు పొందిన సదాశివబ్రహ్మం రాసిన జానపద కథలో బోల్డన్ని మలుపులూ, మెలికలూ. మాయలూ, మంత్రాలూ, శాపాలూ, శాప విమోచనాలూ.. ఆద్యంతం ఆసక్తికరం.



కథలోకి వస్తే జయంతుడు (అక్కినేని) అనే రాకుమారుడు. ఒకరకంగా ఇతనిది శాపగ్రస్త జీవితం. గురుకులం లో విద్యాభ్యాసం పూర్తవుతుండగానే, తను సోదరిగా తలచిన గురు పుత్రిక ప్రేమిస్తున్నానంటూ వెంట బడుతుంది. తనని కాదన్నందుకు, అత్యాచారం చేశాడని నింద మోపుతుంది. రాజ్యానికి వెళ్తే ఆవేశంలో తండ్రి విధించే శిక్షకి గురి కావాల్సి వస్తుందని రాజ్యం నుంచి పారిపోతాడు. అనుకోకుండా ఒక గంధర్వుడికి శాప విమోచనం కలిగించి, ఎగిరే చాపా, దండం, కమండలం కానుకలుగా అందుకుంటాడు. ఐతే, ఆ కానుకలు దొంగల పాలవుతాయి.

ఓ గుహలో తల దాచుకున్న జయంతుడికి, ఇంద్రలోకం నుంచి శివపూజ కోసం తన చెలికత్తెలతో కలిసి వచ్చిన ఇంద్ర దర్బారు ప్రధాన నర్తకి సువర్ణ సుందరి కంట పడుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజ ముగిశాక జయంతుడిని చూసిన సువర్ణ సుందరి తొలి చూపులోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. జయంతుడికి ఒక వేణువుని కానుకగా ఇచ్చి తనని పిలవాలంటే ఆ వేణువు ఊదితే చాలని చెబుతుంది సుందరి. ఏ పనీ లేకుండా తోచీ తోచకా కాలక్షేపం చేస్తున్న జయంతుడు వేళా పాళా లేకుండా వేణువు ఊదేస్తూ ఉంటాడు.

ఒకసారి ఇంద్రలోకంలో నృత్య ప్రదర్శన ముగుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయిన సువర్ణ సుందరిని పరీక్షిస్తాడు దేవ వైద్యుడు. (ఏం చెప్పాడో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి? తెలుగు సినిమాలు చూసే వాళ్ళు సులువుగా ఊహించ గలరు) ఆగ్రహం పట్టలేని ఇంద్రుడు, సుందరికి స్వర్గ లోక ప్రవేశం నిషేధించడంతో పాటు జయంతుడు ఆమెని మర్చిపోతాడని, ఆమె తాకితే అతడు శిలగా మారిపోతాడనీ శాపం ఇస్తాడు. ఆమె బతిమాలితే, ఆమెకి పుట్టిన బిడ్డ వల్ల శాప విమోచనం కలుగుతుందని అమెండ్మెంట్ ఇస్తాడు.

ఇక్కడ భూలోకంలో సువర్ణ సుందరిని మర్చిపోయిన జయంతుడికి, అనుకోకుండా తను గంధర్వుడి నుంచి పొందిన దండం దొరుకుతుంది. అది పట్టుకుని తోచీ తోచకా అడవుల్లో తిరుగుతూ, ఒక పాము నెత్తిన దండంతో మోదుతాడు. ఆ పాము కాస్తా నెత్తురోడే తలతో నాగకన్యగా మారి, పగలు స్త్రీ గానూ, రాత్రి పురుషుడిగానూ మారిపొమ్మని శాపం ఇస్తుంది జయంతుడికి. సువర్ణ సుందరి భూలోకం వచ్చేసి ఒక మగ బిడ్డని ప్రసవిస్తుంది. ఓ ప్రమాదంలో ఆమె ఆ పసిబిడ్దని పోగొట్టుకోడం, ఆ బిడ్డ ఒక వృద్ధ పశువుల కాపరికి (గుమ్మడి) దొరకడం జరుగుతుంది.

విడిపోయిన జయంతుడూ, సువర్ణ సుందరీ, వాళ్లబ్బాయీ ఎలా కలిశారు? జయంతుడి శాపాలు ఎలా విమోచనం అయ్యాయి? అన్నది మిగిలిన కథ. మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ నిడివి (ఇప్పుడైతే ఇంచుమించు రెండు సినిమాలకి సమానం) గల ఈ సినిమాకి ప్రాణం పోసింది అంజలి నటన, సంగీతం. అసలు ఈ సినిమాకి నాయికా నాయకులు అంజలి, ఆదినారాయణ రావులే అనిపిస్తుంది నాకు. జయంతుడిగా నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. పైగా రెండో సగంలో స్త్రీ గా మారిపోతాడు.

ఆడ జయంతుడిగా రాజసులోచన చేసింది. (నాకు అత్యంత ఇష్టమైన ఒక 'రొమాంటిక్ సాంగ్' లో నటించినందుకు గాను ఈమె అంటే ప్రత్యేకమైన ఇష్టం) సినిమా మొదటి సగంలో దేవకన్యగా సాత్వికాభినయం ప్రదర్శించి, రెండో సగంలో భూలోకంలో సాధారణ స్త్రీగా, బిడ్డకి దూరమైన తల్లిగా, భర్త ఎదురుగా కనిపిస్తున్నా పలకరించలేని భార్యగా కరుణ రసాన్నీ, ఆపై ఒక రాజ్యానికి మంత్రిగా వీర రసాన్నీ అలవోకగా అభినయించింది అంజలి.

'సువర్ణ సుందరి' పాత్ర కోసం ఆమె ఎంపిక చేసుకున్న దుస్తులు, ఆహార్యం ఇప్పటికీ ఆ తరహా పాత్రలకి ఒక రిఫరెన్స్ అనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమా చేసేనాటికి ఆమె వయసు ముప్ఫై ఏళ్ళు. నిజజీవితంలో ఇల్లాలు, మాతృమూర్తి. ఇవేవీ 'సువర్ణ సుందరి' పాత్ర పోషణకి అడ్డు రాలేదు. అంజలి నటన తర్వాత చెప్పుకోవాల్సింది ఆదినారాయణ రావు సంగీతం. ఏ ఒక్క పాటనీ తీసేయలేము.

ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే పాట, ఏ టీవీ చానల్లో పాటల పోటీ జరిగినా గ్రాండ్ ఫినాలే లో తప్పక వినిపించే పాట, నాకు అత్యంత ఇష్టమైన పాట 'హాయి హాయిగా ఆమని సాగే..' జిక్కి, ఘంటసాల పాడారు. ఈ పాట ఒక్కో చరణాన్ని, ఒక్కో రాగం లో కంపోజ్ చేయడమే కాక, ఒక్కో సెట్ లో చిత్రీకరించారు. ముఖ్యంగా 'చూడుమా చందమామ..' చరణంలో అంజలిని చూస్తే నిజంగా చందమామే దిగి వచ్చినట్టు అనిపిస్తుంది.

వెంటనే చెప్పుకోవాల్సిన మరో పాట 'పిలువకురా...' సుశీల పాడిన ఈ పాటకి అంజలి అభినయాన్ని చూసి తీరాల్సిందే. ఆమె ఇంద్రసభలో నృత్యం చేస్తూ ఉంటే, జయంతుడు భూలోక ఉద్యానవనంలో ఆపకుండా వేణువు ఊదుతూ ఉంటాడు. "ఇదో నాగేసర్రావూ.. ఆ పిల్ల డేన్సింగులో ఉంది కదా.. అవగానే వస్తుందిలే.. కాసేపు ఆ ఊదడం ఆపు.." అని చెప్పాలనిపిస్తుంది మనకి. సుశీల పాడిన 'నీ నీడలోన నిలచేను రా.' పాటకి కూడా అంతే.. ఆమె ఇంద్ర సభలో నాట్యం చేస్తూనే ఉంటుంది, జయంతుడు వేణుగానం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ రెండు పాటలూ ఇంద్రలోకం సెట్లలో చిత్రించారు. (వీనస్ స్టూడియో, అప్పటి బోంబే).

గురు పుత్రిక, ఆమె చెలికత్తెల మీద తీసిన పాట 'బంగారు వన్నెల..' కాగా హాస్య గణం రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ల మీద తీసిన పాట 'ఏరా.. మనతోటి గెలిచే వీరులెవ్వరురా..' బిడ్డ దూరం అయినప్పుడు సువర్ణ సుందరి పాడుకునే పాట 'నా చిట్టి పాపా..' (ఎప్పటిలాగే) గుమ్మడి మరణించగానే, అప్పటికి ఐదారేళ్ళ వాడైన పిల్లవాడు రోడ్డున పడడం, తల్లి, స్త్రీ రూపంలో ఉన్న తండ్రి అంతా ఒక చోట చేరినా ఒకరినొకరు గుర్తించుకోలేని సందర్భంలో నేపధ్యంలో వచ్చే విషాద గీతం 'అమ్మా అమ్మాయని..' ఈ మధ్యలో అంజలి బొమ్మలమ్ముతూ పాడే పాట 'బొమ్మాలమ్మా బొమ్మలూ..' అప్పటి సినిమాల పేర్లన్నీ వినిపిస్తాయి ఈ పాటలో.

ఇవే కాకుండా గిరిజ, బృందం మీద చిత్రించిన 'పూబాల పెళ్లి..' రాజసులోచన, గిరిజల మీద తీసిన 'తధీం నన..' రాజసులోచన, రాక్షసుడి మీద తీసిన 'నా నోము పండే ఈనాడు..' అంజలి పై మరో కరుణరస గీతం 'శంభో నా మొర వినవా..' ఉన్నాయి ఈ సినిమాలో. గ్రాఫిక్స్ అంతే ఏమిటో తెలియని ఆ రోజుల్లో చిత్రించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్య పరుస్తాయి. మనిషి తల, పాము శరీరం తో ఉండే గంధర్వుడు, భారీగా కనిపించే రాక్షసుడు, శాపం వల్ల శిలగా మారిపోతున్న జయంతుడు.. తదితర సన్నివేశాలన్నీ కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి తీసినా క్వాలిటీ లో ఎక్కడా నాసిరకంగా అనిపించవు.

కథలో నాయకుడు నాయికని మర్చిపోయే చోట 'శాకుంతలం,' కొడుకు ద్వారా శాప విమోచనం అన్న దగ్గర 'బాలనాగమ్మ' గుర్తొస్తాయి. హాస్యాన్ని కథలో భాగం చేసినప్పటికీ, కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ సుదీర్ఘంగా అనిపిస్తాయి. పాత్ర స్వభావం వల్లనో, మరెందువల్లో తెలీదు కానీ అక్కినేని జ్వరం నుంచి అప్పుడే కోలుకున్న వాడిలా కనిపిస్తాడు చాలా చోట్ల. తెలుగులో విజయవంతమైన ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో పునర్నిర్మించారు. ఆపాత మధురాలని ఇష్టపడేవాళ్ళు మర్చిపోలేని సినిమా ఈ 'సువర్ణ సుందరి.'